Home News బెంగళూరు నగరంలోని సరస్సులకు ఊపిరిపోస్తున్న ఓ స్వచ్ఛందసంస్థ

బెంగళూరు నగరంలోని సరస్సులకు ఊపిరిపోస్తున్న ఓ స్వచ్ఛందసంస్థ

0
SHARE

పచ్చని చెట్లకు పుట్టినిల్లుగా పేరుపొందిన బెంగళూరులోనూ సరస్సుల పరిస్థితి మిగతా ఊళ్లకు భిన్నంగా ఏం లేదు. మనుషులు చేస్తున్న ఎన్నో పనుల వల్ల అడుగంటిపోతున్న వీటికి, పునరుజ్జీవాన్ని ప్రసాదించేందుకు ఓ స్వచ్ఛందసంస్థ బెంగళూరు మహానగరపాలిక తోడుగా ప్రయత్నిస్తోంది. ఆ సంస్థ నిర్వహిస్తోన్న ‘వేక్‌ ద లేక్‌’ కార్యక్రమం ఇప్పటికి 16 సరస్సులకు తిరిగి ప్రాణం పోసింది.

నగరీకరణ, అక్రమ కట్టడాల వల్ల ఎక్కువగా నష్టపోయినవాటి జాబితాలో చెట్ల తర్వాత చెరువులూ, సరస్సులే ఉంటాయి. వాటిలో మట్టిని నింపేసి, విషవ్యర్థాలను పారించి చివరకు ఎండిపోయేలా చేసి, ఆ ప్రాంతమంతా అపార్టుమెంట్లు కట్టడం చాన్నాళ్లుగా వస్తున్న నగర సంస్కృతి. నీటివనరులు ఎండిపోతే లేదా విషపూరితమైతే ఆ ప్రాంతంలోని భూగర్భజలాల మీద ఆ ప్రభావం ఉంటుంది. చెరువుల చుట్టూ పచ్చదనం పోవడం వల్ల లోపల ఉండే జీవరాశికి మనుగడ కష్టమవుతుంది. ఇవన్నీ వాతావరణంలో మార్పును తీసుకువస్తాయి. బెంగళూరులోని చాలా చెరువులు కూడా నగరీకరణలో భాగంగా మూలనపడ్డాయి. వాటి చుట్టుపక్కలా నీటి సమస్య తలెత్తింది. అందుకే, తమ పనుల్లో ప్రజల్నీ, ప్రభుత్వాన్నీ, కార్పొరేట్‌ సంస్థల్నీ భాగస్వామ్యం చేయడం ద్వారా అడుగంటిపోతున్న సరస్సులకు తిరిగి జలకళను తీసుకువచ్చేలా తొమ్మిదేళ్ల క్రితం ‘వేక్‌ ద లేక్‌’ కార్యక్రమాన్ని ప్రారంభించింది బెంగళూరులోని యునైటెడ్‌ వే బెంగళూరు సంస్థ. ఆ కృషి ఫలితంగా ఇప్పుడు చాలా సరస్సులు నీటితో కళకళలాడుతున్నాయి.

సరస్సులే లక్ష్యంగా…

సరస్సుల్ని బాగుచేయడమంటే, వాటిలో నిండుకున్న చెత్తా చెదారాన్ని తీసేయడం, పిచ్చి మొక్కల్ని తొలగించడం, నీళ్లను లోపలికి ఇంకనీకుండా చేసేలా మేటవేసిన మట్టినితొలగించడంలాంటి పనులెన్నో చేయాలి. అంతేకాదు చాలా చోట్ల మురుగు నీటిని పైపులైన్ల ద్వారా సరస్సుల్లోకి మళ్లించడం గమనించారు ఈ సంస్థ సభ్యులు. వానపడ్డప్పుడు చుట్టుపక్కల నీరంతా సరస్సుల్లోకి చేరే ఏర్పాటూ లేదు. ఇక సరస్సు ప్రాంతంలోకి చొచ్చుకొచ్చిన అక్రమ కట్టడాలు మరోపక్క. ఈ సమస్యలన్నీ తీర్చి సరస్సుల్ని బాగుచేయాలంటే బోలెడు డబ్బు కావాలి. ప్రభుత్వ సహాయమూ అవసరం. తలా ఒక చేయీ వేసేందుకు స్వచ్ఛంద సేవకులూ ముఖ్యమే. సామాజిక మాధ్యమాల ద్వారా, ఎంచుకున్న ప్రాంతాల్లో అవగాహనా కార్యక్రమాల్ని నిర్వహించీ ఆయా సరస్సుల చుట్టుపక్కల నివసించేవాళ్లనీ, అక్కడ పనిచేస్తున్న కాలనీ అభివృద్ధి మండళ్లనీ చైతన్యపరచింది యునైటెడ్‌వే.

జనరల్‌ ఎలక్ట్రానిక్స్‌, డెల్‌, జెన్‌పాక్ట్‌, క్వాల్‌కామ్‌, ప్రెస్టీజ్‌ తదితర కార్పొరేట్‌ సంస్థల్ని కలిసింది. తమ ప్రయత్నానికి ఆర్థిక సాయం చేయమని అడిగింది. అలాగే బృహత్‌ బెంగళూరు మహా నగరపాలికతోనూ 2012లో ఒక ఒప్పందాన్ని చేసుకుంది. అందులో భాగంగా సరస్సుల దగ్గరి అక్రమ కట్టడాలను నగరపాలిక తొలగించాలి. అలాగే డ్రైనేజీ పైపు లైన్లను వాటి వైపు నుంచి మళ్లించాలి. సరస్సులకు వెళ్లే నడక దారిని పునరుద్ధరించాలి. కొలనుల చుట్టూ పెరిగే తోటలకు నీరూ, కరెంటూ సరఫరా చేయాలి. మేట వేసిన మట్టిని తొలగించాలి. యునైటెడ్‌ వే కూడా కొన్ని బాధ్యతల్ని పంచుకుంది. అక్కడి దారులూ, మొక్కలూ, తోటల నిర్వహణ, చుట్టూ ఉండే ప్రాంతాన్ని శుభ్రం చేయడం, చెరువులో ఏమైనా వ్యర్థాలు పోగైతే వాటిని తొలగించడం, వ్యర్థాలను అక్కడ పారబోయకుండా చూసుకోవడం, నిమజ్జనాల సమయంలో ప్రత్యామ్నాయంగా ఏర్పాటు చేస్తున్న కొలనుల్లోనే విగ్రహాలు నిమజ్జనమయ్యేలా జాగ్రత్తలు తీసుకోవడం, సరస్సు ప్రాంతాన్ని ఆహ్లాదంగా ఉంచుతూ రోజులో కొన్ని గంటలు ప్రజలకు అందుబాటులో ఉంచడంలాంటివి ఇందులో ఉన్నాయి. ఈ పనుల కోసం స్థానిక నాయకులూ, కాలనీల వాసులూ, పాఠశాలలూ కళాశాలల పిల్లల సాయాన్ని తీసుకుంటోంది. అంతేకాదు ప్రతి సరస్సుకీ చుట్టూ కంచెను ఏర్పాటు చేయించింది. కార్పొరేట్‌ సంస్థల సాయంతో సరస్సుల వైపు వస్తున్న వ్యర్థాల్ని శుద్ధి చేయించేందుకు అవసరమైన చోట్ల కోట్ల రూపాయల వ్యయంతో మురుగునీటి నిర్వహణ ప్లాంట్లను ఏర్పాటు చేయించింది. ఇలా ఒక్కో సరస్సునీ చక్కగా తీర్చిదిద్దేందుకు ఒక స్కోరింగ్‌ సిస్టమ్‌ను ఏర్పాటు చేసుకుంది. అందులో ఒక సరస్సు బాగుంది అని చెప్పడానికి అందులోని నీటి స్వచ్ఛత, దాని చుట్టూ నడక దారి, కంచె, మురుగునీటి నిర్వహణా ప్లాంటు ఇలా… కొన్ని అంశాల్ని తీసుకుని వాటి ఆధారంగా మార్కులిస్తోంది. సరస్సు చుట్టుపక్కల మట్టి కొట్టుకు పోకుండా ఉండాలన్నా, అక్కడి జీవరాశులు బాగుండాలన్నా చుట్టూ చెట్లుండటం అవసరం. అందుకే సరస్సుల చుట్టూ రకరకాల చెట్లను నాటుతోందీ సంస్థ. ఈ ఏడాది ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా వివిధ రంగాలకు చెందిన వాలంటీర్ల సాయంతో బెంగళూరు మొత్తంలో 10వేల దాకా చెట్లను నాటించింది. వాటి బాగోగులు చూసుకోవాల్సిన బాధ్యతను ఆయా చుట్టుపక్కల ఉన్న విద్యార్థులకు అప్పజెప్పింది.

యునైటెడ్‌ వే శ్రమ ఫలితంగా ఇప్పటికి బెంగళూరులోని హలసూరు, చిన్నప్పనహళ్లి, ఉత్తరహళ్లి, కైకొండ్రహళ్లి, అగర తదితర ప్రాంతాల్లోని 16 సరస్సులు తిరిగి ప్రాణం పోసుకున్నాయి. జనాలు ఆహ్లాదంగా నడిచేందుకు వీలుగా మారడమే కాదు, రకరకాల దేశవిదేశీ పక్షులకూ ఆలవాలంగా మారాయి. ప్రస్తుతం బెంగళూరు చుట్టుపక్కల ప్రాంతాల్లోని మరిన్ని సరస్సుల మీద దృష్టిసారిస్తోంది యునైటెడ్‌ వే. అన్ని ఊళ్లూ ఇలాంటి ముందడుగు వేస్తే సరస్సులన్నీ జనాకర్షక ప్రాంతాలుగా మారిపోతాయి కదూ!

(ఈనాడు సౌజన్యం తో)