తొండచీర్ రైతుదళం మరింత కట్టుదిట్టంగా కార్యకలపాలను సాగించింది. వడిసెలు, చాకు, బరిసె, తుపాకి తదితర ఆయుధాలతో సక్రమంగా శిక్షణ ఇస్తూ వచ్చారు. మరోవైపు మందుగుండు సామాగ్రి, ఆహార ధాన్యాలు సేకరించి నిల్వచేస్తున్నారు. అమాయకుల్లా కనబడే సభ్యులను గూఢచారులుగా నియమించారు.
ఎప్పటికప్పుడే రజాకార్ల కదలికలను ఆచూకీ తీసి వార్తలు అందచేశారు. అన్ని ఏర్పాట్లు జరిగిన తరువాత భావి కార్యక్రమాన్ని నిర్ణయించే నిమిత్తం రామఘాట్‌లో చుట్టుప్రక్కల ఉండే యువకుల సమావేశం ఒకటి జరిగింది. దగ్గర దూరం నుంచి మొత్తం 52 గ్రామాలకు ఆహ్వానాలు వెళ్ళాయి.
ఆనాటి రజాకార్లను ఎదుర్కోవటం అంటే రాక్షసులతో యుద్ధం చేయడం వంటిదని ప్రజలకు అనిపించింది. ఆ రామ, రావణ యుద్ధంలాంటి పోరాటంలో పాల్గొనాలని రైతులు ఎంతో ఉత్సాహంతో ముందుకు వచ్చారు. అంతిమ విజయం తమదే అనే ఆత్మవిశ్వాసం అందరిలో ఉప్పొంగింది.
దోన్‌గావ్ తిరుగుబాటు
రైతుదళాల పోరాటం ప్రారంభం కాక పూర్వం జరిగిన సంఘటన డోన్గావ్లో మసీదు దగ్గర నుంచి బాజా భజంత్రీలు వాయించుకుంటూ వెళ్ళారని కొందరు హిందువులపై కేసు పెట్టారు. ఆ కేసులో ఆనాడు మానిక్‌రావు మూలే, చన్వీర్లు కూడా ఉన్నారు. మెజిస్ట్రేట్ వీళ్ళిద్దరూ మైనార్టీదాటని వాళ్ళని హెచ్చరించి మిగతా వాళ్ళకు శిక్ష విధించి పంపించాడు.
ఆ రోజుల్లో ఉద్గీర్ ఆర్యసమాజ్ కార్యకాలాపాలకు ప్రధాన కేంద్రం. వినిడోన్ గావ్ యువకులు అటువైపు ఆకర్షితులై తమ గ్రామంలో కూడా ఆర్య సమాజ్ శాఖను స్థాపించారు. ఉత్సాహంతో పట్టుదలతో పని ప్రారంభించారు. 1944 నాటి మాట. మధోల్ ఆర్య సమాజ్ ఉత్సవాలకు ఆనాటి ఆర్యసమాజ్ నాయకులు శ్రీ వినాయక్‌రావు విద్యాలంకార్, కృష్ణదత్ హాజరైనారు.
ఈ ఇద్దరి నాయకుల ఉపన్యాసాలకు వినిడోన్గావ్ యువకులు ఉత్తేజితులైనారు. క్రమంగా అన్యాయాన్ని ప్రతిఘటించే సాహసాన్ని పొందారు. ఉద్గీర్ ప్రాంతంలో ఉన్న తోరన్ అనే గ్రామంలో శ్రీనివాసరావు దేశ్‌ముఖ్ ఇంట్లో ఒక సంఘటన జరిగింది. యాకుబ్ అనే రోహిల్లా బలవంతంగా ఆ ఇంట్లోకి వెళ్ళి అధికారం చెలాయించడం ప్రారంభించారు. అలాగే ఆ గ్రామవాసులను నానా బాధలు పెట్టేవాడు. అతనితోబాటు మరికొంతమంది రోహిల్లాలు చుట్టుప్రక్కల గ్రామాలను భయభ్రాంతులని చేశారు. ముఖ్యంగా యాకుబ్‌ను అదుపులో పెట్టాలని తోరన్ ప్రజలు కోరారు.
అప్పుడే మానిక్‌రావు, చన్వీర్ల నాయకత్వాన కొంతమంది యాకుబ్ ఇంటికి వెళ్ళారు. తన భార్యా పిల్లలతో కలిసి యాకుబ్ ఇంటిపైకి ఎక్కి తుపాకీతో కాల్పులు మొదలుపెట్టారు. క్రింద నుంచి రాళ్ళు విసిరారు. చివరికి ఒక రాయి బలంగా యాకుబ్‌కు తగిలింది. అతను గాయానికి కట్టుకట్టుకోవాలని ఇంట్లోకి దిగాడు. అదే అదనుగా మానిక్‌రావు, చన్వీర్లు ఇంటిపైకి ఎక్కి లోనికి దూకి యాకుబ్‌ను పట్టుకొచ్చారు. ఆ తరువాత మానిక్‌రావు పటేల్ దగ్గర అందరూ కలసి యాకుబ్‌ను శిక్ష విధించారు. అతను చేసిన అన్యాయాలకు, రౌడీ పనులకు శిక్షగా రెండు కళ్ళు పెరికివేశారు.
ఆ తర్వాత తీవ్రమైన పరిస్థితి ఏర్పడింది. యాకుబ్ బంధువు ఒకతను పోలీసు సబ్ ఇన్స్పెక్టర్. అతను డోన్గావ్ ప్రజలపై కేసు పెట్టాడు. మానిక్‌రావు, చన్వీర్లు పారిపోయారు. ఒక ముస్లిం పైరవీకారుడు రెండువేల రూపాయలు లంచం తీసుకొని అందరినీ వదిలివేయించగలనని హామీ ఇచ్చాడు. అప్పుడు గ్రామంలోకి తిరిగి మానిక్‌రావు, చన్వీర్లు వచ్చారు. కొన్నిరోజులకు అకస్మాత్తుగా నాగభూషణ్ అనే యువకుని అరెస్టు చేయాలని పోలీసులు వచ్చారు. డోన్గావ్ ఆర్య సమాజ్ కార్యదర్శిగా ఉన్న నాగభూషణ్‌ను అరెస్టు చేస్తుండగా సహించి ఊరకుండటం మిగతావాళ్ళకు సాధ్యం కాలేదు.
మానిక్‌రావు, చన్‌వీర్ లాఠీలు తీసుకొని నాగభూషణ్ దుకాణం దగ్గరికి వెళ్ళారు. పదిమంది పోలీసులు, జమేదార్, ఒక సబ్ ఇన్స్పెక్టర్ సిద్ధంగా ఉన్నారు. ఆ గ్రామంలో అరెస్టు జరగకుండా అందరూ పట్టుబట్టారు. పోలీసుల వినలేదు. అప్పుడు పోలీసులపై దాడిచేసి సబ్ ఇన్స్పెక్టర్ను గాయపర్చారు. తుపాకి, సంకెళ్ళు లాక్కున్నారు. మిగతా పోలీసులు భయపడి పారిపోయారు.
పోలీసు అధికారిని గాయపర్చి తుపాకి, సంకెళ్ళు లాక్కోవడం మహానేరం. అందువల్ల మానిక్‌రావు, చన్‌వీర్, మరికొంతమంది గ్రామంలోంచి పారిపోయారు. నిజాం పోలీసులు గ్రామ ప్రజలను బాధించడం మొదలుపెట్టారు. అప్పుడు బాల్కీ తాలుకాలోని కున్నూర్ పోలీసు స్టేషనుపై దాడిచేయాలని ఆ యువకులు పథకం వేశారు. అయితే ఆ పథకం గురించి ఎలాగో పోలీసులకు తెలిసిపోయింది. ఆ పని సాధ్యం కాలేదు. ఆ తర్వాత ఐదారు నెలలు గడిచిపోయాయి.
Source: Vijaya Kranthi