ఐసిస్ ఉగ్రవాద సంస్థకు చెందిన సభ్యులుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న 15 మందిలో హైదరాబాద్ కు చెందిన ముగ్గురిని జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) ప్రత్యేక కోర్టు శుక్రవారం జైలు శిక్ష విధించింది. హైదరాబాద్ లోని టోలిచౌకి కి చెందిన షరీఫ్ మౌనిద్ధిన్, సైదాబాద్ కు చెందిన అబ్దుల్లా ఖాన్, మాదాపూర్ కి చెందిన నఫీసా ఖాన్ అలియాస్ ఫాతిమా ఖాన్ అలియాస్ అబూ జర్రర్ లకు కోర్టు శిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది.
నాఫిస్ ఖాన్ కు పదేళ్ల కఠిన జైలుశిక్షతో పాటు 1.03 లక్షల జరిమానా విధించింది. షరీఫ్ మొయినుద్దీన్ ఖాన్, అబ్దుల్లా ఖాన్ లకు ఐదేళ్ల జైలు శిక్ష ఒక్కొక్కరికీ రూ.38 వేల జరిమానా విధించింది. ఐసీస్ తో సంబంధాలున్న మరో 12 మంది ముదబ్బీర్ ముష్తాక్ షేక్, అబూ అనాస్, ముఫ్తీ అబ్దుస్ సామి, అజార్ ఖాన్, అమ్జాద్ ఖాన్, ఆసిఫ్ అలీ, మొహద్ హుస్సేన్, సయ్యద్ ముజాహిద్, ఎండి అలీమ్, ఎండి అఫ్జల్, నజ్మల్ హుడా, సోహైల్ అహ్మద్ లకు కూడా ఎన్ఐఏ కోర్టు 5 నుంచి 7 ఏళ్ళ జైలు శిక్ష విధించింది.
వివిధ సామాజిక మాధ్యమాల ద్వారా ముస్లిం యువతను ఐసిస్ లో చేర్చేందుకు కుట్రలు చేస్తూ భారతదేశంలో ఐసిస్ తన స్థావరాన్ని ఏర్పాటుకు చేసిన నేరపూరిత కుట్రకు సంబంధించి ఐపిసి సెక్షన్ 125, చట్ట విరుద్ధ కార్యకలాపాలు నివారణ చట్టం లోని 18, 18 బి, 38 & 39 చట్టాల కింద ఎన్ఐఏ 2015 డిసెంబర్ 9న కేసు నమోదు చేసింది. దర్యాప్తులో భాగంగా దేశంలోని పలు ప్రాంతాల్లో చేసిన దాడుల ద్వారా ఇప్పటివరకు 19 మంది నిందితులను ఎన్ఐఏ అరెస్టు చేసింది.
సిరియా కి చెందిన ఐసిస్ మీడియా చీఫ్ ‘యూసఫ్ హిందీ’ అకా షఫీ ఆర్మర్( అంజన్ భాయ్) ఆదేశాల మేరకు భారత్ లో ‘జునూద్- ఉల్ – ఖిలాఫా- ఫీల్ హింద్’ అనే సంస్థ ఏర్పాటు చేసి, దాని ద్వారా ముస్లిం యువకులను ఐసిస్ లోకి తీసుకొచ్చి భారత్ లో ఉగ్రవాద చర్యలకు పాల్పదిందని ఎన్ఐఏ అధికారి తెలిపారు.
ఐసిస్ లో చేరాలనుకునే వారిపై ఈ కేసు ప్రభావం చూపిందని, అరెస్టుల తర్వాత ఉగ్రవాద కార్యకలాపాలు కూడా చాలా తగ్గాయని ఎన్ఐఏ అధికారి తెలిపారు. ఐసిస్ లో చేరడానికి వెళ్లిన చాలామంది సానుభూతిపరులను మధ్యప్రాచ్యం లోని వివిధ ప్రదేశాలలో అడ్డగించి తిరిగి భారతదేశానికి పంపించారు. అందుకు సంబంధించి 2016 – 17లో 16 మంది నిందితులపై ఎన్ఐఏ చార్జిషీటు దాఖలు చేసింది. ఆన్లైన్ ద్వారా ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతున్న అబూ – బకార్ – ఆల్ – బగ్దాది యూసఫ్ ఆల్ హిందీ ఆధారిత ఉగ్రవాద రాడికల్ సంస్థలపై 2014 లో మొదటి కేసు నమోదైనట్లు ఎన్ఐఏ పేర్కొంది.