Home News మాతృభూమికి సేవ చెయ్యాలని..ఆర్మీలో చేరిన యువకుడు

మాతృభూమికి సేవ చెయ్యాలని..ఆర్మీలో చేరిన యువకుడు

0
SHARE
  • అమెరికా ఉద్యోగం, ఐఐఎం సీటు వదులుకున్నాడు

ఓ యువకుడికి మంచి జీతంతో అమెరికాలో ఉద్యోగం ఆఫర్‌.. మరోవైపు ఐఐఎం నుంచి పిలుపు. కానీ ఆ యువకుడు మాత్రం వాటిల్లో దేన్నీ ఎంచుకోలేదు. తన మాతృభూమి కోసం పనిచేయాలని అనుకున్నాడు. అందుకోసం ఆర్మీలో చేరాడు. కొన్ని నెలల పాటు కఠినమైన శిక్షణ పూర్తి చేసుకొని.. ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచాడు. అతడే బర్నాన యాదగిరి.

బర్నాన తండ్రి గున్నయ్య హైదరాబాద్‌లోని ఓ సిమెంట్‌ ఫ్యాక్టరీలో దినసరి కూలీగా పనిచేస్తున్నాడు. పనికి వెళ్తే కానీ రోజు గడవని పరిస్థితి. కానీ కొడుకును చక్కగా చదివించాడు. ఆర్థిక పరిస్థితులను అధిగమించి బర్నాన హైదరాబాద్‌లోని ఐఐఐటీలో విద్యనభ్యసించాడు. అతడికి యూఎస్‌కి చెందిన ఓ పెద్ద కంపెనీ నుంచి భారీ ఆఫర్‌ వచ్చింది. అంతేకాదు.. క్యాట్‌ ఎగ్జామ్‌లో 93.4శాతం మార్కులు సాధించడంతో ఇండోర్‌లోని ఐఐఎంలో సీటు సాధించగలిగాడు. కానీ ఈ రెండు ఆఫర్లను బర్నాన పక్కన పెట్టాడు. తన దేశానికి సేవ చేయాలని నిర్ణయించుకున్నాడు. ఆర్మీలో చేరి శిక్షణ తీసుకున్నాడు. శనివారం డెహ్రడూన్‌లోని ఇండియన్‌ మిలటరీ అకాడమీలో శిక్షణ పూర్తి చేసుకున్నాడు. టెక్నికల్‌ గ్రాడ్యుయేట్‌ కోర్సులో అత్యున్నత ప్రతిభ కనబరిచి రజత పతకాన్ని సొంతం చేసుకున్నాడు.

శిక్షణ పూర్తి చేసుకున్న అతడిని చూసి తల్లిదండ్రులు ఎంతగానో గర్విస్తున్నారు. ‘మా నాన్న రోజువారీ సంపాదన రూ.60. అమ్మ పోలియోతో బాధపడుతుంది. ఎన్నో ఆర్థిక ఇబ్బందులను అధిగమించి ఈ స్థాయికి చేరాను. మాతృదేశానికి సేవ చేయడం ద్వారా పొందే మానసిక సంతృప్తిని ఏ డబ్బుతో భర్తీ చేయలేము’ అని బర్నాన గర్వంగా చెప్పుకొచ్చాడు.

(ఈనాడు సౌజన్యం తో)