Home Telugu Articles మావోయిస్టులకు, కాశ్మీర్ వేర్పాటు వాదులకు మధ్య సంబంధమున్నదా?

మావోయిస్టులకు, కాశ్మీర్ వేర్పాటు వాదులకు మధ్య సంబంధమున్నదా?

0
SHARE

సుక్మాలో ఆకస్మిక దాడికి కారకులైన వారికి, శ్రీనగర్‌లో రాళ్ళతో ప్రతిఘటిస్తోన్న నిరసనకారులకి మధ్య సంబంధమున్నదా? ముఖ్య నక్సలైట్‌ నాయకులు కశ్మీరీ, పాకిస్థానీ మిలిటెంట్లతో జరిపిన సమావేశాల విషయమై గూఢచార సమాచారం ప్రభుత్వం వద్ద వున్నది.

దేశ భద్రతకు ప్రమాదం వాటిల్లుతోంది. మన దిగంతాలలో కారు మేఘాలు కమ్ముకొస్తున్నాయి. ఈ పుణ్యభూమి సరిహద్దులుగా వున్న కొండలు, మైదానాలు, సముద్రాల చుట్టూ మన శత్రువులు పకడ్బందీగా వ్యాపిస్తున్నారు. అయినా దేశప్రజలు, ముంచుకొస్తోన్న ముప్పును నిరోధించడానికి చురుగ్గా చర్యలు చేపట్టావల్సిన ఆవశ్యకతను గుర్తించినట్టుగా కన్పించడం లేదు. పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకున్నట్టయితే సుక్మాలో సంభవించిన ఆకస్మికదాడిపై దేశవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహావేశాలు ప్రజ్వరిల్లేవి కావూ?

విధి నిర్వహణలో ప్రాణాలర్పించిన జవానుల స్మృతిని గౌరవించడంలో మనమేమీ లుబ్ధంగా వ్యవహరించడం లేదు. వారికి ఘనంగా నివాళులర్పిస్తున్నాం. ఆ అమరవీరుల కుటుంబాలను ఆదుకొంటున్నాం. సుక్మా ఘటనలో గ్రామస్తులను బలవంతంగా భాగస్వాములను చేసినందుకు భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని నక్సలైట్‌ నాయకులను కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ తీవ్రంగా హెచ్చరించారు.

‘విప్లవ’ కార్యకలాపాలలో పాల్గొనే వారిపై ప్రభుత్వం నుంచి వచ్చే ఇటువంటి ఎదురు బెదిరింపుల ప్రభావం పరిమితంగానే వుంటుంది. ఎందుకంటే రాజ్యాంగబద్ధమైన మన వ్యవస్థలో కంటే మావోయిస్టు పాలనలో మాత్రమే సమస్యల నుంచి తక్షణ విముక్తి లభిస్తుందని విశ్వసించేలా ఉద్యమ నాయకులు వారికి బాగా నూరిపోసివుంటారు.

భద్రతా దళాల కదలికలను ముందుగా తెలుసుకొని, ఆకస్మికంగా చుట్టుముట్టి, మూకుమ్మడిగా హతమార్చగల శక్తిసామర్థ్యాలు నక్సలైట్లకు వున్నాయని బస్తర్‌ ప్రాంతంలోని సుక్మాలో రుజువయింది. ఆ ప్రాంతంలో గతంలో అటువంటి ఘటనలు పలుమార్లు సంభవించాయి. రాష్ట్ర అగ్రశ్రేణి రాజకీయ నాయకులు పలువురు సైతం ఆ దాడుల్లో హతమారిపోయారు. అటువంటి పాశవిక ఉదంతాలు బస్తర్‌లో పదే పదే ఎందుకు చోటు చేసుకొంటున్నాయి? సాయుధ నక్సలైట్‌ ఉద్యమం నుంచి ఎదురవుతోన్న బహుముఖ సవాళ్ళను తాము సమర్థంగా ఎదుర్కోగలమనే విశ్వాసాన్ని భద్రతా దళాల ఉన్నతాధికారులు, రాయ్‌పూర్‌, న్యూఢిల్లీలోని రాజకీయ నాయకత్వం ప్రజలకు ఇంకా కల్గించవలసే వున్నది.

మావోయిస్టులు కొంతమందిని సజీవంగా పట్టుకున్నట్టు, వారిని బస్తర్‌ వెలుపల ప్రాంతాలలోని జైళ్ళలో నిర్బంధించినట్టు అప్పుడప్పుడూ వెలువడే వార్తలు ప్రజలకు తమ రక్షణపై తగు భరోసానివ్వడం లేదు. సామాజిక మాధ్యమాలలో వెలువడుతున్న వ్యాఖ్యలను నిశితంగా గమనిస్తే అమాయక గ్రామస్తులు, ముఖ్యంగా గిరిజనులు నక్సలైట్ల మద్దతుదారులుగా మారడానికి కారణమైన మౌలిక సమస్యలను అర్థం చేసుకోవడానికి ఎవరూ తగు శ్రద్ధ చూపడం లేదని విశదమవుతుంది. నిరంతరం ప్రజ్వరిల్లుతున్న హింసాకాండ వల్లే ఖనిజ సంపన్న అటవీ ప్రాంతాల ప్రజలు మావోయిస్టులకు విధేయులుగా మారిపోతున్నారన్నది ఎవరూ కొట్టివేయలేని వాస్తవం. సుక్మాలో సంభవించిన ఆకస్మిక దాడికి వ్యూహ రచన చేసిన నక్సల్‌ నాయకుడు 32ఏళ్ళ హిద్మా అని తెలుస్తోంది. గమనార్హమైన విషయమేమిటంటే హిద్మా, బస్తర్‌ ప్రాంతానికే చెందిన గిరిజనుడు. మావోయిస్టు ఉద్యమాన్ని సామాజిక కోణం నుంచి అధ్యయనం చేస్తున్న వారికి ఇదొక ఆసక్తికరమైన వాస్తవం. న్యూఢిల్లీ, రాయిపూర్‌లో ఏ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ భారత రాజ్యవ్యవస్థను ఇన్ని సంవత్సరాలుగా ధిక్కరిస్తూ వస్తోన్న నక్సలైట్‌ ఉద్యమ మూలాలను అర్థం చేసుకోవడానికి మనం సరైన ప్రశ్నలు వేసుకొంటున్నామా? సమస్యను సహేతుకమైన రీతిలో పరిశీలిస్తున్నామా?

తమను ఎన్నుకున్న ప్రజలపై శాసనసభ్యుల, పార్లమెంటు సభ్యుల ప్రభావం నిజంగా ఏ స్థాయిలో ఉంటోంది? ఎందుకంటే బస్తర్‌లోని నియోజక వర్గాలన్నీ గిరిజనులకు రిజర్వ్‌ అయినవే. భూమి పుత్రులైన ఆ రాజకీయవేత్తల ప్రభావాన్ని తెలుసుకొనేందుకు జరిపే పరిశోధనలకు నిజంగా ప్రోత్సాహం లభిస్తుందా? ఆ ఆదివాసీ నియోజక వర్గాలలో తమకు వాస్తవంగా లభిస్తున్న ఆదరణ విషయమై రాజకీయ పార్టీలు ఆత్మశోధన చేసుకొంటున్నాయా?

సరే, వివిధ స్థాయిలలోని ప్రభుత్వాధికారులుగా వున్న గిరిజనుల విషయమేమిటి? వారందరూ రాజ్యాంగం కల్పించిన వెసులుబాటుతోనే ప్రభుత్వోద్యోగం పొందినవారే కదా. స్థానికులతో వున్న ప్రభుత్వ యంత్రాంగం కంటే జర్నలిస్టులు మొదలైన బయటి నుంచి వచ్చిన వ్యక్తులే బస్తర్‌ ప్రాంత సమస్యల మూలాలను లోతుగా అర్థం చేసుకొంటున్నారనే వాస్తవాన్ని న్యూఢిల్లీ , రాయిపూర్‌లలోని విధాన నిర్ణేతలు విస్మరించకూడదు. సుక్మా ఘటన అనంతరం వెలువడుతున్న వార్తలు నక్సలైట్లు ఏకే–47 తో సహా పలు అత్యాధునిక ఆయుధాలను ఆ ఆకస్మిక దాడిలో వినియోగించారని స్పష్టం చేశాయి. వాటిలో కొన్నిటిని వారు గతంలో భద్రతా దళాల నుంచి స్వాధీనం చేసుకున్నవి అయివుంటాయనడంలో సందేహం లేదు. ఆయుధాలతో పాటు మందుగుండు సామాగ్రి ఉండడం కూడా ఎంతైనా అవసరం. అందునా ఆ ఆయుధాలకు ప్రత్యేకంగా ఉత్పత్తి చేసిన మందుగుండు సామాగ్రి కావాలి. మరి వీటన్నింటిని నక్సలైట్లు ఎలా సమకూర్చుకోగలుగుతున్నారు? వాటి సరఫరాకు పటిష్ఠ ఏర్పాట్లు తప్పకుండా వుండే వుంటాయి. అంతేకాదు ఆ సరఫరా ఏర్పాట్లు అనివార్యంగా వివిధ రాష్ట్రాలకు పరివ్యాప్తమై వుంటాయి.

ఆంధ్రప్రదేశ్‌లో స్వాధీనం చేసుకున్న అక్రమ ఆయుధాలు విదేశాల నుంచి సరఫరా అయినవిగా వెల్లడయింది. ఆయుధాలను స్మగ్లింగ్‌ చేసే స్థానిక ముఠాలు కూడా నక్సలైట్లకు ఆయుధాలు సరఫరా చేస్తున్నాయి. అయితే సుక్మా ఆకస్మిక దాడిలో పాల్గొన్నవారు ఉపయోగించిన ఆయుధాలు దేశ బద్ధ శత్రువుల నుంచి సరఫరా అయినవిగా అధికారులు నిర్ధారించారు.

సుక్మా ఘటనకు బాధ్యులైన వారికి, శ్రీనగర్‌లో రాళ్ళు రువ్వుతున్న నిరసనకారులకి మధ్య సంబంధమున్నదా? ముఖ్య నక్సలైట్‌ నాయకులు కశ్మీరీ, పాకిస్థానీ మిలిటెంట్లతో జరిపిన సమావేశాల విషయమై గూఢచార సమాచారం ప్రభుత్వ రికార్డులలో ఉన్నది. కశ్మీర్‌లో, పాకిస్థాన్‌లో శిక్షణ పొంది చొరబడిన, స్థానిక మిలిటెంట్లు రెచ్చగొడుతోన్న హింసాత్మక సంఘటనలు మన భద్రతాదళాల సమర్థతపై సదభిప్రాయాన్ని కల్గించని విధంగా వుంటున్నాయి. అలాగే నక్సలైట్‌ నాయకులు కూడా, భద్రతా దళాలలో ఆత్మ విశ్వాసాన్ని దెబ్బకొట్టే విధంగా హింసాత్మక సంఘటనలకు పాల్పడుతున్నారు. మరి ఇటువంటి పలు సంఘటనలు దేశ తూర్పు సరిహద్దు ప్రాంతాలలో కూడా చోటుచేసుకొంటున్నప్పుడు ఇవన్నీ మన దేశాన్ని చుట్టుముట్టే వ్యూహంలో భాగంగా సంభవిస్తున్నాయన్న విషయాన్ని మనం ఎలా విస్మరించగలం?

ఈ సందర్భంగా రెండు నిర్దిష్ట పరిణామాలు మనం ప్రస్తావించుకుని తీరాలి. ఒకటి– అరుణాచల్‌ ప్రదేశ్‌లో దలైలామా పర్యటనపై చైనా ఆక్షేపణలు; మన దేశంలో అంతర్భాగమైన అరుణాచల్‌లోని వివిధ ప్రాంతాలకు, బీజింగ్‌ పునఃనామకరణం చేయడం . పొరుగు దేశపు ప్రాంతపు భూభాగాలు తమవి అయినట్టుగా వాటి పేర్లను మార్చడం ఏ అంతర్జాతీయ న్యాయనియమం అనుమతిస్తుందో చైనా పాలకులే చెప్పాలి. రెండోది–హిందూ మహాసముద్రంలో చైనా తలపెట్టిన నావికా విన్యాసాలు. చైనా తన దక్షిణాది రాష్ట్రాలను, పాకిస్థాన్‌లో తాను అభివృద్ధి పరుస్తోన్న గ్వాదర్‌ ఓడరేవుతో అనుసంధానం చేస్తూ రవాణా, పారిశ్రామిక నడవా(కారిడార్‌)లను నిర్మిస్తోంది. ఇందుకు బీజింగ్‌ 5000 కోట్ల డాలర్లను వ్యయం చేస్తోంది. చైనా– పాకిస్థాన్‌ల మధ్య ఇలా పటిష్ఠమవుతోన్న అనుబంధం మన దేశాన్ని సైనికంగా చుట్టుముట్టే లక్ష్యంతోనే అనేది స్పష్టం.

ఇలా మన దేశాన్ని చుట్టు ముట్టడంలో నక్సలైట్లు, కశ్మీరీ వేర్పాటువాదులు, విద్యార్థి జిహాదీలు కీలక పాత్ర వహిస్తున్నారు. భారత్‌లో అంతర్గత భద్రతా పరిస్థితి ఎంతగా బలహీనపడితే తమ లక్ష్యాలను నెరవేర్చుకోవడం అంత సుళువవుతుందని వారు విశ్వసిస్తున్నారు. మన సొంత వామపక్ష– ఉదార వాదులు కూడా ఇందుకు అనుద్దేశపూర్వకంగా తోడ్పడుతున్నారు. భారత్‌ను తన చక్రబంధంలో ఇరికించడానికి కమ్యూనిస్టు చైనా చేస్తున్న ప్రయత్నాలను పట్టించుచుకోవల్సిన అవసరం లేదని న్యూఢిల్లీ విధాన నిర్ణేతలకు నచ్చచెప్పడానికి వారు ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో సుక్మాలో ఆకస్మిక దాడి, విషమిస్తున్న మన భద్రతా పరిస్థితిపై మరొక మేలుకొలుపు.

-బల్బీర్ పుంజ్

(వ్యాసకర్త బీజేపీ సీనియర్‌ నాయకులు)

(ఆంధ్ర జ్యోతి సౌజన్యం తో)