వేసవి వచ్చిందంటే నీటికి కటకటే. ఎక్కడ చూసినా ఎండిపోయిన బావులు, నీళ్ళురాని బోర్‌లు కనిపిస్తాయి. కొన్ని ప్రాంతాల్లోనైతే గుక్కెడు నీళ్ళ కోసం కిలోమీటర్ల దూరం వెళ్ళాల్సిన పరిస్థితి. నగరాలు, గ్రామాలు అనే తేడా లేకుండా నీటి ఎద్దడితో జనం అల్లల్లాడతారు. జీవనదులు ఉన్న మన దేశంలో నీటికి కొరత ఏమిటి? అటూఇటుగానైనా ప్రతిఏటా వర్షాలు కురిసే మనకు నీటికి కటకట ఏమిటి?
ఆందోళన కలిగించే అంశాలు
50 ఏళ్ళలో జనాభాతోపాటు మన నీటి అవసరాలు కూడా పెరిగిపోయాయి. కానీ ఒకపక్క అవసరాలు పెరుగుతుంటే మరోపక్క స్వచ్ఛమైన నీరు మాత్రం తగ్గుతోంది. ప్రపంచ జనాభాలో ఆసియా వాటా 60శాతం కాగా అందుబాటులో ఉన్న నీరు మాత్రం 36శాతమే. అదే అమెరికాలో చూస్తే 6శాతం జనాభాకి 26శాతం నీరు అందుతోంది. అంటే ప్రపంచ జనాభాలో 17శాతం మన దేశంలో ఉంటే ఇక్కడ లభిస్తున్న నీరు మాత్రం 4శాతమే. 1951లో ప్రతిఒక్కరికి 5వేల క్యూబిక్ మీటర్ల నీరు అందుబాటులో ఉంటే ఇప్పుడు కేవలం 938 క్యూబిక్ మీటర్ల నీరు మాత్రమే అందుతోంది. అది కూడా మన అవసరానికి మించి 17రెట్లు అధికంగా భూగర్భజలాల్ని పీల్చేసిన తరువాత కూడా ఇదీ మన పరిస్థితి! 2050 నాటికి దేశపు మొత్తం జనాభాలో 50శాతానికి పైగా పట్టణ జనాభా ఉంటుందని ఐక్యరాజ్యసమితి అంచనాలు చెపుతున్నాయి. అంటే దేశంలో ఇప్పటివరకూ నీటికొరతతో బాధపడుతున్నవారి సంఖ్య 320 మిలియన్ల నుంచి 840 మిలియన్లకు పెరుగుతుంద న్నమాట.ప్రస్తుతం మన దేశంలోని 140జిల్లాల్లో తీవ్రమైన నీటికొరత ఉంది.
నీటి కష్టాలు
ప్రపంచంలో సురక్షిత నీరు అందుబాటులో లేనివారి సంఖ్య 84 కోట్లు కాగా అందులో 16.3 కోట్లు మన దేశంలోనే ఉన్నారు. మన దేశంలో నీటి కోసం మహిళలు సగటున రోజుకి ఆరుగంటల పాటు కష్టపడుతున్నారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థమవుతుంది. స్వచ్ఛమైన నీరు అందక దొరికిన కలుషితమైన నీటినే ఉపయోగించడంవల్ల లక్షలాదిమంది రోగాలబారిన పడుతున్నారు, మరణిస్తున్నారు. ఇలా స్వచ్ఛమైన నీరు అందక 10లక్షలమంది చనిపోతున్నారు. మంచినీరు లభిస్తే రోగాలబారినపడేవారి సంఖ్య, దానితోపాటు వైద్యానికి పెట్టే ఖర్చూ కూడా తగ్గుతాయి. సరైన నీటి సదుపాయం అందించ గలిగితే దేశంలో నీటి సంబంధమైన వ్యాదులపై పెట్టే ఖర్చు 2 లక్షల కోట్ల రూపాయలు ఆదా అవుతుందని ఒక అంచనా. ఇక నీటి కొరతవల్ల మనం 171 లక్షల రూపాయల నష్టాన్ని భరించ వలసివస్తోంది.
కారణం ఏమిటి?
భూమి పైన, లోపల పుష్కలంగా నీరు కనిపిస్తున్నా ఇంతటి కొరత ఏర్పడటానికి కారణం ఏమిటి? ఎన్ని నదులున్నా, ఎంత భూగర్భజలసంపద ఉన్నా లాభం ఏమిటి? వాటిని పొదుపుగా, జాగ్రత్తగా ఉపయోగించుకోవాల్సిన ముందుచూపు, వివేకం మనకు లేకపోయిన తరువాత. ప్రాచీన భారతంలో జలసంరక్షణకు అనేక పద్ధతుల్ని అనుసరించేవారు. 5వేల సంవత్సరాల నాటి సిందూ నాగరకతలో ప్రపంచంలోనే అత్యున్నతమైన నీటి పారుదల, పారిశుద్ధ్య వ్యవస్థలు ఉండేవని స్పష్టమైంది.వర్షపునీటిని కూడా ఒడిసిపట్టుకునేందుకు వీలుగా నగర నిర్మాణం జరిగిందని కనబడుతోంది. మన దేశంలో ఒకప్పుడు విస్తృతంగా చెరువుల నిర్మాణం జరిగేదని, వాటిని సక్రమంగా నిర్వహించ డానికి, ప్రజలందరికీ నీటిని అందించడానికి ప్రత్యేక కమిటీలు కూడా ఉండేవని చరిత్ర చెపుతోంది. ఈ ప్రత్యేక నీటి కమిటీలలో మహిళలకు ప్రాధాన్యత నిచ్చేవారు కూడా. మన రాష్ట్రంలో కాకతీయ రాజులు తవ్వించిన పెద్దపెద్ద చెరువులు ఇప్పటికీ కనిపిస్తాయి. పూర్వం ఇళ్ళను కూడా జలసంరక్షణకు తగినట్లుగా కట్టుకునేవారు. ఇంటిపైకప్పులపై పడిన నీరు నేరుగా కింద ఉన్న ట్యాంకుల్లోకి పడేవిధంగా ఏర్పాటు చేసుకునేవారు. ముఖ్యంగా పశ్చిమ రాజస్థాన్‌లో ఇలాంటి ఇళ్ళ నిర్మాణం కనిపిస్తుంది.
కానీ ఆధునికత, అభివృద్ధి పేరుతో నీటి వనరులను కాపాడుకోవాలనే కనీసపు ఆలోచనకు దూరమయ్యాం.పూజించే నదుల్లోనే చెత్తవేయడం ప్రారంభించాం.పరిశ్రమలుపెట్టి వాటి నుంచి వెలువడే వ్యర్థాల్ని నదుల్లోకి వదిలిపెడుతున్నాం. దాదాపు సగం దేశానికి నీటిని అందించే గంగానదిలో ప్రతిరోజూ 700 పరిశ్రమల నుండి వెలువడుతున్న 50కోట్ల లీటర్ల కాలుష్యాలు కలుస్తున్నాయి. అలాగే యమునా నదిలో 70శాతం నీరు కలుషితమైపోయింది. మన దేశంలో 275నదుల్లో నీరు ప్రమాదకరమైనదని కాలుష్య నియంత్రణ మండలి తేల్చిందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చును.సంవత్సరం పొడవునా నీళ్ళు ఉండే నదుల సంగతే ఇలా ఉంటే వర్షపు నీటివల్లనే నిండే చెరువుల సంగతి చెప్పనవసరంలేదు. అవి కబ్జాలకు గురై కనుమరుగవుతున్నాయి.
మనమేం చేయాలి?
– నీటిని పొదుపుగా, జాగ్రత్తగా వాడుకోవడం చాలా అవసరం.అవసరానికి మించి ఒక్క చుక్క కూడా ఉపయోగించకూడదనే జాగ్రత్త ఉండాలి. నిత్యజీవితంలో మన అలవాట్లను మార్చుకోవాలి.
– నీటి వృధాను అరికట్టాలి. ఉదాహరణకు ఉదయమే బ్రష్ చేస్తున్నంతసేపు పంపును తిప్పి ఉంచకుండా కట్టేస్తే దాదాపు 30లీటర్ల నీరు ఆదా చేసినట్లే. పాత్రలు కడిగేప్పుడు ఐదునిముషాలకు 50లీటర్ల నీరు వాడతాం. అదే బకెట్‌లో తీసుకుని వాడితే అందులో సగం నీరు మిగులుతుంది.
– బట్టిల్ని వాషింగ్‌మిషన్‌లో ఉతికితే నాలుగురెట్లు ఎక్కువ నీరు అవసరమవుతుంది. అలాగే షవర్‌స్నానానికి రెట్టింపు నీరు కావాలి. కార్లు, వాహనాలను పైపుపెట్టి కడగడం, వాకిలి శుభ్రం చేయడానికి పైపు ఉపయోగించడం మానుకో వాలి. కారు, బళ్ళు తుడుచుకునేందుకు తడిబట్ట సరిపోతుంది. దానికి అరలీటరు నీరు చాలు.
– ఇళ్ళలో వాడిన నీటిని మొక్కలకు మళ్ళించ వచ్చును.
– ప్రతి ఇంటి ఆవరణలో ఇంకుడు గుంతలు తప్పనిసరిగా ఏర్పాటుచేసుకోవాలి. అప్పుడే వాననీరు భూమిలోకి ఇంకి భూగర్భజలాలు పెరుగుతాయి.
– నీటి పునర్వినియోగంపై ప్రభుత్వాలు కూడా దృష్టి పెట్టాలి. మురుగునీటిని, వ్యర్థపదార్థాలను నేరుగా నదులు, చెరువుల్లోకి కలపకుండా శుద్ధి చేసే పద్ధతిని ప్రవేశపెట్టాలి.
(లోకహితం సౌజన్యం తో)