Home News హెచ్ వి శేషాద్రి: సంఘ వికాసానికి అంకితమైన దేశభక్తుడు

హెచ్ వి శేషాద్రి: సంఘ వికాసానికి అంకితమైన దేశభక్తుడు

0
SHARE

సంఘం కోసం తన జీవితమంతా అంకితం చేసిన పూజనీయులు హెచ్ వీ శేషాద్రి. వీరి పూర్తి పేరు హెంగసంద్ర వెంకటరామయ్య శేషాద్రి. వీరు మే 26, 1926న బెంగళూరులో జన్మించారు. 1943లో స్వయం సేవక్‌గా మారి, 1946లో మైసూర్ విశ్వవిద్యాలయం నుంచి రసాయన శాస్త్రంలో ప్రథమ శ్రేణిలో బంగారు పతకం సాధించిన తర్వాత ఎమ్మెస్సీ చేశారు. తరువాత సంఘ్ ప్రచారక్‌గా తన జీవితాన్ని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్‌కు అంకితం చేశారు. మొదట శేషాద్రి గారి పని ప్రదేశం మంగళూరు విభాగ్ కాగా, తర్వాత కర్ణాటక రాష్ట్రం, ఆ తర్వాత యావత్ దక్షిణ భారతదేశం. 1986 వరకు వీరు దక్షిణాదిలో చురుకుగా పని చేశారు. శ్రీ యాదవరావ్ జోషిచే బాగా ప్రభావితమైన శేషాద్రిగారు 1987 నుండి 2000 వరకు సంఘ్ సర్‌కార్యవాహ. ఈ కారణంగా వారు భారతదేశమంతటా, ఇంకా ప్రపంచంలోని కొన్ని దేశాలలోను పర్యటించారు. అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో సైతం సరైన నాయకత్వాన్ని అందించారు.

శేషాద్రి గారు పనిలో నిమగ్నమైనప్పటికీ, ప్రతిరోజూ రాయడానికి సమయం కేటాయించుకునేవారు. తన రచనల ద్వారా ఎందరోమందికి స్పూర్తి ప్రదాతగా నిలిచారు. వారు తరచుగా విక్రమ్ వీక్లీ, ఉత్థాన్ మాసపత్రిక, ఢిల్లీ నుంచి వెలువడే పాంచజన్య, ఆర్గనైజర్ వీక్లీ, లక్నో నుంచి ప్రచురించే రాష్ట్రధర్మ మాసపత్రికలకు వ్యాసాలు రాసేవారు. ఆయన కథనాల కోసం పాఠకులు ఆసక్తిగా ఎదురుచూసేవారు. సంఘతో పాటుగా ఇతర హిందూ సాహిత్య ప్రచురణల కోసం శ్రీ యాదవరావు పర్యవేక్షణలో ‘రాష్ట్రోత్తన్ పరిషత్’ను బెంగుళూరులో స్థాపించారు. సేవాకార్యక్రమాల విస్తరణకు, సంస్కృత అభ్యున్నతికి కూడా శేషాద్రి ఎంతో కృషి చేశారు.

శేషాద్రి గారు వందకు పైగా చిన్న పెద్ద పుస్తకాలు రాశారు; రెండవ సర్‌సంఘ్‌చాలక్ శ్రీ గురూజీ ప్రసంగాలను ‘బంచ్ ఆఫ్ థాట్స్’ రూపంలో మొదట సంకలనం చేసింది వీరే. దాని సంచికలు నేటికీ ఏటా ప్రచురించబడుతున్నాయి. ఇవి కాకుండా, వీరి ముఖ్యమైన రచనలు కృతిరూప్ సంఘ్ దర్శన్, ఔర్ దేశ్ బనుత్ గయా, నన్యాహ్ పంథా, వైశ్యాన్, ది వే, Hindus abroad: The dilemma, dollar or dharma?, ఉజాలే కి ఓర్… మొదలైనవి. ఇవన్నీ అనేక భాషల్లోకి అనువదించబడ్డాయి.

ఇక శివాజీ మహరాజ్ పై శేషాద్రి రాసిన యుగావతార, ప్రత్యేకంగా సమాజ హితంపై రాసిన అమ్మ బగిలు అనే వ్యాసాలు, చింతనగంగ, విభజన యొక్క విషాధ కథ, భుగిలు అనే పుస్తకాలు, ఆర్ఎస్ఎస్ పై వారు రాసిన “ఎ విజన్ ఇన్ యాక్షన్” పుస్తకాలు అత్యంత ప్రసిద్ధిపొందాయి. వారు రాసిన వ్యాసాల సంకలనం అమ్మ బగిలు 1982లో కర్ణాటక రాష్ట్ర సాహిత్య అకాడమీ అవార్డును కూడా గెలుచుకుంది. వారి రచన “ది ట్రాజిక్ స్టోరీ ఆఫ్ పార్టిషన్” (తెలుగులో విభజన యొక్క విషాద గాథ) అనేది విభజన సమస్యకు భిన్నమైన దృక్పథాన్ని అందించిన ఏకైక పుస్తకాలలో ఒకటి. దీన్ని భారతీయ చరిత్ర గురించి తెలుసుకోవాలనుకునే ప్రతి ఒక్కరూ తప్పకుండా చదవాలి.

శేషాద్రి గారి ప్రసంగ శైలి కూడా అద్భుతంగా ఉంటుంది. సరళమైన మరియు ఆసక్తికరమైన ఉదాహరణలు ఇస్తూ తన అభిప్రాయాలను శ్రోతలకు తెలియజేసేవారు. 1984లో న్యూయార్క్ (అమెరికా)లో జరిగిన ప్రపంచ హిందూ సదస్సుకు, బ్రాడ్‌ఫోర్డ్‌లో (UK) జరిగిన హిందూ సంగమానికి ప్రత్యేకంగా ఆహ్వానం అందుకున్నారు. ఆయన ప్రసంగాలను అక్కడి ప్రజలు ఎంతగానో మెచ్చుకున్నారు.

నాల్గవ సర్‌సంఘచాలక్ రజ్జు భయ్యా అనారోగ్య కారణాలతో సెలవు తీసుకోవాలనుకున్నప్పుడు, స్వయంసేవకులందరూ శేషాద్రి జీ ఈ బాధ్యతను చేపట్టాలని కోరుకున్నారు; కానీ వారు ఇందుకు సిద్ధంగా లేరు. మితిమీరిన శారీరక, మానసిక శ్రమ కారణంగా అనారోగ్యం బారిన పడ్డారు. తన ఆరోగ్యం బాగోలేదని, అందుకే ఈ పని ఓ యువకుడికి ఇవ్వాలని అన్నారు. చివరికి ఈ బాధ్యతను సుదర్శన్ జీకి అప్పగించారు. శేషాద్రి జీ సహ-సర్‌కార్యవాహగాను, ప్రచారక్ ప్రముఖ్‌గాను ఎప్పుడు పనిచేస్తూనే ఉన్నారు.

శేషాద్రి గారి చివరి రోజుల్లో బెంగుళూరు కార్యాలయంలో ఉండేవారు. అక్కడ ఒక రోజు సాయంత్రం ఆయన జారి పడటంతో కాలులో ఎముక విరిగింది. వారి తుంటి ఎముక గతంలో కూడా ఒకసారి విరిగింది. ఈసారి చికిత్సా సమయంలో వారి శరీరం ఇన్ఫెక్షన్ బారిన పడింది. దీంతో అవయవాలన్నీ క్రమంగా క్రియారహితంగా మారాయి. కొన్ని రోజులు ఆసుపత్రిలోనే ఉంచారు. ఈ దేహంతో సంఘ కార్యం ఇక సాధ్యం కాదని భావించి విరామం తీసుకున్నారు. ఆయన కోరికను గౌరవించి హాస్పిటల్ నుంచి సంఘ్ కార్యాలయానికి తీసుకొచ్చారు. జీవితకాలం మొత్తం సంఘ వికాసానికి పనిచేసిన శేషాద్రి గారు తమ 80 సంవత్సరాల వయసులో ఆగస్టు 14, 2005 సాయంత్రం దేశమాత ఒడిలో శాశ్వతంగా నిద్రపోయారు.

మెరుగైన సమాజాన్ని నిర్మించాలంటే అందుకు అనుగుణంగా స్వయం సేవకులు తయారవ్వాలని శేషాద్రి గారు బలంగా విశ్వసించారు. వారి రచనలన్నింటిలో కూడా సంఘ లక్ష్యాలు, సంఘ చేసే పనులు, సంఘ దృక్పథం స్పష్టంగా గోచరించించేవి. ఎక్కడా కూడా వ్యక్తిగత ప్రశంస ఉండేది కాదు.