‘దేశంలో విజాతీయ శక్తులు పెరిగిపోవడం, దేశ భద్రతకు ముప్పుగా పరిణమించడం చాలా విచారించవలసిన విషయం. ఇందులో మన లోపం కూడా కనబడుతోంది. అంతర్గత భద్రత గురించి ప్రభుత్వం ప్రజలను మరింత జాగరుకులను చేయాల్సిన అవసరం ఉంది’ అని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సర్ కార్యవాహ శ్రీ సురేశ్ (భయ్యాజీ) జోషి అన్నారు. సరిహద్దు గ్రామాల్లో ప్రజలు తగిన సహాయ సహకారాలు అందించినప్పుడే మన భద్రతాదళాలు తమ పని సమర్ధంగా నిర్వహించగలుగుతాయని ఆయన అన్నారు. నిన్న (27-డిసెంబర్) ఢిల్లీలో రాష్ట్రీయ సురక్షా మంచ్ ఏర్పాటుచేసిన ‘మంథన్’ సంగోష్టి కార్యక్రమంలో శ్రీ సురేశ్ జోషి పాల్గొన్నారు.
చుట్టుపక్కల ఉన్న దేశాలు మనను శత్రువుగా చూస్తున్నప్పుడు సమస్యలు మరింత పెరుగుతాయని, భారత్ ఎప్పుడు పాకిస్థాన్ ను శతృదేశంగా చూడకపోయినా ఆ దేశం మాత్రం మొదటి నుంచి శతృత్వం వహిస్తోందని ఆయన అన్నారు. చైనాను కూడా మనం శత్రువుగా పరిగణించనప్పటికీ ఆ దేశం అలాగే వ్యవహరిస్తోంది. బంగ్లాదేశ్ వల్ల కూడా సమస్యలు ఎదురవుతున్నాయి. చొరబాటులు మన దేశ భద్రతకు ముప్పుగా పరిణమించాయి. పొరుగు దేశాలతో మిత్రత్వం వహించాలి. కానీ అది రెండు వైపుల నుంచి ఉండాలి. స్నేహ హస్తం అందించడం విషయంలో భారత్ ఎప్పుడు ముందే ఉంటుందని ప్రపంచానికి తెలియాలని శ్రీ సురేశ్ జోషి అన్నారు.
నేడు మన దేశంపై సాగుతున్న ప్రచ్చన్న దాడిని కూడా సరిగా అర్ధం చేసుకోవాలని ఆయన అన్నారు. మాదక ద్రవ్యాలను, నకిలీ కరెన్సీని ఈ దేశంలోకి దొంగచాటుగా రవాణా చేసేవారు, ఆవులను దొంగిలించేవారు ఎవరు? ఈ దేశంలో అక్రమంగా ప్రవేశించి, ఇక్కడే తిష్టవేసుకుని దీనికి వ్యతిరేకంగానే పనిచేస్తున్నది ఎవరు? ఇలాంటివారు ఈ దేశ భద్రతకు పెను ముప్పు. ఈ దేశపు సంస్కృతీ సభ్యతలను నాశనం చేయడానికి అనేకరకాల ప్రయత్నాలు జరుగుతున్నాయి. వివేకం, జ్ఞానం మనిషికి అవసరమే. మౌలికమైన విలువలను కూడా వదిలిపెట్టడం పతనానికి దారితీస్తుంది. మన దేశంలోకి ఎలాంటి విదేశీ సాహిత్యం వస్తోంది? విదేశీ టీవి ఛానళ్ళపట్ల వ్యామోహం ఎందుకు ఎక్కువవుతోంది? ఈ విషయాల పట్ల జాగ్రత్తవహించాల్సిన అవసరం ఉంది. ప్రపంచంలో మన దేశానికి మాత్రమే రెండు పేర్లు ఉన్నాయి. అవి, భారత్, ఇండియా. భారత్ అంటే ఇక్కడి ప్రాచీన సాంస్కృతిక పరంపర గుర్తుకు వస్తుంది. అందుకనే ఇక్కడి ప్రజలను ఆ ప్రాచీన పరంపర నుండి వేరు చేయడానికి బ్రిటిష్ వాళ్ళు ఈ ఇండియా అనే పేరు పెట్టారు. ఇప్పటికీ మన ఈ పేరును వదిలిపెట్టలేకపోతున్నాము. ఈ దేశానికి చెందినవారెవరు ఇక్కడ లేరని, అంతా బయటనుంచి వచ్చినవారేనని నిరూపించడానికి బ్రిటిష్ వాళ్ళు విశ్వప్రయత్నం చేశారు. బయట నుంచి ఆర్యులు వచ్చారు కాబట్టి ఆర్యావర్తమయిందని, ఆ తరువాత మొగలాయిలు, వారి తరువాత తాము వచ్చామని ప్రచారం చేశారు. ఈ దేశంలోని మేధావులు, ఆలోచనపరులు కూడా బ్రిటిష్ వారి ఈ కుట్రను తెలుసుకోలేకపోయారు. ఈ దేశం ఎవరిది కాదనే భ్రమకు వారుకూడా లోనయ్యారు. కానీ ఈ దేశం అనేక దాడులు, ప్రమాదాలను తట్టుకుని ఎలా నిలబడింది? ఇదే విషయాన్ని ఈ దేశాన్ని ఆక్రమించాలనుకున్న విదేశీ శక్తులు తెలుసుకున్నాయి. ఈ దేశంపై సాయుధదాడి చేస్తే లాభంలేదు. సైద్ధాంతీక దాడి చేసినా ఫలితం లేదు. ఈ దేశపు బలం నైతిక విలువల ఆధారంగా సాగే జీవనంలో ఉంది. దానిని నాశనం చేస్తే ఇది నశిస్తుందని అనుకున్నారు. ప్రస్తుతం అలాంటి ప్రయత్నమే చేస్తున్నారు.
నేడు భౌతిక సుఖాల వ్యామోహం ఎంతగా పెరిగిపోయిందంటే వ్యక్తి తన స్వార్ధం కోసం దేనికైనా తెగించే పరిస్థితిలో పడ్డాడని సర్ కార్యవాహ శ్రీ సురేశ్ జోషి విచారం వ్యక్తం చేశారు. ఈ ప్రమాదం నుండి గట్టెక్కాలంటే ధార్మిక గురువులు పూనుకోవాలి.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ కేంద్ర కార్యకారిణి మండలి సభ్యులు ఇంద్రేష్ కుమార్ మాట్లాడుతూ ఆధునిక జయచంద్ లు, మీర్ జాఫర్ ల వల్లనే దేశానికి నష్టం వాటిల్లుతోందని అన్నారు. నైతిక విలువలు తగ్గిపోవడం వల్లనే దేశంలో నేరాలు పెరుగుతున్నాయని, సాంకేతిక పరిజ్ఞానాన్ని, సాధనాలను సక్రమంగా ఉపయోగించుకోవాలని ఆయన అన్నారు. యూరోప్ దేశాల్లో సరిహద్దుల్లో సైన్యం ఉంచే అవసరం లేదని, కానీ మనం మాత్రం మన సరిహద్దులను రక్షించుకునేందుకు ఎంతో ఖర్చు పెట్టవలసివస్తోందని ఆయన అన్నారు.
సరిహద్దులు సురక్షితంగా ఉన్నప్పుడే దేశం అభివృద్ధి సాధించగలుగుతుందని ఎయిర్ మార్షల్ డా. ఆర్ సి బాజ్ పాయి అన్నారు. సామ్రాజ్యవాద ధోరణి కలిగిన చైనా పట్ల ఎప్పుడు అప్రమత్తంగానే ఉండాలని ఆయన అన్నారు.