Home News పాకిస్థాన్ లో హిందువులపై ఆగని దాడులు, మైనర్ బాలికను మతం మార్చిన ముస్లింలు

పాకిస్థాన్ లో హిందువులపై ఆగని దాడులు, మైనర్ బాలికను మతం మార్చిన ముస్లింలు

0
SHARE

హిందూ బాలికలను అపహరించి బలవంతంగా మతమార్పిడి చేస్తున్న సంఘటనలు పాకిస్తాన్లో రోజు రోజుకు పెరుగుతున్నాయి. పాకిస్తాన్లోని హిందువులు, ఇతర మైనారిటీల రోజువారీ జీవితంలో  హింస, వేదన  ఒక భాగంగా మారుతోంది.  హిందూ మహిళపై అత్యాచారం, దారుణ హత్య జరిగిన వారంలోపే, మరో మైనర్ బాలికను అపహరించి మతం  మార్చారు.

సింధ్ ప్రావిన్స్ లోని జకోబాబాద్ జిల్లాలో నివసిస్తున్న మెహక్ కుమారి (14) అనే 9 వ తరగతి విద్యార్థినిని  జనవరి 15 న కిడ్నాప్ చేసి ఇస్లాం మతంలోకి మార్చినట్లు సమాచారం. పాకిస్తాన్ హిందువుల యూత్ ఫోరం (పిహెచ్‌వైఎఫ్) అనే ఫేస్‌బుక్ పేజీ ఈ సంఘటనను వివరించింది. మెహక్ కుమారి తండ్రి ఒక వ్యాపారవేత్త అని, ఆమెను అలీ రాజా సోలాంగి అనే ఒక వ్యక్తి, వివాహం చేసుకునే సాకుతో కిడ్నాప్ చేసి మతం మార్చారు. అయితే అలీ రాజా ఇప్పటికే వివాహితుడని, పిల్లలు కూడా ఉన్నారని ఆ పోస్ట్ లో  తెలిపారు.

ఈ సంఘటనను మీడియా దృష్టికి తీసుకువెళ్లినప్పటికీ ఎవరూ పట్టించుకోలేదని పి.హెచ్‌.వై.ఎఫ్ తెలిపింది. ఆఫహరించినవారు మాత్రం ఇది ప్రేమ వ్యవహారమని, బలవంతపు అపహరణ కాదని అంటున్నారని, కానీ అలీ రాజా ఒక కూలీ అని , బాలికతో ఎలాంటి సంబంధం లేదని పి.హెచ్‌.వై.ఎఫ్ తెలిపింది.

తన మైనర్ కుమార్తె అపహరణ వెనుక ఉన్న వ్యక్తి గురించి తాను అధికారులకు సమాచారం ఇచ్చానని మెహక్ తండ్రి విజయ్ కుమార్ చెప్పారు. పాకిస్తాన్ లోని  హిందువులను, ఇతర మైనారిటీ వర్గాలను లక్ష్యంగా చేసుకుని సాగుతున్న బలవంతపు మత మార్పిడులు, బాల్య వివాహాలను అడ్డుకోవడంలో  సింధ్ అధికారులు విఫలమయ్యారని హిందువులు ఆరోపించారు.

న్యాయం చేయాలని సోషల్ మీడియాలో కోరుతున్న హిందువులు

అపహరణలు, మతమార్పిడిలతో బాధపడుతున్న పాకిస్తాన్లోని హిందువులు ఇప్పుడు న్యాయం కోసం సోషల్ మీడియాలో పోరాడుతున్నారు. పి.హెచ్‌.వై.ఎఫ్ (PHYF ) నేతృత్వంలోని ఈ ప్రచారం పాకిస్తాన్‌లో చాలా మందికి సమస్య తీవ్రతను తెలియజేసింది. పి.హెచ్‌.వై.ఎఫ్ ఫేస్ బుక్ పేజీకి 31 వేలకు పైగా లైక్‌లు ఉన్నాయి. వారు ఈ ఫేస్ బుక్ పేజీలో  పాకిస్తాన్‌లో హిందువులపై జరిగిన దారుణాలను ప్రపంచం దృష్టికి తీసుకువస్తున్నారు.  

కిడ్నాప్ కు గురై మతం మార్చబడిన హిందూ అమ్మాయిల జాబితాను కూడా ఈ బృందం బయట పెట్టింది. జాబితా ప్రకారం, గత కొన్ని నెలల్లోనే 50 మంది బాలికలను కిడ్నాప్ చేసి మతం మార్చారు. వారు ఇచ్చిన జాబితాలో  బాలికలను కిడ్నాప్ చేసినవారి పేర్లతో పాటు ప్రదేశాల వివరాలను కూడా ఇచ్చారు.

 ‘మతం పేరిట మా కుమార్తెలను ఈ దుర్మార్గులు లాక్కోవడం చూస్తూ ఉండటం కంటే వలసపోయి, శరణార్థి శిబిరాల్లో ఉండటం మంచిది’ అని పి.హెచ్‌.వై.ఎఫ్ తన ఫేస్ బుక్ పేజీలో  పోస్ట్ చేసింది.

-ఆర్గనైజర్ సౌజన్యంతో