చెన్నైలోని ఆరెస్సెస్ ప్రధాన కార్యాలయంపై ఆగస్ట్ 8, 1993లో నాడు జరిగిన బాంబు దాడి కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ముస్తాక్ అహ్మద్‌ను సీబీఐ శుక్రవారం అరెస్టు చేసింది. 24 ఏళ్లుగా అతడు చట్టం కళ్లుగప్పి తిరుగుతున్నాడు.అతడి ఆచూకీ తెలిపినవారికి రూ.10లక్షల నజరానాను సీబీఐ ప్రకటించింది.
ఈ దాడిలో ఆరెస్సెస్ ప్రధాన కార్యాలయంలో ఉన్న 11 మంది మరణించగా 7 గురు గాయాలపాలయ్యారు. అర్‌డీఎక్స్ పేలుడు దాటికి బహుళ అంతస్తుల భవనం సైతం కూలిపోయింది.
నిందితుడు ముస్తాక్ అహ్మద్ బాంబును తయారుచేయడం కోసం పేలుడు పదార్థాలను సమకూర్చాడని, ఇతర నిందితులకూ అతడు ఆశ్రయమిచ్చాడని సీబీఐ దర్యాప్తు అధికారులు పేర్కొన్నారు.
తమిళ నాడు ప్రభుత్వం కోరిక మేరకు చేట్ పాట్ పోలీస్ స్టేషన్ లో నమోదు అయిన కేసును రాష్ట్ర పోలీస్ నుండి సీబీఐకు బదిలీ చేయడం జరిగింది.
అహ్మద్ ను చెన్నైలోని శివార్లలో అరెస్టు చేసినట్లు సీబీఐ అధికార ప్రతినిధి అభిషేక్ దయాల్ తెలిపారు.
ఈ కేసులో 11 మందిని ప్రత్యేక కోర్టు దోషులుగా తేల్చింది. వీరిలో ముగ్గురికి జీవిత ఖైదు విధించింది.