ఒక ఆలోచన కోట్లాది ప్రజలు నడిచే మార్గాన్ని మార్చగలదు. ఒక త్యాగం మరెందరి ఆలోచనలనో ప్రభావితం చేయగలదు. స్వాతంత్య్రోద్యమ సమరంలో అలాంటి ప్రభావం చూపిన వ్యక్తుల్లో చెప్పుకోదగినవారు- లోకమాన్య బాలగంగాధర్ తిలక్, చంద్రశేఖర్ ఆజాద్. ఒకరు ‘స్వరాజ్యం నా జన్మ హక్కు’ అంటూ నినదించారు. స్వరాజ్య సాధన కోసం మరొకరు జీవితాన్నే త్యాగం చేశారు. తిలక్ తన మాటలతో యువతలో స్ఫూర్తి నింపి, స్వరాజ్య సాధన దిశగా సాధారణ ప్రజలను సైతం ముందుకు నడిపిస్తే, ఆజాద్ తన త్యాగంతో యువకుల్లో స్వతంత్ర కాంక్ష రగిలించారు.
భారత స్వాతంత్య్ర గాథ 1857లోనే ప్రారంభమైంది. ఆ ఉద్యమాన్ని సిపాయిల తిరుగుబాటుగా బ్రిటిష్‌వారు పరిగణించి, దాని పట్ల ప్రపంచ, భారతీయ దృష్టి కోణాలను మార్చే ప్రయత్నం చేశారు. అందువల్లే చాలామంది దాని ప్రాధాన్యతను విస్మరించారు. 1857 ఉద్యమాన్ని బ్రిటిష్ పాలకులు అణచిన తీరు అతి క్రూరమైంది. ఆ తరవాత స్వాతంత్య్రం కోసం కొందరు శాంతియుత పంథాలో ముందుకు సాగారు. మరికొందరు విప్లవ పంథా ఎంచుకున్నారు. తన మాటలతో విప్లవ భావాలు నూరిపోసి యువతను ఉత్తేజితం చేసిన వ్యక్తి బాల గంగాధర్ తిలక్ అయితే; అసమాన ధైర్య సాహసాలతో ప్రాణం కంటే దేశం విలువైనదనే స్ఫూర్తిని నరనరాన నింపినవారు చంద్రశేఖర్ ఆజాద్. స్వరాజ్యం తన జన్మహక్కు అని నినదిస్తూ, దాన్ని సాధించి తీరుతానంటూ శపథం పూని, ముందుకు సాగిన దేశభక్తుల్లో మొదటగా స్మరించాల్సినవారు బాల గంగాధర తిలక్. జాతీయవాదిగా, సామాజికవాదిగా, స్వాతంత్య్ర సమరయోధుడిగా, జాతీయోద్యమాన్ని కొత్తపుంతలు తొక్కించి, దేశవ్యాప్తంగా సామాన్యులు సైతం ఆ ఉద్యమంలో పాల్గొనే విధంగా చేయడంలో ఆయన పాత్ర అమోఘమైనది. అందుకే ఆయన్ను సంపూర్ణ స్వరాజ్యోద్యమానికి పితామహుడిగా చరిత్రకారులు చెబుతారు. జాతీయవాదానికి తొలుత బీజం వేసి, స్వరాజ్యకాంక్షను ప్రతి గుండెలో మొలకెత్తించిన మహా నాయకుడు. ఆధునిక భారతీయ విద్యావిధానానికి ఆద్యుడు.
భారతీయతకు ప్రతీక
ఆధునిక భావాలతో కళాశాల విద్య అభ్యసించిన తిలక్, ఉపాధ్యాయుడిగా జీవితం ప్రారంభించారు. పత్రికా విలేకరిగానూ పని చేశారు. పాశ్చాత్య విద్యావిధానం వల్ల భారతీయ విద్యార్థుల్లో సంస్కృతి పట్ల సరైన అవగాహన కలగడం లేదని, పైపెచ్చు అది భారతీయ సాంస్కృతిక వారసత్వాన్ని అగౌరవపరచి, భారతీయ విద్యార్థులను చిన్నబుచ్చేలా ఉందనే ఉద్దేశంతో బాహాటంగానే నిరసన ప్రకటించారు. మంచి విద్య ద్వారానే మంచి పౌరులు తయారవుతారనే ఆలోచనతో, ప్రతి భారతీయుడికి సంస్కృతి గురించి, దేశ ఔన్నత్యం గురించి బోధించాలన్న భావన ఆయనది. అందుకే ‘డక్కన్ ఎడ్యుకేషనల్ సొసైటీ’ అనే విద్యాసంస్థ స్థాపనతోపాటు మరాఠీ భాషలో కేసరి దినపత్రికనూ ప్రారంభించారు. వాక్ స్వాతంత్య్రం, భారతీయ సంస్కృతి పట్ల బ్రిటిష్ పాలకులు చూపుతున్న నిర్లక్ష్య వైఖరిపై, తిలక్ యుద్ధం ప్రకటించారు. భారతీయ సంస్కృతిపై బ్రిటిష్ నాయకుల అణచివేతను 1857 తిరుగుబాటు తరవాత అంతగా నిరసించిన వ్యక్తిగా ఆయన పేరు చెప్పుకోవాలి.
జాతీయ స్ఫూర్తి రగిలించేందుకు వీలున్న ఏ చిన్న సందర్భాన్నీ తిలక్ వదిలిపెట్టలేదు. ఈ రోజు దేశవ్యాప్తంగా అందరినీ ఒక్కటి చేసే సంకల్పంతో సాగుతున్న గణపతి ఉత్సవాలు, శివాజీ ఉత్సవాలు తిలక్ భావన వాహిని ప్రభావం నుంచే ప్రారంభం అయ్యాయి. భారతీయుల పూజా మందిరాల్లో జరిగే గణేశ పూజకు సామూహికమైన, సామాజికమైన, సార్వజనీనమైన ప్రాధాన్యత అందించడంలో ఆయన చేసిన కృషి ఎంతో ఉంది. ఇవన్నీ స్వరాజ్య సాధనకు ప్రభావిత మాధ్యమాలుగా మారాయి. ఇదే తిలక్‌కు స్వాతంత్య్ర సంగ్రామంలో ఓ ప్రాధాన్యత కల్పించాయి. 1920లో మరణించినప్పుడు ఆయన్ను ‘నవభారత నిర్మాత’గా మహాత్మ గాంధీ అభివర్ణించారు. తిలక్ తరవాతా ఆయన స్ఫూర్తి స్వాతంత్య్ర ఉద్యమం దిశగా యావత్ భారతాన్ని నడిపించింది. నేటికీ జాతీయవాద స్ఫూర్తిని మనలో నింపుతూనే ఉంది.
తిలక్ తన విధానాలతో యువతలో ఉత్తేజం తీసుకొస్తే, తన త్యాగం ద్వారా యువతకు స్ఫూర్తిగా నిలిచిన జ్వలంత విప్లవవాది చంద్రశేఖర్ ఆజాద్. తన సర్వస్వాన్ని దేశ స్వాతంత్య్రం కోసం అర్పించిన మహా వ్యక్తి. ఆయన ధైర్యం అసామాన్యం. వ్యక్తిత్వం ప్రజాస్వామ్యవాదులకు ఉత్తేజం. దీపావళి మతాబుల వెలుగులు చంద్రశేఖర్ మదిలో స్వతంత్ర జ్వాలలు రగిలించాయి. చిన్న అగ్గిపుల్లే ఇంత వెలుగిస్తే, అన్ని అగ్గిపుల్లలు కలిస్తే, ఇంకెంత వెలుగిస్తాయనే ఆలోచన- ఆయన దృక్పథంలో ఎనలేని మార్పు తీసుకొచ్చింది. ఆ నాటి దేశ పరిస్థితులు చూసి చలించిపోయిన ఆజాద్, బ్రిటిష్ పాలకుల దమననీతికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేయాలనే ప్రేరణ పొందారు. ఆర్య సమాజ్ ప్రభావమూ ఆయన మీద చాలా ఉంది. రౌలత్ చట్టానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా జరిగిన ప్రదర్శనలు ఆయనలో కొత్త ఆలోచనలు రేకెత్తించాయి. జలియన్ వాలాబాగ్ దురంతం తరవాత ఆలోచన ప్రవాహం మరింత పెరిగింది. నాలుగు వైపులా గోడలు ఉన్న పార్కు మైదానంలో పెద్దా చిన్నా తేడా లేకుండా నిరాయుధులపై జనరల్ డయ్యర్ కాల్పులు జరపడం దేశమంతా పెద్దయెత్తున నిరసనలకు కారణమైంది. 14 ఏళ్ల ఆజాద్ రక్తం ఉప్పొంగింది. అనంతరం సహాయ నిరాకరణ ఉద్యమం, విదేశీ వస్తు బహిష్కరణ సమయంలో బ్రిటిష్ పోలీసుల దమనకాండ, అత్యాచారాలను చూసి ఆజాద్ జ్వలించిపోయారు. అన్యాయాలకు వ్యతిరేకంగా నిరసన తెలిపారు. పోలీసులు అరెస్టు చేసి జైలులో పెట్టినా, చలికాలం కనీసం దుప్పటి కూడా ఇవ్వకుండా లాకప్‌లో పెట్టినా, రాత్రంతా వ్యాయామం చేస్తూ జైలులోనే గడిపారు.
కారాగారంలోనూ కదనోత్సాహం
స్వరాజ్య సముపార్జన కోసం తిలక్ అనేకమార్లు జైలు పాలయ్యారు. ఏ దశలోనూ జైలు గదులు ఆయన స్వరాజ్య నినాదాన్ని అడ్డుకోలేకపోయాయి. ఒకానొక సమయంలో ఆయన జైలుపాలు కావడాన్ని రాజనీతిజ్ఞులంతా వ్యతిరేకించి, విడుదల చేయమంటే- ఉత్సవాల్లో పాల్గొనకూడదు, ప్రభుత్వాన్ని విమర్శించకూడదనే రెండు ఆంక్షలను నాటి ప్రభుత్వం ఆయన ముందుంచింది. పిరికివాడిగా బతకడం కంటే అండమాన్ జైలులో ఉండటమే మేలని నాడు ఆయన చెప్పిన మాటలు యావత్ దేశాన్ని ఉత్తేజపరచాయి. 1908లో దేశద్రోహ నేరం కింద నాటి బ్రిటిష్ కోర్టు ఆరేళ్ళ పాటు ద్వీపాంతర జైలుశిక్ష విధించింది. 1908 నుంచి 1914 వరకు తిలక్, బర్మాలోని మాండలే జైలులో ఉన్నారు. చాలా చిన్న జైలుగదిలో ఒంటరి జీవితం గడిపిన తిలక్, గీతారహస్యం పేరిట భగవద్గీత మీద గొప్ప వ్యాఖ్యానం రాశారు. కర్మ చేయడమే మన కర్తవ్యమని చెప్పిన ఆ గ్రంథం విజ్ఞుల మన్ననలు అందుకుంది.
ఒకసారి చంద్రశేఖర్ ఆజాద్‌ను మేజిస్ట్రేట్ ముందు హాజరుపరచారు. అక్కడ ఆయన సమాధానాలు ఎందరికో కనువిప్పు కలిగించాయి. నీ పేరు ఏమిటి అంటే నవంబర్ అని, నాన్న పేరు ఏమిటంటే డిసెంబర్ అని సమాధానాలిచ్చారు. న్యాయమూర్తి రెట్టించి నీ పేరు ఏమిటంటే ఆజాద్ అని, తండ్రి పేరేమిటంటే స్వాతంత్య్రం అని, నివాసం ఎక్కడా అంటే జైలు అని చెప్పిన సమాధానాలకు మేజిస్ట్రేట్ బిత్తర పోయారు. 15 బెత్తపు దెబ్బల్ని శిక్షగా విధించారు. జైలులో అనేక హింసలకు గురి చేశారు. క్రూరంగా కర్రలతో, కొరడాతో హింసించారు. గాంధీజీకి జై అంటూ నినదిస్తూ, తొణకకుండా శిక్ష అనుభవించిన తీరు సంచలనం కలిగించింది. చంద్రశేఖర్ పేరు… చంద్రశేఖర్ ఆజాద్‌గా మారిపోయింది. చంద్రశేఖర్ ఆజాద్‌కు జై, భారత్ మాతాకు జై అనే నినాదాలు మిన్నంటాయి. ఆయన ఫొటో పత్రికల్లో ప్రచురితమైంది. ఆ సందర్భం ఎందరో యువకుల మనసులో స్వాతంత్య్రోద్యమ భావనలను బీజాలుగా నాటింది.
విప్లవదీప్తి
చాణక్యుడు చెప్పిన రాజనీతి సూత్రాన్ని ఆజాద్ ఆచరించారు. కుటుంబం కోసం వ్యక్తి, గ్రామం కోసం కుటుంబం, రాష్ట్రం కోసం గ్రామం, దేశం కోసం రాష్ట్రం త్యాగం చేయాలనే మార్గంలో పయనించారు. సరిగ్గా అదే సమయంలో హిందూస్థాన్ రిపబ్లిక్ అసోషియేషన్‌లో రామ్‌ప్రసాద్ బిస్మిల్ లాంటి క్రాంతికారులతో పరిచయం ఆయన మార్గాన్ని మలుపు తిప్పింది. నాడు క్రాంతికారులు (విప్లవకారులు)కి, నేటివారికీ మధ్య చాలా తేడా ఉంది. నాటి క్రాంతికారులు దేశం కోసం, విదేశీయులను పారదోలేందుకు తమ సర్వస్వాన్ని అర్పించారు. నేడు తాము కోరుకున్న మార్పులు సాధించుకునేందుకు దేశంలో అశాంతి పరిస్థితులు నెలకొల్పి, విప్లవానికి చెడు అర్థాన్ని తీసుకొస్తున్నారు. మారువేషాల్లో పర్యటించడం, ఉద్యమానికి నిధులు సమకూర్చుకోవడం లాంటి విప్లవ పంథాల్లో పయనించి, దేశ స్వాతంత్య్రం కోసం ఆజాద్ తమ సర్వస్వాన్ని త్యాగం చేశారు.
సరిగ్గా అదే సమయంలో జరిగిన కాకోరి ఘటన ఆజాద్ జీవితాన్ని మరో మలుపు తిప్పింది. రైలును అడ్డగించి, దానిలో ఆయుధాలు స్వాధీనపరచుకునే ప్రయత్నంలో చాలామంది క్రాంతికారులు పోలీసులకు దొరికిపోగా, చంద్రశేఖర్ ఆజాద్ సహా మరికొందరు తప్పించుకున్నారు. బ్రిటిష్ ప్రభుత్వం దీన్ని సవాలుగా భావించి, దొరకనివారిని తప్పించుకుని తిరుగుతున్నవారిగా ప్రకటించింది. లక్షలు ఖర్చుచేసి, తమ చేతుల్లో కట్టుబడిపోయిన న్యాయవ్యవస్థ ద్వారా ఉరిశిక్షలు విధింపజేసింది. అనంతరం ఆజాద్, మోటార్ మెకానిక్‌గా పని చేస్తూ, గాయపడి, పోలీసులకు దొరికే పరిస్థితులు ఏర్పడినా తప్పించుకు తిరిగారు. భగత్ సింగ్ లాంటివారితో కలిసి హిందుస్థాన్ సమాజ్‌వాది గణతంత్ర సేనను నిర్మాణం చేశారు. ఆపై కొంత కాలానికి పార్లమెంట్ మీద దాడి ఘటనలో భగత్ సింగ్, సుఖ్‌దేవ్‌లకు న్యాయస్థానం ఉరిశిక్ష విధించింది. వారిని కాపాడేందుకు ఆల్ఫ్రెడ్ పార్కులో విప్లవ మిత్రులతో కలిసి చర్చలు జరుపుతున్నప్పుడు, వారిలో పోలీసులు కూడా ఉన్నారని నిర్ధారించుకున్నారు. తన దగ్గర ఉన్న తుపాకీతో ముగ్గురు పోలీసులను కాల్చారు. అనంతరం చాలామంది పోలీసులు ఆయన్ను వెంబడించారు. బ్రిటిష్‌వారికి దొరకకూడదనే ఉద్దేశంతో, తన తుపాకీలో ఉండే ఒకే ఒక గుండుతో తనను తాను కాల్చుకుని 25 ఏళ్ళ వయసులో చంద్రశేఖర్ ఆజాద్ ఆత్మార్పణ గావించారు.
బాలగంగాధర్ తిలక్, చంద్రశేఖర్ ఆజాద్… ఈ మహానుభావులు ఎన్నో సంప్రదాయాలు, విలువలను దేశం ముందు ఉంచారు. స్వాతంత్య్రం, త్యాగం అనే పదాలకు విస్తృత అర్థం చెప్పారు. దేశ స్వాతంత్య్రం కోసం తమ సర్వస్వాన్ని అర్పించిన అలాంటి మహనీయులను చూసి ప్రతి పౌరుడు స్ఫూర్తి పొందాలి. ఆ మహానాయకులకు నివాళి అర్పించడం మాత్రమే కాదు, వారు అందించిన జాతీయవాద భావనల స్ఫూర్తితో నవభారత నిర్మాణానికి కదలాలి. స్వరాజ్యాన్ని సురాజ్యంగా మలచుకోవాలి. నాడు స్వరాజ్యం జన్మహక్కుగా కదిలారు. నేడు సురాజ్యం మన ప్రాథమిక హక్కుగా నినదించాలి!
– ముప్పవరపు వెంకయ్యనాయుడు
This Article First Published On 23.07.2020