Home News నిజాంను ఎదురించిన గండరగండడు కొమురం భీం

నిజాంను ఎదురించిన గండరగండడు కొమురం భీం

0
SHARE
  • గోండువీరుడి జయంతి నేడు

స్వాతంత్య్ర పోరులో ధృవతారలా మెరిసి బ్రిటిష్‌వారి గుండెల్లో దడపుట్టించిన మన్యంవీరుడు అల్లూరి. సరిగ్గా అలాంటి ధైర్యసాహసాలనే కనబరిచి తన జాతి కోసం జల్(నీరు), జంగిల్(అడవి), జమీన్(భూమి) కావాలంటూ పోరుసల్పి నైజాం నవాబుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించిన గండరగండడు కొమురం భీం! ఆ వీరుడు నైజాం సేనలను ముప్పుతిప్పలు పెట్టి బాబేఝరి కొండల్లో పోరుసల్పి ఆశ్వయుజపౌర్ణమి రోజు అమరుడైనాడు.

ఈ గోండువీరుడు దట్టమైన అడవులతో అలరారే ఆసిఫాబాద్ జిల్లాలోని సుంకెపల్లి అనే మారుమూల గిరిజన గూడెంలో అక్టోబర్ 22, 1901న జన్మించారు. ఇక్కడి గిరిజనం, ఇక్కడి అడవిలోని సెలయేళ్ల వలే కల్మషం లేని మనస్సు గలవారు. అడవిలోని క్రూరమృగాలను సైతం మట్టుపెట్టగల ధీరోధాత్త హృదయం గలవారు. ధర్మం కోసం, తమ జాతి కోసం ప్రాణాలైనా లెక్కచేయని వీరులు ఈ గోండు గిరిజనులు.

ఈ కల్మషరహిత అమాయక మనస్తత్వమే నిజాం నవాబు రక్కసిమూకల చేత నిలువుదోపిడీకి గురైంది. ఈ మూకలు అటవీ అధికారుల ముసుగులో, దళారుల ముసుగులో ఇక్కడి అమాయక గోండు గిరిజనంపై సాగించిన దౌర్జన్యం వర్ణనాతీతం. ఈ దౌర్జన్యాన్ని ఎదిరించే కొమురం భీం తండ్రి కొమురం చిన్ను నైజాం సేనల మారణకాండకు బలైయ్యారు. తన తల్లిని కూడా 15వ ఏట కోల్పోయిన కొమురం భీం అడవుల్లో వ్యవసాయం చేసుకుంటున్న సమయంలో కష్టాలు మొదలైనాయి. ఆ కాలంలో నైజాం ప్రభుత్వంలో భూమి పట్టాలు జారీ చేసేవారిని పట్టేదారు అనే వారు.

ఇలాంటి పట్టేదార్లలో సిద్ధిక్ అనే పట్టేదారుడు భీంసోదరులు వ్యవసాయం చేస్తున్న సంగతి గమనించాడు. వీరు చిన్నపిల్లలే గనుక బెదిరించి ఆ భూమిని, వారు పండిస్తున్న పంటను సొంతం చేసుకోవాలనుకున్నాడు. మిగిలిన అమాయక గిరిజనుల లాగే ఈ సోదరులు కూడా తనకు దాసోహం అవుతారు అనుకున్నాడు. కానీ తాను తలపడుతున్నది కొదమసింహంతో అన్న సంగతి ఆదురాక్రమణదారుడికి తెలియదు. సిద్దిక్ వచ్చి భీం సోదరులను బెదిరించగానే కొమురం భీం తిరగబడి తన చేతిలోని గొడ్డలితో సిద్దిక్‌ను అక్కడికక్కడే నరికి పోగులు చేశాడు.

అందుకే మనం జయజయహే తెలంగాణ గీతంలో కొమురం భీంను గండరగండడిగా కీర్తిస్తున్నాం. తామాడింది ఆటగా, పాడింది పాటగా, ఆక్రమించిందే తమ భూమిగా అమాయక గిరిజనాన్ని బెదిరించి నిలువుదోపిడీ సాగించిన నైజాము సేనలకు గిరిజనం తిరగబడితే ఎలాగుంటుందో అప్పటికి గానీ తెలిసి రాలేదు. వెంటనే నైజాం సైన్యం కొమురం భీంను బంధించడానికి సుంకెపల్లికి వెళ్లింది. దీనిని పసిగట్టిన భీం ఆ సేనను తప్పించుకుని మహారాష్ర్టలోని చాంద (నేటి చంద్రాపూర్), అటు నుండి పూనా వెళ్లి తలదాచుకున్నాడు.

కొమురం భీం పూనాకు చేరుకున్న సమయంలో అక్కడ భారత స్వాతంత్య్ర సమరం మహోజ్వలంగా సాగుతోంది. అది 1935వ సంవత్సరం. ఒకే జాతి పక్షులన్నీ ఒక్కచోట చేరుతాయన్నట్లు పూనాలోని స్వాతంత్య్ర వీరులతో చేయి కలిపాడు కొమురం భీం. ఆ సమరయోధుల సహకారంతో రాయడం, చదవటం నేర్చుకున్నాడు. వారి తోడ్పాటుతో అస్సాంకు వెళ్లి ఆయుధశిక్షణ తీసుకున్నాడు. అక్కడ మొఘలాయి సేనలను ఎదిరించిన లాచిత్‌బర్‌పుఖాన్ సాహసాన్ని తెలుసుకున్నాడు. ఇలా లాచిత్‌బర్‌పుఖాన్, అల్లూరిల స్ఫూర్తిగా ముందుకు కదిలాడు.

అస్సాం నుంచి తిరిగి వచ్చి కెరమెరి మండలంలోని బాలేఝరి చుట్టుపక్కల గల టోకెన్‌మోవాడ్, పిట్టగూడ, బాబేఝరి, లైన్‌పటార్, చాల్‌బాడి, పాటగూడ, కల్లెగాం, చిన్నపట్నాపూర్, పెద్దపట్నాపూర్, కొలాంగూడ, జోడేఘాట్, కొల్లారి మొదలగు 12 గూడేల వనవాసులను ఏకం చేశాడు. వారికి అల్లూరి, లాచిత్‌బర్‌పుఖాన్ పద్ధతిలో గెరిల్లా శిక్షణనిచ్చి ప్రత్యేక సైన్యం ఏర్పాటు చేశాడు. ఈ 12గూడెంలలో గల వందలాది ఎకరాల అడవిని నరికి సాగుభూమిగా చేసి పోడు వ్యవసాయం మొదలుపెట్టాడు.

నైజాంకు శిస్తులు కట్టక నిరాకరించి సహాయ నిరాకరణ చేస్తూ ఈ జల్ (నీరు), జంగల్ (అడవి), జమీన్ (భూమి) ఈ భూమి బిడ్డలవేనని నినదించాడు. గోండు వీరుల్లో ఉత్సాహం నింపి వారిని మెరికల్లా తయారుచేశాడు. వీరిని అణచడానికి నైజాం సైన్యం, పోలీసులు రంగ ప్రవేశం చేశారు. గోండువీరులు భీం నాయకత్వాన గెరిల్లా పోరు సాగించి దొరికిన సైనికులను దొరికినట్లే మట్టుబెట్టసాగారు. పరిస్థితులు విషమించడం గమనించాడు నిజాంరాజు. పోరుబాటలో భీంను దారికి తెచ్చుకోలేమని తలచాడు. సంధి నెపంతో ఆసిఫాబాద్ కలెక్టర్‌ను భీం వద్దకు పంపాడు.

వచ్చిన కలెక్టర్ బాబేఝరి చుట్టుపక్కల గల భూములకు పట్టాలిచ్చి గిరిజనులకు భూపంపిణీ చేస్తానన్నాడు. ఈ నైజాం నక్క జిత్తులకు కొదమసింహం కొమురం భీం లొంగలేదు. వచ్చిన కలెక్టర్‌తోనే ‘ఈ జోడేఘాట్ ఒక్కటేగాదు చుట్టుపక్కల గల 12గూడెంలకు చెందిన జల్(నీరు), జంగల్ (అడవి), జమీన్(భూమి) తమవేనని, వీటిని ఇంకొకరు గుర్తించి పట్టాలివ్వాల్సిన ఆగత్యం పట్టలేదని నినదించాడు. ఈ భూమిపై నైజాం ప్రభుత్వానికి ఎలాంటి హక్కు లేదు’ అని తెగేసి చెప్పాడు. అంతేగాక ‘నైజాం ప్రభుత్వం జైళ్లలో పెట్టిన తన అనుచరులను బేషరతుగా విడుదల చేయని పక్షంలో పోరు తీవ్రతరమవుతుందని’ హెచ్చరించాడు. చేసేది లేక కలెక్టర్ వెనుదిరిగాడు. వెనువెంటనే భీం హైదరాబాద్ పయనమై నైజాం దర్బారులో అడుగుపెట్టాడు. ఆకాలంలో నిజాం అన్నా, అతని రాకాసిమూకల రజాకార్లన్నా సామాన్యజనం నిలువెల్లా వణికేవారు. కానీ గండరగండడు కొమురం భీం కొదమసింహం గనుక నైజాం దర్బారులో నిలబడి జోడేఘాట్ ప్రాంతంలో గల 12గూడేలపై సర్వ హక్కులు గిరిజనానివేనని స్పష్టం చేశారు. ఇతరులను తన దుశ్చేష్టలతో వణికించే నిజాం సైతం కొమురం భీం సింహనాదానికి నిశ్చేష్టుడైనాడు. ఎదురుగా భీం ఉన్నప్పుడు ఏమీ చేయలేని నైజాం రాజు భీం తిరిగి వెళ్లగానే గిరిజన గూడేలపై తన రజాకార్ సేనను ఉసిగొలిపాడు.

అటు నిజాం సైన్యం, ఇటు రజాకార్లు గోండుగూడేల్లో తమ పైశాచిక కృత్యాలు మొదలుపెట్టారు. ఆడవారి మానప్రాణాలకు విలువ లేకుండా చేయబూనారు. అమాయక గోండు గిరిజనులపై అత్యాధునిక మారణాయుధాలు, తుపాకులు ఎక్కుబెట్టారు. తమ వద్ద అత్యాధునిక ఆయుధాలు లేకున్నా కొమురంభీం ఇచ్చిన కొండంత అండతో గోండు గిరిజనులు గెరిల్లా పోరు మొదలుపెట్టారు. భీం సైన్యాన్ని ఆయుధ పోరులో ఎదుర్కొలేని నైజాం సేన కుయుక్తితో భీంను మట్టుబెట్టాలనుకుంది. అదను కోసం చూసింది.

అది 1940వ సంవత్సరం అక్టోబరులో ఆశ్వయుజపౌర్ణమి. అడవిలో వెన్నెల పిండారబోసినట్లుగా ఉంది. కొదమసింహం కొమురం భీం ఆ అడవిలో ఆదమరచి నిద్రిస్తున్నాడు. ధైర్యంగా పోరుతో ఎదుర్కొలేని నైజాం తాలూక్‌దార్ (ఆర్డీఓ) సైన్యం నిద్రిస్తున్న భీంను చుట్టుముట్టి కాల్పులు ప్రారంభించారు. వెంటనే నిదుర నుండి మేలుకున్న కొదమ సింహం నైజాం పైశాచిక సేనలకు ఎదురొడ్డి వీరోచిత పోరు సల్పారు.

కానీ అత్యాధునిక ఆయుధ సంపత్తి, కుయుక్తులు తోడైన నైజాం రాక్షససేన ముందు కేవలం ఆత్మవిశ్వాసమే ఆలంబనగా పరిమిత వనరులతో పోరుసల్పుతున్న భీం సైన్యం ఇంకా నిలిచేనా ? చివరగా ముష్కర మూకల దుష్కరపోరులో భారతమాత ముద్దుబిడ్డడు, గండరగండడు, కొదమసింహం కొమురం భీం నేలకొరిగాడు. ఆ ధృవతారను మరువని గిరిజనం ప్రతీ ఏడు జోడేఘాట్‌లో కొమురం భీంను స్మరిస్తుంది.

కొమురం భీం జల్(నీరు), జంగల్(అడవి), జమీన్(భూమి) కావాలని పోరు సల్పినాడో అవి ఇంతవరకు ఆ గిరిపుత్రులకు పూర్తిస్థాయిలో అందడం లేదు. ఆ కొదమసింహం మనుమరాలు సోనుబాయి కట్టుకోవడానికి సరైన బట్టలు కూడా లేకుండా పూరి గుడిసెలోనే పట్టా సైతం కరువైన భూమిలో బ్రతుకీడుస్తోంది. అక్కడి గిరిజనం తమ భూముల కోసం పట్టా పాస్‌బుక్‌ల కోసం ప్రతి అధికారిని వేడుకుంటున్నారు. గ్రామ పంచాయతీకి దిక్కులేక ప్రభుత్వ పథకాలకు దూరంగా గడుపుతున్నారు. కేవలం ఆవీరుని వర్ధంతి రోజు వేసే తాత్కాలిక రోడ్లను, విద్యుత్ దీపాలను చూసి మురిసిపోయే దుస్థితి.

గిరిపుత్రులకు దన్నుగా నిలిచే 1/70 చట్టాన్ని ఉల్లంఘించి ఇతరులు వారి భూములను సాగు చేస్తున్నారు, ఆక్రమిస్తున్నారు. అయినా ప్రభుత్వాలు వీరి గోడు వినడం లేదు. రానురాను అన్యాక్రాంతమవుతున్న ఈ భూముల కోసం గిరిజనం మరోసారి కన్నెర్రజేయకముందే ప్రభుత్వాలు, అధికారులు మేల్కోనాలి. వారి పట్టాలు వారికివ్వాలి. జోడేఘాట్ నుంచి ఆసిఫాబాద్ వరకు, ఇటు కెరమెరి వరకు పూర్తిస్థాయి రోడ్డు సౌకర్యం కల్పించాలి. గిరిజనుల విద్యా, వైద్యానికి పూర్తి భరోసానివ్వాలి అదే ఆ వీరుడికి ఘననివాళి.

-రాంనరేష్‌కుమార్
9492682285