Home News హజ్ సబ్సిడీని  ఇతర మత కార్యక్రమాలపై చేసే ఖర్చుతో పోల్చకూడదు

హజ్ సబ్సిడీని  ఇతర మత కార్యక్రమాలపై చేసే ఖర్చుతో పోల్చకూడదు

0
SHARE

హజ్ సబ్సిడీని రద్దుచేస్తున్నట్లుగా NDA ప్రభుత్వం ప్రకటించగానే `మరి మానససరోవర యాత్ర కోసం హిందూ యాత్రికులకు ఇచ్చే సబ్సిడీ మాటేమిటి’ అని సెక్యులర్ మీడియా అడగడం ప్రారంభించింది. కుంభమేళా కోసం `కుమ్మరిస్తున్న’ కోట్ల రూపాయల సొమ్ము సంగతి ఏమిటని అడిగింది. ఇక మజ్లిస్ ఎ ఇత్తెహాదుల్ ముస్లిమీన్ నాయకుడు, `చిన్న జిన్నా’గా పేరుతెచ్చుకోవాలని తాపత్రయపడుతున్న అసదుద్దీన్ ఒవైసీ మరో అడుగు ముందుకు వేసి ట్రావన్ కోర్ దేవస్వోమ్ బోర్డ్ కు 46.5 లక్షల రూపాయలు ఇవ్వడానికి కారణమైన అధికరణం 290A మాటేమిటని అడిగాడు.

అయితే వీళ్ళు తమకు తోచినప్పుడు, తమకు ఇష్టమైనప్పుడు, అనుకూలమైనప్పుడు మాత్రమే ఇలాంటి ప్రశ్నలు సంధిస్తారు తప్ప అన్నీ విషయాల్లో ఇలాంటి పోలికలు తీసుకురారు. అయినా వాళ్ళ ప్రశ్నలకు సమాధానం ఉంది.

ఈ మేధావులంతా మొట్టమొదటగా గుర్తించాల్సిన విషయం ఏమిటంటే వ్యక్తులకు ఇచ్చే సబ్సిడీకి, మతపరమైన కార్యక్రమాలకు ఇచ్చే సబ్సిడీకి తేడా ఉంది. మొదటి రకం సబ్సిడీల వల్ల వ్యక్తులకు ప్రయోజనం చేకూరుతుంది. మరొకటి మొత్తం ఒక వర్గానికి లాభం కలిగిస్తుంది.

హజ్ సబ్సిడీ మొదటిరకానికి చెందినది. ఇస్లాం మతపు పవిత్ర స్థలాలను దర్శించడానికి వ్యక్తిగతంగా దరఖాస్తు చేసుకున్న ముస్లింలకు ఇచ్చే వ్యక్తిగత సబ్సిడీ ఇది. కనుక చార్ధామ్ యాత్ర, మానససరోవర యాత్రలకు కూడా ఇచ్చే ఇలాంటి సబ్సిడీ గురించి ప్రశ్నిస్తే ఫరవాలేదనుకోవచ్చు. అయితే జాగ్రత్తగా  పరిశీలిస్తే చార్ధామ్ యాత్ర సబ్సిడీకి, హజ్ సబ్సిడీకి తేడా ఉందని కూడా తెలుస్తుంది. అదేమిటో తరువాత చూద్దాం.

ముందు పాలను, నీళ్ళను వేరుచేద్దాం

కుంభమేళా, ఆజ్మీర్ షరీఫ్ ఉర్స్, వెలాంకని ఉత్సవం మొదలైనవాటిలో యాత్రికులకు సబ్సిడీ ఏది ఇవ్వరు. కేవలం ఆయా ఉత్సవాల్లో సదుపాయాలు కలిగించడానికి, శాంతిభద్రతల పరిరక్షణకు ఖర్చు చేస్తారు. సామాజిక సంస్థలు కూడా భక్తులకు ఉచితంగా ఆహారం, నీళ్ళు అందిస్తాయి. ఇలా కుంభమేళా, ఉర్స్ లలో ప్రజలందరి కోసం ఏర్పాట్లు చేస్తారు, దానికోసం ఖర్చు చేస్తారు.

అలాగే ఈ రెండు మత ఉత్సవాలు సాంస్కృతిక, వ్యాపారపరమైనవి కూడా. ప్రయాగలో 2013లో జరిగిన కుంభమేళా కోసం ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం 2,500 కోట్ల రూపాయలు ఖర్చు చేయాలనుకుంది. ఆలాగే మేళాలో 12,000 కోట్ల వ్యాపారం జరుగుతుందని అంచనా వేశారు. స్థానికంగా వసతి సదుపాయాలను మెరుగుపరచడం కోసమే ప్రభుత్వం ఎక్కువ ఖర్చు చేయవలసి వస్తుంది. దీనివల్ల పర్యాటక రంగంలో అభివృద్ది సాధ్యపడుతుంది. ఇది మొత్తం రాష్ట్రానికి మేలు చేస్తుంది. అలాగే 2016 మధ్యప్రదేశ్ లో జరిగిన సింహస్త కుంభలో వ్యాపార సంస్థలు ఊహించని విధంగా వ్యాపారం జరిగింది.

ఇక ఇతర మతస్థుల తీర్థయాత్రలకు ఇచ్చే సబ్సిడీల వల్ల నష్టం ఉంది. మనదేశంలో జరిగే తీర్థయాత్రల వల్ల దేశపు ఆర్ధిక వ్యవస్థకు లాభం చేకూరుతుంది. ఎందుకంటే అక్కడ జరిగే వ్యాపారం, వాటికోసం ప్రభుత్వం చేసే ఖర్చు ఈ దేశంలోనే ఉంటుంది. స్థానికంగా సదుపాయాలు, ఆర్ధిక స్థితి మెరుగుపడతాయి. కానీ హజ్ సబ్సిడీ వేరు. దీనివల్ల ఎయిర్ ఇండియా కొంత లాభపడుతుందేమోకానీ మిగతా ఆర్ధిక ప్రయోజనం అంతా సౌదీ అరేబియాకే చెందుతుంది. నిజానికి తమ దేశంలో మౌలిక సదుపాయాలు, ఆర్ధిక రంగాలలో కలిగే లాభాల కోసం సౌదీ అరేబియాయే హజ్ యాత్రికులకు సబ్సిడీ ఇవ్వాలి.

భారత ప్రభుత్వం హిందూమతం తో పాటు ఏ మతానికైనా ప్రత్యేక సదుపాయాలు కలిగించాలా, లేదా అన్న ప్రశ్న కూడా వస్తుంది. ప్రభుత్వం ఏ మతానికి అనుకూలంగా వ్యవహరించాల్సిన అవసరంలేదని కొందరు వెంటనే సమాధానం చెపుతారు. కానీ ఈ దేశంలో అలా ప్రత్యేక సదుపాయాలు పొందుతున్న మతాలు ఏమిటన్నది కూడా చూడాలి. అలా చూస్తే హైందవేతర మతాలే ప్రభుత్వం నుండి ప్రత్యేక రాయితీలు పొందుతున్నాయని తెలుస్తుంది. దక్షిణాది రాష్ట్రాల్లో ఒక లక్షకు పైగా హిందూ దేవాలయాలు ఉన్నాయి. విద్యా హక్కు చట్టం కింద చేసే ఖర్చు ప్రధానంగా ఈ దేవాలయాలపైనే పడుతోందన్నది నిజం . వీటికంటే రాష్ట్ర ప్రభుత్వాలు ఆర్ధిక సహాయం అందించే మైనారిటీ సంస్థలకు ఎక్కువ స్వేచ్చ ఉంది. కనుక `అన్ని మతాలను ఒకేలా చూడాలి’ అని వాదించడానికి ముందు మెజారిటీ వర్గానికి చెందిన మత వ్యవహారాలలో ప్రభుత్వాల అనవసర జోక్యం గురించి మాట్లాడాలి. అది ముందు తొలగించే మార్గం చూడాలి. అదేకనుక జరిగితే హిందువుల తీర్థ యాత్రలకు ఏ ప్రభుత్వము సబ్సిడీలు ఇవ్వాల్సిన అవసరం ఉండదు. ఎందుకంటే శ్రీ పద్మనాభస్వామి దేవాలయం (లక్ష కోట్ల రూపాయలు), తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి వచ్చే ఆదాయంతోనే ఈ తీర్థ యాత్రలను వైభవోపేతంగా నిర్వహించవచ్చును.

ఒకవేళ కొన్ని మతాలకు ప్రత్యేకమైన సదుపాయాలు ఇవ్వాల్సి వస్తే మన దేశంలో ఏ మతాలకు అలాంటి సదుపాయాలు కల్పించాలన్న ప్రశ్న వస్తుంది. దానికి సమాధానం హిందూ మతం, ఇతర భారతీయ, గిరిజన మతాలు అనే వస్తుంది. ఈ సమాధానం చాలమందికి నచ్చక పోవచ్చును. ప్రభుత్వం నిస్పాక్షికంగా, తటస్థంగా ఉండాలని వాళ్ళు భావిస్తారు. కానీ మనం అటువంటి ఆదర్శవంతమైన స్థితిలో జీవించడంలేదుకదా. హిందువులకు ఉన్న ఏకైక సురక్షితమైన దేశం భారత్. అదే క్రైస్తవులకు, ముస్లిములకు అనేక దేశాలు ఉన్నాయి. సంపన్నమైన ఈ దేశాలు తమతమ మతాలను వ్యాప్తిచేసుకునేందుకు భారత్ లో డాలర్లు, పెట్రోడాలర్లు గుమ్మరిస్తున్నాయి. కానీ హిందువుల , ఇతర భారతీయ మతాలను పరిరక్షించడానికి భారత్ లో కొద్దిపాటి ప్రభుత్వ, ప్రైవేట్ నిధులు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. అందుకనే ఇతర దేశాలలో శోషణకు గురవుతున్న హిందువులను(మన పొరుగు దేశాలలో ఎక్కువగా ఉన్నారు) కాపాడేందుకు  మనకున్న నిధులను ఉపయోగించాలి. అంతేకానీ దేశ భద్రతకు ముప్పు తెచ్చిపెట్టే, జనాభా సంతులనాన్ని భంగపరచే రోహింగ్యాలకు ఆశ్రయం ఇవ్వడానికి నిధులు ఖర్చు పెట్టకూడదు.

భారతదేశపు వర్తమానం, భవిష్యత్తు అల్పసంఖ్యాకుల కంటే అధికసంఖ్యకుల పైనే ఎక్కువ ఆధారపడి ఉంది. నిజానికి ఇక్కడ మైనారిటీలుగా చెలామణి అవుతున్నవారు ప్రపంచంలో మైనారిటీలు కారు. భారతీయ మతాలతో పోలిస్తే క్రైస్తవం, ఇస్లాంలు శక్తివంతమైనవి, ధనవంతమైనవి కూడా. అయితే భారత్ లో మైనారిటీల పట్ల వివక్ష చూపాలని కాదు. కేవలం మత విషయాలలో భారతీయ మతాలకు మరింత సహాయం అవసరం.

స్వరాజ్ మ్యాగ్ సౌజన్యంతో ….