ఇజ్రాయిల్ ‘యూదు జాతీయ రాజ్యాంగ వ్యవస్థ’గా ఏర్పడడం చారిత్రక భౌగోళిక వాస్తవాలకు అనుగుణమైన పరిణామం. ఈ పరిణామాన్ని ఇరుగుపొరుగు దేశాలవారు నిరసించడం కూడ చారిత్రక వాస్తవాలకు అనుగుణం. మధ్యధరా సముద్రానికి తూర్పుగా ఆసియా పశ్చిమ ప్రాంతంలో వ్యాపించి ఉన్న ‘పాలస్తీనా’ వేల ఏళ్లుగా యూదుల మాతృభూమి. క్రీస్తుకు పూర్వం ఒకటవ శతాబ్దినుంచి యూదులపై ‘రోము’ నాగరికులు దాడులు చేశారు. క్రీస్తుశకం ఒకటవ శతాబ్దిలో యూదులను ‘రోము’ నాగరికులు ‘పాలస్తీనా’నుంచి నిర్మూలించారు, తరిమివేశారు. ప్రపంచమంతటా చెల్లాచెదురైన యూదులు ఇరవయ్యవ శతాబ్ది ఆరంభంనుంచి తమ ప్రాచీన మాతృభూమికి తిరిగి వచ్చారు. 1948లో ఐక్యరాజ్యసమితి ‘పాలస్తీనా’ను విభజించి యూదు లు అధికంగా ఉన్న ప్రాంతాన్ని ఇజ్రాయిల్‌గాను, అరబ్బీ ముస్లింలు అధికంగా ఉండిన ప్రాంతాలను కొత్త ‘పాలస్తీనా దేశం’గాను ఏర్పాటుచేసింది. అందువల్ల ఇజ్రాయిల్ సహజంగానే ‘యూదు జాతీయుల రాజ్యాంగ వ్యవస్థ’- నేషన్ స్టేట్ ఆఫ్ జ్యూయిష్ పీపుల్-! ఈ వాస్తవాన్ని ఇజ్రాయిల్ పార్లమెంటు గురువారం ధ్రువపరచింది, ‘జాతీయ రాజ్యాంగ వ్యవస్థ’ చట్టాన్ని ఆమోదించింది.
ఒక ‘జాతి’గా యూదులకు వేల సంవత్సరాల చరిత్ర ఉంది, కానీ దాదాపు రెండువేల ఏళ్లపాటు వారికి ‘రాజ్యం’ లేదు, భౌగోళిక ప్రదేశం లేదు, రాజ్యాంగ వ్యవస్థ లేదు, సార్వభౌమ అధికారంకల ప్రభుత్వం లేదు. 1948లో ఐక్యరాజ్యసమితి తీర్మానం ద్వారా ఈ నాలుగు ‘స్వరూపాలు’ కూడాయి. ఇవి సమకూడడానికి పూర్వం, ఇవి సమకూడిన తరువాత కూడ ‘యూదులు’ ఒక ‘జాతి’గానే ఉన్నారు! జాతీయ జీవన ప్రస్థానం ‘రాజ్యం’ పరిధితోను, ప్రభుత్వంతోను, ప్రదేశంతోను సంబంధం లేకుండా కొనసాగుతుందన్న సనాతన- శాశ్వత- ఎటర్నల్- వాస్తవానికి యూదుల చరిత్ర ఒక ప్రధానమైన ప్రమాణం. రాజ్యాంగ వ్యవస్థ ఏర్పడినప్పుడు మాత్రమే ఒక జాతి ‘జాతి’గా రూపొందుతుందన్న ఐరోపా వారి భ్రాంతి ఈ వాస్తవానికి విరుద్ధం! అందువల్ల ‘దేశం’ లేనప్పుడు ‘జాతి’గా మనగలిగిన యూదులు- జ్యూస్- హీబ్రూస్- దేశం ఏర్పడిన తరువాత కూడ ‘జాతి’గా కొనసాగడంలో ఆశ్చర్యం లేదు. అనౌచిత్యం లేదు. దీన్ని గురువారం ఇజ్రాయిల్ పార్లమెంటు ధ్రువపరచింది… అంతే!!
గురువారంనాటి ధ్రువీకరణవల్ల ఇజ్రాయిల్‌లో నివసిస్తున్న అరబ్బీ ముస్లింలకు అన్యాయం జరిగిపోతుందన్న అరబ్ దేశాల ప్రభుత్వాల ‘భయం’ అర్థంలేనిది. ఇజ్రాయిల్‌కు ఇరుగుపొరుగున ఉన్న అరబ్ దేశాలన్నింటిలోను ఇస్లాం మత రాజ్యాంగ వ్యవస్థ ఏర్పడి ఉంది. ఈ అరబ్ దేశాలలో ఇస్లాం మతస్థులు దాదాపు తొంబయి తొమ్మిది శాతానికి పైగా ఉన్నారు. ఈ దేశాలలో యూదులు లేరు. ఇస్లాం ఏకైక అధికార మతంగా ఏర్పడి ఉన్న అరబ్ దేశాలలో ఇస్లాం మతేతరులకు అస్తిత్వం లేదు, పరిగణన లేదు, రాజ్యాంగపరమైన అధికారాలు లేవు. హక్కులులేవు. ఇస్లామేతరులు తమ మత సంప్రదాయాలను బహిరంగంగా పాటించడానికి, మతపరమైన సభలు సమావేశాలు ఉత్సవాలు జరుపుకునే స్థితి అరబ్ దేశాలలో లేదు. విదేశాలనుండి వెళ్లి అరబ్ దేశాలలో ఉపాధి పొంది జీవిస్తున్న ఇస్లామేతర మతస్థులు సైతం ఇస్లాం పద్ధతులను- ఇష్టంలేక పోయినప్పటికీ- పాటించవలసిన దుస్థితి ఈ అరబ్బీ దేశాలలో నెలకొని ఉంది. అందువల్ల తమ దేశాలలో ‘సర్వమత సమభావ వ్యవస్థ’- సెక్యులర్ స్టేట్-ను ఏర్పాటుచేయని అరబ్ దేశాల ప్రభుత్వాలకు ‘ఇజ్రాయిల్’లో అల్పసంఖ్యాకులైన ఇస్లాం మతస్థుల హక్కులకు భంగం వాటిల్లుతుందని ఆర్భాటించే నైతికమైన హక్కులేదు.
ఇజ్రాయిల్ 1948నుంచి కూడ సర్వమత సమభావ రాజ్యాంగ వ్యవస్థ అమలులో ఉంది. అందువల్ల పాలస్తీనా విభజన సమయంలో ఇజ్రాయిల్‌లో అల్పసంఖ్యాకులుగా మిగిలిన ఆరబ్- పాలస్తీనా- ముస్లింలు డెబ్బయి ఏళ్లుగా హాయిగా జీవిస్తున్నారు, యూదులతో సమానంగా సకల విధ రాజ్యాంగ అధికారాలను అనుభవిస్తున్నారు, ఉద్యోగాలను ఉపాధిని పొందారు, ఎన్నికలలో వోట్లువేస్తున్నారు, పోటీ చేస్తున్నారు. ప్రస్తుతం ఇజ్రాయిల్ జనాభాలో యూదుల సంఖ్య దాదాపు ఎనభై ఒక్క శాతం, దాదాపు పద్దెనిమిది శాతం ఇస్లాం మతస్థులు. ఎనభై లక్షల జనాభాకు ఇజ్రాయిల్‌లో ఇలా దాదాపు పదునాలుగున్నర లక్షల మంది అల్పసంఖ్యాక అరబ్ ముస్లింలు! అరబ్ దేశాలలో- ఇస్లాం ప్రజలు దాదాపు వంద శాతం ఉన్న దేశాలలో- యూదులు మచ్చుకైనా కనపడరు. కానీ యూదుల జనబాహుళ్యం కల ఇజ్రాయిల్‌లో ఇస్లాం మతస్థులు ఇంత పెద్దసంఖ్యలో జీవిస్తున్నారు. ఇదీ స్పష్టంగా కనిపిస్తున్న అంతరం. తమ దేశంలో సర్వమత సమభావ వ్యవస్థ ఉండడంవల్ల హాయిగా జీవించగలుగుతున్న ‘ఇజ్రాయిలీ’ ముస్లింలు, పొరుగున ఉన్న అరబ్ దేశాలలో సైతం ‘సర్వమత సమభావ వ్యవస్థ’ ఉండాలని కోరడం న్యాయం. కానీ ‘ఇజ్రాయిలీ’ ముస్లింలు పొరుగు దేశాలలోని ‘ఏకమత రాజ్యాంగ వ్యవస్థ’లను నిరసిస్తున్న దాఖలా లేదు! తమ దేశాలలో ఇతర మతస్థుల ఉనికి సైతం అరబ్ దేశాలలోని ‘జిహాదీ’లు సహించడం లేదు. అంతేకాదు 1948 నుంచి కూడా ఇజ్రాయిల్ ఉనికిని సైతం ఈ అరబ్ దేశాలవారు సహించడం లేదు- 1948లో పాలస్తీనా విభజన తరువాత ఏర్పడిన ఇజ్రాయిల్ అవశేష పాలస్తీనాను స్వంత దేశంగా గుర్తించింది. కానీ అవశేష పాలస్తీనా కాని, అరబ్ దేశాలు కాని ‘ఇజ్రాయిల్’ను స్వతంత్ర దేశంగా గుర్తించలేదు. ఇజ్రాయిల్ స్వతంత్ర దేశంగా ఏర్పడిన రోజునే, ఈ అరబ్ దేశాలు కలసికట్టుగా ఇజ్రాయిల్‌పై దాడి చేశాయి! ఇజ్రాయిల్‌ను ధ్వంసం చేయడం ఈ దేశాల లక్ష్యం! కానీ అతి చిన్న దేశమైన ఇజ్రాయిల్ ఈ దురాక్రమణను తిప్పికొట్టింది. దాడి చేసిన సిరియా, ఈజిప్ట్, జోర్డాన్, లెబనాన్, ఇరాక్ వంటి అరబ్ దేశాలను ఇజ్రాయిల్ ఓడించగలగడం ఒక చారిత్రక అద్భుతం, మతోన్మాద అన్యమత విధ్వంసక జిహాదీ తత్వంపై సర్వమత సమభావం సాధించిన విజయం.
ఆ తరువాత మరో మూడుసార్లు ఈ అరబ్ దేశాలు ఇజ్రాయిల్‌ను ధ్వంసం చేయడానికి యత్నించి విఫలం కావడం ‘‘అసమర్థ దుర్జన’’ ప్రవృత్తికి నిదర్శనం. ఈ యుద్ధాలన్నింటిలోను గెలిచిన ఇజ్రాయిల్ పాలస్తీనాను కూడ ఆక్రమించుకోవడం ఇస్లాం మతోన్మాద దేశాల ప్రభుత్వాలకు గుణపాఠం! 1978లో ఈజిప్ట్ ‘‘ఇజ్రాయిల్‌కు ఒక స్వతంత్ర దేశంగా మనుగడ సాగించే అధికారం ఉందని’’ ప్రకటించడం ‘సర్వమత సమభావ ప్రజాస్వామ్య వ్యవస్థ’కు లభించిన మరో నైతిక విజయం. ఇజ్రాయిల్‌ను ధ్వంసం చేయడం లక్ష్యంగా ఏర్పడిన ‘పాలస్తీనా విమోచన సంస్థ- పిఎల్‌ఓ- సైతం 1993లో ఇజ్రాయిల్‌ను స్వతంత్ర దేశంగా గుర్తించింది. వెంటనే ఇజ్రాయిల్ ప్రభుత్వం అవశేష పాలస్తీనా నుంచి వైదొలగింది. జోర్డాన్ నది పశ్చిమప్రాంతానికి, ‘గాజా’ ప్రాంతానికి స్వయంపాలిత ప్రతిపత్తిని కల్పించింది. అయితే స్వతంత్ర పాలస్తీనా దేశం ఏర్పడక పోవడానికి కారణం పాలస్తీనాలోని కొన్ని బీభత్స ముఠాలు…! ఈ ముఠాలు ఇజ్రాయిల్‌ను విధ్వంసం చేయాలన్న లక్ష్యాన్ని విడనాడినప్పుడు మాత్రమే ‘స్వతంత్ర పాలస్తీనా’ సాధ్యం అవుతుంది!
(ఆంధ్రభూమి సౌజన్యం తో)