తిరిగి ఈనాడు గోర్టపై రజాకార్లు దాడిచేయడానికి కుట్రలు పన్నసాగారు. గోర్టలో ధనవంతులు చాలామంది ఉన్నారు. ముస్లింల కుటుంబాలు కూడా చాలానే ఉన్నాయి. ఆ గ్రామంలో చుట్టుప్రక్కల ప్రాంతాల్లో రజాకార్ల నాయకులు చాలామంది ఉన్నారు. హిసామొద్దీన్ ఆ గ్రామంలో పుట్టి పెరిగినవాడే. అసలు హిసామొద్దీన్ తాత హిందువు. అల్లర్లు జరిగిన సందర్భంలో హిసామొద్దీన్ అవ్వ తన చిన్న కొడుకు భద్రప్పతో ఒక ముసల్మాన్ ఇంట్లో ఆశ్రయం పొందింది. తర్వాత భద్రప్ప బద్రోద్దీన్‌గా మారిపోయాడు.
అతని కొడుకే హిసామొద్దీన్. ఇక గోర్టా ముస్లింలు ఏ విధంగానైనా ప్రతీకారాన్ని అమలు జరపాలని ప్రయత్నించసాగారు. హిసామొద్దీన్ హత్య జరిగిన రోజు నలభై ఐదు బండ్లతోపాటు వెళ్ళిన రైతులనందరినీ పోలీసులు పట్టుకెళ్ళి తీవ్రంగా చితకగొట్టారు. అందులో రామశెట్టిప్ప, సింగప్ప చివరే అనే రైతులను ప్రత్యేకంగా పోలీసులు నిర్భంధించి ఆ హత్యతో గ్రామంలోని షావుకారు మహదేవప్ప డుమనేకు హరిశెట్టిప్ప పటేలుకు సంబంధం ఉందనే అబద్ధాన్ని సాక్ష్యంగా చెప్పమని ఒత్తిడి తీసుకువచ్చారు. దెబ్బలు తినికూడా ఆ ఇద్దరు వ్యక్తులు అబద్ధమాడలేదు.
గోర్టలో శాంతిభద్రతలను కాపాడటం కోసం పోలీసులు క్యాంపు వేశారు. ఈ లోగానే రజాకార్లు పగటిపూట పంటపొలంలో పనిచేసుకుంటున్న పోలీస్ పటేల్ గురుపాదప్పను హత్యచేసి నదిలో సగందాకా పాతిపెట్టారు. హత్య జరిగినప్పుడు చూసిన రైతులను ఆ విషయాన్ని బయటపెడితే చంపివేస్తామని బెదరించారు.
ఆ తర్వాత పోలీసులు షావుకారు మహదేవప్ప డుమనేను బాధించసాగారు. ఆయన ఇంట్లో చాలరకాల ఆయుధాలు ఉన్నాయని వాటిని స్వాధీనం చేసుకోవాలనే వాళ్ళ ప్రయత్నం. చివరికి పోలీస్ సబ్ ఇన్‌స్పెక్టరు ఇంటిపై దాడిచేసి కూడా ఎలాంటి ఆయుధాల్ని పట్టుకోలేకపోయాడు. ఈ లోగానే ప్రభుత్వం వారి తాఖీదుననుసరించి లైసెన్సు ఉన్న తన తుపాకిని మహదేవప్ప పోలీసులకు అప్పగించాడు.
చైత్ర అమావాస్య. నాడు సూర్యగ్రహణం రోజు. గ్రామస్థులు మరుసటిరోజు పండుగ చేసుకునే ఏర్పాట్లలో ఉన్నారు. రజాకార్లు హత్యాకాండ చేయాలనే ప్రయత్నాలు సాగించారు. సహాయంగా కొందరు పస్త్ అక్వామ్‌లు తోడైనారు. ఆ రోజు ఉదయం ఎనిమిది గంటల నుండి హత్యాకాండ ప్రారంభమైంది. ఘోడవాడి, హుయానాబాద్ ఖాల్కీ, కళ్యాణ్, బేటార్ తదితర గ్రామాల నుండి మొత్తం రెండువేల మంది రజాకార్లు గోర్టాలో సమావేశమయ్యారు. ఎదురైన ప్రతి హిందువుని ఇంట్లోకి చొరబడి అమానుషంగా బయటకులాగి తలను నరికివేయటం మొదలైంది. ఆ ఘోర హింసాకాండను వర్ణించడం సాధ్యం కాదు. భీమ్‌రావ్ పటేల్, ఆయన భార్య తమ పిల్లలను సంరక్షించుకోవటానికి విశ్వ ప్రయత్నం చేశారు.
రజాకార్ రసూల్‌కు 40 తులాల బంగారం ఇచ్చివేసి తమ పిల్లల్ని మాత్రం రక్షించమని వేడుకున్నాడు. రసూల్ తాను రక్షణగా ఉంటానాని హామీ ఇచ్చాడు. కానీ మరుక్షణంలోనే అతని సైగపై బేలూర్ రజాకార్లు పటేల్ ఇంట్లోకి చొరబడి తల్లిదండ్రుల ఎదుటనే పెద్ద కుమారుడైన బసప్పను చంపివేశారు. భీమ్‌రావ్ తలను సగం నరికి పిడకలపై శరీరాన్ని కాల్చివేశారు. చిన్నవాడు తప్పించుకొని పారిపోతుండగా త్రోవలో పట్టుకొని నరికివేశారు. తన కళ్ళ ఎదుట జరిగిన హింసాకాండను చూసి ఆ స్త్రీ ఎంత నరకయాతనకు లోనైనదో చెప్పలేము. రామారావు పట్వారి, నారాయణరావు ముక్తేదార్‌లను బయటకు ఈడ్చి బహిరంగంగా కాళికాలయం ఎదుట తలలను నరికి విగ్రహంపై రక్తాన్ని పులిమారు. మాలీ పటేల్ బసప్ప, లింగాయత్ మఠంలోని రాజయ్య, స్వామి గునీప్ప కణజే తదితరులందరిని క్రూరంగా హత్య చేశారు.
ఒక ఇంట్లోని మగవాళ్ళనందరిని లాగి నరకటం ప్రారంభించారు. మిగిలిన ఒక తమ్ముడ్ని కూడా బయటకు లాగి కిందపడవేసేసరికి గర్భవతియైన అతని అక్క అతనిపై బడి రోదించసాగింది. రాక్షసులైన హంతకులు పాశవికమైన పద్ధతిలో ఆమెను ఈడ్చి నడుముపై తన్నారు. ఆమె అక్కడే ప్రసవించి చనిపోయింది. ఆనాడు బ్రతికి బయటపడ్డ పిల్లవాడు ఈనాటికి “బాబు” అనే పేరుతో సజీవంగా ఉన్నాడు.
గ్రామంలో ఆ రోజు పాశవిక పాలన సాగింది. రాక్షసమైన ప్రవృత్తితో కనబడిన ప్రతి స్త్రీపై అత్యాచారం చేశారు. ఎంతోమంది స్త్రీలు రజాకార్ల కామానికి బలైపోయారు. ఎవరూ ఆ రాక్షస చర్యలను అడ్డుకొనేవాళ్ళు కనపడలేదు. ఆ ఒక్కరోజు హత్యకావింపబడిన యాభైమందిలో కొంతమంది పేర్లు ఇవి అనిరుద్దప్ప, ములుశెట్టి, జగబెట్టి, శివప్ప, ధన్‌గర్, శివప్పమైత్రి, మారుతి అప్పకొనే, ధూలప్ప కణజే, రామారావు పటజే, గురప్ప కణజే, భీమన్న రాజోలె, శరణప్ప కనకటీ, చిన్నప్ప బరాదర్, గురప్ప బరాదర్, కాశప్ప మధుకంటి, విరూపాక్షప్ప మఠపతి, బసవప్ప వంకే మొదలైనవాళ్ళు.
Source: Vijaya Kranthi