Home News ఆచార్య సాయిబాబాకు జీవిత ఖైదు

ఆచార్య సాయిబాబాకు జీవిత ఖైదు

0
SHARE

మావోయిస్టులతో సంబంధాల కేసులో దిల్లీ విశ్వవిద్యాలయ ఆచార్యుడు జి.ఎన్‌.సాయిబాబాను మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లా, సెషన్స్‌ కోర్టు దోషిగా నిర్ధారించింది. ఆయనకు జీవిత ఖైదు ఖరారు చేసింది. ఇదే కేసులో జహవర్‌లాల్‌ నెహ్రూ విశ్వవిద్యాలయ విద్యార్థి హేమ్‌ మిశ్ర, మాజీ పాత్రికేయుడు ప్రశాంత్‌ రాహి, మహేశ్‌ తిర్కీ, పాండు నరోటె, విజయ్‌ తిర్కీలను కూడా దోషులుగా తేల్చింది. మిశ్ర, రాహి, మహేశ్‌, పాండులకు జీవిత ఖైదు; విజయ్‌కి పదేళ్ల కఠిన కారాగార శిక్ష విధిస్తూ మంగళవారం తీర్పు వెలువరించింది. దోషులందరికీ రూ.వెయ్యి జరిమానా విధించింది. తీర్పు సమయంలో వారంతా కోర్టులోనే ఉన్నారు.

చట్ట వ్యతిరేక కార్యకలాపాల (నిరోధక) చట్టం కింద వీరందరిపై దాఖలైన అభియోగాలునిరూపితమైనట్లు కోర్టు పేర్కొంది. జీవిత ఖైదు పడ్డవారంతా నిషేధిత సీపీఐ(మావోయిస్టు) పార్టీ, దాని విభాగమైన ‘రెవల్యూషనరీ డెమోక్రటిక్‌ ఫ్రంట్‌(ఆర్డీఎఫ్‌)’లో క్రియాశీల సభ్యులని తేల్చింది. దివ్యాంగుడైనంత మాత్రాన సాయిబాబాకు శిక్ష నుంచి ఏమాత్రం మినహాయింపులివ్వలేమని.. మానసికంగా పూర్తి ఆరోగ్యంగా ఉన్న ఆయన.. సీపీఐ(మావోయిస్టు), ఆర్డీఎఫ్‌లలో కీలక పాత్ర పోషించారని సూచించింది. గడ్చిరోలి అడవుల్లో నక్సల్స్‌తో సమావేశాలకు రాహిని తీసుకెళ్లినందుకే విజయ్‌ని దోషిగా నిర్ధారించినట్లు పేర్కొంది. సెషన్స్‌ కోర్టు తీర్పును బొంబాయి హైకోర్టుకు చెందిన నాగ్‌పుర్‌ ధర్మాసనం ఎదుట సవాలు చేయనున్నట్లు సాయిబాబా తరఫు న్యాయవాదులు వెల్లడించారు. మావోయిస్టులతో సంబంధాలున్నాయన్న ఆరోపణలపై హేమ్‌ మిశ్ర, మహేశ్‌ తిర్కీ, పండు నరోటె గడ్చిరోలి జిల్లాలోని అహేరీ వద్ద 2013లో అరెస్టయ్యారు. అనంతరం వారి నుంచి రాబట్టిన సమాచారం ఆధారంగా ప్రశాంత్‌ రాహి, విజయ్‌ తిర్కీలను గోండియా జిల్లాలోని దేవరిలో అరెస్టు చేశారు. నిషేధిత సీపీఐ(మావోయిస్టు) సభ్యుడన్న ఆరోపణలపై గడ్చిరోలి పోలీసులు 2014 మేలో సాయిబాబాను కూడా అరెస్టు చేశారు. దీంతో ఆచార్య విధుల నుంచి ఆయన సస్పెన్షన్‌కు గురయ్యారు. ఆయన నివాసం నుంచి పోలీసులు పెన్‌డ్రైవ్‌లు, మావోయిస్టు సాహిత్యాలను స్వాధీనం చేసుకున్నారు. మావోయిస్టులకు వసతులు కల్పిస్తున్నారని.. వారి నియామక ప్రక్రియలో దోహదపడుతున్నారని ఆయనపై అభియోగాలు నమోదయ్యాయి.వైకల్యంతో బాధపుడుతున్న సాయిబాబా.. ఎప్పుడూ చక్రాల కుర్చీకే పరిమితమై ఉంటారు. జైల్లో తన ఆరోగ్యం క్షీణిస్తోందంటూ విన్నవించుకోవడంతో సాయిబాబాకు సుప్రీంకోర్టు గతేడాది జూన్‌లో బెయిలు మంజూరు చేసింది. ప్రస్తుతం ఆయన బెయిల్‌పైనే ఉన్నారు.

(ఈనాడు సౌజన్యం తో)