Home Hyderabad Mukti Sangram సంస్థానాలపై ఆర్థిక నిర్బంధాలు.. (హైదరాబాద్ అజ్ఞాత చరిత్ర-36)

సంస్థానాలపై ఆర్థిక నిర్బంధాలు.. (హైదరాబాద్ అజ్ఞాత చరిత్ర-36)

0
SHARE

పరిస్థితులు విషమిస్తున్నాయి. హైద్రాబాద్ నుంచి వెళ్ళిన ప్రతినిధివర్గం ఢిల్లీ నుంచి చర్చలు విఫలం కాగా తిరిగి వచ్చింది. భారత ప్రభుత్వం సంస్థానాలపై ఆర్థిక నిర్బంధాలను విధించింది. సరిహద్దు ప్రాంతాలపై సైన్యాన్ని సిద్ధంగా ఉంచింది. నిజాం ఇటువైపు తన సాయుధ బలగాన్ని పెంచుకుంటున్నాడు. మరొకవైపు తన సంస్థాన విలీన సమస్యను అంతర్జాతీయ సమస్యగా మార్చాలనే ఉద్దేశ్యంతో ఒక ప్రతినిధి వర్గాన్ని ఐక్యరాజ్య సమితికి పంపించే ఏర్పాట్లు చేస్తున్నాడు.

1948 సెప్టెంబర్ నెలలో సంస్థానం ప్రధానమంత్రి మీర్ లాయక్ ఆలీ ఒక ప్రకటన చేస్తూ తమ సంస్థానంలో శాంతిభద్రతలు కట్టుదిట్టంగా ఉన్నాయని అందువల్ల సికింద్రాబాద్‌కు భారత సైన్యాన్ని పంపించే అవసరం లేదని పేర్కొన్నాడు. ఈ ప్రకటనను సవాలు చేస్తూ పి.పి.సి అధ్యక్షుడు శ్రీ వినాయక్‌రావు విద్యాలంకార్ వెంటనే న్యాయవాదుల తరపున మరో ప్రకటన చేశాడు. ఆనాటి పరిస్థితులలో లాయక్ ఆలీని సవాలు చేస్తూ ప్రకటన చేయడం అసాధరణమైన విషయం. ఆ ప్రకటన సారాంశము.

“ప్రధానమంత్రి లాయక్ ఆలీ సంస్థానంలో శాంతిభద్రతలు నెలకొన్నాయని ప్రకటించడం సత్యదూరం. గత ఆరుమాసాల నుంచి న్యాయవాదులు ఎందువల్ల కోర్టులను బహిష్కరిస్తున్నారు? సంస్థానంలో ఎక్కడ శాంతిభద్రతలున్నాయో ఎవరిని అడిగినా చెబుతారు. 15 జనవరి, 1948 నుంచి 11 ఆగస్టు, 1948 మధ్య జరిగిన సంఘటనలను మా సమితి విచారించింది. మజ్లీస్ సభ్యులు జరిపిన అత్యాచారాలు కొన్నింటిని మాత్రమే లెక్కలోకి తీసుకుంటే చాలు. అసలు వాస్తవం బయటపడుతుంది.

పైన పేర్కొన్న కాలంలోనే 353 గ్రామాల్లో ఘోర కిరాతకాలు జరిగాయి. 50 గ్రామాలు పూర్తిగా ధ్వంసం చేశారు. గ్రామస్థులను చంపేశారు. అమానుషంగా జరుపబడిన కిరాతకాలను వర్ణించాలంటే మాటలు చాలవు. గోర్ట గ్రామంలో 200 మందిని చంపి 75 లక్షల రూపాయల ఆస్తిని దోచుకున్నారు. ఉద్‌గిర్‌లో ముస్లింలు 500 మంది హిందువులను వరుసగా నిలుచోబెట్టి కాల్చివేశారు. ఒక మఠాన్ని దోచుకున్నారు. ఖాసిం రజ్వీ అనేక ప్రాంతాలను దోచుకొని లారీలలో నింపుకొని విజయయాత్ర సాగించాడు. జనవరి నుండి ఆగస్టు వరకు ఆయా ప్రాంతాలలో జరిగిన ఘోర మారణకాండను కప్పిపుచ్చడం మాకు సాధ్యం కాదు. మానభంగాలు, మంగళసూత్రాలు లాక్కోవడం ఇవన్నీ నిత్యకృత్యాలై పోయాయి”.

“వీటినన్నింటినీ విస్మరించి ఇక్కడ శాంతిభద్రతలు నెలకొని ఉన్నాయని ప్రకటించడం ప్రపంచం దృష్టిలో దుమ్ముచల్లడమే. ఈ అత్యాచారాలను ఎదుర్కొనకుండా, ప్రజలకు రక్షణ కల్పించకుండా ప్రపంచాన్ని మభ్యపెట్టడం మీకు సాధ్యం కాదు”.

ఈ ప్రకటన చేసి లియాకత్ ఆలీని సవాలుచేసిన ప్రముఖ న్యాయవాది వినాయక్‌రావు విద్యాలంకార్ గురించి కొంత వివరంగా తెలుసుకోవడం అవసరం. ఆయన హైద్రాబాద్‌లో ప్రజా చైతన్యాన్ని ఉద్దీపింపచేసిన న్యాయమూర్తి కేశవరావు కోరట్‌కర్ పెద్ద కుమారుడు. స్వర్గీయ కేశవరావు గారిని హైద్రాబాద్ రానడేగా పేర్కొంటారు. బారిస్టర్ వినాయక్‌రావు విద్యాలంకార్ నాయకత్వంలోనే 1938లో నిజాం పాలనకు వ్యతిరేకంగా ఆర్యసమాజ్ పక్షాన సత్యాగ్రహం జరిగింది.

రావుగారి విశిష్ట వ్యక్తిత్వం మరువరానిది. ఆయన ప్రజలకు అభిమానపాత్రుడు. ఈ ప్రాంతంలో ఆయనపట్ల ప్రజలకున్న ప్రేమాభిమానాలను చూసి నిజాం పాలకవర్గం జంకుతూ ఉండేది. వినాయక్‌రావు విద్యాలంకార్‌లో ఉన్న మానవీయతా దృక్పథం, కలుపుగోలుతనం, సాహసం, పట్టుదల ప్రధానంగా ఆయన వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దాయి. పి.సి.సి విజయవంతంగా పనిచేయడానికి వినాయక్‌రావుగారి నాయకత్వం ఎంతో దోహదపడింది.

ప్రధానమంత్రి మీర్ లాయక్ ఆలీ ప్రకటనను ఖండిస్తూ వెలువడిన ప్రకటన తర్వాత సంఘటనలు వేగంగా జరిగిపోయాయి. వ్యతిరేక ప్రకటన వెలువడిన మరుసటిరోజు అర్ధరాత్రి వినాయక్‌రావు విద్యాలంకార్ ఇంటిని పోలీసులు చుట్టుముట్టారు. జామ్‌బాగ్‌లో ఉన్న పాత కింబట్ హౌస్‌లో ఆయన నివసించేవారు. (నిజాం ఇంగ్లీషు పాలకుల ఆధీనంలోకి రాక పూర్వం ఇక్కడ ఈ భవనంలోనే ఫ్రెంచి రెసిడెన్సీ ఉండేది.) దానిని క్యాబినెట్ హౌస్ అని పిలిచేవారు.

 

Source: Vijaya Kranthi