హోన్సాలికి చెందిన భావూరావు, బాబారావు అనే సోదరుల సాహసంతో ఈ లింగదల్లిని విముక్తిపర్చారు. ఆ సోదరులు కూడా దళంలో చేరి పోయారు. భావూరావు స్వాధీనంలో ఉన్న గఢ్‌లో ఆయుధాలు దాచి పెట్టారు. షోలాపూర్‌లో తిరిగి ఆయుధాలు సేకరించారు. షోలాపూర్ కలెక్టర్, స్థానికి నాయకుడు చెన్నూసింగ్ ఈ దళనాయకులను ప్రశంసించి సహాయం చేశాడు.
లింగదల్లి పక్కనే ఉన్న హిస్సర్గలో నిజాం సైన్యాలు ఉన్నాయి. లింగదల్లికి వాటివల్ల ప్రమాదం ఉన్నదన్న సంగతి తెలుసు. దళం అక్కడే ఉన్న సందర్భంలో హిస్సర్గపై దాడిచేశారు. వెంకట్రావ్ మిర్కల్, డా॥ చెన్నప్ప నాయకత్వాన దళం వెళ్ళి విజయవంతంగా దాడి జరిపింది. ఒక మైలుదూరం ఆ నిజాం సైన్యాలను తరిమికొట్టగలిగారు. అయితే ఆ తర్వాత అదనంగా వచ్చిన సైనికదళాలతో పోరాటం జరిగింది. రైతు దళంలో ముగ్గురు మరణించారు. ఇక లాభం లేదని రైతుదళం లింగదల్లివైపు ఉపసంహరించుకుంది. అయితే ఈలోగా ఇక్కడే దళంలో ప్రముఖ నాయకులు కొందరు జీవితాలను అర్పించారు.
వెంకట్రావ్ మిర్కల్, డా॥ చెన్నప్ప, సమర్థారావు, భాయిసింగ్లాంటి వీరులు మరణించారు. యశ్వంత్రావ్ లింగదల్లి నుంచి తిరిగి హిస్సర్గపై దాడి జరిపాడు. అయితే ఈ లోగా నిజాం సైన్యాలు హిస్సర్గ నుంచి వెనక్కి వెళ్ళిపోయాయి. యశ్వంత్రావ్ అప్పుడే హిస్సర్గకోటపై త్రివర్ణపతాకాన్ని ఎగురవేశాడు. హిందువులంతా హర్షోల్లాసాలతో ఉత్సవం జరుపుకున్నారు. ఆ తర్వాత పదిరోజులకే పోలీసుచర్య జరిగింది. అయితే ఈ హిస్సర్గ పోరాటంలోనే దళం తన అమూల్యమైన సహచరులను కోల్పోయింది. మానిక్రావ్ను తిరిగి సంస్థానంలోకి, యశ్వంత్రావ్, దత్తగీర్ భారతీయ సైన్యాలకు దారిజూపించడానికి నియమితులైనారు. 12 సెప్టెంబర్ 1948 నాడు భారతీయ సైన్యాలు సంస్థానంలో ప్రవేశించాయి.
రజాకారాయ స్వాహా!
పోలీసు చర్య కొన్ని రోజుల్లో జరుగుతుందనగా మానిక్రావ్మూలే, తదితరులు షోలాపూర్ నుంచి తిరిగి వచ్చాడు. ఆ దళం అట్టర్గా నుంచి లాసోనాపైకి వెళ్ళింది. దళానికి ఆహారం, డబ్బు సమస్య పీడించసాగింది. లాసోనాలోని ఫీరాజీపటేల్ను విరాళం అడిగారు. అతను నిరాకరించాడు. ఫిరాజీ ధనవంతుడు. దళం భయంచేత రజాకార్లు అతన్ని లూట్ చేయకుండా వదిలేశారు. ఆ కృతజ్ఞతతోనైనా అతను సహాయం చేయలేదు. అందువల్ల అతన్ని చివరికి భయపెట్టి దళం వెయ్యిరూపాయలు వసూలు చేసుకోక తప్పలేదు. రజాకార్లకు వ్యతిరేకంగా మాత్రమే ఆయుధాలు లేవనెత్తిన దళం అలాంటి మూర్ఖులైన ధనవంతులను కూడా భయపెట్టి పనిచేయించ తప్పలేదు. లాసోనా ప్రాంతంలోనే దళం స్థావరం ఏర్పాట్లు చేసుకుంది.
హలవాయి ప్రాంతంలో రజాకార్లు అత్యాచారాలు చేస్తున్నారనే వార్త అందింది, ఒక హరిజన యువతిని బలాత్కరించటం, వీధుల్లో ఆవుమాంసం విసిరివేయడంలాంటి పనులు జరిగాయి. దళం హలవాయిపై దాడిచేసి 40 మంది రజాకార్లను ఖతం చేసింది. ఆ తర్వాత వలాండి గ్రామం చేరుకున్నారు. అక్కడే రజాకార్లతో ఘర్షణ పెద్ద ఎత్తున జరిగింది. చివరికి హాండ్గ్రైనేడ్తో పోరాటం జరిగింది. రజాకార్లు బాగా దెబ్బతిని తోక ముడిచారు. అక్కడ నుంచి మేకర్ వెళ్ళి ఆగఢ్లో ఉన్న రజాకార్లపై దాడి చేశారు. ఆగఢ్లో రజాకార్లు దాచిపెట్టిన దోపిడి సామాగ్రిని గ్రామ ప్రజలకు పంచిపెట్టారు.
మేకర్ నుంచి దేవనీ చేరుకున్నారు. ఇక్కడ రజాకార్లు పెద్దసంఖ్యలో ఉన్నారు. షోలాపూర్ నుంచి క్రమంగా భారతీయ సైన్యాలు ముందుకు వస్తుంటే రజాకార్లు వెనక్కి పారిపోయి దేవనీలో తలదాచుకుంటున్నారు. ఆ గ్రామంలో హిందువుల ఇళ్ళను దోచుకున్నారు. విపరీతంగా ఖూనీలు జరిపారు. అక్కడ గఢ్‌లో రజాకార్ల స్థావరం ఏర్పరచుకున్నారు. దళం దాడిజరిపి, కాల్పులు జరిపింది. అయితే గఢ్‌లో ఉన్న రజాకార్లు అనుకూలమైన స్థితిలో ఉన్నారు. ఆరు రోజులపాటు ఈ ముట్టడి సాగుతూనే ఉంది.
చివరికి ఒకరోజు దళం నర్సింగ్‌రావ్ మాస్టరును దేశ్‌ముఖ్ ఇంటిపైకి ఎక్కించారు. మరోవైపు దళం కాల్పులు కొనసాగిస్తూనే ఉంది. నర్సింగ్‌రావ్ ఆ ఇంటిపై నుంచి ఐదారు చేతిబాంబులు విసిరాడు. గఢ్‌లో ఉన్న రజాకార్లు ఆ దెబ్బకు తలుపులు తెరచుకొని పారిపోవడం ప్రారంభించారు. దేవనీ నుంచి భుజనాల్వైపు రజాకార్లు, చివరికి నిజాం ప్రభుత్వాధికారులు, అరబ్ తహసీల్దార్, పోలీస్ అమీన్ కూడా వాళ్ళతోపాటు పారిపోతున్నారు. దారిలో రజాకార్లు, ముస్లింలు ఊచకోతకు గురైనారు. ఎక్కడ చూసినా శవాలే! ఈనాటికీ తమ అన్యాయాలకు, అవినీతి పనులకు ఫలితం అనుభవించారు.
ఆ ప్రాంతాల్లో దాదాపు 2 నుంచి 4 వేలదాకా రజాకార్లు ప్రజల చేతుల్లో చచ్చిపోయారు, హిందువుల ప్రతీకారం మండిపోయింది. అక్బర్‌ఖాన్ అనే పఠాన్ తన నలుగురు కూతుళ్ళతో పారిపోతుండగా దారిలో చంపబడ్డాడు. ఆ నలుగురు కూతుళ్ళు కమాల్నగర్ వెళ్ళారు. వాళ్ళ నిస్సహాయ స్థితిని చూసి అక్కడి పోలీసు అధికారి వాళ్ళను బంధించి పెట్టాడు. దళం అక్కడికి వెళ్ళి ఆ నలుగురు అమ్మాయిలను విముక్తి పర్చారు. వాళ్ళను హైద్రాబాద్ వెళ్ళే రైల్లో సురక్షితంగా పంపించివేశారు.