Home News స్థానిక జమాత్ అంగీకారంతో గణేశ్ విగ్రహం ఏర్పాటుకు అనుమతి: మద్రాసు హైకోర్టు

స్థానిక జమాత్ అంగీకారంతో గణేశ్ విగ్రహం ఏర్పాటుకు అనుమతి: మద్రాసు హైకోర్టు

0
SHARE

తమిళనాడులో ఓ హిందూ మహిళ వినాయక చవితి పండుగ నాడు గణేశ్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి అవకాశం ఇవ్వాలని మద్రాసు హైకోర్టును ఆశ్రయించారు. అయితే ఆ మహిళ నివసించే ముస్లిములు ప్రాతినిధ్యం వహిస్తున్న జమాత్ అంగీకారంతోనే గణేశ్ విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవాలని హైకోర్టు ఆదేశించింది.

కోయంబత్తూరు పరిధిలోని ఉక్కడమ్ సౌత్‌లో పుల్లకాడు హౌసింగ్ బోర్డు కాలనీ ఉంది. ఆ ప్రాంతానికి చెందిన మహాలక్ష్మి ఆగస్టు 31న వినాయక చవితి పండుగను పురస్కరించుకొని అక్కడ గణేశ్ విగ్రహం ఏర్పాటు చేసుకోవాలని భావించారు. ఆ దిశగా తనను అనుమతిస్తూ ఒక డైరెక్షన్ ఇవ్వాలని మద్రాసు హైకోర్టును ఆశ్రయించారు. అయితే సదరు హౌసింగ్ బోర్టు కాలనీలో ముస్లిముల జనాభా అత్యధికంగా ఉన్న కారణంగా స్థానిక జమాత్ నుంచి అంగీకారం పొందిన తర్వాతనే గణేశ్ విగ్రహం ఏర్పాటుకు అనుమతించాలని కోయంబత్తూరు పోలీసులను మద్రాసు హైకోర్టు ఆదేశించింది.

మహాలక్ష్మి దాఖలు చేసిన ఒక పిటిషన్‌ను పరిష్కరిస్తున్న సందర్భంగా జస్టిస్ ఎన్ సతీశ్ కుమార్ ఆగస్టు 26న ఈ మేరకు తీర్పును వెలువరించారు.

హౌసింగ్ కాలనీలోని ప్రజలు వినాయక చవితి పండుగను జరుపుకోవాలని ఆకాంక్షిస్తున్నారని కోర్టుకు దాఖలు చేసుకున్న పిటిషన్‌లో మహాలక్ష్మి పేర్కొన్నారు. అదే కాలనీలో ఉన్న ఇతర సామాజిక వర్గానికి చెందిన ప్రజలు కూడా వినాయక చవితి వేడుకల్లో పాల్గొనడానికి సముఖత వ్యక్తం చేశారని తెలిపారు. సదరు ఇతర సామాజికవర్గానికి చెందిన వారు భక్తులకు అన్నదానం చేయడానికి సైతం అంగీకరించారు. కనుక గణేశ్ విగ్రహం ఏర్పాటుకు స్థానిక పోలీసుల అనుమతిని ఆమెను కోరారు.

కేసులో కోయంబత్తూరు పోలీసుల తరఫున అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదించారు. ఆ ప్రాంతంలో ముస్లిముల ప్రాబల్యం అధికంగా ఉన్న కారణంగా విగ్రహ ఏర్పాటుకు అనుమతించిన పక్షంలో శాంతి, భద్రతల సమస్య ఉత్పన్నమవుతుందని హైకోర్టుకు అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ విన్నవించుకున్నారు.

అయితే వినాయక చవితి వేడుకల్లో పాల్గొనడానికి స్థానిక జమాత్ ప్రజలు సైతం సుముఖంగా ఉన్నారని, విగ్రహ ఏర్పాటుపై వారికి ఎలాంటి అభ్యంతరాలు లేవని పిటిషనర్ మహాలక్ష్మి తరఫున న్యాయవాది న్యాయస్థానానికి తెలియపరిచారు.

ఆ దృక్కోణంలో కేసును పరిశీలించినప్పుడు, 2018 సంవత్సరం ఆగస్టు తొమ్మిదవ తేదీ నాటి పబ్లిక్ (శాంతి, భద్రతలు) డిపార్ట్‌మెంట్ ప్రభుత్వ ఉత్తర్వునకు (జీవో) లోబడి నిర్దేశించిన మార్గదర్శకులను కచ్చితంగా అనుసరిస్తూ, ఆగస్టు 31వ తేదీన వినాయక చవితి పండుగను జరుపుకోవడం కోసం గణేశ్ విగ్రహం ఏర్పాటుకు అంగీకారం తెలుపుతూ జమాత్ కమిటీ ఇచ్చిన అఫిడవిట్‌తో పాటుగా ఒక అఫిడవిట్/అండర్‌టేకింగ్‌ను సంబంధిత పోలీస్ స్టేషన్‌కు సమర్పించడానికి పిటిషనర్‌ను అనుమతిస్తున్నామని పేర్కొంటూ మద్రాసు హైకోర్టు తీర్పును వెలువరించింది.

“పిటిషనర్ అలాంటి ఒక అండర్‌టేకింగ్‌ను సమర్పించినప్పటికీ పోలీసులు తగిన భద్రతను కల్పించాలి” అని జస్టిస్ సతీశ్ కుమార్ ఆదేశించారు. “పిటిషనర్ కేవలం వినాయక చవితి పండుగను జరుపుకోవడానికి మాత్రమే హౌసింగ్ కాలనీలో గణేశ్ విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవాలి. విగ్రహంతో పాటుగా ఎలాంటి ఊరేగింపును చేపట్టరాదు” అని జడ్జి స్పష్టం చేశారు.

Source : Indian Express