‘సమితి’ సంస్కరణ పగటి కలేనా?, రేపు ఐరాస దినోత్సవం
ఐక్యరాజ్య సమితి 1945 అక్టోబరు 24న ఏర్పాటైంది. నాటి నుంచి ఏటా ఆ రోజును ఐక్యరాజ్య సమితి దినోత్సవంగా నిర్వహిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా మానవ హక్కుల పరిరక్షణ, శాంతిస్థాపన, సామాజిక ప్రగతికి దోహదపడుతున్న ఐక్యరాజ్య సమితిని గౌరవించేందుకే ఈ దినోత్సవం జరుపుతున్నారు. 20వ శతాబ్దం మానవాళిని అతలాకుతలం చేసింది. 1930 నాటి మహామాంద్యం దరిమిలా ఐరోపాలో నియంతలు అధికార పీఠాలు అధిరోహించారు. ఆపై సంభవించిన రెండో ప్రపంచ యుద్ధం, మానవాళి చరిత్రనే రక్తాక్షరాలతో లిఖించింది. అలాంటి పరిస్థితుల్లో ప్రపంచం ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి ఒక బహుముఖీన అంతర్జాతీయ సంస్థ అవసరమని ప్రపంచ నాయకులు భావించారు. ఆ భావనకు ఒక రూపం కల్పించారు. తరవాత అదే ఐక్యరాజ్య సమితిగా ఆవిర్భవించింది. ప్రపంచ శాంతిని ప్రోది చేయడం, విశ్వసౌభాగ్యానికి పాటుపడటం, ప్రపంచం నుంచి దారిద్య్రాన్ని పారదోలడమనే మహత్తర లక్ష్యాలతో అది ఏర్పాటైంది. ఐక్యరాజ్య సమితి రెండో సెక్రెటరీ జనరల్‌గా పనిచేసిన డగ్‌హ్యామర్క్స్‌జోల్డ్ మాటల్లో చెప్పాలంటే- మానవాళిని స్వర్గం వైపు నడిపించేందుకు కాదు, నరకం నుంచి బయటపడేసేందుకే ఐక్యరాజ్య సమితి ఏర్పాటైంది.
ప్రత్యామ్నాయ శక్తులు
ఆయన ఆ ప్రకటన చేసి దాదాపు ఏడు దశాబ్దాలవుతోంది. ఐక్యరాజ్య సమితి ఏర్పాటైన రోజులకు, ఇప్పటికీ పరిస్థితులు బాగా మారాయి. అమెరికా, సోవియట్ యూనియన్‌ల మధ్య నలభై ఏళ్లపాటు ప్రచ్ఛన్న యుద్ధం జరిగింది. తరవాత సోవియట్ యూనియన్ పతనమై, విచ్ఛిన్నమైంది. దరిమిలా ప్రపంచ భౌగోళిక, రాజకీయ సమీకరణలు సాంతం మారిపోయాయి. పలు అధికార కేంద్రాలు ఏర్పడ్డాయి. రెండో ప్రపంచ యుద్ధం తరవాత ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రాబల్యం వహించిన అమెరికా వెనక్కి తగ్గాల్సివచ్చింది. చైనా, ఐరోపాలు ప్రత్యామ్నాయ ఆర్థిక శక్తికేంద్రాలుగా అవతరించాయి. ప్రపంచీకరణ పుణ్యమా అని తొమ్మిదో దశకం ఆరంభం నుంచి భారత్ సైతం చెప్పుకోదగ్గ శక్తిగా ఆవిర్భవించింది. ఆర్థికపరమైన ఈ పరిణామాలు చైనా, రష్యాల మధ్య వ్యూహాత్మక రాజకీయ సంబంధాలకు దారితీశాయి. భారత్, అమెరికాలు మరింత దగ్గరయ్యాయి. ఈ సమీకరణలు ప్రపంచంలో సరికొత్త ఆర్థిక, రాజకీయ పరిణామాలకు అంటుకట్టాయి. ఇస్లామిక్ ఉగ్రవాదం రూపేణా మరోవైపు సరికొత్త సవాళ్లు ఎదురయ్యాయి. ఐసిస్, అల్‌ఖైదా, బోకో హరామ్ వంటి ఉగ్రవాద సంస్థలు మనిషి మనుగడనే ప్రమాదంలో పడేశాయి. దాంతో, భారీయెత్తున శరణార్థుల సంక్షోభం తలెత్తింది. అణ్వాయుధాలు కలిగి ఉన్న ఉత్తర కొరియా వంటి దేశాలు అగ్నికి మరింత ఆజ్యం పోస్తున్నాయి. మరోవైపు ఆర్థిక సంక్షోభం తీవ్రమవుతోంది. సామాన్యుడి పొట్టకొట్టి బడా వ్యాపార సంస్థలు కోట్లకు పడగలెత్తుతున్నాయి. అంతర్గతంగాను, వివిధ దేశాల మధ్యా ఆర్థిక అసమానతలు బాగా పెరిగాయి. దాంతో పెద్ద సంఖ్యలో ప్రజానీకం పేదరికం, ఆకలి, దుర్భిక్షం కోరల్లోకి జారుకొంటున్నారు. అమెరికా వంటి కొన్ని సంపన్న దేశాల ఆత్మాశ్రయ ధోరణులు అభివృద్ధి చెందుతున్న, వర్ధమాన దేశాల్లో జనజీవనాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. విశ్వమానవాళి ఆర్థిక, ఆహార భద్రతకు, జీవించే హక్కుకూ ముప్పు ఏర్పడింది. ఇలాంటి సమస్యలెన్నో చుట్టుముట్టి, పలు సవాళ్లు ఎదురవుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఐక్యరాజ్య సమితిని ఉన్నదున్నట్లు కొనసాగించడం వల్ల ప్రయోజనం ఉంటుందా అన్న ప్రశ్న ఇప్పుడు తలెత్తుతోంది. యథాతథ పరిస్థితి వల్ల లాభం లేదన్నదే దీనికి సమాధానం. ప్రపంచాన్ని అస్తవ్యస్తం చేస్తున్న అనేక సమస్యల్ని సమర్థంగా ఎదుర్కొనలేక, చేతులు ముడుచుకొనే పరిస్థితి తలెత్తడానికి చాలా వరకు ఐక్యరాజ్య సమితి స్వరూప, స్వభావాలు, నిర్వహణ తీరూ కారణమే. ఈ దృష్ట్యా ఐక్యరాజ్య సమితిని తక్షణం సంస్కరించాల్సిన అవసరం ఉంది. ఇందుకు సంబంధించిన అంశాలను చక్కగా అవగతం చేసుకున్నపుడే ఆ సంస్కరణలు ఏ విధంగా ఉండాలన్న దాని మీద అవగాహన ఏర్పడుతుంది.
ప్రపంచ సంస్థ అయిన ఐక్యరాజ్య సమితి ప్రస్తుతం కొన్ని తీవ్ర సమస్యలతో సతమతమవుతోంది. పలు ‘ప్రొటోకాల్’లు, ఇతర లాంఛనాలతో దాని నిర్వహణ తీరు ముడిపడి ఉండటం మొదటి సమస్య. దీని వల్ల ఈ సంస్థ సామర్థ్యం దెబ్బతింటోంది. ఐక్యరాజ్య సమితిలో ఒక ఉద్యోగిని నియమించడానికి సగటున 213 రోజులు పడుతున్నట్లు అంచనా. నియామక ప్రక్రియ ఈ విధంగా నత్తనడకన సాగుతుండటంతో ఆర్థికంగానూ, మానవ వనరుల పరంగానూ ఐక్యరాజ్య సమితి ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తోంది. సమితి శాంతిస్థాపన కార్యకలాపాల కోసం కేటాయించే నిధులపైనా, వాటి వ్యయంమీదా సమర్థమైన పర్యవేక్షణ యంత్రాంగం లేదు. ఈ లోపాన్ని వెంటనే చక్కదిద్దాల్సిన అవసరం ఉంది. ఐక్యరాజ్య సమితికి చెందిన వివిధ విభాగాల మద్య సమన్వయం లేకపోవడం రెండో సమస్య. గడాఫీ హయాములో తీవ్ర మానవహక్కుల అణచివేతకు పాల్పడిన లిబియాను 2003లో ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల కమిషన్ అధ్యక్ష పదవికి ఎన్నుకోవడం విడ్డూరం! ఐక్యరాజ్య సమితి ప్రపంచ పర్యాటక సంస్థ 2012లో జింబాబ్వే నియంత రాబర్ట్ ముగాబేను తమ పర్యాటక నాయకుడిగా నియమించింది. స్త్రీల హక్కులను అణచివేస్తున్న సౌదీ అరేబియాకు మహిళల స్థితిగతులమీద ఏర్పాటైన ఐక్యరాజ్య సమితి కమిషన్‌లో ఇటీవల చోటుకల్పించారు. ఈ తరహా నిర్ణయాలను గమనించినప్పుడు ఐక్యరాజ్య సమితికి చెందిన వివిధ విభాగాల మధ్య సమన్వయం బొత్తిగా కొరవడిందని స్పష్టమవుతోంది. ఐక్యరాజ్య సమితి విశ్వసనీయతకే విఘాతం కలుగుతోంది. వర్ధమాన ప్రపంచానికి తన గళం వినిపించే అవకాశం లేకపోవడం ఐక్యరాజ్య సమితి నిర్వహణ తీరులో ప్రధాన లోపం. 1945 నాటికి, నేటికీ ప్రపంచం ఎంతగానో మారిపోయిందన్న వాస్తవాన్ని గుర్తించడానికి ఐక్యరాజ్య సమితి నిరాకరిస్తోందనిపిస్తోంది. సెక్రెటరీ జనరల్ ఎంపికలో తమ మాటా చెల్లుబాటు కావాలని కోరుతున్న దేశాలు ఎన్నో ఉన్నాయి. చాలాకాలంగా వాటి వాదన అరణ్యరోదనే అవుతోంది. మరోవైపు, ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం కావాలని బ్రెజిల్, భారత్, జపాన్ ఎప్పటి నుంచో కోరుతున్నాయి. అయినా వాటిని పట్టించుకోవడం లేదు. ఐక్యరాజ్య సమితిని ఇప్పటికైనా సమ్మిళిత సంస్థగా రూపొందించాలి.
‘సమితి’ ముందుగా తనను తాను మార్చుకోవాలి. సంక్షోభం తలెత్తాక స్పందించడం కాదు, అసలు సంక్షోభమే ఏర్పడకుండా చూడటం లక్ష్యంగా పెట్టుకోవాలి. దీనివల్ల లక్షలాది ప్రాణాలను కాపాడినట్లవుతుంది. ఐక్యరాజ్య సమితి ఆధారపడదగిన సంస్థగానూ రూపొందుతుంది. ‘ప్రోటోకాల్’లు, దౌత్యపరమైన లాంఛనాలకు పెద్దగా ప్రాధాన్యం ఇవ్వకుండా క్షేత్రస్థాయిలో ఫలితాల మీదే దృష్టి సారించడం ‘సమితి’ చేయాల్సిన రెండోపని. దీనివల్ల దాని ప్రాముఖ్యం, ప్రతిష్ఠా మరింత పెరుగుతాయి. భావితరాల అవసరాలను దృష్టిలో పెట్టుకొని తనను తాను మలచుకోవడం ‘సమితి’ ముందున్న మూడోమార్గం. దీనివల్ల వనరుల సమర్థ వినియోగానికి అది తోడ్పడగలుగుతుంది. నాలుగోపని- విధానపరమైన పొరపాట్లకు అవకాశం లేకుండా వివిధ విభాగాలను సమన్వయపరచడం. అభివృద్ధి చెందుతున్న, వర్ధమాన దేశాల మాటకు మరింత విలువ ఇవ్వాల్సిన అవసరాన్నీ ‘సమితి’ గుర్తించాలి.
ఐక్యరాజ్య సమితి సెక్రెటరీ జనరల్
ప్రస్తుత పరిస్థితి అంతటికీ ఐక్యరాజ్య సమితిదే బాధ్యత అని నిందించి ప్రయోజనం లేదు. సభ్యదేశాల మధ్య భౌగోళిక, రాజకీయ సమీకరణలు విపరీతంగా మారిపోయాయి. దీంతో భద్రతా మండలిలో ఏ దేశానికి శాశ్వత సభ్యత్వం కల్పించాలనేది ఎటూ తేలకుండాపోతోంది. వాస్తవంలో, ఐక్యరాజ్య సమితిలో చైనా సభ్యత్వానికి భారత్ అప్పట్లో గట్టి మద్దతు పలికింది. ఇప్పుడు అదే చైనా భద్రతామండలిలో భారత్ శాశ్వత సభ్యత్వానికి అడ్డుపడుతోంది. జపాన్‌కూ చైనా మోకాలడ్డుతోంది. బ్రెజిల్‌కు అర్జెంటీనా, దక్షిణాఫ్రికాకు నైజీరియాలు అడ్డుచక్రం వేస్తున్నాయి. భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం కలిగి ఉన్న దేశాలు, తమ ప్రాబల్యానికి ఎక్కడ గండి పడుతుందోనన్న భయానుమానాలతో ‘సమితి’లో సంస్కరణలను నిరోధిస్తున్నాయి. ఆ దేశాలు అందజేసే నిధులమీదే ఐక్యరాజ్య సమితి అధికంగా ఆధారపడుతోంది. ‘సమితి’కి పేదదేశాలు అందజేసే నిధులు చాలా తక్కువ. ఉదాహరణకు ‘సమితి’కి అమెరికా ఏటా 300 కోట్ల డాలర్ల నిధులు ఇస్తోంది. ‘సమితి’ వ్యయంలో దాదాపు 22 శాతానికి అది సమానం. పైగా ప్రపంచం వివిధ ప్రాంతాల్లో ‘సమితి’ చేపడుతున్న శాంతిస్థాపన కార్యక్రమాలకు అవుతున్న వ్యయంలో 29 శాతం అమెరికానే భరిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఐక్యరాజ్య సమితి తనంతట తానుగా సంస్కరణల కార్యక్రమాన్ని చేపడుతుందనుకోవడం కల మాత్రమే. ‘వీటో’ అధికారం కలిగి ఉన్న దేశాలు, ముఖ్యంగా అమెరికా నుంచి ఈ సంస్కరణల కార్యక్రమం ప్రారంభం కావలసి ఉంటుంది. ఎన్నో లొసుగులు, లోపాలు ఉన్నప్పటికీ – ప్రపంచంలో ఎక్కడ ఏ మూలన ఎలాంటి సమస్యలు, గడ్డు పరిస్థితులు, మానవతా సంక్షోభాలు తలెత్తినా – ప్రతి ఒక్కరు సమితివైపు చూస్తుంటారు. పరిస్థితుల్ని ‘సమితే’ చక్కదిద్దుతుందని ఆశిస్తుంటారు. అందుకే దాన్ని ఆశ్రయిస్తుంటారు. వైరివర్గాలను ఒకే చర్చావేదికమీద కూర్చోబెట్టి శాంతి సామరస్యాలు సాధించడానికి ప్రపంచం మొత్తంమీద ఐక్యరాజ్య సమితిని మించిన అంతర్జాతీయ సంస్థ మరొకటి లేదు మరి! పలుచోట్ల సంఘర్షణలు, యుద్ధాలను నివారించడంలో విఫలమైనప్పటికీ ‘సమితి’నే అంతా నమ్ముకోవడానికి బలమైన కారణమిదే. సంక్షోభాల్లో కలుగజేసుకొని, వాటి పరిష్కారానికి ప్రయత్నించే చట్టపరమైన హక్కు, యుఎన్ చార్టర్ ద్వారా ‘సమితి’కి లభించింది. అందుకే దానిమీద అంతగా ఆధారపడాల్సి వస్తోంది. ప్రపంచానికి ఐక్యరాజ్య సమితి అవసరం ఇదివరకటికన్నా ఇప్పుడే ఎక్కువగా ఉంది.
భారత్ క్రియాశీల పాత్ర
భారతదేశం మొదటినుంచీ ఐక్యరాజ్య సమితిలో క్రియాశీల పాత్ర పోషిస్తోంది. ప్రచ్ఛన్న యుద్ధానంతర కాలంలో భారత్ ప్రాధాన్యం మరింత పెరిగింది. ఐక్యరాజ్య సమితిలో సంస్కరణలు తీసుకురావాలని, దాన్ని మరింత సమ్మిళితంగా రూపొందించి విస్తృత ప్రాతినిధ్యం కలిగిన సంస్థగా తీర్చిదిద్దాలని గట్టిగా కోరుతున్న దేశాల్లో భారత్ ఒకటి. ఐక్యరాజ్య సమితి సంస్కరణలన్నవి కేంద్ర కార్యాలయానికే పరిమితం కారాదని, మారుతున్న ప్రపంచ పరిస్థితులను పరిగణనలోకి తీసుకొని విస్తృత స్థాయిలో సంస్కరణలు చేపట్టాల్సిన అవసరం ఉందని భారత్ వాదిస్తోంది. ఐక్యరాజ్య సమితి శాంతిస్థాపక కార్యకలాపాలకు అత్యధికంగా దళాలు సమకూరుస్తున్న దేశాల్లో భారత్ కూడా ఒకటి. ‘సమితి’ గడచిన అరవై ఏళ్లలో 71 శాంతిస్థాపక కార్యకలాపాలు చేపట్టింది. వాటిలో 50 కార్యకలాపాలకు భారత్ దాదాపు రెండు లక్షల మంది సైనికులను సమకూర్చింది. అవసరమైనప్పుడు ఎలాంటి చర్చలు, సంప్రతింపులు లేకుండానే తనంతట తానుగా జోక్యం చేసుకునేందుకు సమితికి అధికారం కల్పిస్తున్న ‘జోక్యం హక్కు’ మీద భారత్ భయానుమానాలు వ్యక్తం చేస్తోంది. మొత్తమ్మీద ప్రపంచ శాంతి కోసం ఐక్యసమితి చేస్తున్న కృషిలో భారత్ ప్రముఖంగా పాలుపంచుకుంటోంది. వర్ధమాన ఆర్థిక శక్తిగా ఐక్యరాజ్య సమితి బలోపేతమయ్యేందుకు వీలుగా భారత్‌కు భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
భద్రమైన భవిష్యత్తు కోసం!
ప్రజలు పేదరికంలో మగ్గిపోతున్నారు. ఒంటరితనంతో కుమిలిపోతున్నారు. సంఘర్షణల్లో నలిగిపోతున్నారు. వారి హక్కులకు, గౌరవ మర్యాదలకు భంగం వాటిల్లుతోంది. అయినప్పటికీ, ఎన్నో ఆశలు, ఆకాంక్షలతో భవ్యమైన భవితకోసం వారు ఎదురుచూస్తున్నారు. వారికిప్పుడు చేదోడు అవసరం. అందుకోసమే సంస్కరణలు చేపట్టాల్సి ఉంది. మనం మద్దతు ఇచ్చే ప్రజానీకానికి, మనకు మద్దతుగా నిలిచేవారికీ మరింత విస్తృత స్థాయిలో సేవలు అందజేయాల్సి ఉంది. దానికోసమే సంస్కరణలు అవసరం. -ఆంటోనియో గుటెరస్
– మహేంద్రబాబు కురువ
(ఈనాడు సౌజన్యం తో)