Home Hyderabad Mukti Sangram రామఘాట్ స్థావరంపై దాడి చేయడం అసాధ్యం (హైదరాబాద్ అజ్ఞాత చరిత్ర-44)

రామఘాట్ స్థావరంపై దాడి చేయడం అసాధ్యం (హైదరాబాద్ అజ్ఞాత చరిత్ర-44)

0
SHARE

రైతుదళ సభ్యులు చన్‌వీర్ నాయకత్వాన సత్తువను, ఓపికను పుంజుకొని పరిగెత్తుతున్నారు. ఆకలిని, అలసటను భరించలేక విశ్వనాథ పటేల్ భూమి మీద నీరసించి పడిపోయాడు. అతన్ని మరికొందరిని అక్కడే వదిలేసి చన్‌వీర్ మిగతా వాళ్ళతో దగ్గరలోనే ఉన్న గడీకుసుమాన్ అనే గ్రామం చేరుకున్నాడు. ఆ గ్రామం పటేల్ వీళ్ళను చూసి ఆనందంగా స్వాగతం చెప్పాడు. వెనకాలే ఉండిపోయిన మిగతా దళ సభ్యులను రప్పించే ఏర్పాట్లు చేశాడు. అందరూ భోజనం చేసి తిరిగి బయలుదేరారు.

అయితే పటేల్ గ్రామ ప్రజలు ఇష్టపడలేదు. పరిస్థితి విషమించింది కాబట్టి ముందుకు వెళ్ళిపోవడమే శ్రేయస్కరమని వీళ్ళు వాదించారు. పటేలు వాళ్ళకు గుర్రాల్ని, కొన్ని ఆయుధాలను ఇచ్చి ముందుకు పంపించాడు. అప్పటికే అర్ధరాత్రి గడిచి రెండు గంటల సమయం కావచ్చింది. 40,45 మైళ్ళు ప్రయాణం చేసి ఆఖరుకు దళ సభ్యులు తమ స్థావరం చేరుకున్నారు. రామఘాట్ అనే ఆ స్థావరం కాలినడకతో తప్ప చేరుకోలేము. ఆ స్థావరం నుంచి దూరదర్శినితో చూసి, వచ్చే వ్యక్తులను రైతుదళం పసిగట్టేది. విమానాలతో తప్ప ఆ స్థావరంపై దాడి చేయడం సాధ్యం కాదు.

మానిక్‌రావు మూలే, చన్‌వీర్ తదితరులు జైలునుంచి పారిపోయి వచ్చారని అందరికీ తెలిసిపోయింది. బీదర్ జిల్లాలో తిరిగి ఈ దళం ఎక్కడ కార్యకలాపాలను ప్రారంభించి శాంతిభద్రతలకు ముప్పు తెచ్చి పెడుతుందోనని జిల్లా కలెక్టర్ భయపడి పోయాడు. దండనతో కాకుండా, సామ, దాన, భేదోపాయాలతో రైతు దళాన్ని లొంగదీసుకోవాలనుకున్నాడు. దళాన్ని క్షమించామని చెప్పి మంచి చేసుకోవాలనే సలహా కూడా ఇవ్వడం జరిగింది.

ఒకరోజు ఆ స్థావరానికి కాంగ్రెస్ కార్యకర్త మాధవ్‌రావు, ఘున్‌సేకర్ స్వయంగా వచ్చారు. జిల్లా కలెక్టర్ క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడని, ఆయుధాలతో సహా లొంగిపోవడం మంచిదని నచ్చచెప్పాడు. అధికారుల స్వభావం తెలిసిన సభ్యులు నిరాకరించారు. మాధవరావు ఖాళీ చేతులతో తిరిగి వెళ్ళిపోయాడు. మరోరోజు బోరోల్ పోలీస్ సబ్ ఇన్‌స్పెక్టర్ పెద్దారెడ్డి ఆ స్థావరానికి వచ్చాడు. నిరాయుధుడుగా ఉన్నాడని రానిచ్చి మాట్లాడారు. కలెక్టర్ ఇచ్చిన హామీని అతను తిరిగి చెప్పాడు.

ఆ ప్రతిపాదనను చర్చించి తమ నిర్ణయాన్ని తెలియచేస్తామని పెద్దారెడ్డిని పంపించి వేశారు. ఆ తర్వాత దళ సభ్యులు గంభీరంగా పరిస్థితిని అంచనావేసి ఒక నిర్ణయానికి వచ్చారు. కలెక్టరు హామీని పరీక్షించే నిమిత్తం దళంలోని ఒక సభ్యుని ముందుగా పంపిచాలనుకున్నారు. చీటీలు వేయగా అనుకోకుండా చన్‌వీర్ పేరు వచ్చింది. చన్‌వీర్ ఆత్మ సమర్పణ కోసంగాను సిద్ధపడ్డాడు. ఇక్కడ రైతుదళం ఏర్పడిన తీరు కొంత తెలుసుకోవలసి ఉంది. హిందూ యువకులు సాహసంతో ముందుకు వచ్చి ప్రాణాలకు తెగించి ముస్లింలపై ప్రతీకారం తీర్చుకోవడానికి కొన్ని పరిస్థితులు తప్పనిసరిగా దారితీశాయి. రెండో ప్రపంచ యుద్ధం ముగిసింది. భారత స్వాతంత్య్ర పోరాటం ముందంజ వేస్తోంది.

నిజాం స్వతంత్ర హైద్రాబాద్ కోసం ఏర్పాట్లు చేసుకుంటున్నాడు. ఇత్తేహాదుల్ ముస్లిమీన్ సంస్థ ఖాసిం రజ్వీ నాయకత్వాన హిందువులను భయభ్రాంతులను చేస్తోంది. ముఖ్యంగా హరిజనులను చేరదీసి“పస్త్ ఆక్వామ్‌” అనే పేరుతో రజాకార్ల దళంతోబాటు కొందరిని దళాలుగా తయారుచేశారు. స్వార్థపరులైన కొందరు హరిజన నాయకులు ఈ అవకాశాన్ని బాగా వినియోగించుకున్నారు. ఆనాటి రజాకార్ల మంత్రివర్గంలో ఉన్న బి.ఎస్. వెంకట్‌రావు మరో నాయకుడు శ్యామ్‌సుందర్ హిందువులకు వ్యతిరేకంగా తీవ్రంగా ప్రచారం చేశారు. రజాకార్లతో బాటు గ్రామాలు లూటీలు, దహనాలు, మానభంగాలు లాంటి అరాచక చర్యల్లో పాలుపంచుకున్నారు.

ఈ పరిస్థితులలో ఆత్మగౌరవం గల మిగతా హిందువుల ఉనికికే ప్రమాదం ఏర్పడింది. ఎదురునిల్చి ప్రతిఘటించని పక్షంలో అన్యాయాన్ని, హింసాకాండను ఎదుర్కొనలేమని ఆర్యసమాజ్ ఉద్బోధించింది. ఉత్తేజం కలిగించి ఆత్మవిశ్వాసాన్ని రగుల్కొల్పింది. ఫలితంగా అనేకమంది యువకులు రైతుదళంగా ఏర్పడి దేశభక్తిని, త్యాగాన్ని నిరూపించారు. ముఖ్యంగా తొండవీర్, దోన్‌గావ్, పాయ్‌గావ్, అట్టర్గా, బోట్‌కల్ అనే గ్రామాలలోని రైతు యువకులు ఆయుధాలు ధరించి ప్రతిఘటనకు నడుం బిగించారు. దీర్ఘకాలిక పోరాటానికి సిద్ధపడ్డారు. ప్రజలు ఈ రైతుదళాన్ని ప్రాణప్రదంగా చూసుకొనేవారు. ఈ పరిస్థితి వల్ల రైతుదళాన్ని స్వేచ్ఛగా వదిలివేస్తే ఏమి చేస్తారో అనే భయం జిల్లా అధికారులకు కలిగింది. ఇదీ క్లుప్తంగా ఆనాటి పరిస్థితి.

Source: Vijaya Kranthi