మరోవైపు గాయపడిన రామచంద్రను ఉద్గీర్ నుంచి తప్పించారు. ఉద్గీర్లో రజాకార్ల మధ్య రామచంద్ర ఆస్పత్రిలో ఉండటం క్షేమం కాదు. అందువల్ల ఆసుపత్రిలో ఖాజా అనే కాంపౌండరుకు లంచమిచ్చి రామచంద్రకు పారిపోయే అవకాశం కల్పించారు. మానిక్రావ్, చన్వీర్లు రామచంద్రతోపాటు క్షేమంగా తొండచీర్ చేరుకున్నారు. తమ కుటుంబ సభ్యులను రహస్యంగా తరలించి షోలాపూర్ పంపించి వేశారు.
గూఢచారి చర్యలకు శిక్ష
రైతుదళంలోని మానిక్రావ్మూలే, చన్‌వీర్, హన్స్‌రాజ్, బల్వీర్ లాంటి సాహసవంతులైన యువకులు రావడం అందరికీ మరింత ఉత్సాహాన్ని కలిగించింది. మానిక్రావ్ తన దృఢమైన శరీరంతో మీసాలతో ఎత్తుగా గంభీరంగా నడుస్తూ ఉంటే ముఖ్యంగా తూటాల దండ ధరించి తుపాకితో వస్తుంటే ఎదుటపడే వ్యక్తి జంకేవాడు. చన్‌వీర్ కూడా విశిష్టమైన వ్యక్తి. హన్నుఖాన్ ఉరఫ్ హన్స్‌రాజు మొండి పట్టుదల గల వ్యక్తి. వైదిక మతం పుచ్చుకున్న ముస్లిం. ఇక బల్వీర్. అవసరమైతే హరాకిరి స్వయంగా కత్తితో తలనరుక్కొనే జపాన్ పద్ధతి కూడా అలవాటు చేసుకొన్న మనోధైర్యం కలవాడు. ముఖ్యంగా మానిక్రావ్ ధైర్యం, సమయస్ఫూర్తి ఎలాంటివో ఈ క్రింది సంఘటన నిరూపిస్తుంది.
ఒకసారి బోట్కూల్ గఢ్‌లో రైతుదళం విశ్రాంతి తీసుకుంటూ ఉంది. సూర్యోదయం అవుతుండగా అకస్మాత్తుగా సాయుధులైన నిజాం పోలీసులు ఆ గఢ్‌ను చుట్టుముట్టారు. రజాకార్లతో పోరాడి అనేకసార్లు తిప్పికొట్టిన సంఘటనలున్నాయి. కాని మొదటిసారిగా పోలీసులను ఈ విధంగా ఎదుర్కొనడం ప్రమాదంగా పరిణమించింది. ఉదయం ఎనిమిది అయిపోయింది. అలసివచ్చిన పోలీసులు కూర్చున్నచోటే ఆవలింతలు తీస్తున్నారు. ఆ గఢ్కి మూడువైపులా దారి ఉంది. వెనుకాల మరో ఇల్లు ఉంది. ఏ విధంగానైనా తప్పించుకొనే మార్గం కనుక్కోవాలి. మానిక్‌తో బాటు కొందరు దళ నాయకులు వెనకాల నుంచి ఆ ఇంట్లో చొరబడ్డారు.
ఆ ఇంటి తలుపు తెరుచుకుంది. ఎదురుగా తుపాకీ పట్టుకొని నిలుచున్న పఠాన్ పోలీసును మానిక్‌రావు గుర్తించాడు. ‘తుపాకీ వెనక్కి తిప్పు!’ పోలీసు జవాబు ‘ఎవరనుకున్నావు? నేను పఠాన్‌ను!’ ‘తెలుసు. నీ తుపాకీలో తూటాలు లేవు. నా తుపాకీ లోడ్ చేసి సిద్ధంగా ఉంచాను. క్షణాల్లో నీ పని పూర్తి చేయగలను’, అని మానిక్‌రావు హెచ్చరించారు. నిజంగానే పఠాన్ దగ్గర తుపాకీ లోడ్ చేసి లేదు. అతను భయపడిపోయి ఇలా అన్నాడు. ‘మేం ఏమి చేయగలం. పొట్టకూటికోసం ఉద్యోగం చేస్తున్నాం.’
‘అందువల్లనే అంటున్నాను. తుపాకీ తిప్పి పట్టుకోమని’ అని మానిక్‌రావు పురమాయించగానే పఠాన్ తుపాకీని తిప్పి పట్టుకున్నాడు. ఈలోగా మానిక్రావుతో సహా కొందరు గఢ్ ఆవరణలోకి వెళ్ళి పొజిషన్ తీసుకొని రైఫిళ్ళు ఎక్కు పెట్టారు. మానిక్‌రావు గొంతెత్తి అరిచాడు పోలీసుల నుద్దేశించి, ‘జాగ్రత్త! కదిలారంటే మా రైఫిళ్ళు పేలుతాయి. అలాగే కూచోండి. మా దళం వెళ్ళిపోయేవరకు’ అకస్మాత్తుగా వచ్చిన ఈ పరిణామానికి పోలీసులు ఏమీ చేయలేని స్థితిలో అలాగే కూచుండి పోయారు.
చంపివేయాలని మాత్రమే వచ్చే పోలీసులు చావటానికి సిద్ధం కారు. అందువల్లనే, అలానే కిమ్మనకుండా కూర్చుండిపోయారు. ఈలోగా గఢ్ తలుపు తెరువబడింది. కిసాన్ దళ సభ్యులు అందరూ బయటకు వచ్చేశారు. మూకుమ్మడిగా అందరూ తప్పించుకొని వెళ్ళిపోతుండగా పోలీసులు వెనకాలే పరిగెత్తారు. ఎదురు కాల్పులు జరిగాయి. గాయపడి పోలీసులు తిరిగి వెళ్ళిపోయారు. కౌల్ఖేడ్కు చెందిన లక్ష్య అనే వ్యక్తి రజాకార్లకు గూఢచారిగా పనిచేసేవాడు. అప్పారావు పటేల్‌కు సంబంధించిన సమాచారాన్ని, రోహిల్లాలకు, పఠాన్లకు అందచేసిన వ్యక్తి లక్ష్య. అతన్ని శిక్షించాలని దళం నిర్ణయించింది. ఒక అర్ధరాత్రి కొందరు దళ సభ్యులు సాయుధంగా కౌల్ఖేడ్కు వెళ్ళారు. లక్ష్య ఇంటిపై దాడిచేసి పట్టుకెళ్ళిపోయారు.
ఆ రోజుల్లో హరిజనుల్లో కొందరిని పస్తక్వామ్ అనే పేర రజాకార్లు తమలో చేర్చుకొనే వాళ్ళని ఇంతకు పూర్వమే తెలుసుకున్నాం. ఆ పస్తక్వామ్లు హిందువులతో ఉండే సంబంధాల వల్ల అనేక రహస్యాలు తెలుసుకొనేవారు. వాటిని రజాకార్లకు అందచేయడంలో సహాయపడేవారు. ఖాసిం రజ్వీ ఈ విధంగా హరిజనులను చేరదీసి ఉపయోగించుకుంటూ తాము సెక్యులర్‌గా ఉన్నామని ప్రచారం చేసేవాడు. అదే సందర్భంలో లక్ష్యను నిర్భంధించి తీసుకుపోవడం జరిగింది. విచారించి మరణశిక్ష విధించారు. లక్ష్యకు దళం ఆ విధంగా శిక్ష విధించింది.
మరుసటి రోజు ఈ వార్త ఉద్గీర్‌లోని పోలీసులకు, రజాకార్లకు తెలిసిపోయింది. లక్ష్యను దళం వాళ్ళు పట్టుకెళ్ళి పోవడం వల్ల వాళ్ళ లంకె తెగిపోయింది. అందువల్ల ఉద్గీర్‌లోని డి.యస్.పి. ఫతేఆలీ పన్నెండు మంది పోలీసులతో తొండవీర్ వెళ్ళాడు. పోలీసులు వస్తున్నారనే సంగతి తెలిసి గఢ్లోని గంట మ్రోగింది. దళం వెంటనే కొండమీదకు వెళ్ళి తుపాకులు గురిపెట్టి సిద్ధంగా ఉంది.
తమలో ఒకరిని గొల్లవాడిగా పోలీసుల వద్దకు పంపించారు. అతను లక్ష్య ఉద్గీర్వైపు వెళ్ళాడని ఫతేఆలీతో చెప్పగా పోలీసులు నమ్మి నిజం అనుకొన్నారు. అయితే కొండపై పొజిషన్ తీసుకొని ఉన్న దళ సభ్యులను చూసి డి.యస్.పి భయపడిపోయాడు. తాను కేవలం ఏదో ఎంక్వైరీకి మాత్రమే వచ్చానని అన్నాడు. తాము కూడా ఆ ప్రాంతాలలో శాంతిభద్రతలను కాపాడుతున్నామని దళం వాళ్ళు జవాబు ఇచ్చారు. ఫతేఆలీ తన సిబ్బందితో ఏమీ చేయలేక తిరిగి వెళ్ళిపోయాడు.
పరిస్థితి అదుపు తప్పిపోవడంతో ఉద్గీర్‌లోని పోలీసు అధికారులకు ఆందోళన కలిగింది. తొండచీర్లో దళం మొత్తాన్ని నిర్బంధించాలని అనుకున్నారు. దానికోసం వందమంది పోలీసు మాలీ పటేళ్ళను వెంట ఉండమని పురమాయించాడు. ఆ పటేళ్ళు సాధారణంగా అందరూ హిందువులే. ఈ ఏర్పాట్లతో తొండచీర్పై దాడి చేయడానికి పోలీసులు వెళ్ళారు.
ఈ లోగానే దళంకు సమాచారం అందింది. గఢ ఖాళీచేసి రహస్య స్థావరాలకు దళం వెళ్ళిపోయింది. పోలీసులు తొండచీర్ ప్రవేశించగానే కిషన్‌గీర్ పోలీసు పటేల్ ఎదరుగా వెళ్ళి స్వాగతం చెప్పాడు. పోలీసు అధికారులు కిషన్‌గీర్ దళం ఎక్కడుందని ప్రశ్నించాడు. దళం ఎక్కడుందో తనకు తెలియదని అతను జవాబు ఇచ్చాడు. గ్రామంలోని సామాగ్రి, ఆయుధాలు కూడా ఎక్కడా కనబడలేదు. కిషన్గీర్ను అతని తమ్ముళ్ళ గురించి ప్రశ్నించి చివరికి దళం వస్తే వెంటనే కబురు పంపించాలని హుకుం జారీచేసి వెళ్ళిపోయారు.
ఆట్టర్గాలో విజయం
రామఘాట్ మహాసభ నుంచి తిరిగి వెళ్ళిన తరువాత యశ్వంతరావ్ ఆట్టార్గాలో రెండింతల ఉత్సాహంతో సమీకరణ ప్రారంభించాడు. రైతుదళ కేంద్రాలు ఒకటి కాదు రెండు ఉన్నాయని, తొండచీర్లో ఉన్న దళం అన్నివిధాలా కలిసి వస్తుందని అతను సహచరులకు చెప్పాడు. రైతు దళాన్ని పెంచి, ఆయుధాలతో సమగ్రమైన శిక్షణ ఇచ్చి నిజాం ప్రభుత్వంతో పోరాడాలని మిత్రులకు బోధించాడు. ఈ పోరాటం కొనసాగి హైద్రాబాద్‌లో రజాకారుల ప్రభుత్వాల్ని కూలదోసి కార్మికుల, రైతుల రాజ్యాన్ని తీసుకురావటానికి యువకులంతా నడుంకట్టి పోరాడాలని ప్రచారం చేశాడు. యువజనులలో మంచి ఉత్సాహం నెలకొంది.