అపర రుద్రుడై పాకిస్తాన్ సైనికులను చీల్చి చెండాడి తరిమికొట్టిన వీర సైనికుడు హవల్దార్ అబ్దుల్ హమీద్ గురించి నేటి యువతరం తెలుసుకోవాల్సింది ఎంతో ఉంది. అబ్దుల్ హమీద్ జూలై 1, 1933న ఉత్తరప్రదేశ్‌లోని ఘాజిపూర్ జిల్లాలోని ధూపపూర్ గ్రామంలో సాకినా బేగం, మహమ్మద్ ఉస్మాన్ దంపతులకు జన్మించాడు. అబ్దుల్ తండ్రి వృత్తిరీత్యా టైలరు. అబ్దుల్ సైన్యంలో చేరాలని నిర్ణయించుకోవడానికి ముందు తరచూ తండ్రికి బట్టలు కుట్టడంలో సహాయపడేవాడు. చిన్నప్పటి నుండి హమీద్‌కి కుస్తీలు, కత్తిసాము అంటే బాగా ఇష్టం. దేశభక్తి గీతాలు పాడుతుండేవాడు. తనకు సైనిక విభాగమే తగినది అని భావించి ఇరవయ్యవ ఏట మిలటరీలో చేరాడు.
సైన్యంలో హమీద్‌కి ప్రత్యేక గుర్తింపు లభించింది. హమీద్ వారణాసి వద్ద ఆర్మీలో నియమితుడయ్యాడు. నాసిరాబాదులోని గ్రెనడెర్స్ రెజిమెంటల్ సెంటర్ వద్ద శిక్షణ పొందిన తరువాత అతను 1955లో 4 గ్రెనడీలకు పంపబడ్డాడు. మొదట్లో అతను రైఫిల్ కంపెనీలో పనిచేశాడు, తరువాత ప్లాటూన్‌కు పంపబడ్డాడు. అతను థంగ్లాలో 1962లో జరిగిన యుద్ధంలో పాల్గొన్నాడు.
1962లో చైనాతో జరిగిన యుద్ధంలో హమీద్ తన నైపుణ్యంలో పలు ట్యాంక్‌లను విజయవంతంగా ధ్వం సం చేశాడు. ఆ యుద్ధం ముగిసింది. హమీద్‌ని స్టోర్స్‌లో క్వార్టర్ మాస్టర్‌గా సైనిక అధికారులు నియమించారు. 1965లో భారత్, పాకిస్తాన్ల మధ్య యుద్ధం జరిగినప్పుడు అబ్దుల్ హమీద్ భారత సైన్యంలో అప్పటికి పది సంవత్సరాల సేవలను పూర్తిచేసాడు. 4వ గ్రెనెడర్స్లో పనిచేశాడు. జమ్మూ కశ్మీర్ సరిహద్దులో భారత దళాలకు కమ్యూనికేషన్, సరఫరా మార్గాలను తగ్గించాలనే ఉద్దేశంతో జమ్మూలో అకస్మాత్తుగా శత్రువు దాడి చేసినట్లు వార్తలు వచ్చాయి.
హమీద్ పనిచేసే 4వ గ్రెనెడీయర్స్ పంజాబ్‌లోని ఖేంకరణ్ రోడ్డులో చిమా గ్రామానికి సమీపంలో ఒక ముఖ్యమైన ప్రాంతంలో ఆక్రమించారు. వీరికి ఆసా ఉత్తర గ్రామ సమీపంలోని శత్రువులను పట్టుకోవాలని అధికారులు చెప్పారు. భారత రక్షణ ప్రణాళికకు ఈ ప్రాంతం నిలకడగా ఉంది. సెప్టెంబర్ 8న శత్రువులు గ్రెనడీల ప్రాంతంలో పునరావృత దాడులను చేశారు. కానీ ప్రతిసారీ విఫలమయ్యారు. శత్రువు పటోన్ ట్యాంకుల రెజిమెంట్‌లో ముందుకు వచ్చినప్పుడు అత్యంత తీవ్రమైన దాడి జరిగింది. హమీద్ తన తుపాకీతో ఒక జీప్ మీద ఒక పొలంలోకి వెళ్లాడు. అక్కడి నుంచి గురిచూసి వేచి వున్నాడు. శత్రువు 30 గజాల దూరంలోకి రాగానే తుపాకీలు ఎక్కుపెట్టమని సహచరులకు చెప్పాడు.
పాకిస్థాన్ ట్యాంక్‌ల కదలిక శబ్దాలు వినిపించాయి. ఖేమ్ కరణ్ జిల్లాలోని చీమా గ్రామంలోని ఒక చెరుకుతోటలో మాటువేసి జీప్ మీద బిగించిన యాంటీ ట్యాంక్ గన్‌తో హమీద్ సిద్ధంగా ఉన్నాడు. హమీద్ వంటి వీరుడు రంగంలోకి వచ్చాడని తెలియని పాకిస్తానీ సైనికులు తమ ట్యాంకులతో ముందుకు రావడం ప్రారంభించారు. ఖేమ్ కరణ్ సెక్టార్లో పాక్ సైన్యం యుద్ధ నియమాలు పాటించకుండా సరిహద్దు గ్రామాల వైపు టాంకులను మళ్ళించింది.
శత్రువుల కుట్రల్ని పసిగట్టిన హమీద్ 9వ తేదీ సాయంత్రం నాటికి రెండు ట్యాంకులను ధ్వంసం చేశాడు. అత్యాధునిక సాయుధ యుద్ధ టాంకులు పాకిస్తాన్ వైపు నుండి మన దేశ సరిహద్దుల వైపుకి దూసుకు వస్తున్నప్పుడు హమీద్ చూపిన ధైర్యం అనితర సాధ్యమైనది. హవల్దార్ హమీద్ తన గన్ పేల్చాడు. యాంటీ ట్యాంక్ గన్ పాకిస్థాన్ ట్యాంక్‌కి తగలటం నిప్పు అంటుకోవటం క్షణంలో జరిగిపోయింది. హఠాత్తుగా తగిలిన ఎదురుదెబ్బకు పాకిస్థానీయులు పలాయనం చిత్తగించారు.
సెప్టెంబరు 10, 1965న రెండు గంటల్లో తిరిగి పాకిస్థానీయులు మరో మూడు ట్యాంకులతో వచ్చారు. భారీగా ట్యాంక్ గన్లు పేలుస్తూ వచ్చారు. అయినప్పటికీ అక్కడ భారత వీరులు మొక్కవోని ధైర్యంతో వున్నారు. హవల్దార్ హమీద్ గురితప్పని తుపాకీ ఒక యుద్ధ ట్యాంకును ధ్వంసం చేసింది. మిగిలిన రెండు ట్యాంక్‌లను అక్కడే వదిలేసి శత్రుసైన్యం వెన్ను చూపించింది. ఆ రెండు ట్యాంక్‌లను హమీద్ ధ్వంసం చేశాడు.
మళ్ళీ పాక్ సైన్యం వస్తుందని తెలుసుకున్న హమీద్ ఒక్క రోజులో అదనపు బలగాలతో శత్రు సైన్యం అంతు చూడటం, విజయం సాధ్యమని అనుకున్నాడు హమీద్. తమ ట్యాంక్‌లను ధ్వంసం చేస్తున్నారనే ఆలోచనలో వున్న పాక్ సైనికులకు హమీద్ గురించి సమాచారం అందింది. జీపు మీద పెట్టిన ఆర్సిఎల్ గన్ను హమీద్ పేలుస్తున్నాడు. మెరుపువేగంతో వాహనాన్ని అతివేగంగా కదిలించి, శత్రువులకు కనపడకుండా మాటువేస్తూ అతను మరో మూడు ట్యాంక్‌లను ధ్వంసం చేశాడు. హమీద్ మాటువేసిన ప్రదేశాన్ని శత్రువులు పసిగట్టి దాడి చేశారు.
అనూహ్య రీతిలో శత్రువుల దాడుల నుంచి దేశాన్ని రక్షించిన హమీద్ విజయోత్సాహంలో పాలుపంచుకోవడానికి లేకుండా ఆ దాడిలోనే ప్రాణాల్ని కోల్పోయాడు. యుద్ధంలో అమరుడైన హమీద్‌కు మరణానంతరం భారత ప్రభుత్వం పరమవీరచక్ర అవార్డును ప్రకటించి, అతడి సేవలను గౌరవించింది. ఆ గ్రామంలో ఈ వీరుడి స్మృతి చిహ్నాన్ని ఏర్పాటుచేశారు. సెప్టెంబరు 10వ తేదీని, ఆ గ్రామాన్ని, ఆ వీరుణ్ణి చరిత్ర ఎప్పటికీ మరచిపోదు.
-పుష్యమి
(ఆంధ్రభూమి సౌజన్యం తో)