భార్య, చిన్న కొడుకు దగ్గరికి రాగానే ఆయన చిన్నపిల్లవాడి చేతిని, భార్య చేతిలో పెట్టి ప్రాణాలు వదిలాడు. బయట ముస్లిం దుండగులు కారును దహనం చేయాలని ప్రయత్నించి పెట్రోలు లేకపోవడంతో విఫలమై వెళ్ళిపోయారు. నల్లగొండ జిల్లాలోని దేవరకొండ తాలుకాలో ఉన్న ముదిగొండ గ్రామవాసి టి.బుచ్చిరెడ్డి. ఆయన మధ్యతరగతి రైతు.
ఒక ఆడపిల్లతో సహా ఐదుగురు సంతానం. నలుగురు మగపిల్లలలో డాక్టర్ నారాయణరెడ్డి పెద్దవాడు. ఇతను హైద్రాబాద్‌లోని చాదర్‌ఘట్ ఉన్నత పాఠశాలలో చదివిన తర్వాత ఉస్మానియా మెడికల్ కాలేజీలో వైద్యవిద్య నభ్యసించాడు. విద్యార్థికాలంలో ప్రతిభావంతుడుగా ఎన్నో బహుమతులు గెలుచుకున్నాడు. ఆ తర్వాత వృత్తిలో ఉండగా ఉస్మానియా ఆసుపత్రిలో సర్జన్ బహదూర్‌ఖాన్ సహాయకుడుగా పనిచేసి ప్రశంసలు పొందాడు. గుల్బర్గాలో మెడికల్ ఆఫీసర్‌గా కొంతకాలం ఉద్యోగం చేసి హైద్రాబాద్ తిరిగి వచ్చాడు. సొంతంగా ప్రాక్టీస్ ప్రారంభించి కొంతకాలం పనిచేశాడు.
అయితే వరంగల్‌లో ప్రాక్టీసు చేయవలసిందిగా మిత్రులంతా బలవంతం చేశారు. ఆయన 1944 దసరానాడు వరంగల్‌లో ప్రాక్టీస్ మొదలుపెట్టాడు. కొద్ది కాలంలోనే ప్రజాభిమానాన్ని చూరగొన్నాడు. ఆయన రోగుల్లో 80 శాతం ముస్లింలు. అందులో 20 శాతం మంది బీద ముస్లింలకు ఆయన ఉచితంగా చికిత్స చేసేవాడు. 2,3 నెలలలోనే వేలాది రూపాయలు ఆదాయం సమకూరింది. తన తమ్ముళ్ళను చదివించాడు. ఇతరులకు సహాయపడే ఉదార స్వభావం ఆయనది. వరంగల్‌లోనే మరో డాక్టర్ టి.యన్.మూర్తితో ఆయనకు స్నేహం.
ఆయన హైద్రాబాద్‌లో జరిగిన స్టేట్ కాంగ్రెస్ మహాసభలకు ప్రేక్షకుడుగా హాజరైనాడు. అదే మహానేరంగా పరిణమించింది. పైగా ప్రముఖ హిందువుగా దృష్టిలో ఉన్నాడు. ఆయన హత్య జరిగిన తర్వాత కూడా సుబేదార్ ఎవరిని అరెస్టు చేయించలేదు. ఎవరిపైనా విచారణ జరిపించలేదు. మహబూబాబాద్ తాలుకాలోని ఎర్రబాడు గ్రామంలో కమ్యూనిస్టు విప్లవకారులు రహస్యంగా ఉన్నారని సుబేదార్ తన పోలీసు బలగంతో వెళ్ళి గ్రామస్థులను బెదిరించాడు. స్వయంగా విప్లవకారులను ఎదుర్కొనే దమ్ములు లేక గ్రామస్థులే వాళ్ళను పట్టితెచ్చి హాజరు పర్చాలని హుకుం జారీచేశాడు. తన బలగంతో కుమ్మరికుంట దేశ్‌ముఖ్ దగ్గర రాత్రి అన్ని మర్యాదలు పొం దాడు సుబేదార్.
ప్రజలను భయభ్రాంతులను చేయాలనే ఉద్దేశ్యంతో సుబేదార్ ఆ తరువాత గ్రామంపైబడి గుడిసెలకు నిప్పు పెట్టించాడు. బీద గ్రామప్రజలు, రైతులు నిరాశ్రయులై గగ్గోలు పెట్టారు. రజాకార్ల మూకలు కమ్యూనిస్టులను శిక్షించాలనే నెపంపై అమాయకులైన ప్రజల ఇండ్లను తగులబెట్టే వాళ్ళు. ఇష్టానుసారం లూటీలు జరిపేవాళ్ళు. ఇలాంటి సంఘటనలు వరంగల్‌లో పరిసర గ్రామాలలో అనేకం జరిగాయి. సంగా జగన్నాథ్ అనే యువకుడు పరిసర గ్రామాల్లో ఆత్మరక్షణ కోసం గ్రామీణ దళాలను నిర్మించాడు.
ఉరున్ అనే ప్రాంతంలోని రజాకార్ల దళం జగన్నాథ్‌ను పట్టుకోవాలని బయలు దేరింది. వర్ధన్నపేటలోని రాయపర్తికి చెందిన రజాకార్ల దళం నాయకుడు షమ్‌సుద్దీన్ రజాకార్ల దళానికి నాయకత్వం వహించి గ్రామాలపై పడ్డాడు. అయితే ఉప్పరపతి దగ్గర సంగాజగన్నాథ్ దళాలు ఈ రజాకార్ల మూకలను ఎదుర్కొని వెనక్కు తరిమికొ ట్టారు. వాళ్ళు వెనక్కు వెళ్ళి మరికొన్ని గ్రామాలపైబడి గుడిసెలను తగులబెట్టారు. అంతారంలో లూటీలు చేశారు. మానభంగాలు జరిపారు.
కొలకపాక అనే గ్రామంలో 22 మంది యువకు లను బంధించి, వాళ్ళను వరుసగా కాల్చమని అక్కడి వైశ్యుడైన యువకుణ్ణి ఆదేశించారు. అతను ఎదురు తిరిగి రజాకార్లపై తుపాకి ఎక్కు పెట్టాడు. అయితే అతన్ని వెంటనే రజాకార్ల నాయకుడు ముజామియా కాల్చివేశాడు. ఆనాటికి బతికి బయటపడిన యువకుల్లో చందా బచ్చయ్య ఒకడు. 22 మందిని తుపాకులతో కాల్చి వాళ్ళశవాలపై గడ్డివేసి తగుల బెట్టాడు. ఈలోగా సంగా జగన్నాథ్ దళం వచ్చి దాడి జరిపింది. అప్పుడు ఈ రజా కార్ల దళంపారిపోయి చోటా పల్లి ముస్లిం జాగీర్దార్ ఇంట్లో ఉన్నారు. చోటాపల్లిలో ఇండ్లు తగులబెట్టి అక్కడ కూడా 22 మంది యువకులను కాల్చి వేశారు. జమలాపూర్ సోమ వారం అనే గ్రామంలోకి వెళ్ళి లూటీలు, మానభం గాలు జరిపారు.
చివరికి అసహాయులైన బాలింతలపై పాశవికంగా ప్రవర్తించారు. ఈ ఘోరకృత్యాలన్నీ సాలార్ షమ్‌సుద్దీన్ నాయకత్వాన జరిగాయి. ఇరవయ్యో శతాబ్దంలోనే ఈ ఘోర కిరాతకాలు తెలంగాణా ప్రాంతాలలో అనేకం జరిగాయి. పాకిస్తాన్ సైనికులు తూర్పు బెంగాల్‌లో తమ సోదరులైన ముస్లింలపై ఎన్ని హత్యాచారాలు జరిపారో ప్రపంచానికి తెలుసు. అయితే ఇక్కడ ముస్లింలు హిందువులపై జరిపిన కిరాత చర్యలు అసలు ప్రపంచం దృష్టికి రాలేదు. ఈ అంశాలు బయటికి రావటం మత ప్రమేయం లేని వ్యవస్థకు భాగం అని భావించారేమో?
గెరిల్లా రైతు దళం
రజాకార్ల కాలంలో దుండగులకు వ్యతిరేకంగా నిలుచుని ఎక్కడికక్కడ అన్యాయాన్ని హింసను విజయవంతంగా ఎదుర్కొన్న సంఘటనలు ఇంతకు పూర్వం చూశాం. స్థానికంగా గ్రామీణులు రజాకార్ల గూండా చర్యలను తమకు లభించిన కొద్దికాలంలోనే ప్రాణాలు సైతం లెక్కచేయక ప్రతిఘటించారు. అయితే వీటినన్నింటిని మించి సాయుధ రైతాంగ గెరిల్లా దళాలు శత్రువుల్ని ప్రతిఘటించిన తీరు, చారిత్రాత్మ కమైనది. సంఖ్యలో, ఆయుధాలతో తమను మించిన శత్రుదళాలను సాహసంతో, త్యాగంతో, ధైర్యంలో చాకచక్యంగా గెరిల్లా యుద్ధపద్ధతులను అవలంభించి మట్టి కరిపించిన ఉదంతాలు చాలా ఉన్నాయి.
ఈ రైతుదళాల సభ్యుల మానసిక స్థుర్యైం చెప్పుకో తగ్గది. ఆనాటి పాలకవర్గం కిరాయి సైనికుల వలె, రజాకార్లవలె లూటీలు, హత్యలు మానభంగాలు చేస్తూ అసలు పోరాటంలో తోక ముడుచుకొని పారిపోవటం కాకుండా ఒక పవిత్ర ఆశయంకోసం, న్యాయంకోసం సర్వస్వం అర్పించడానికి పోరాటంలో పాల్గొనే రైతు గెరిల్లాల సాహసం, త్యాగం ఎన్నో రెట్లు ఉన్నతమైనది. రైతుదళం గురించి వివరించే ముందుగా రెండు అంశాలను ప్రస్తావించవలసి ఉంది. మొదటిది 1938లో హైద్రాబాద్ నగరంలో హస్మత్‌గంజ్‌లో మార్వాడీ సమాజ్ ఆధ్వర్యాన వినాయక ఉత్సవాలు జరుగుతున్నాయి.