జమ్ముకశ్మీర్‌లో గవర్నర్ పాలన విధించాలంటూ మంగళవారం గవర్నర్ ఎన్.ఎన్.వోహ్రా చేసిన సిఫార్సుకు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఆమోదం తెలిపారు. దీంతో నేటి నుంచి జమ్ముకశ్మీర్‌లో గవర్నర్ పాలన అమల్లోకి వచ్చింది.
మెహబూబా ముఫ్తీ సారథ్యం లోని జమ్మూ కాశ్మీర్ రాష్ట్ర ప్రభుత్వం కశ్మీరు లోయలో భదత్రా పరిస్థితులు మెరుగుపరచడంలో విఫలమైందని, ఉగ్రవాదాన్ని కట్టడి చేయడంలో సైతం పి డి పి తగిన చర్యలు తీసుకొని కారణంగా ప్రభుత్వానికి తమ మద్దతు ఉపసంహరించుకున్నట్లు నిన్న భాజపా ప్రకటించింది. దీనితో జమ్ముకశ్మీర్‌లో ముఖ్యమంత్రి పదవికి మెహబూబా ముఫ్తీ రాజీనామా చేశారు.
87 అసెంబ్లీ స్థానాలున్న జమ్ముకశ్మీర్‌లో పీడీపీకి 28 సీట్లు, భాజపాకు 25 స్థానాలు ఉన్నాయి. నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీకి 15సీట్లు, కాంగ్రెస్‌కు 12సీట్లు, ఇతరులకు 7 స్థానాలు లభించాయి. ఏ పార్టీకి సాధారణ మెజారిటీ రాకపోవడంతో పీడీపీ, భాజపా కలిసి ప్రభుత్వాన్నిఏర్పాటు చేశాయి. ఈ ప్రభుత్వం మూడేళ్లపాటు పాలన అందించింది. ఇప్పుడు బిజెపి ప్రభుత్వం నుండి వైదొలగడంతో గవర్నర్ పాలన అనివార్యమైంది.
జమ్మూ కాశ్మీర్ లో రాష్ట్రపతి పాలన విధించడం గత నాలుగు శతాబ్దాలలో ఇది 8 వ సారి. 2008 నుండి గవర్నర్ గా ఉన్న ఎన్.ఎన్.వోహ్రా హయంలో ఇది 4 వ సారి.
ఇదిలాఉంటే జమ్ముకశ్మీర్ డీజీపీ శేషు పాల్ వైద్ మాట్లాడుతూ గవర్నర్ పాలనలో ఉగ్రవాద కార్యకలాపాల నిర్మూలన చర్యలను మరింత ఉధృతం చేస్తామని అన్నారు.