Home Telugu Articles లౌకికవాదంపై ఆత్మశోధన

లౌకికవాదంపై ఆత్మశోధన

0
SHARE

భారత రాజ్యాంగం ఉద్ఘోషిస్తున్న ఉన్నతాదర్శాలకు అనుగుణంగా మన రాజకీయ జీవితాన్ని తీర్చిదిద్దుకొంటున్నామా? బహుశా, లేదు కనుకనే విభజన రాజకీయాలకు వ్యతిరేకంగా దేశ సర్వోన్నత న్యాయస్థానం ఇటీవల ఒక తీర్పు వెలువరించింది. మత తత్వ రాజకీయమంటే ఏమిటి? మత ప్రమేయం లేని రాజకీయమంటే ఏమిటి?– ఫిబ్రవరి 4తో ప్రారంభమై, మార్చి రెండోవారంలో ముగియనున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియను నిర్ణయాత్మకంగా ప్రభావితంచేసే ముఖ్య అంశాలతో ఇది ఒకటిగా వున్నది. ఆ ప్రకారంగా, మన ఎన్నికల చట్టం కింద ‘అవినీతి’కి పాల్పడినట్టు ప్రకటించడానికి ఎవరు అర్హులవుతారు?

ప్రజాప్రాతినిధ్య చట్టంలోని నిర్దిష్ట అంశాలపై ఏడుగురు సభ్యులు గల సర్వోన్నత న్యాయస్థాన రాజ్యాంగ ధర్మాసనం తీర్పుతో ఎన్నికల ప్రచారంలో వివాదాస్పద కుల మతాల ప్రసక్తి అంశం మళ్ళీ అగ్ర ప్రాధాన్యం సంతరించుకొంది.

మతతత్వ రాజకీయమంటే ఏమిటి? లౌకికవాద లేదా మత ప్రమేయం లేని రాజకీయమంటే ఏమిటి అనే అంశాన్ని నిష్కర్షగా తేల్చివేయవల్సిన అవసరం ఎంతైనావున్నది. ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా వచ్చే ఐదారు వారాల పాటు చోటు చేసుకోనున్న ప్రచార సంచలనాలు ఎన్నికల వ్యవస్థ ప్రక్షాళనకు దోహదం చేయవచ్చు. కనుక సుప్రీంకోర్టు తీర్పును అందరూ స్వాగతించాలి. అయితే సర్వోన్నత న్యాయస్థానం తీర్పు పూర్తి పాఠం ఇంకా అందుబాటులో లేనందున అయోమయం నెలకొనివున్నది. అయినప్పటికీ కొంత మంది వ్యాఖ్యాతలు మీడియా వార్తల ఆధారంగా ఆ తీర్పు పర్యవసానాలపై తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.

రాజ్యాంగ ధర్మాసనం ముందున్న అంశమేమిటో సంక్షిప్తంగా తెలుసుకుందాం. ఎన్నికలలో పోటీ చేస్తున్న అభ్యర్థులను అనర్హులను చేసే ‘అవినీతి’ చర్యల విషయమై ఒక నిర్దిష్ట ప్రస్తావనకు చెబుతున్న భాష్యానికి సంబంధించింది.

మరింత స్పష్టంగా చెప్పాలంటే ఆ విచారణాంశం ప్రజాప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్‌ 123(3). ఈ సెక్షన్‌ పేర్కొన్న విషయమిది: ‘‘అభ్యర్థి లేదా ఆ వ్యక్తి ఎన్నికల ఏజెంటు, లేదంటే అభ్యర్థి సమ్మతితో ఏ వ్యక్తి అయినా.. ‘అతని’ మతం, కులం, జాతి, వర్గం, భాష ప్రాతిపదికగా ఓటేయాలని లేదా మిన్నకుండాలని కోరినా.. మతపరమైన చిహ్నాల ఆధారంగా విజ్ఞప్తులు చేసినా.. సదరు అభ్యర్థి లేదా మరే అభ్యర్థి జయాపజయాలపై ఈ ప్రభావం కనిపిస్తే మాత్రం అది అవినీతి కిందికే వస్తుంది’. ‘అతని’ అనే పదాన్ని నొక్కిచెప్పడం గమనార్హం. ఎందుకంటే ఆ పదానికి న్యాయశాస్త్ర రీత్యా పలు భాష్యాలు చెప్పడానికి ఆస్కారమున్నది. కనుకనే సెక్షన్‌ 123(3) అంశాన్ని విస్తృత రాజ్యాంగ ధర్మాసనానికి నివేదించడం జరిగింది.

ప్రస్తావిత సెక్షన్‌లోని ‘అతని’ అనే పదానికి సంప్రదాయకంగా చెప్పే భాష్యం అభ్యర్థి మతం, జాతి, కులం మొదలైన వాటిని సూచిస్తుంది. అయితే ఏడుగురు సభ్యుల విస్తృత ధర్మాసనంలోని నలుగురు న్యాయమూర్తులు ఆ పదం ఓటరు మతం, కులం మొదలైన వాటిని కూడా సూచిస్తుందని అభిప్రాయపడ్డారు. అంటే ఓటర్లు, అభ్యర్థులు, వారి ఏజెంట్లు సహా అందరి మతం, కులం కూడా అని అర్థం చేసుకోవల్సివున్నది. ఈ మెజారిటీ తీర్పునిచ్చిన నలుగురు న్యాయమూర్తులలో ఇద్దరు జస్టిస్‌ బి.లోకుర్‌, జస్టిస్ లావు నాగేశ్వరరావులు ‘ఎన్నికల ప్రక్రియ స్వచ్ఛతను కాపాడేందుకు ఈ విస్తృత భాష్యం అవసరమయిందని’ ప్రత్యేకంగా పేర్కొన్నారు. ఎన్నికల ప్రచారంలో మతాన్ని ఏ విధంగాను ఉపయోగించుకోవడం ఆమోదయోగ్యం కాదని పార్లమెంటు స్పష్టం చేసిన నేపథ్యంలో మెజారిటీ న్యాయమూర్తుల విస్తృత భాష్యం అందుకనుగుణంగా వున్నది. ఎన్నికలలో అవినీతిని అదుపు చేయడమనే ప్రజాప్రాతినిధ్య చట్టం లక్ష్యాన్ని నెరవేర్చేవిధంగా ఆ విస్తృత భాష్యం వుందని చెప్పవచ్చు.

ధర్మాసనానికి నేతృత్వం వహించిన అప్పటి ప్రధాన న్యాయమూర్తి టి.ఎస్‌. ఠాకూర్‌ అభిప్రాయాన్ని కూడా ఇక్కడ ప్రస్తావించవల్సి వున్నది. ‘ప్రయోజనాత్మక భాష్యం’ అన్నది మతం, జాతి మొదలైన వాటిని అనుమతి లేని అంశాల జాబితా నుంచి తొలగించడాన్ని నిరోధిస్తుందని, దీనివల్ల ఎన్నికల ప్రచారంలో వాటిని ఉపయోగించుకోవడానికి ఆస్కారమేర్పడి, రాజ్యవ్యవస్థ లౌకిక స్వభావాన్ని ప్రభావితం చేస్తుందని చీఫ్‌ జస్టిస్ ఠాకూర్‌ అన్నారు.

మెజారిటీ న్యాయమూర్తుల తీర్పుతో ముగ్గురు న్యాయమూర్తులు– జస్టిస్ ధనంజయ వై. చంద్రచూడ్‌, జస్టిస్ ఉదయ్‌ యు లలిత్‌, జస్టిస్ ఆదర్శ్‌ కుమార్‌లు విభేదించారు. ఎన్నికల ప్రచారంలో నిషిద్ధ అంశాల జాబితా నుంచి ఓటర్ల మతపరమైన ప్రాధాన్యతలను తొలగించాలని పార్లమెంటు సైతం కోరిందన్న వాదనను ఈ ముగ్గురూ ప్రశ్నించారు. ‘అతని మతం’ అంటే అభ్యర్థి మతం మాత్రమేనని వీరు వాదించారు. ప్రజల న్యాయబద్ధమైన ఆందోళనలపై మాట్లాడకుండా వ్యక్తులను అడ్డుకోవడం ప్రజాస్వామ్యానికి విఘాతమని వీరు అభిప్రాయపడ్డారు. కుల మతాలు, జాతి, వర్గం మొదలైన అంశాలకు సంబంధించిన ప్రస్తావనలు, చర్చలపై సంపూర్ణ నిషేధం ప్రజాస్వామ్య పరిపూర్ణతకు తోడ్పడదని వారు స్పష్టం చేశారు. మెజారిటీ, మైనారిటీ తీర్పులు వెలువరించిన న్యాయమూర్తులు తమ తమ అభిప్రాయాలకు మద్దతుగా చేసిన వాదనలలోని సూక్ష్మభేదాలు చాలా సున్నితమైనవి. ఆ తీర్పుల విషయంలో మనం మన సొంత అవగాహనకు రావడానికి వాటి పూర్తి పాఠాలను సమగ్రంగా చదవవలసి వున్నది.

ఇదిలావుండగా సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం వెలువరించిన తీర్పు, పిటిషనర్లు మౌలికంగా లేవనెత్తిన సమస్యను పరిష్కరించలేదనే అభిప్రాయం గట్టిగా వ్యక్తమవుతోంది. మతం అంటే ఏమిటి అన్న కీలక ప్రశ్నకు ఆ తీర్పులో సమాధానం లభించలేదు. లౌకికవాద విధానం వెర్సెస్ మత రాజ్యవ్యవస్థ అనే సమస్యకు శాశ్వత పరిష్కారాన్ని కనుగొనాల్సిన అవసరాన్ని అది నొక్కిచెబుతోంది.

భారతదేశ చరిత్రలో ఎనిమిది వందల సంవత్సరాల ముస్లిం రాజులు, చక్ర వర్తుల పాలన దేశప్రజలు అనుభవించిన రాజకీయ బానిసత్వాన్ని తెలియజేస్తుందని ఒక ఆలోచనా స్రవంతి వాదిస్తుంది. ఇస్లామిక్ పాలకుల కాలంలో హిందువులు అన్ని రకాల వివక్షలకు గురయ్యారని, సామాజిక, రాజకీయ, మత, సాంస్కృతిక, ఆర్థిక అణచివేతలో ఇతోధికంగా నష్టపోయారని ఈ ఆలోచనా స్రవంతి ఆరోపిస్తుంది. ఈ అన్యాయాలకు నష్టపరిహారాన్ని సాధించుకోవాలన్న డిమాండ్‌కు లౌకికవాదులు తీవ్ర అభ్యంతరం చెబుతున్నారు. హిందూరాజ్యాలను ఆక్రమించిన ముస్లిం రాజులు తమ అధికారాన్ని ప్రదర్శించడానికి వివిధ రకాల చర్యలకు పాల్పడ్డారని, వాటిని చారిత్రకంగా అర్థం చేసుకోవాలని లౌకిక వాదులు అంటున్నారు.

ఒక రాజకీయ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మైనారిటీ వర్గాల వారు ప్రార్థనలు, ఆరాధనలు జరిపే ప్రదేశాల పోషణ, పరిరక్షణకు పెద్ద ఎత్తున నిధులు కేటాయించడం, సంబంధిత మతాచార్యులకు ప్రభుత్వ ఖజానా నుంచి నెలసరి వేతనాలు ఇవ్వడం జరిగింది. మరి హిందూ దేవాలయాలకు చెందిన పేద పూజారులకు అదే విధమైన సహాయాన్ని అందించడానికి ఆ రాజకీయ పార్టీ నిరాకరించింది. ఈ వివక్షను లౌకికవాదులెవ్వరూ ప్రశ్నించలేదు మరి.

మహిళలకు వివిధ హక్కులను సమకూర్చిన సంస్కరణలన్నిటినీ ప్రగతిశీలమైనవిగా తమకు తాము లౌకికవాదులుగా ప్రకటించుకున్నవారు ప్రశంసిస్తున్నారు. అయితే అవే సంస్కరణలను ఒక మైనారిటీ మత మహిళలకు విస్తరింపచేయడాన్ని వారు అంగీకరించడం లేదు. ఆ సంస్కరణలను అలా పొడిగించడమంటే మైనారిటీ వర్గం వారి మతపరమైన హక్కుల విషయంలో జోక్యం చేసుకోవడమేనని లౌకికవాదులు వాదిస్తున్నారు!

కొన్ని సంవత్సరాల క్రితం భావోద్వేగాలకు గురైన జనసమూహాలు ఒక మస్జీదును కూల్చివేసిన విషయం విదితమే. ఒక ఆలయాన్ని కూల్చివేసిన ప్రదేశంలో ఆ మస్జీదును నిర్మించారు. ఆ మస్జీదును నిర్మించడానికే ఆ ఆలయాన్ని కూల్చివేయడం జరిగింది. అలా నిర్మితమైన మస్జీదును కూల్చివేయడం ఒక ‘దుష్కార్యం’ అని లౌకివాదులు తప్పుపడుతున్నారు. అయితే ఆ మస్జీదును నిర్మించడానికి ఒక ఆలయాన్ని కూలగొట్టారనే వాస్తవాన్ని వారు విస్మరిస్తున్నారు. అది రుజువులేని విషయమని వాదిస్తున్నారు. మనదేశంలో అత్యధిక సంఖ్యాకులకు బహు భార్యాత్వం చట్టపరంగా నిషిద్ధం. ఒక సామాజికవర్గం వారు తమ మతం బహు భార్యత్వాన్ని ఆమోదించిందని, ఈ సంప్రదాయాన్ని గౌరవించాలని డిమాండ్‌ చేస్తున్నారు. లౌకికవాదులు వారికి మద్దతునిస్తున్నారు. లౌకిక వాదం పేరిట ఒక మైనారిటీ మతానికి చెందిన వివిధ వర్గాల వారికి ఆధునిక విద్యావకాశాలను నిరాకరిస్తున్నారు.

ఎన్నికలు కుల మతాలకు అతీతంగా జరగాలని సప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు నిజమైన లౌకికవాదం విషయమై ఆత్మశోధనకు దోహదం చేస్తుంది. లౌకికవాద మౌలికధర్మాలను అన్ని మతాలవారు అంగీకరించడానికి అది తోడ్పడుతుంది. లౌకిక భారతదేశ భావనకు ఆ తీర్పు ఇతోధిక మేలు చేస్తుంది.

-బల్బీర్‌ పుంజ్‌

(వ్యాసకర్త బీజేపీ సీనియర్‌ నాయకులు)

(ఆంధ్ర జ్యోతి సౌజన్యంతో )