Home News జ‌మ్మూ కాశ్మీర్ లోని అన్ని ప్ర‌భుత్వ కార్య‌ల‌యాల‌పై ఎగ‌ర‌నున్నతివ‌ర్ణ ప‌తాకం

జ‌మ్మూ కాశ్మీర్ లోని అన్ని ప్ర‌భుత్వ కార్య‌ల‌యాల‌పై ఎగ‌ర‌నున్నతివ‌ర్ణ ప‌తాకం

0
SHARE

జ‌మ్మూ కాశ్మీర్ లోని అన్ని ప్రభుత్య కార్య‌లయాల‌పై జాతీయ జెండాను ఎగురవేయాల‌ని నిర్ణ‌యం తీసుకుంటూ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా నేతృత్వంలోని జ‌మ్మూ కాశ్మీర్ ప్ర‌భుత్వం ఉత్త‌ర్వులు జారీ చేసింది. ఈ మేర‌కు స‌మాచార పౌర సంబంధాల శాఖ‌ సోమ‌వారం ఒక ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది. జమ్మూ కాశ్మీర్‌లోని అన్ని ప్రభుత్వ కార్య‌ల‌యాల‌పై జాతీయ జెండాను ఎగురవేయడానికి నిర్ణయం తీసుకున్న‌ట్టు పేర్కొంది.

గ‌త గురువారం డివిజనల్ కమిషనర్లు, డిప్యూటీ కమిషనర్లు, పోలీసు సూపరింటెండెంట్ ల‌తో నిర్వ‌హించిన వీడియో కాన్ఫ‌రెన్స్‌లో లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా జ‌మ్మూ కాశ్మీర్‌లోని అన్ని ప్ర‌భుత్వ కార్య‌ల‌యాల్లో జాతీయ జెండాను ఎగుర‌వేయాల‌ని ఆదేశాలు జారీ చేశారు.

లెఫ్టినెంట్ గ‌వ‌ర్న‌ల్ ఆదేశాల మేర‌కు అన్ని జిల్లాల ఉన్న‌తాధికారులు సంబంధింత జిల్లాల  కార్యాల‌యాల‌కు ఉత్త‌ర్వులు జారీ చేస్తున్నారు. కాశ్మీర్ లోయలో డిప్యూటీ కమిషనర్ అనంతనాగ్ డాక్టర్ పియూష్ సింగ్లా కూడా జిల్లాలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలపై జాతీయ జెండాను ఎగురవేయడానికి ఒక ఉత్త‌ర్వులు జారీ చేశారు.

15 రోజుల వ్యవధిలో అన్ని ప్రభుత్వ భవనాలపై జాతీయ జెండా ఎగిరేలా చూడాల‌ని, ఈ విషయంలో ప్రతిరోజూ పురోగతి నివేదికను సమర్పించాలని జిల్లా అధిపతులకు ఆదేశాలు ఇవ్వబడ్డాయి.

స్వాతంత్ర్యం వ‌చ్చి 75 సంవ‌త్స‌రాలు గ‌డుస్తున్న నేప‌థ్యంలో నిర్వ‌హిస్తున్న‌ “ఆజాది కా అమృత్ మహోత్సవ్”  కార్య‌క్ర‌మంలో భాగంగా స్వాతంత్య్ర సంగ్రామంలో ముఖ్య భూమిక పోషించి, త‌మ ప్రాంత ప్ర‌జ‌ల కోసం కృషి చేసిన వారిని గుర్తించి ఈ వేడుక‌ల సంద‌ర్భంగా వారిని సత్కరించాలని లెఫ్టినెంట్ గ‌వ‌ర్న‌ర్ జిల్లా అధికారులకు సూచించారు.

Source : VSK BHARATH