కాశ్మీర్ లోయ నుంచి 1990వ దశకంలో తరిమి వేయబడిన పండిట్లు మరో సంవత్సరంలో తిరిగి స్వస్థలాలకు చేరుకోగలరని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆరెస్సెస్) సర్ సంఘచాలక్ డా. మోహన్ భగవత్ విశ్వాసం వ్యక్తం చేశారు. వారు మళ్లీ అక్కడికి వెళితే, వారిని మరోసారి ఎవరూ నిర్వాసితులను చేయబోరనే భరోసా ఇచ్చారు.
నవ్‌రేహ్ వేడుకల చివరి రోజు అయిన ఆదివారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కశ్మీరీ హిందువులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ “కశ్మీరీ హిందువులు తమ స్వదేశానికి తిరిగి రావడానికి కొంత సమయం మాత్రమే ఉంది. వచ్చే సంవత్సరం, మన కశ్మీరీ పండిట్లు తమ ఇళ్లలో తిరిగి ఉంటారు. ఈ సంకల్పం కార్యరూపం దాల్చడానికి ఇప్పుడు ఎక్కువ సమయం లేదు. దీనికోసం మన ప్రయత్నాలు కొనసాగించాలి. మనం ఇంటికి తిరిగి వెళ్లాలి, ” అని భగవత్ ఆశాభావం వ్యక్తం చేశారు.
వారికి మొత్తం సమాజం మద్దతుగా ఉందని, వారు త్వరలో లోయకు తిరిగి వెళతారని ఆయన స్పష్టం చేశారు. “మీరు ఆ ప్రాంతం నుంచి బహిష్కృతులమయ్యారు, అయినా కానీ కాశ్మీర్ మీతోనే ఉంది. మొత్తం భారతదేశం మీతో ఉంది” అంటూ డా. భగవత్ కాశ్మీర్ పండిట్లకు భరోసా ఇచ్చారు.
“మనం ఇప్పుడు హిందువుగా, భారతీయునిగా కాశ్మీర్‌కు వెళ్తాము. మనం అక్కడ స్థిరపడతాము. ఇక మరెప్పటికీ తిరిగి రావలసిన అవసరం ఉండదు. వలసలకు తావు లేని విధంగా మనం స్థిరపడతాము” అంటూ ఆర్‌ఎస్‌ఎస్ అధినేత వారిలో ఆత్మస్థైర్యాన్ని పాదుగొల్పారు. సమాజంలో కోల్పోయిన స్థానం కోసం పోరాడేందుకు సిద్ధంగా ఉండాలని కూడా ఆయన ఈ సందర్భంగా కాశ్మీర్ పండిట్లకు సూచించారు. కాశ్మీర్ పండిట్లకు వ్యతిరేకంగా ఎవరైనా గతంలో చేయనటువంటి ప్రయత్నం చేస్తే అటువంటి వారికి తగిన గుణపాఠం చెబుతామని భగవత్ హెచ్చరించారు.
ఈ సందర్భంగా ఇజ్రాయెల్ పౌరుల వలసల గురించి, వారు తిరిగి పోరాడిన వైనాన్ని సోదాహరణంగా సర్ సంఘ చాలక్ వివరించారు. “ఇజ్రాయెల్ ప్రజలు సైతం వారి స్వంత ఇళ్ళ నుంచి తరిమివేయబడ్డారు. అయినా కానీ 1800 సంవత్సరాలు పోరాడారు. 1700 సంవత్సరాల సంకల్పం, 100 సంవత్సరాల పోరాటం వారిని ఇజ్రాయెల్‌కు తిరిగి వచ్చేలా చేసింది” అని గుర్తు చేశారు.
అదే విధంగా కాశ్మీర్ పండిట్లు కూడా లోయకు తిరిగి వస్తారని ఆయన స్పష్టం చేశారు. కాశ్మీరీ పండిట్లకు భద్రత, జీవనోపాధికి హామీ లభించడంతో వారు త్వరలోనే తిరిగి వెళ్తారనే ఆశాభావాన్ని డా. భగవత్ వ్యక్తం చేశారు.
“మేము తీవ్రవాదం కారణంగా (కశ్మీర్) విడిచిపెట్టాము, అయితే మేము ఇప్పుడు తిరిగి వచ్చినప్పుడు, మా భద్రత, జీవనోపాధికి హామీ ఇవ్వడంతో మేము హిందువులుగా , భరతమాత భక్తులుగా తిరిగి వెళ్తామనే విశ్వాసాన్ని మీరు పెంచుకోవాలి. మమ్మల్ని ఎవరూ స్థానభ్రంశం చేయడానికి సాహసించని విధంగా మేము జీవిస్తామనే భరోసాతో మీరు వ్యవహరించాలి” అంటూ ఆయన మార్గదర్శనం చేశారు.
‘‘ఎవరూ మమ్మల్ని నిర్వాసితులను చేసే సాహసం చేయబోరనే విధంగా మేం జీవిస్తాం’’ అనే దృఢసంకల్పంతో వ్యవహరించాలని డా. భగవత్ హితవు చెప్పారు. గడచిన మూడు, నాలుగు దశాబ్దాల నుంచి స్వదేశంలో కశ్మీరీ పండిట్లు తమ స్వగృహాల నుంచి తరిమివేయబడటంతో అనేక కష్టాలను అనుభవిస్తున్నారని ఆయన చెప్పారు.
ఈ పరిస్థితిలో ఓటమిని అంగీకరించకూడదని, సవాళ్ళను ఎదుర్కొనాలని సూచించారు. వివేక్ అగ్నిహోత్రి దర్శకత్వం వహించిన ‘ది కశ్మీర్ ఫైల్స్’ సినిమా కశ్మీరు పండిట్లు నిరాశ్రయులైన దురదృష్టకర వాస్తవాన్ని తెలియజేసిందని పేర్కొన్నారు. మనందరినీ దిగ్భ్రాంతికి గురి చేసే దురదృష్టకర వాస్తవాన్ని ఈ సినిమా ప్రదర్శించింది అని తెలిపారు.
ప్రజలు అవగాహన పెంచుకోవడం ద్వారా మాత్రమే కశ్మీరీ పండిట్ల సమస్య పరిష్కారమవుతుందని తాను గతంలో చెప్పానని ఈ సందర్భంగా డా. భగవత్ గుర్తు చేశారు. అధికరణ 370 వంటి అడ్డంకులు తొలగిపోయాయని చెబుతూ 2011 తర్వాత మనందరి కృషి ఫలితంగా అధికరణ 370 అడ్డంకి తొలగిపోయిందని చెప్పారు.