కిషన్‌గీర్ దళాలకు చేసిన సహాయాన్ని దృష్టిలో పెట్టుకొని తొండచీర్ గ్రామాన్ని సర్వనాశనం చేయాలని పోలీసులూ రజాకార్లూ గ్రామంపై దాడిచేశారు. ఇళ్ళను లూటీచేస్తూ నిప్పు అంటించారు. ఈ విషమ పరిస్థితుల్లో కిషన్‌గీర్ తన భార్య, తల్లి అడ్డువచ్చినా వినకుండా నిస్సహాయస్థితిలో పరుగెత్తాడు. రజాకార్లకు ఎదురు వెళ్ళి వాళ్ళ మంచితనాన్ని అర్థించాడు. కాని ఈలోగానే ఒక రోహిలా రజాకార్ అతన్ని గురిచూసి కాల్చివేశారు.
తన హత్యకు ప్రతీకారం తీసుకోబడుతుందని అంటూ కిషన్‌గీర్ నేలకొరిగాడు. నిరాయుధుడుగా ఉంటూ కూడా గ్రామాన్ని రక్షించాలని అతను నిర్భయంగా ముందుకు ఉరికాడు. రజాకార్లను కేవలం చంపడం కోసం కాకుండా అవసరమైతే చావడం కోసం కూడా తాము ముందు ఉండగలమని, కిషన్‌గీర్, మరో యువకుడుర హన్మంత్ నిరూపించారు. ఆ రోజు రజాకార్లు, పోలీసులు గృహదహనాలు, మానభంగాలు, లూటీలు జరిపి విజయోన్మాదంతో ఉద్గీర్వైపు వెళ్ళిపోయారు. తొండచీర్లో విషాదం అలుముకుంది. కిషన్గీర్కు ఇతర మృతులకు బంధువులంతా కలసి విషణ్ణ వదనాలతో దహన సంస్కారాలు జరిపారు.
తొండచీర్లో జరిగిన అత్యాచారాల గురించి రైతుదళాలకు కబురు అందింది. ఆ దళాలు వెంటనే బయలుదేరి తొండచీర్ వచ్చి చేరుకున్నాయి. ముఖ్యంగా దత్తగీర్ తన తండ్రిలాంటి కిషన్‌గీర్ చావును భరించలేక పోయాడు. ఏ విధంగానైనా, ఆ అన్యాయానికి, అఘాయిత్యానికి ప్రతీకారం తీసుకోవాలని దళం నిర్ణయించుకొంది. ప్రాణాలకు తెగింది ఉద్గీర్పై దాడిచేయాలని అనుకొన్నారు. ఉద్గీర్పై దాడి చేయడమంటే అగ్నిలోకి శలభాలవలే దూకడమే. అయినా కక్ష సాధించాలనే దృఢ నిశ్చయం అందరినీ ప్రాణాలకు తెగింప చేసింది, తమ బంధు మిత్రులతో చివరిసారిగా కలిసి రావడానికి దళ సభ్యులకు అనుమతి ఇవ్వడం జరిగింది. ఈ నిర్ణయాలన్నీ రామఘాట్లోనే జరిగాయి.
ఆత్మ బలి – ప్రతీకారం
రైతుదళం ముఖ్యపాత్ర వహించే బల్వీర్ కూడా తన ఇద్దరు మిత్రులతో తల్లిని కలుసుకోవాలని డోన్గావ్ వెళ్ళాడు. ఈ విషయం తెలిసిన రెండువందల మంది రజాకార్లు అతని ఇంటిని చుట్టుముట్టి వేశారు. బల్వీర్ తన మిత్రులు ఇద్దరూ ఆ సమయానికి గ్రామం బయట కాలకృత్యాలు తీర్చుకోవాలని వెళ్ళి ఉన్నారు. ఈ దాడి చూసి వాళ్ళిద్దరూ గత్యంతరం లేక అటునుంచి పారిపోక తప్పలేదు. బల్వీర్ తన మరో సహచరుడైన విఠల్తోబాటు ఇంటిలోంచి ఎదురు కాల్పులు జరిపారు. కొన్ని గంటలపాటు కాల్పులు కొనసాగాయి. రజాకార్లు చివరికి ఆ ఇంటికి నిప్పు జరిపారు. ఈ విషమ పరిస్థితుల్లో బల్వీర్ బయటకు రావాలన్నా ఎదురుగా రజాకార్లు.
తుపాకులకు బల్వీర్ తొణకకుండా తన తుపాకీతో పఠాన్ తుపాకీకి ఆనించాడు. అతని గుండెపై రామకృష్ణ తన తుపాకి మడిమతో లాగి కొట్టాడు. అది విరిగింది. ఇద్దరు తలపడి కుస్తీ పట్టారు. దళసభ్యుడు పఠాన్‌ను గురిచూసి దెబ్బతీశాడు. రామకృష్ణ మోకాలుకు దెబ్బ తగిలింది. దేవరాజ్ శత్రువుపై దాడిచేసి తుపాకీతో మిత్రుడైన విఠల్‌ని కాల్చి ఆ తర్వాత స్వయంగా తానే కాల్చుకున్నాడు. చేతిలో ఉన్న మందుగుండు సామాగ్రి ఉన్న సంచిని మంటల్లోకి విసిరేశాడు. దానితో చిన్న ప్రేలుడు జరిగి మంటలు మరింతగా ప్రజ్వరిల్లినాయి. బల్వీర్ తన సహచరుడితో ఆత్మబలిచేసుకున్నాడు, శత్రువులచేతుల్లో చావటం ఇష్టం లేక.
ఆజానుబాహుడైన బల్వీర్ దళానికి ఎన్నో విధాలుగా పనికి వచ్చిన వీరుడు. అతడు చావడం దళానికి తీరని నష్టం. బల్వీర్ మరణవార్త షోలాపూర్‌కు మరో విధంగా చేరింది. చన్‌వీర్ గోన్గావ్కర్ మరణించాడని ఎవరో చెప్పారు. చన్‌వీర్ కుటుంబం తీరని శోకానికి లోనైంది. అయితే స్వాతంత్య్రం తర్వాత షోలాపూర్ నుండి తిరిగి వచ్చిన ఆ కుటుంబం ముఖ్యంగా బల్వీర్ భార్య, చన్వీర్ను సజీవంగా చూసి ఆనందోత్సాహాలతో ఉప్పొంగి పోయింది.
తొండచీర్ను దోపిడి చేసిన తర్వాత ఉద్గీర్ ముస్లిం వర్గాలు తమకు ఇక ప్రతిఘటన లేదని విర్రవీగిపోయారు. రంజాన్ ఉత్సవాలు ఘనంగా జరుపుకున్నారు. 15 ఆగస్టు 1948 నాడు స్వతంత్ర హైద్రాబాద్ ఉత్సవం జరుపుకోవాలనుకొంటున్నారు. అయితే 11 ఆగస్టునాడే ఉద్గీర్లో చెడువార్త ఒకటి వ్యాపించింది. పక్కవూరిలో (నిడేబన్)ని ఒక బావిలో నలుగురు రజాకార్ల శవాలు కనపడ్డాయని వార్త. దళంవాళ్ళు చంపి పడవేసినట్లు తెలిసింది. ఇక ఎదురులేదని అనుకుంటున్న రజాకార్లను ఈ సంఘటన భయకంపితులను చేసింది. చాటుమాటుగా దళం వాళ్ళు ఎవరిపై ఎప్పుడు దాడి చేస్తారో అని భయం పీడించడం ప్రారంభించింది.
అసలు జరిగిన విషయం : రామఘాట్‌లో రైతుదళం ఉద్గీర్ పై దాడికోసం చురుకుగా ఏర్పాట్లు చేసుకుంటూ ఉంది. అయితే ప్రతీకార వాంఛతో దహించుకుపోతున్న కొందరు యువకులు మొదటే వెళ్ళి 10 ఆగస్టు నాడే కుమదాల్ గ్రామం ప్రవేశించారు. మానిక్రావ్ సహచరుడైన హన్నుఖాన్ ఆరుగురు సభ్యులను రజాకార్ల వేషంలో తీసుకెళ్ళారు. అయితే ఆ గ్రామంలోని రజాకార్లు మొదట్లో హన్నుఖాన్ను నమ్మలేదు. అతను అల్లామియా, నిజాం సాక్షిగా వాళ్ళను నమ్మించగలిగాడు. ఆ రాత్రి అజాగ్రత్తగా ఉన్న రజాకార్ల గఢ్‌పై హన్నూఖాన్ దాడిచేశాడు. అనేక మందిని చంపగలిగారు. నలుగురు రజాకార్లను చంపి నిడేబన్ దగ్గర పాడుబావిలో పడవేశారు.
Source: Vijaya Kranthi