Home Hyderabad Mukti Sangram ప్రాణాలమీదికి వస్తే రజాకార్లు రాజీపడతారు..! (హైదరాబాద్ అజ్ఞాత చరిత్ర – 49)

ప్రాణాలమీదికి వస్తే రజాకార్లు రాజీపడతారు..! (హైదరాబాద్ అజ్ఞాత చరిత్ర – 49)

0
SHARE

దత్తగీర్ ప్రమాదంలో ఉన్నాడని తెలిసి తొండచీర్ నుండి కొందరు దళ సభ్యులు సహాయార్థం వెళ్ళాలని ప్రయత్నించారు. ప్రతి ఒక్కరు ప్రమాదంలోంచి తప్పించుకొనే ప్రయత్నం స్వయంగా చేసుకోవాలని కిషన్‌గీర్ అన్నాడు. పైగా అక్కడి గ్యానోబా, రామారావు పటేల్ ఉండగా ఏమీ ప్రమాదం జరగదని, రజాకార్లు ప్రాణాలమీదికి వస్తే మాత్రం రాజీపడతారని ఆయన హామీ ఇచ్చాడు.  తర్వాత క్రమంగా రైతు దళం వల్ల హిందువులు ఉత్సాహంతో ధైర్యంతో తల ఎత్తుకొని తిరుగుతూ వచ్చారు. ఇదంతా చూసి రజాకార్లు నిజాం నుండి సహాయం అర్థించారు.

కౌల్‌ఖేడ్‌లో దహనకాండ

అప్పారావు పటేల్ రోహిల్లాలకు, పఠాన్‌లకు స్నేహితుడైనప్పటికి ఖత్‌గావ్‌లో ఇద్దరు రోహిల్లాలను ఖతం చేశాడనే అంశం ముస్లింలకు విస్మయం కలిగించింది. ఏ విధంగానైనా అప్పారావును దండించాలని ముస్లిం రజాకార్లు ఒకరోజు ఉదయమే కౌల్‌ఖేడ్‌పై దాడి జరిపారు. అంతకు పూర్వమే అప్పారావుకు కబురు అందింది. అప్పారావుతోబాటు మరికొంతమంది గ్రామంలోంచి పారిపోయారు.

ఆ ఉదయం కౌల్‌ఖేడ్‌పై దాడి జరిగింది. పెద్దవాళ్ళు ఎవరూ దొరకలేదని ఇద్దరు పిల్లలను బంధించి కాల్చివేశారు. విశ్వనాథ్, మహాలింగప్ప అనే ఆ ఇద్దరు అబ్బాయిలలో మహాలింగప్ప మాత్రం తీవ్రంగా గాయపడి మిగిలాడు. ఆ తర్వాత ఉద్‌గీర్‌కు చెందిన ఫజల్ మహ్మద్‌ఖాన్ నాయకత్వాన అప్పారావు ఇంటిపై దాడి జరిగింది. 70 ద్వారాలు గల ఆ మహా భవంతికి నిప్పు అంటించారు. లోపల ఉన్న ధాన్యం, 80 వేల రూపాయల నోట్లు కాలి భస్మీపటలమై పోయాయి. ఈ సంఘటన ఉద్‌గీర్ తదితర ప్రాంతాలలోని ముస్లిం రజాకార్లను మరింత ఉత్సాహవంతులను చేసింది.

అప్పారావు పటేల్ మాత్రం తొండచీర్ చేరుకొని ఆశ్రయం పొందాడు. అప్పుడే పోలీసు రిమాండు నుంచి మానిక్‌రావు మూలే, చన్‌వీర్ తదితరులు విడుదల పొంది డోన్‌గావ్ తిరిగి చేరుకున్నారు. కౌల్‌ఖేడ్‌లో అప్పారావుకు జరిగిన నష్టం గురించి తెలిసింది. తాము కూడా రైతు దళంలో చేరి ప్రజలను సమీకరించాలని నిర్ణయించుకున్నారు. ఈలోగా అంతకు పూర్వమే మానిక్‌రావు మూలే అన్న రామచంద్రను రజాకార్లు దారికాచి గాయపర్చారు. ఒక చేయి విరిగింది. కాలు తీవ్రంగా గాయపడింది. ఈ తర్వాత పోలీసులు అతనిని కమలానగర్ పోలీసు స్టేషన్‌కు తీసుకు వెళ్ళారు. మానిక్‌రావును కూడా చంపివేయాలనే కుట్రలు పన్నారు.

ఒకరోజు చన్‌వీర్ డోన్‌గావ్‌లోకి వెళ్ళేముందు వార్త అందింది. గ్రామంలో రజాకార్లు వాళ్ళపై దాడి చేయడానికి సిద్ధంగా ఉన్నారనే సంగతి తెలిసింది. అలాగే ఆయుధాల కోసం జామ్‌జల్‌కోట్ వెళ్ళిన మానిక్‌రావును దారికాచి చంపనున్నారనే విషయం కూడా తెలిసింది. చన్‌వీర్ వెంటనే వెనక్కు తిరిగి తొండచీర్ వెళ్ళాడు. అతన్ని దూరంనుంచి పోల్చుకోలేక తొండచీర్‌లో కాపలావున్న రైతుదళ సభ్యులు చన్‌వీర్‌పై కాల్పులు జరిపారు. వెంట్రుకవాసిలో ప్రమాదం తప్పింది. దళ సభ్యులు చన్‌వీర్‌ను పోల్చుకొని ఆ తర్వాత చాలా బాధపడ్డారు. రాబోయే ప్రమాదం గురించి జమ్‌జల్ కోట్‌లో ఉన్న మానిక్‌రావుకు కబురు పంపించారు.

Source: Vijaya Kranthi