Home News హిందూ దేవుళ్ళను అవమానపర్చిన అమెరికా కంపెనీ ‘ఎట్సి’, టాయిలెట్ సీట్ల పై గణేశుడి బొమ్మ

హిందూ దేవుళ్ళను అవమానపర్చిన అమెరికా కంపెనీ ‘ఎట్సి’, టాయిలెట్ సీట్ల పై గణేశుడి బొమ్మ

0
SHARE

ఇ కామర్స్ కంపెనీ ఎట్సి డాట్ కామ్  హిందూ దేవుడైన గణేశుడి బొమ్మ ముద్రించిన టాయిలెట్ సీట్ లను  అమ్మకానికి పెట్టడంపై అమెరికాలో హిందువులు తీవ్ర నిరసన తెలిపారు. గణేశుడిని ప్రపంచవ్యాప్తంగా లక్షలాదిమంది పూజిస్తారని, అలాంటి దేవుడి బొమ్మను దుర్వినియోగం చేయడం తగదని అమెరికాలోని యూనివర్సల్ సొసైటీ ఆఫ్ హిందూయిజం సంస్థ డిమాండ్ చేసింది. ఇది హిందువులను అవమానించడమేనని సంస్థ అధ్యక్షుడు రాజన్ జెద్ అన్నారు. ఇటీవల మరొక అమెరికా కంపెనీ అమజాన్ కూడా ఇలాగే  గణేశుడి బొమ్మ ముద్రించిన చెప్పులను అమ్మకానికి పెట్టింది. టాయిలెట్ సీట్ పై గణేశుడు ఒక అద్దం, దువ్వెన, టూత్ పేస్ట్, బ్రష్ పట్టుకుని ఉన్నట్లుగా, ఆయన వాహనం ఎలుక తోక ఒక దువ్వెనలా చిత్రించారు. `పుట్టినరోజు, పెళ్లిరోజులకు చక్కని బహుమతి’ అంటూ ముద్రించారు. దీని వెల 85 అమెరికా డాలర్లు.

“హిందువులు ఎంతో భక్తిగా గణేశుడి బొమ్మల్ని గుళ్లలో, ఇళ్ళలో పెట్టుకుంటారు. కానీ ఎట్సి కంపెనీ వాటిని  టాయిలేట్ సీట్ లపై ముద్రించింది. ఇలా హిందూ దేవుళ్ళ బొమ్మల్ని వ్యాపారంకోసం, ఇతర ప్రయోజనాలకోసం వాడటం భక్తుల మనోభావాలను కించపరచడమే’’ అని రాజన్ ఒక ప్రకటనలో నిరసన వ్యక్తం చేశారు. అభ్యంతరకరమైన టాయిలెట్ సీట్ లను మార్కెట్ నుండి ఉపసంహరించుకోవడమే కాక ఎట్సి కంపెనీ సి.ఈ.ఓ జోష్ సిల్వర్మన్ హిందువులకు క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.

ఇలా హిందూ దేవి దేవతలను అభ్యంతరకరంగా చిత్రించడం, వారి బొమ్మలను దుర్వినియోగం చేయడం ఇటీవల ఎక్కువగా జరుగుతోందన్నారు.  హిందువులు కళాత్మక, భావ స్వేచ్ఛకు ఎప్పుడు మద్దతునిస్తారని, కానీ ఇప్పుడు జరుగుతున్నది మాత్రం అభ్యంతరకరమైన విషయమని రాజన్ స్పష్టం చేశారు.

హిందూ మత, సాంస్కృతిక విషయాలను, హిందువుల మనోభావాలను అర్ధంచేసుకునేందుకు ‘ఎట్సి’ తమ అధికారులకు శిక్షణ ఇవ్వాలని, అప్పుడు ఇలాంటి తప్పులు జరగవని రాజన్ సూచించారు.

2005లో ప్రారంభమయిన ఎట్సి కంపెనీకి ఫ్రాన్స్, జపాన్, ఆస్ట్రేలియా, కెనడా, జర్మనీ, లండన్, ఐర్లాండ్ లలో కూడా ఆఫీసులు ఉన్నాయి, 2016 నాటికి కంపెనీ అమ్మకాలు ఏటా 2.84 బిలియన్ డాలర్లకు చేరాయి.

ఇంతకు ముందు ఎట్సి తో పాటు ఎమజాన్ కంపెనీ కూడా గాంధీ బొమ్మ ముద్రించిన చెప్పుల్ని అమ్మకానికి పెట్టి వివాదంలో ఇరుక్కుంది.  ఈ కంపెనీల దుశ్చర్యను అప్పుడు  ప్రపంచ వ్యాప్తంగా లక్షలాదిమంది తీవ్రంగా ఖండించారు. ఈ విషయం ఏకంగా ప్రభుత్వం వరకు వెళ్లింది. విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ భారత్ ను కించపరచే చర్యలు తగవని ఎమజాన్ తెలియచెప్పారు. భారత జాతీయ పతాకం ముద్రించిన డోర్ మాట్ పట్ల కూడా ఆమె తీవ్ర అభ్యంతరం తెలిపారు.

అయిన అమెరికా కంపెనీల బుద్ధిమాత్రం మారినట్లు లేదు.