ఇటీవల ప్రసార మాధ్యమాల్లో చాలా తెలివిగా ‘హిందుత్వ’ను ధ్వంసం చేసే కార్యక్రమాల్లో ‘దొంగబాబాలంటూ’ మొత్తానికి మొత్తం ఆధ్యాత్మిక గురువులపై ఏకపక్షంగా నిందలేస్తున్నారు. ‘హిందూమతం’ అనగానే శంకరాచార్యుల దగ్గర నుండి శివసత్తుల వరకు అందరిలోనూ తప్పులు వెతికేవాళ్లు ఎక్కువయ్యారు. ప్రశ్నలు వేసేవాళ్లు హిందుత్వను సంస్కరించాలని కాకుండా ద్వేషించేవారిలా ప్రవర్తిస్తున్నారు. నిజానికి హిందూ ధర్మంలో జిగీషు ప్రశ్న- గెలవాలనే కోరికతో అడిగే ప్రశ్న, జిజ్ఞాసు ప్రశ్న- తెలుసుకోవాలని అడిగే ప్రశ్న అని రెండు రకాలు. చాలామంది తెలుసుకోవాలన్న జిజ్ఞాసతో కాకుండా హిందూమతంలో చిన్న చిన్న తప్పులను పెద్దవిగా చేసి భూతద్దంలో చూపి తాము పేరు పొందాలనుకొంటున్నారు.
కొన్ని ప్రసార మాధ్యమాలు, కొందరు వంకర టింకర మేధావులు, షార్ట్‌కట్‌లో పేరు పొందాలనుకొనేవారు హిందుత్వపై ఎక్కి స్వారీ చేయాలనుకొంటారు. ఉదాహరణకు ఇటీవల తెలుగులో హిందుత్వను బాగా వ్యతిరేకించే ఓ టీవీ చానల్ కడుపున మరో పిల్ల పుట్టింది. దానిని తొందరగా ప్రచారంలోకి తేవడానికి ఆ చానల్ యాజమాన్యం శబరిమల ఘటనను ఉపయోగించుకోవాలనుకొన్నది. ఆ చానల్ రిపోర్టర్‌ను శబరిమల ఆలయంలోకి వెళ్లమని పంపించారు. నాస్తికురాలైన ఆమెను భక్తురాలిని చేసిన ఘనత ఆ ప్రసార మాధ్యమానికే దక్కింది. దీని వెనుక భక్తికన్నా ఆ చానెల్‌కు అడ్డదారిన పేరు తేవడమే వారి ముఖ్య లక్ష్యం.
ఈ హిందుత్వ వ్యతిరేక శక్తులు- ఎవరో అనామకులు భక్తి పేరుతో చేసే మోసాలను మొత్తం హిందుత్వకే అంటగట్టాలని చూస్తున్నారు. సమాజం విస్తృతంగా ఉన్నపుడు అందులో జరిగే పొరపాట్లను మొత్తం సమాజానికి ఆపాదించడం నేరం. ఇతర మతాలు మెజారిటీగా ఉన్నచోట్ల ఇంతకంటే ఘోరమైన ఘటనలు జరుగుతున్నాయి. ఇటీవల కేరళలో అత్యాచారం చేసిన ఓ మత గరువును గొప్పగా స్వాగతించినా ఒక్కరూ దానిపై మాట్లాడలేదు సరికదా దాని గురించి పనె్నత్తలేదు. అయిదు శాతం జనాభా ఉన్న వాళ్లలోనే ఇలాంటివి ఉన్నపుడు 83 శాతం జనాభా ఉన్న హిం దూ సమాజంలో అక్కడక్కడ జరిగే అవాంఛనీయ ఘటనలు మొత్తం ధర్మానికే ఆపాదించడం తగదు.
మనం మార్కెట్లోకి వెళ్లినపుడు నాణ్యతగల, తక్కువ ధరగల వస్తువులనే ఖరీదు చేస్తాం గాని అందుకు భిన్నంగా కొనలేము కదా. అలాగే ఈ దేశంలో ఎందరో మంచి గురువులు దేశ సంస్కృతికి ఆధారంగా నిలిచారు. సనాతన ధర్మాన్ని సజీవంగా ఉంచుతున్నారు.
పాషండ మతాలను ఖండించి సనాతన ధర్మాన్ని పంచాయతన ఆరాధనతో మరోసారి ధర్మ వైభవాన్ని చాటిన ఆదిశంకరుల మా ర్గం మనం ఎలా వదలిపెట్టగలం. కీటువార, భోగవార, ఆనందవార, భూరివార అనే సంప్రదాయాలను సృష్టించి ద్వారక, గోవర్థన, జ్యోతిర్మఠం, శృంగేరి మఠాలను స్థాపించి, సనాతన ధర్మ వైభవాన్ని నిలబెట్టిన ఆదిశంకరుడు మనకు గురువు కాదా? దళితుల నుండి ఆళ్వారులను సృష్టించిన శ్రీమద్రామానుజులను ఈ జాతి ఎలా మరిచిపోతుంది? వచనాల్లో వేదాంతాన్ని అందించి దక్షిణభారతంలో నిమ్నకులాల్లోనూ ఆధ్యాత్మికతను సాధించి మహాత్మా బసవేశ్వరుని అడుగుజాడలు మనం విడిచిపెట్టగలమా? శూద్ర కులాలకు పీఠాలను స్థాపించే విధంగా వేదాంతులను తీర్చిదిద్దిన శ్రీమద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామిని ఈ జాతి నుండి ఎవరైనా వేరు చేయగలరా? అంతెందుకు..? ఇటీవలి కాలంలో ఎందరో ఆధునిక గురువులు హిందూ మత వైభవాన్ని తమ తమ పంథాను అనుసరిస్తూనే గొప్పగా ఆచరించారు. స్వామి శివానంద, పరమహంస యోగానంద, లాహిరీ మహాశయులు, యుక్తేశ్వర్ మహరాజ్, సత్యానంద్ మహరాజ్, జిడ్డు కృష్ణమూర్తి, ఓషో, శ్రీలప్రభుపాద, ప్రభాత్ రంజన్ సర్కార్, బ్రహ్మం బాబా, రమణారెడ్డి, స్వామి రామతీర్థ, రామకృష్ణ పరమహంస, ముమ్మిడివరం బాలయోగీశ్వరులు, సదాశివ బ్రహ్మేంద్ర, మెహర్‌బాబా- వీళ్లంతా తమ జీవితకాలమంతా శుద్ధమైన వేదాంతాన్ని అందించారు. మన శాస్త్రాల్లో వున్న గహనమైన విషయాలను సులభరీతిలో మనకు అందించి, ఆధునిక వేదాంతంగా మెరుగులు దిద్ది ఇంకో వెయ్యేళ్లకు కావాల్సిన ఆధ్యాత్మికదారులను సిద్ధం చేసి శరీరాలను వదలిపెట్టారు.
అలాగే ఇపుడు శరీరంతో ఉన్నవాళ్లు కొందరు ఆత్మజ్ఞానులైతే మరి కొందరు ధర్మరక్షణ చేసే వీర యోధుల్లా భారతీయ సాంస్కృతిక వైభవాన్ని నిత్య నూతనం చేస్తున్నారు. మాతా అమృతానందమయి- రూపంతో, కులంతో సంబంధం లేకుండా ప్రపంచ వ్యాప్తంగా తన ఆధ్యాత్మిక సేవలను ఆధ్యాత్మికత వైపు మరల్చింది. ‘ఆర్ట్ ఆఫ్ లివింగ్’ ఉద్యమ సారథి రవిశంకర్ గురూజీ తీవ్రవాదులతో చర్చలు జరిపి శాంతి సౌభ్రాతృత్వాలను సాధిస్తున్నారు. బాబా రాందేవ్ ఇవాళ పతంజలి బ్రాండ్ అనే భారతీయ మార్కెట్ సృష్టించి కోకోకోలాకే నీళ్లు తాగిస్తున్నాడు. ఇంత గొప్ప గురువులు ఈ దేశంలో పుట్టి నిస్వార్థ చింతనతో జాతికి మేలు చేస్తుంటే- ఎవరో చిల్లరగాళ్లు చేసే బాణామతులు, చేతబడుల ఘటనలకు బాబాల పేర్లు తగిలించి హిందుత్వను అ పఖ్యాతి పాలు చేయడానికి ప్రయత్నం చాపక్రింద నీరులా జరుగుతోంది. సమాజ హితమే లక్ష్యంగా దధీచి మహర్షి వారసుల్లా అనాథ ఆశ్రమాలు, బీదల కోసం పాఠశాలలు, కుటీర పరిశ్రమలు, వృద్ధాశ్రమాలు నడుపుతున్న గురువులు ఒకవైపు ఉండగా, రాజదండం బలహీనమైనపుడు ధర్మదండంతో జాతిని రక్షించే గురువుల బలాన్ని తగ్గించేందుకు జరుగుతున్న ఈ కుట్రను ఇకనైనా గ్రహించకపోతే జాతి మనుగడే ప్రశ్నార్థకమవుతుంది. తస్మాత్ జాగ్రత్త!
– డాక్టర్ పి.భస్కర యోగి
Source: Andhra Bhoomi