పోలీసుచర్య జరుగుతున్న సందర్భంలో రైతుదళంపై కొందరు అధికారులకు ఫిర్యాదులు చేయడం ప్రారంభించారు. మిలిట్రీ నియమించిన జిల్లా కలెక్టరుకు దళంపై ఆరోపణలు వెళ్ళాయి. డోన్గావ్లో ఉన్న దళాన్ని వాళ్ళ నాయకులను బంధించి పెట్టాలనే ప్రయత్నాలు విఫలమైనాయి. జిల్లా కలెక్టరు రోబెల్లో వాళ్ళకు నచ్చచెప్పి పరిస్థితిని అదుపులో పెట్టాలని ప్రయత్నిస్తున్నాడు. ఆ ప్రాంతాల్లో దళం వల్ల అశాంతి ప్రబలిందని కొందరు దుష్ప్రచారం సాగించారు.
హల్సముంద అనే ప్రాంతం నుంచి ఒక అజానుబాహుడైన రైతు బయలుదేరాడు. దారిలో ఒకట్రక్కును ఆపి బీదర్ వెళ్ళాడు. అయితే బీదర్‌లో లారీలోంచి ఆ రైతు సూటువేసుకొని దిగాడు. అతనే చన్‌వీర్. సరాసరిన అతను బీదర్‌కోట దగ్గరలో ఉన్న కలెక్టరు భవనానికి వెళ్ళాడు. కలెక్టరు భవనం దగ్గర భీమ్రావ్ పటేల్ కలిశాడు. మొదట్లో అతను ఏ మాత్రం గుర్తుపట్టలేదు. చన్‌వీర్ తనను పరిచయం చేసుకోగానే పటేల్ ఆశ్చర్యపడ్డాడు. పోలీసులు ఇంతకాలంగా గాలిస్తున్న వ్యక్తి ఈనాడు స్వయంగా కలెక్టరు కార్యాలయానికి వచ్చాడు. తాను కలెక్టరును కలుస్తానని, అయితే తనపట్ల చెడువిధంగా వ్యవహారాలు జరిగితే మాత్రం దళానికి కబురు అందచేయాలని చన్‌వీర్ పటేల్‌తో చెప్పి వెళ్ళాడు.
లోపలికి ప్రవేశిస్తుండగా మిలట్రీసెంట్రీ, చప్రాసీ అతనికి సెల్యుట చేశారు. అతను కార్యాలయం లోపలికి ప్రవేశించగానే లోపల కొందరు ప్రముఖులు కూర్చున్నారు. కలెక్టరు ఇంకా రాలేదు. బీదర్ కాంగ్రెస్ నాయకుడు, న్యాయవాది శ్రీనివాస్‌రావు, గుండేరావు, యేరోతక్కర్ ఎదురుగా ఉన్నారు. చన్‌వీర్ వాళ్ళను గుర్తుపెట్టాడు. కాని వాళ్ళు ఇతనిని ఎవరో కొత్తఅధికారి కాబోలని అనుకున్నారు. కాసేపట్లో కలెక్టరు లోపలికి వచ్చాడు. అప్పుడు చన్‌వీర్ గాగుల్స్, హ్యాట్ తీసి కలెక్టరుకు నమస్కరించాడు.
కలెక్టరు అతన్ని గుర్తుపట్టి, ‘చన్వీర, నువ్వా!’ అంటూ భయంతో, ఆశ్చర్యంతో చేంబర్లోకి వెళ్ళండి. యస్.పి.ని వెంటనే సాయుధ పోలీసులతో ఆజ్ఞాపించాడు. శ్రీనివాసరావు, గుండేరావ్లు చన్వీర్ను రెప్పవాల్చకుండా చూస్తూ ఉండిపోయారు. కొన్ని నిముషాల్లోనే డి.ఎస్.సి. పోలీసులతో వచ్చి కార్యాలయాన్ని చుట్టుముట్టాడు. స్వ యంగా కలెక్టరుతో సంప్రదించి ఇద్దరు చన్‌వీర్ ముం దుకు వచ్చారు. చన్‌వీర్ అన్నాడు. ‘నేను స్వయంగా లొంగిపోవాలనే వచ్చాను. మీరేకదా మాపై కేసులు వగైరా ఏమీఉండవు వచ్చి లొంగిపొమ్మని కబురు పంపించారు’. కొంచెంసేపు నిశ్శబ్దం ఆవరించింది.
‘శూర్ ఇద్యో’ (గొప్ప సాహసివి) అని కన్నడంలో చన్వీర్ను డి.యస్.పి. వీపుతట్టి అభినందించాడు. కాగితాలపై హామీ రాయించుకొని కొన్ని విషయాలు నచ్చచెప్పాడు. చన్‌వీర్ ప్రతిరోజు ఉద్గీర్ పోలీస్ స్టేషన్లో హాజరు వేయించుకోవాలని, మిగతా సహచరులను కూడా లొంగి పొమ్మని చెప్పాలని షరతులు విధించారు. చన్‌వీర్ వెంటనే రామ్‌ఘాట్ నుంచి మిగతా మిత్రులను తీసుకువచ్చాడు. నిర్ణయానుసారం చన్వీర్తో సహా అందరూ పోలీసు అధికారి దల్వీర్ దగ్గరకు వెళ్ళారు. దల్వీర్ వాళ్ళను రోజూవచ్చి సబ్ఇన్స్పెక్టర్ మన్నాన్‌ను కలిసి వెళ్ళాలని ఆదేశించాడు. బోట్కూల్లో మన్నాన్ మాచేత ఓటమి పొందాడు. అతని ఆయుధాలు అప్పట్లో లాక్కొన్నాము. అతని ముందు రోజూ హాజరు వేయించుకోమంటారా? అని చన్‌వీర్ అన్నాడు. దల్వీర్ వివరాలన్నీవిని లోపలి నుంచి మన్నాన్‌ను పిలిపించాడు. అతను తన ఓటమి గురించి అంగీకరించాడు. దల్వీర్, చన్వీర్ను ప్రశంసిస్తూ మీరు రోజూ హాజరు వేయించుకోవలసిన అవసరం కూడా లేదు. అయితే మా ఔదార్యాన్ని మాత్రం ‘దుర్వినియోగం చేయవద్దు’ అని చెప్పి పంపించాడు.
చాకచక్యం
అయితే కొంతకాలం గడచిన తర్వాత చన్‌వీర్, మానిక్రావులను పోలీసులు తిరిగి అరెస్టు చేశారు. పాతకేసు ఒకదానిని తిరగతోడి వాళ్ళిద్దరినీ విచారణాధీనంలో ఉన్న ఖైదీలుగా బీదర్ జైల్లో వేశారు. బీదల్ కాంగ్రెస్ నాయకుడైన గుండేరావు పలుకుబడిగల వ్యక్తి. అతను స్వయంగా రైతుదళ నాయకులను ఏదోకేసులో ఇరికించి జైల్లో వేయించాలని శ్రద్ధ తీసుకున్నాడు. పైగా న్యాయవాదులందరిని సహాయపడవద్దని ప్రచారం చేశాడు. ఒకరోజు చన్‌వీర్, మానిక్రావ్లు కోర్టుకు వచ్చారు. న్యాయవాదిగా ప్రాక్టీసు ప్రారంభించిన హన్మంతరావ్ జాదవ్ వాళ్ళకు కనపడ్డాడు. పిలిచి అతన్ని తమ తరపున వాదించమని కోరారు.
అతను కొత్తవాణ్ణి అని, గుండేరావ్ ప్రభావం వల్ల మిగతా న్యాయవాదులు ముభావంగా ఉన్నారని స్వయంగా తాను ఏమీ చేయగలనని అంటూ అసహాయతను వెలిబుచ్చాడు. తమ తరపున వకాలత్ పడవేసి కొత్తగా వచ్చిన పబ్లిక్ ప్రాసిక్యూటర్‌తో వివరాలను చెబితే చాలునని చన్‌వీర్ చెప్పాడు. అలాగే జరిగింది. ఆ తర్వాత ప్రాసిక్యూటర్ విషయమంతా ఓపిగ్గా విని సానుభూతితో పరిశీలించాడు. నిజాంనాటి కేసులేవైనా నిరాధారంగా సాగదీయ బడుతుంటే ఎత్తివేయాలని పై నుంచి ఆదేశాలు కూడా వచ్చాయి. ప్రాసిక్యూటర్ ఈ వ్యవహారమంతా పై పోలీసు అధికారులతో చర్చించి చివరకు కేసును ఉపసంహరించు కొన్నాడు.
తిరిగి చన్‌వీర్, మానిక్రావ్లు విడుదలై బయటికి వచ్చేశారు. ఆ తర్వాత మానిక్రావ్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఇంటికి వెళ్ళి కృతజ్ఞతలు తెలియచేశాడు. అతని ప్రాసిక్యూటర్ ఇంట్లో ఉండగా పోలీసులు తలుపుతట్టి, ఇంటిని గాలించాలని బయటి నుండి కేక వినపడింది. ప్రాసిక్యూటర్ తలపట్టుకొన్నాడు. మానిక్రావ్ లంచం ఇవ్వడానికి వచ్చాడని అదే సందర్భంలో అరెస్టుచేశామని చెప్పడానికి విరోధులు ఈ ఎత్తుగడకు దిగారు. మానిక్రావ్ వెంటనే ప్రాసిక్యూటర్ యూనిఫారమ్ వేసుకొని ‘మీరు ఏమీ బెదిరిపోవద్ద’ని మెల్లగా తలుపుతీసి వెనకాల నిలబడ్డాడు. సబ్ ఇన్స్పెక్టర్ సరాసరి లోపలికి వెళ్ళిపోగానే యూనిఫారమ్‌లో ఉన్న మానిక్రావ్ బయటికి వెళ్ళి పోలీసులను వెనకాల ఉన్న ద్వారంలోంచి రమ్మనమని చెప్పాడు.