Home News హైదరాబాద్‌లో ముగ్గురు మహిళా మావోయిస్టుల అరెస్టు

హైదరాబాద్‌లో ముగ్గురు మహిళా మావోయిస్టుల అరెస్టు

0
SHARE

-అదుపులోకి తీసుకున్న విశాఖపట్నం పోలీసులు
-విప్లవసాహిత్యం, ముఖ్యమైన ఉత్తరాలు స్వాధీనం
-నెల్లూరు జిల్లాకు చెందిన అక్కా చెల్లెండ్లుగా గుర్తింపు
-నక్సల్స్ కీలక నేతలతో సన్నిహిత సంబంధాలు
-అర్బన్ ప్రాంతాల్లో తెలంగాణ పోలీసుల ఆరా

హైదరాబాద్‌లో ముగ్గురు మహిళా మావోయిస్టులను అరెస్టుచేయ డం కలకలంరేపింది. మావోయిస్టులకు సహకరిస్తున్నారనే ఆరోపణలపై ఎన్జీఆర్‌ఐలో టెక్నికల్ ఆఫీసర్ నక్కా వెంకటరావును ఛత్తీస్‌గఢ్ పోలీసులు పట్టుకున్న మరుసటిరోజే.. సోమవారం వైజాగ్ పోలీసు లు ముగ్గురు అక్కాచెల్లెండ్లను అరెస్టుచేయడం సంచలనం రేకెత్తించింది. హైదరాబాద్‌లోని మౌలాలీ హౌసింగ్‌బోర్డు కాలనీలో ఆత్మకూరు అనూష, ఆత్మకూరు అన్నపూర్ణ, ఆత్మకూరు భవానీ అనే మావోయిస్టులను అరెస్టు చేశామని ఏపీలోని విశాఖపట్నం జిల్లా పాడేరు డీఎస్పీ వీబీ రాజ్‌కమల్ మంగళవారం ధ్రువీకరించారు.

వీరు స్వయంగా అక్కాచెల్లెండ్లు అని, విశాఖపట్నం జిల్లా జీ మాడుగుల పోలీస్‌స్టేషన్ నమోదైన కేసులోభాగంగా వీరిని అరెస్టుచేసినట్టు తెలిపారు. నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం తిమ్మయ్యపాలెంకు చెందిన అక్కాచెల్లెళ్లు అన్నపూర్ణ, భవానీ, అనూష కొద్దిరోజులుగా హైదరాబాద్‌లో ఉంటూ పోలీసుల కదలికల సమాచారాన్ని మావోయిస్టులకు చేరవేస్తున్నారు. వీరి తండ్రి రమణయ్య కులనిర్మూలన పోరాట సమితిలో, ప్రస్తుతం తెలంగాణ ప్రజాఫ్రంట్‌లో పనిచేస్తుండగా.. తల్లి లక్ష్మీనర్సమ్మ హైదరాబాద్‌లో ప్రజాపోరాట సంఘంలో చురుకుగా పాల్గొంటున్నారు.

అత్యంత కీలక సభ్యులు

పట్టుబడిన ముగ్గురికి .. మావోయిస్టు కీలక నేతలతో అత్యంత సన్నిహిత సంబంధాలున్నట్టు తెలుస్తున్నది. అక్కలు భవానీ, అన్నపూర్ణ ప్రోత్సాహంతో అనూష 2017లో మావోయిస్టుల్లోని చైతన్య మహిళా సం ఘంలో చేరింది. విశాఖపట్నం ఏజెన్సీ ప్రాంతంలో మావోయిస్టు నాయకుడైన అక్కిరాజు హరగోపాల్ అలియాస్ ఆర్కేతో కలిసి పనిచేస్తున్నది. మావోయిస్టులతో కలిసి విశాఖ అటవీప్రాంతంలో ఉంటున్న అనూష.. ఎవరికీ అనుమానం రాకుండా అప్పుడప్పుడు వచ్చి ఇద్దరు అక్కలను కలుస్తున్నది. అడవిలో ఉన్నవారికోసం మందులు, వస్తువులు, విప్లవసాహిత్యం సమకూరుస్తున్నది. ఇదే క్రమంలో హైదరాబాద్‌కు వచ్చిన అనూషపై రెక్కీ నిర్వహించిన విశాఖపట్నం పోలీసులు.. పక్కా సమాచారంతో ముగ్గురిని అరెస్టుచేశారు. అన్నపూర్ణ, భవానీ వద్ద విప్లవసాహిత్యం, ముఖ్యమైన మావోయిస్టుల ఉత్తరాలు స్వాధీ నం చేసుకున్నారు.

తెలంగాణ పోలీసులు అప్రమత్తం

అర్బన్ నక్సలిజంలో వరుసగా పట్టుబడుతున్న కీలక వ్యక్తులం తా హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్నట్టు తెలుస్తుండటంతో తెలంగాణ పోలీసులు అప్రమత్తమయ్యారు. తెలంగాణలోని పట్టణప్రాంతాల్లో మావోయిస్టు సానుభూతిపరులు, కోవర్టులు ఎవరెవరు ఉంటున్నారు.. వారు ఎవరెవరిని కలుస్తున్నారన్న అంశాలపై ప్రత్యేకంగా దృష్టిపెట్టారు. గత నాలుగైదు రోజుల్లో పట్టుబడినవారికి హైదరాబాద్‌లో మరెవరితో లింకులు ఉన్నాయన్నదానిపై ఆరా తీస్తున్నట్టు సమాచారం. నిఘా పటిష్ఠం చేశామని, మావోయిస్టుల కదలికలను ఎప్పటికప్పుడు గమనిస్తున్నట్టు పోలీస్ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.

(#నమస్తే తెలంగాణ సౌజన్యం తో)