Home Hyderabad Mukti Sangram జాతీయ శక్తి బలపడకుండా ఉండాలని.. (హైదరాబాద్ అజ్ఞాత చరిత్ర-34)

జాతీయ శక్తి బలపడకుండా ఉండాలని.. (హైదరాబాద్ అజ్ఞాత చరిత్ర-34)

0
SHARE

పి.పి.సి ఏర్పాటు సర్దార్ వల్లభభాయిపటేల్ భారత ప్రభుత్వపు ఏజెంట్ జనరల్ కె.యం. మున్షీతో మాట్లాడుతూ ఉత్సాహంగా “చాలా మంచి పని జరిగింది, చాలా మంచి పని జరిగింది” అని సంతోషాన్ని వ్యక్తం చేశారు. సాధారణంగా గంభీరంగా ఉండే వ్యక్తి పటేల్. అతని మానసిక స్థితిని అంచనా వేయటం కష్టం. నిర్వికారంగా ఉండే వ్యక్తి ప్రత్యేకించి ఏదో అసాధరణమైన సంఘటన జరిగి ఉంటేనే అలా తన మనోభావాలను వ్యక్తం చేయగలదు. నిజాం సంస్థానం గురించి మున్షీగారి నుంచి ఏదో ఒక విషయం విన్న తర్వాత ఆ ఉక్కుమనిషి రెండుసార్లు అలా అనటం విశేషం. బహుశా సంస్థానానికి సంబంధించిన ఏదో జటిల సమస్యకు పరిష్కారం కనబడిందేమో!

కుటిల రాజకీయాలలో నిష్ణాతులైన ఆంగ్లేయ సామ్రాజ్యవాదులు గత్యంతరం లేక భారతదేశం నుంచి వెళ్ళిపోయే ముందు, జాతీయ ప్రభుత్వానికి కఠిన సమస్యను సృష్టించిపోయారు. తమ సామ్రాజ్యవాదానికి అనుగుణంగానే దేశాన్ని రెండు ముక్కలు చేసి భారత  పాకిస్తాన్‌లని విభజించిపోయారు. అంతర్గతంగా అనేక రాజకీయ కల్లోలాలను సృష్టించి, నూతన జాతీయ శక్తి బలపడకుండా ఉండాలని ఆ సామ్రాజ్యవాదుల దురాశ. కొరియా, వియత్నాం, లావోస్, జర్మనీ, భారత్ తదితర దేశాల్లో ఇలాంటి విషబీజాలను వాళ్ళు నాటిపోయారు. దేశాలను విభజించటమే కాదు, గృహకల్లోలాలను రేపి అంతర్యుద్ధ పరిస్థితిని కల్పించాలని ఆంగ్లేయుల కుటిలయత్నం.

దానికి అనుగుణంగానే 1947 మార్చి 3వ తేదీనాడు ఒక ప్రకటన చేశారు. భారతదేశంలో సంస్థానాధీశులు తమ సంస్థానాలను ఇష్టానుసారంగా పాకిస్తాన్‌లో లేదా భారత్‌లో విలీనం చేసుకోవచ్చు లేదా స్వతంత్రాన్ని ప్రకటించుకోవచ్చునని ఆ ప్రకటన సారాంశం. అయితే సర్దార్ సాహసంతో రాజకీయ విజ్ఞతతో రక్తపాతం లేకుండా దాదాపు సంస్థానాలన్నింటిని భారత్‌లో విలీనం చేయగలిగాడు. అంతర్యుద్ధం అనే ప్రమాదాన్ని నివారించి స్వతంత్ర భారత చరిత్రలో ఒక శాశ్వతమైన, సంస్మరణీయమైన పుటను జోడించిపోయారు.

హైద్రాబాద్ సంస్థానం విలీనం కాకుండా ఉండాలని నిజాం, ముస్లిం మజ్లిస్, నియంత ఖాసిం రజ్వీ ఇక్కడ ప్రజలను మభ్యపెడుతూ నాటకం ఆడారు. హిందువులు, ముస్లింలు తనకు రెండు కళ్ళులాంటి వారని వాళ్ళిద్దరూ తన కళ్ళులాగానే ప్రీతిపాత్రులని హైద్రాబాద్ సంస్థానాన్ని పాకిస్తాన్‌లో విలీనం చేసే పక్షంలో హిందువులు బాధపడతారు.  భారత్‌లో విలీనం చేయటం ముస్లింలకు ఇష్టం లేదు కాబట్టి ఆ పరిస్థితుల్లో తన రాజ్యం స్వతంత్రంగా ఉండటమే మంచిదని నిజాం తెలివిగా ప్రకటించారు. తన రాజ్యకాంక్షను, మత దురహంకారాన్ని కప్పి పుచ్చి ఒక ప్రత్యేక ఫర్మానా ద్వారా స్వతంత్రాన్ని చాటుకున్నాడు.

అయితే వాస్తవం మరోవిధంగా ఉంది. ఈ సంస్థానంలోని అత్యధిక సంఖ్యాకులైన హిందువులు తమ ప్రాంతాన్ని మత ప్రమేయంలేని స్వతంత్ర భారత్‌లో విలీనం చేసి బాధ్యతాయుతమైన ప్రభుత్వాన్ని నెలకొల్పాలని ప్రగాఢంగా కోరుతున్నారు. హైద్రాబాద్ స్టేట్ కాంగ్రెస్ ఈ ఆశయ సాధనకోసం సంఘర్షణ జరుపుతూ ఉంది. ఈ ప్రజావాంఛను, వాస్తవాన్ని అణచిపెట్టాలని నిజాం శాయశక్తులా ప్రయత్నం చేస్తున్నాడు. తనకు అన్ని విధాలా సహాయంగా ఉండాలని ఇత్తేహాదుల్ ముసల్‌మీన్ అనే మత సంస్థను పోషించాడు. ఖాసిం రజ్వీ దాని నాయకుడుగా అండగా ఉన్నాడు. నిజాం తన సైన్యాన్ని మరింత సాయుధం చేసి ప్రజా ఆందోళనలను నిరంకుశంగా అణచి వేయాలని సిద్ధంగా ఉన్నాడు.

1947 ఆగస్టు 15 నాటి నుండి హైద్రాబాద్ స్టేట్ కాంగ్రెస్ తన ఆందోళనను తీవ్రతరం చేసింది. సత్యాగ్రహంలో పాల్గొన్న దళాలను నిజాం అరెస్టు చేయించాడు. తీవ్రమైన దమనకాండను జరిపించాడు. నిజాం పోలీసులు, రజాకార్ల దళాలు ఇష్టానుసారంగా అత్యాచారాలు జరుపుతున్నారు. కాంగ్రెస్ జరుపుతున్న ఆందోళనను అమానుషంగా అణచివేయాలని అన్నిరకాల బల ప్రయోగాలు చేస్తున్నారు. జైళ్ళలో సత్యాగ్రహులపై లాఠీచార్జీ జరిపి అనేకమందిని గాయపరిచారు. 1948 జనవరి 11న నిజామాబాద్ జైలుకు బయటనుంచి గూండాలను తీసుకెళ్ళి రాజకీయ ఖైదీలను విపరీతంగా కొట్టించాడు.

అప్పుడు లాయక్ ఆలీ మంత్రిమండలి నుండి శ్రీ రామాచార్య రాజీనామా చేశాడు. వేలాదిమంది రాజకీయ ఖైదీలు జైలు కటకటాల వెనుక క్రూర హింసలకు గురౌతున్నారు. స్వతంత్ర పోరాటంలో పాల్గొనాలని విద్యార్థులు విద్యాలయాలను బహిష్కరిస్తున్నారు. రజాకార్లు విచ్చలవిడిగా అభ్యుదయకాముకులైన ప్రజలపై, నాయకులపై అత్యాచారాలు జరుపుతున్నారు. ప్రాణ, మాన, ఆస్తి రక్షణ లేకపోవడం మూలాన ప్రజలు లక్షల సంఖ్యలో సంస్థానాన్ని వదిలి ఇతర ప్రాంతాలకు వలస వెళ్ళిపోతున్నారు. వందలాది మంది తుపాకీ గుండ్లపాలై ప్రాణాలు వదిలారు. సజీవ దహనాలు, ఆడవాళ్ళ మానభంగాలతో సంస్థానం అల్లకల్లోలంగా ఉంది. ఈ అన్యాయాల్ని బయటపెట్టిన పత్రికల నోరు మూయించారు. ఈ దారుణ పరిస్థితుల్లో స్టేట్ కాంగ్రెస్ వెలుపలి నుంచి తన కార్యకలపాలను నిర్వహించటం ప్రారంభించింది.

తన స్వయం ప్రతిపత్తిని భారత ప్రభుత్వం అంగీకరించదని తెలుసుకొని నిజాం తెలివిగా వ్యవహరించటం మొదలుపెట్టాడు. భారత ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతున్నానని చెప్తూనే మరోప్రక్క యుద్ధ సన్నాహాలు ఆరంభించాడు. ఐక్యరాజ్య సమితికి ప్రతినిధివర్గాన్ని పంపించాలనే ప్రయత్నం చేశాడు. మరోప్రక్క తన రాజ్యానికి ప్రాతినిధ్యం వహిస్తున్నదంటూ ఒక డమ్మీ మంత్రివర్గాన్ని ఏర్పాటు చేశాడు. మజ్లిస్ తరపున వచ్చిన లాయక్ ఆలీ ప్రధానమంత్రిగా ప్రజల్లో ఏ మాత్రం పలుకుబడి లేని కొందరు హిందువులను సభ్యులుగా నియమించటం జరిగింది.

ఆ తర్వాత భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా విస్త్రృతమైన దుష్ప్రచారాన్ని కొనసాగించాడు నిజాం. తన సంస్థానంలో జరిగే అత్యాచారాలకు భారత ప్రభుత్వపు ఏజెంట్లు కారణమని బుకాయించాడు. బయట నుంచి తనకు అనుకూలంగా ఉండే పత్రికా విలేకరులను రప్పించి తనకు నచ్చిన విధంగా రిపోర్టులు రాయించుకున్నాడు. తన రాజ్యంలో తాను అమలు జరుపుతున్న ప్రజా సంస్కరణలను చూసి సహించక భారత ప్రభుత్వం రాజ్య విస్తరణ కాంక్షతో తనపై దురాక్రమణ తలపెట్టిందని తన స్వతంత్ర ప్రతిపత్తిని కూలదోయాలనే కుట్ర జరుపుతూందని పెద్ద ఎత్తున నిజాం ప్రచారం చేస్తున్నాడు. ఈ పరిస్థితుల్లో భారత ప్రభుత్వానికి ఏమిచేయాలో తోచని దశ ఏర్పడింది.