Home Hyderabad Mukti Sangram ఆర్య సమాజ్‌ను విమర్శించిన బహదూర్ యార్‌జంగ్ (హైదరాబాద్ అజ్ఞాత చరిత్ర-42)

ఆర్య సమాజ్‌ను విమర్శించిన బహదూర్ యార్‌జంగ్ (హైదరాబాద్ అజ్ఞాత చరిత్ర-42)

0
SHARE

భారతకోకిల, సరోజినిదేవి నాయుడు అధ్యక్షత వహించిన ఆ ఉత్సవాల్లో నవాబ్ బహదూర్ యార్‌జంగ్ ఉపన్యసిస్తున్నాడు. హైద్రాబాద్ సంస్థానంలో హిందూ – ముస్లింలు, పాలు – తేనెలా కలసి ఉన్నారని, ఇస్లాం ఏకేశ్వరోపాసననే కోరుతూఉందని, కుల భేదాలను వ్యతిరేకిస్తుందని అన్నాడు. అయితే ఇక్కడే ఒక వర్గం మతస్వాతంత్య్రం కోరుతూఉందని, దాని లక్ష్యం నిజాం కింగ్‌కోఠీవైపు మాత్రమేనని, అదే ఇస్లాం ఐక్యతకు బలం చేకూరుస్తూ ఉందని బహదూర్ యార్‌జంగ్ ఆర్య సమాజ్‌ను పరోక్షంగా ఎత్తి చూపించాడు.

పోలీసు చర్య తర్వాత ఒకరోజు వినాయక్‌రావు విద్యాలంకార్‌గారు అమరవీరుడు శ్యాంలాల్ గురించి చెబుతూ ఒక అంశాన్ని జ్ఞాపకం చేశారు. శ్యాంలాల్‌గారు ఆర్య సత్యాగ్రహానికి పూర్వం ఆత్మ విశ్వాసంతో ఒక మాట అన్నారు. “రావుగారూ! మీరు నమ్మండి. 10 సంవత్సరాలలో మనం ఈ సంస్థానపు రాజ్యపీఠాన్ని కూలద్రోయగలం. మన ప్రజల రాజ్యం అప్పుడు ఏర్పడుతుంది.”

ఈ రెండు అంశాలు ఒక విషయాన్ని స్పష్టం చేశాయి. నవాబ్ బహదూర్ యార్‌జంగ్ అనుమానాలు, భయం మరోవైపు శ్యాంలాల్ ఆత్మవిశ్వాసం, బలిదానం. ఇవే క్రమంగా రైతు దళానికి పునాదులుగా నిలిచాయి.

ఆనాటి సంస్థానంలో ఆర్య సమాజ్ ఉద్యమాన్ని అణచివేయడానికి నిజాం ప్రభుత్వం శాయశక్తులా ప్రయత్నించింది. 1938లోనే బీదర్ జైలులో నిర్బంధించబడ్డ శ్యాంలాల్‌కు విషప్రయోగం చేసి చంపివేశారు. అయినా 1939 నుంచి ఆర్య సమాజ్ ఆందోళన మహోద్యమంగా సాగింది. ప్రజలు వేలాదిసంఖ్యలో సత్యాగ్రహంలో పాల్గొంటూ జైళ్ళ పాలయ్యారు. ఆనాటి సత్యాగ్రహం ఆత్మవిశ్వాసాన్ని, క్రమశిక్షణనూ చూసి గాంధీ మహాత్ముడే ప్రశంసించాడు. ఆర్య సమాజ్‌పై దుండగాలు జరిపి, ఖూనీలు చేయించి కేసుల్లో ఇరికించినా ప్రజా ఉద్యమం వెనుకంజ వేయలేదు. చివరికి నిజాం ఆర్య సమాజ్  కోరికలను మన్నించక తప్పలేదు.

1948లో మారిన కాలానికి అనుగుణంగా ఆందోళనా పద్ధతులు కూడా మారిపోయాయి. ఆనాటి సత్యాగ్రహం ఈనాటి శస్త్రాగ్రహంగా పరిణమించింది. సాయుధులైన రైతు గెరిల్లా దళాలు ఈ దశలో తమ పాత్రను ఉత్తేజంతో నిర్వహించాయి.

పోలీసు చర్య జరిగింది. ఎర్రకోటపై ఆసఫియా ధ్వజాన్ని ఎగురవేస్తానన్న రజాకార్ల సర్వ సైన్యాధికారి ఖాసిం రజ్వీ కటకటాల వెనక్కి వెళ్ళాడు. సంస్థానంలో జరిగిన రక్తపాతానికి మూలకారకుడైన నిజాం భారత సైన్యం ముందు బేషరతుగా మోకరిల్లాడు.

పోలీసు చర్యకు పూర్వం కొందరు యువకులు ఉద్‌గీర్ పరిసర గ్రామాలను కాపాడుతూ రజాకార్ల దుండగాలను ఎదిరించారు. సాహసంతో, క్రమశిక్షణతో, సంఘటిత శక్తిగా రూపొందిన ఈ యువకులే ఆరు నెలలపాటు సాయుధులైన రజాకార్లను, నిజాం సైనికులను, రోహిల్లాలను, పఠాన్‌లను వీరత్వంతో, ప్రతీకారవాంఛతో ప్రతిఘటిస్తూ అనేక గ్రామాలను రక్షించారు. చాకచక్యంగా, ధైర్యంగా శత్రువులను ఎదుర్కొని ఎంతోమంది రజాకార్లను, పోలీసు అధికార్లను మట్టుపెట్టారు. గ్రామీణుల మనోధైర్యాన్ని నిలిపారు. బీదర్ జిల్లాలోని రజాకార్లకు, పోలీసులకు ఈ రైతుదళం సింహస్వప్నంగా పరిణమించింది.

అందువల్లనే పోలీసు చర్య జరిగాక జిల్లా మొత్తంలో ఆడవాళ్ళు దంపుడు దగ్గర ఈ రైతు గెరిల్లాల సాహసకృత్యాలను పాటలుగా పాడుకొనేవారు. మహారాష్ట్రలోని “గోంధలి” అనే జానపద గాయకులు వీరరస ప్రధానమైన “పహాడే” అనే గేయ ఫణితిలో రైతు వీరులను స్తుతిస్తూ గ్రామాలలో తిరిగేవారు.

స్టేట్ కాంగ్రెస్ అధ్యక్షుడు స్వామీ రామానందతీర్థ ఆదేశాన్ని అనుసరించి ఈ రైతుదళం వాళ్ళు కొందరు స్వయంగా పోలీసు చర్య తర్వాత ఆయుధాలను అప్పగించారు. శాంతి స్థాపనకు తోడ్పడ్డారు. అయితే ఈ రైతుదళం ప్రముఖ నాయకులైన మానిక్‌రావుమూలే, చన్‌వీర్ తదితరులను అరెస్టు చేయడం జరిగింది. దోన్‌గావ్ ప్రజలు ఈ పరిస్థితిని ఏనాడూ ఊహించలేదు. ఈ రైతుదళ నాయకులను అరెస్టు చేయాలనే ప్రయత్నాలను అంతకు పూర్వం, రెండు, మూడుసార్లు గ్రామ ప్రజలు అడ్డుకున్నారు. కాని ఈ సారి పోలీసులు గూర్ఖా సైనికుల సహాయంతో వచ్చి ఉదయమే డోన్ గ్రామంపై దాడిచేసి ఈ ప్రముఖులను నిర్బంధించింది. మరికొన్ని చోట్ల 12 మంది దాకా రైతుదళ సభ్యులను అరెస్టు చేశారు.

ఈ రైతుదళ వీరులు, డోన్‌గావ్ తిరుగుబాట్లపై ముస్లింలపై దాడిచేసి లూటీలు జరిపి, హత్యలు చేశారని ఆనాటి తాత్కాలిక సైనిక ప్రభుత్వానికి చెందిన మిలిట్రీ ట్రిబ్యునల్‌కు కొందరు ఆరోపణలు అందచేశారు. ఈ దళంపై కోపం ఉన్నవాళ్ళు ఆ జిల్లా పోలీసులను రెచ్చగొట్టారు. ముఖ్యంగా పోలీసు డి.యస్.పి. నాయక్‌గారు మరీ పట్టుదలతో పనిచేసి వీళ్ళను అరెస్టు చేయించాడు. ఆయుధాలను అప్పగించలేదని కూడా ఆరోపణ చేశాడు. నిజాంకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేయదని నమ్మకమేమిటని డి.యస్.పి. నాయక్ ప్రచారం చేస్తూ వాళ్ళకు ఏ విధంగానైనా శిక్ష వేయించాలనే ప్రయత్నాలు చేశాడు. రైతుదళానికి చెందిన ఈ నాయకులు, మరికొందరు సభ్యులు ఆయుధాలు అప్పగించమన్నారు. అయితే ఆనాటి అస్థిర పరిస్థితులలో తాత్కాలిక సైనిక ప్రభుత్వం శాంతి స్థాపన అనే నెపంపై ఆయుధాలను అప్పగించని వాళ్ళను కాల్చివేయమని కూడా ఆజ్ఞలు జారీ చేసింది.

Source: Vijaya Kranthi