ఫారిన్ కంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ ప్రకారం విదేశీ నిధులు పొందుతున్న సంస్థల విషయంలో భారత ప్రభుత్వం మరింత కఠినమైన నిబంధనలు రూపొందించింది. ఇకపై ఎఫ్.సి.ఆర్.ఏ లైసెన్సుల కోసం లేదా విదేశీ నిధులు పొందేందుకు ముందస్తు అనుమతులు కోరే సంస్థలకు చెందిన ముఖ్య సభ్యులందరూ కూడా తమపై గతంలో మతమార్పిడి ఆరోపణలు కానీ, కేసులు కానీ లేవని అఫిడవిట్ సమర్పించాలని కేంద్ర హోంశాఖ నూతన నిబంధన జారీ చేసింది. అఫిడవిట్ తో పాటుగా సభ్యులు తమ ప్రభుత్వ గుర్తింపు కార్డులను కూడా ఈ సందర్భంగా సమర్పించాల్సి ఉంటుంది.
తాజా నిబంధన ప్రకారం కేవలం మతమార్పిళ్లు మాత్రమే కాకుండా, మతపరమైన ఉద్రిక్తతలు రెచ్చగొట్టడం, దేశద్రోహం, నిధుల దుర్వినియోగం వంటి నేరాల్లో ప్రమేయం కానీ, ప్రాథమిక అభియోగాలు కూడా ఇకపై సంస్థ సభ్యులపై ఉండరాదు.
ఫారిన్ కంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ 2010 చట్టంలోని సెక్షన్ 12(4) ప్రకారం ఇప్పటి దాకా కేవలం సంస్థ ముఖ్య కార్యనిర్వాహక సభ్యుడు లేదా అధినేత మాత్రమే ఈవిధమైన డిక్లరేషన్ ఇవ్వాల్సి ఉంది. కానీ తాజా నిబంధన ప్రకారం సంస్థ (ట్రస్ట్ లేదా సొసైటీ లేదా లాభాపేక్ష లేని కంపెనీ)లోని ముఖ్య సభ్యులందరూ తమపై క్రిమినల్ నేరాలు లేదా అభియోగాలు లేవని అఫిడవిట్ ఇవ్వాల్సి ఉంటుంది.
ఇప్పటికే ఎఫ్.సి.ఆర్.ఏ లైసెన్సు కలిగి విదేశాల నుండి నిధులు సమకూర్చుకుంటున్న సంస్థలు తమ లైసెన్సుల రెన్యూవల్ సమయంలో ఎఫ్.సి-3బి ఫామ్ తో పాటుగా సంస్థ సభ్యుల అఫిడవిట్లు కూడా సమర్పించాలి.