జమ్మూ కాశ్మీర్ రాష్ట్రానికి స్వయంప్రతిపత్తి కల్పించే 370వ అధికరణాన్ని రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల మహారాజా హరి సింగ్ కుమారుడు, జమ్మూ-కాశ్మీర్ ఆఖరి యువరాజు కరణ్ సింగ్ స్వాగతించారు. ఈ మేరకు కరణ్ సింగ్ ఒక ప్రకటన విడుదల చేశారు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ సాహసోపేతమైన నిర్ణయంపై జమ్మూ-కాశ్మీర్-లద్దాఖ్ తో పాటు దేశవ్యాప్తంగా అన్ని వర్గాల ప్రజల నుండి విశేషమైన మద్దతు లభిస్తున్నట్టు తెలుస్తోందని అన్నారు.
తాను 1965లో జమ్మూ కాశ్మీర్ రాష్ట్రానికి సదర్-ఇ-రియాసత్‌గా వ్యవహరిస్తున్న సమయంలోనే లద్ధాక్ ప్రాంతాన్ని కేంద్రపాలిత ప్రాంతంగా గుర్తించాలని సూచించినట్టు ఆయన చెప్పారు. ఇక రాజకీయ పార్టీలు జమ్మూ-కాశ్మీర్ ప్రాంత ప్రజల మధ్య సుహృద్భావ వాతావరణం కల్పించే విధంగా చర్చలు జరపాలని కోరారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు, వర్గాల ప్రజల సంక్షేమమే తన లక్ష్యమని తెలిపారు.
ఆర్టికల్ 370 ను రద్దుచేస్తూ మోడీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి మద్దతుగా ముందుకు వచ్చిన ప్రముఖ కాంగ్రెస్ నాయకుల జాబితాలో కరణ్ సింగ్ ఒకరు. ఆర్టికల్ 370 ను రద్దు చేయడాన్ని సమర్థిస్తూ ఇప్పటికే జ్యోతిరాదిత్య సింధియా, దీపిందర్ హుడా, జనార్దన్ ద్వివేదిలు ముందుకొచ్చారు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై కాంగ్రెస్ ప్రదర్శిస్తున్న వైఖరికి నిరసనగా ఇప్పటికే ఆ పార్టీ చీఫ్ విప్ భువనేశ్వర్ కలిత రాజ్యసభకు రాజీనామా చేశారు.
Source: OpIndia