శబరిమలలోని అయ్యప్ప భక్తులపై కేరళ కమ్యూనిస్ట్ ప్రభుత్వం సాగిస్తున్న అరాచకాలపై మంగళవారం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు జరిగాయి. జిల్లా కేంద్రాలలో అయ్యప్ప భక్తులు శాంతియుత నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. హైదరాబాదులోని ఇందిరాపార్కు సమీపంలోని ధర్నా చౌక్ వద్ద వందలాది మంది అయ్యప్ప మాలధారణలో ఉన్న దీక్షాపరులు ధర్నా నిర్వహించారు. ధర్నా చౌక్ ప్రాంతం మొత్తం అయ్యప్ప భజనలతో మార్మోగిపోయింది. కేరళ దుష్ట ప్రభుత్వానికి గుణపాఠం నేర్పి, ముఖ్యమంత్రి పినరాయి విజయన్ కి సద్భుద్ది ప్రసాదించమంటూ భజనల ద్వారా అయ్యప్పను ప్రార్ధించారు.
శబరిమల సంరక్షణ సమితి ఆధ్వర్యంలో జరిగిన ఈ నిరసన కార్యక్రమంలో గురుస్వామి రమణ మాట్లాడుతూ.. కేరళ ప్రభుత్వం అయ్యప్ప భక్తులపై అత్యంత నిరంకుశ వైఖరితో వ్యవహరిస్తోందని అన్నారు. బీజేపీ తప్ప ఏ ఇతర పార్టీలు కూడా భక్తులకు మద్దతు ప్రకటించకపోవడానికి కారణం ఏమిటి అని ప్రశ్నించారు. అయ్యప్ప భక్తులకు, హిందువులకు మద్దతు ప్రకటించే పార్టీలకు మాత్రమే మేము ఓటు వేస్తామని ప్రతి హిందువు బహిరంగంగా ప్రకటించాలని, ప్రతి దేవాలయం వద్ద, ప్రతి చౌరాస్తాలో ‘సేవ్ శబరిమల’ (శబరిమలను రక్షించండి) అంటూ బ్యానర్లు కట్టి అక్కడ జరిగే దుష్ట చర్యలను బాహ్యప్రపంచానికి వివరించాలని పిలుపునిచ్చారు.
కార్యక్రమంలో కాకినాడ శ్రీపీఠం అధిపతి పరిపూర్ణానంద స్వామి మాట్లాడుతూ.. కేరళ పోలీసుల తీరును ఖండించారు. పోలీసులు పాదరక్షలతో పవిత్ర స్థలంలో ప్రవేశించి, అమానుషంగా అయ్యప్ప భక్తుల ఉరుముళ్ళని తొలగించి, వాటిలో రాళ్లు, బాంబులు ఉంటాయేమో అని అనుమానాలు వ్యక్తం చేసి అవమానిస్తున్నారని అన్నారు. ఇరుముళ్లను అలా కిందకి దించకూడదు అని చెప్పిన భక్తులపై పోలీసులు లాఠీ ఛార్జి చేసినంత పనిచేసి దాడి చేశారని వివరించారు. ఇతర మతస్థుల ప్రార్ధనా మందిరాల వద్దకు పాదరక్షలతో వెళ్లే దమ్ము పోలీసులకు ఉందా అని పరిపూర్ణానంద అని అడిగారు. ఈ సందర్భంగా సుప్రీం కోర్టు వ్యవహారశైలిని కూడా స్వామి ప్రశ్నించారు. ఒకవైపు రివ్యూ పిటిషన్ స్వీకరించలేం అని చెప్తున్న సుప్రీం కోర్టు మరోవైపు 22వ తేదీన ఓపెన్ కోర్టులో విచారణ జరుపుతామని అనడం ఏమిటని అన్నారు.
అయ్యప్ప భక్తుల ముందు రెండే మార్గాలు ఉన్నాయని, అవి ఆ స్వామి శరణం, రెండు ఆయన కోసం మరణమని ఆయన అన్నారు. భక్తులు ఆయనను శరణు పొందితే వారి కోసం అవసరమైతే తాను మరణాన్ని ఎంచుకుంటానని స్వామిజీ ఉద్వేగపూరితంగా అన్నారు.