ఐసిస్… సిరియాను స్థావరంగా చేసుకుని ప్రపంచ దేశాలను వణికిస్తున్న భయంకర ఉగ్రవాద సంస్థ. విష భావజాలాన్ని ప్రపంచం నలు మూలలకూ విస్తరింపజేస్తున్న ఉన్మత్త మూక ఇది! ఈ ఉగ్రభూతాన్ని అంతమొందించడంలో ఎవరి దారి వారిదే అన్నట్లు ఇన్నాళ్లూ వ్యవహరించిన అమెరికా, రష్యాలు ఇప్పుడీ విషయంలో ఒక్కటయ్యాయి. ఐసిస్‌ను అన్ని విధాలా దిగ్బంధించి, తుదముట్టించేందుకు వ్యూహాత్మకంగా ముప్పేట దాడులు మొదలెట్టాయి. ఫలితంగా సిరియా, ఇరాక్‌లోని తన ప్రాబల్య ప్రాంతాలను ఐసిస్ ఒక్కొక్కటిగా కోల్పోతోంది. అగ్రనాయకత్వమూ అంతమవుతోంది. జాతి విద్వేషానికి నెత్తుటి భాష్యం చెబుతున్న ఐసిస్ కథ ఇంతటితో ముగుస్తుందా, కొత్త ఎత్తుగడలతో ముందుకొస్తుందా అన్నది ఇప్పుడు ప్రపంచ దేశాలను తొలుస్తున్న ప్రశ్న!
ఆధునిక ప్రపంచంలో ఇస్లామిక్ స్టేట్(ఐసిస్) సృష్టిస్తున్న కల్లోలం అంతాఇంతా కాదు. ఐసిస్ పేరు చెబితేనే అన్ని దేశాలు ఉలిక్కిపడుతున్నాయి. సిరియాలో నెలకొన్న రాజకీయ సంక్షోభాన్ని ఆసరా చేసుకొని ఐసిస్ సొంత రాజ్యాన్ని స్థాపించుకుంది. సరిహద్దుల విస్తరణకన్నా వేగంగా భావజాలాన్ని ప్రపంచమంతటా వ్యాపింపజేసింది. సిరియాలో మొదలైన ముసలం పొరుగు దేశాలైన ఇరాక్, టర్కీలకూ పాకింది. అమెరికా వంటి అగ్రరాజ్యం సహా ఫ్రాన్స్, బెల్జియం లాంటి ఐరోపా దేశాలూ ఉగ్రవాద ఘటనలతో వణికిపోయాయి. సిరియా అధ్యక్షుడు బషర్ అల్ అసద్‌కు వ్యతిరేకంగా 2011లో ‘అల్‌ఖైదా అరేబియన్ పెనిన్సులా’ పేరిట పోరాటం మొదలుపెట్టిన ఉగ్రవాదులు, 2013 నుంచి క్రమంగా సిరియా, ఇరాక్ భూభాగాలను ఆక్రమించుకున్నారు. ఆక్రమిత ప్రాంతాలకు ‘ఇస్లామిక్ స్టేట్’ (ఐసిస్) అని పేరుపెట్టి, నరమేధం మొదలుపెట్టారు. తొలుత కుర్దులు, యజాదీ తెగలను తెగనరకడం ప్రారంభించారు. ‘ద సిరియన్ అబ్జర్వేటరీ ఫర్ హ్యూమన్ రైట్స్’ సంస్థ లెక్కల ప్రకారం ఐసిస్ దురాగతాల కారణంగా ఇప్పటివరకూ 86వేల సాధారణ పౌరులతో సహా మూడు లక్షల మంది మరణించారు. ఐక్యరాజ్య సమితి అంచనాల ప్రకారం 48 లక్షలమంది సిరియా ప్రజలు శరణార్థులయ్యారు. ఒక్క జర్మనీకే 7.40లక్షల శరణార్థి దరఖాస్తులు అందాయి. ఇరాక్‌లోనూ దాదాపు 30 లక్షల మంది తమ ఇళ్లు వదిలేసి పరారయ్యారు. అమెరికాలోని ‘నేషనల్ కౌంటర్ టెర్రరిజం సెంటర్’ అధ్యయనం ప్రకారం ఇరాక్, సిరియాలకు ఆవల ఐఎస్ మొత్తం 18 దేశాల్లో క్రియాశీలక పాత్ర పోషిస్తోంది. ఐసిస్ ప్రభావం ఎంత తీవ్రంగా ఉందంటే 2015 డిసెంబరు నాటికి 86 దేశాల నుంచి మొత్తం 27 వేలమంది ఐసిస్ తరఫున యుద్ధం చేసేందుకు సిరియా బాట పట్టారు. వీరిలో అమెరికా, ఐరోపా, ఆస్ట్రేలియాలకు చెందినవారూ ఉండటం- ఐసిస్ భావజాల విస్తృతికి నిదర్శనం. రెండో ప్రపంచ యుద్ధం తరవాత ఇంతలా ప్రపంచాన్ని కలవరపాటుకు గురిచేసిన పరిణామం మరొకటి లేదు. ఐసిస్ మారణహోమాన్ని అడ్డుకోవడానికి ప్రపంచం అంతా కలిసికట్టుగా ముందుకు కదిలింది. దాంతో ఎంత దూకుడుగా విస్తరించిందో, అంతే వేగంగా ఐసిస్ పతనం మొదలైంది.
పట్టు బిగిస్తున్న సంకీర్ణదళాలు
అమెరికా ఆధ్వర్యంలోని సంకీర్ణ దళాలు 2014 ఆగస్టు నుంచి ఐసిస్‌పై ముప్పేటదాడి మొదలుపెట్టాయి. ఇప్పటివరకూ పదివేలకు పైగా వైమానిక దాడులు జరిపాయి. మరోవైపు ‘సంకీర్ణ దళాల’తో సంబంధం లేకుండా రష్యా సొంతంగా దాదాపు ఆరువేల విమాన దాడులు జరిపింది. సిరియా ప్రభుత్వం పట్టుకోల్పోయిన అలెప్పో పట్టణాన్ని తిరిగి స్వాధీనం చేసుకోవడానికి రష్యా దాడులు ఎంతగానో ఉపకరించాయి. సంకీర్ణ దాడులను ఐసిస్ మొదట్లో దీటుగానే ఎదుర్కొంది. నైజీరియాకు చెందిన బొకొహరాం, ఈజిప్టులోని అతివాద ఉగ్రవాద సంస్థ అన్సర్ బైత్ అల్ మక్దీస్‌లు 2015లో ఐసిస్ అధినేత అల్ బగ్దాదీకి సంఘీభావం ప్రకటించాయి. అదే సంవత్సరం ఐసిస్ ఉగ్రవాదులు ఇరాక్‌కు చెందిన రమాది, సిరియాలోని పాలమైర పట్టణాలతోపాటు లిబియాలోని సిర్తే పట్టణాలను పూర్తిగా తమ అదుపులోకి తెచ్చుకున్నారు. ఇదే సమయంలో సంకీర్ణ దళాల దాడుల్లో ఎదురుదెబ్బలూ తిన్నారు. జనవరిలో సంకీర్ణ దళాలు సిరియా సరిహద్దు పట్టణమైన కొబనె నుంచి ఐసిస్‌ను పూర్తిగా తరిమేశాయి. మార్చిలో తిక్రిత్ పట్టణాన్ని ఇరాక్ తన స్వాధీనంలోకి తెచ్చుకుంది. సిరియా-టర్కీ సరిహద్దులో ఉన్న తల్‌అబ్యాద్ పట్టణాన్ని సిరియా ప్రభుత్వం జూన్‌లో తిరిగి ఆధీనంలోకి తెచ్చుకుంది. తల్‌అబ్యాద్ స్వాధీనంతో ఐసిస్ రాజధాని రక్కాకు సిరియా, టర్కీల నుంచి సరఫరాలు నిలిచిపోయాయి. నవంబరు నాటికి ఇరాకీ దళాలు సింజర్ పట్టణాన్ని ఐసిస్ నుంచి విముక్తం చేశాయి. డిసెంబరులో రమాదీని సైతం స్వాధీనపరుచుకున్నాయి. అరబ్, కుర్దు దళాలు సిరియన్ డెమొక్రటిక్ ఫోర్స్ (ఎస్‌డీఎఫ్) పేరుతో ఏకమై, సంకీర్ణ దళాల వైమానిక దాడుల సహకారంతో ఐసిస్ రాజధాని రక్కాపై రెండువైపుల నుంచి దాడులు మొదలుపెట్టాయి. 2016 జూన్‌లో ఫజుల్లా కోసం జరిగిన పోరులో ఐఎస్ పరాజయం పాలైంది. ఈ పోరులో 25వేల మంది ఉగ్రవాదులు హతులయ్యారు. ఇరాక్‌లో తమ ఆధీనంలో ఉన్న భూభాగం నుంచి 40 శాతం ఐసిస్ చేజారింది. 2016 డిసెంబరు నాటికి ఇరాక్‌లోని హీత్, రుత్బా పట్టణాలు, సిరియాలోని అల్ శద్దాద్ పట్టణాలనూ కోల్పోయిది. దీనికితోడు ఉగ్రవాదుల ఆధీనంలో ఉన్న తూర్పు అలెప్పో ఓడరేవును సిరియా దళాలు స్వాధీనం చేసుకున్నాయి. సంకీర్ణ దళాలు దాడులు మొదలుపెట్టక ముందు ఐసిస్ పరిధి 78 వేల చదరపు కిలోమీటర్లు. 2016 డిసెంబరు నాటికది 60,400 చ.కి.కు పడిపోయింది. ఆ రకంగా అది 14 శాతం భూభాగం కోల్పోయిందని ఐహెచ్‌ఎస్ అనే సంస్థ అధ్యయనం వెల్లడించింది. ఈ ఏడాది జూన్ నాటికి ఇరాకీ దళాలు మొసూల్‌ను తిరిగి స్వాధీనం చేసుకుంటాయని భావిస్తున్నారు.
భూభాగాలనే కాదు, అగ్ర నాయకులను సైతం ఐసిస్ కోల్పోయింది. బగ్దాదీ తరవాత రెండోస్థానంలో ఉన్న అబూఅల్ అఫ్రీ 2015 మేలో జరిగిన అమెరికా వైమానిక దాడుల్లో హతమయ్యాడు. అతడితోపాటు చమురు, గ్యాస్ అక్రమ వ్యాపారం ద్వారా ఐసిస్‌కు పెద్దమొత్తంలో నిధులు సమకూర్చిన ట్యునీసియా దేశస్థుడు అబూ సయ్యాఫ్ మరణించాడు. ఇరాక్ దేశీయురాలైన అతడి భార్య ఉమ్మ సయ్యాఫ్ పట్టుబడింది. అల్‌అఫ్రీ మరణం తరవాత అతడి స్థానంలో ఫాదిల్ అహ్మద్ అల్ హయాలీ అలియాస్ హజ్జీ ముతాజ్ నియమితుడయ్యాడు. మూడు నెలల వ్యవధిలో అతణ్ని సంకీర్ణ దళాలు మట్టుపెట్టాయి. ఐసిస్ మీడియా వ్యవహారాల పర్యవేక్షకుడు అబూ అబ్దుల్లాతో కలిసి మొసూల్ వద్ద కారులో ప్రయాణిస్తున్న హయాలీ, ఆగస్టులో అమెరికా జరిపిన దాడిలో ప్రాణాలు కోల్పోయాడు. ఐసిస్ యుద్ధ వ్యవహారాల మంత్రిగా విధులు నిర్వర్తిస్తున్న అబూ ఒమర్ అల్ షిషాని, మరో అగ్రనేత అబూ అల్ రహ్మాన్ ముస్తఫా అల్ ఖ్వాదులి అలియాస్ హాజి ఇమామ్‌లు 2016 మార్చిలో మరణించారు. 2016 చివరినాటికే ఐసిస్ అగ్రనాయకత్వం దాదాపుగా అంతమైంది. అబూ బకర్ అల్ బగ్దాదీ కూడా హతమైనట్లు సంకీర్ణ దళాలు ప్రకటించినప్పటికీ అదింకా నిర్ధారణ కావాల్సి ఉంది.
ఇరాక్, సిరియాల్లో అనేక చమురు క్షేత్రాలను ఐసిస్ తన ఆధీనంలో పెట్టుకుంది. అయితే చమురు క్షేత్రాలను నిర్వహించగల పరిజ్ఞానం లేకపోవడం వల్ల క్రమంగా ఉత్పత్తి, ఆదాయాలు సన్నగిల్లాయి. దాంతో బెదిరింపు వసూళ్లపై ఐసిస్ దృష్టి సారించిందని సెంటర్ ఫర్ ది అనాలసిస్ ఆఫ్ టెర్రరిజం (క్యాట్) వెల్లడించింది. 33 శాతం ఆదాయం బెదిరింపు వసూళ్ల ద్వారానే సమకూరిందన్నది క్యాట్ అంచనా. ఒకవైపు భూ భాగాలు కోల్పోవడం, మరోవైపు వైమానిక దాడుల్లో అగ్రనేతలు మరణించడం- ఆదాయ క్షీణతకు ప్రధాన కారణాలని ఆ సంస్థ చెబుతోంది. ఐసిస్ అదుపులో ఉన్న ప్రాంతంలోని దేశపౌరుల రక్షణ కోసం ఇరాక్ ప్రభుత్వం నెలకు 17 కోట్ల డాలర్లు చెల్లించేది. 2015 సెప్టెంబరు తరవాత ఈ నిధుల చెల్లింపునూ ఇరాక్ నిలిపేసింది. ఒకప్పుడు ఐసిస్ నెల ఆదాయం 40 కోట్ల డాలర్లు. ఇప్పుడది సగానికి కోసుకుపోయింది. విచిత్రం ఏమిటంటే, సద్దాం హుస్సేన్ ప్రభుత్వంపై అమెరికా ఆంక్షలు విధించినప్పుడు ఇరాక్ చాటుమాటుగా టర్కీకి చమురు అమ్ముకునేది. ఐసిస్ కూడా ఇదే దారిలో తమ చమురు క్షేత్రాల నుంచి చమురు విక్రయిస్తోంది. తమ ఏలుబడిలోని ప్రాంతాలకు విద్యుత్ సరఫరా కోసం అసద్ ప్రభుత్వానికే ఐసిస్ చమురు ఎగుమతి చేసిందన్న వూహాగానాలూ వినిపించాయి.
భావజాలాన్నీ ఏరివేయాలి
వరస ఎదురుదెబ్బలతో ఎటూ పారిపోలేక కలుగులో నక్కిన విషపునాగు మాదిరిగా ఐసిస్ పరిస్థితి తయారైంది. ఐసిస్ పూర్తిగా అంతమవుతుందా లేక మళ్ళీ బలం పుంజుకొని కొత్త వ్యూహాలతో మరోసారి ప్రపంచాన్ని హడలెత్తిస్తుందా అన్నది ఇప్పుడు అందరి మదిని తొలుస్తున్న ప్రశ్న! ఆధునిక ప్రసార మాధ్యమాల ద్వారా ఐసిస్ విష భావజాలం ఇప్పటికే అనేక దేశాలకు పాకిపోయిందన్నది ఎవరూ కాదనలేని నిజం. ప్రపంచవ్యాప్తంగా అనేకమంది యువకులను అది తన బుట్టలో వేసుకుంది. అందుకే నేటికీ ప్రపంచవ్యాప్తంగా ఐసిస్‌కు ప్రచ్ఛన్నంగా మద్దతు కొనసాగుతోంది. ఐసిస్‌ను తుదముట్టించడంతోపాటు దాని ఆధారంగా ఎదిగిన కలుపు మొక్కలనూ ఏరిపారేసినప్పుడే యుద్ధం పరిపూర్తి అవుతుంది. కాబట్టి, ఐసిస్‌పై యుద్ధం ఇప్పట్లో కొలిక్కిరాదన్న విశ్లేషకుల అంచనా తోసిపుచ్చలేనిదే. దాడులు తీవ్రమై పారిపోవాల్సిన పరిస్థితే గనక వస్తే సిరియాను వదిలి తమకు బాగా పట్టున్న దేశానికి ఐసిస్ ఉగ్రదళాలు తరలివెళ్లాలి. అప్పుడు నైజీరియా, లిబియా, అఫ్గానిస్థాన్‌లలో ఏదో ఒక దేశాన్ని ఎంచుకోవచ్చు. వీటిలో అఫ్గానిస్థాన్‌కు ఐసిస్ ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నట్లు భావిస్తున్నారు. అఫ్గానిస్థాన్‌లో పాగావేస్తే గల్ఫ్ దేశాల్లో సంపన్నులైన మద్దతుదారుల ద్వారా సులభంగా ఆర్థిక సాయం పొందవచ్చునన్నది దాని వ్యూహం. అఫ్గానిస్థాన్‌లో అనేక ప్రాంతాలు అల్‌ఖైదా చెప్పుచేతల్లోనే ఉన్నాయి కాబట్టి, స్థానబలిమికి లోటు ఉండదు. వాస్తవానికి అల్‌ఖైదాకు చెందిన అనేకమంది ఉగ్రవాదులు ఇప్పటికే ఐసిస్ తరఫున సిరియాలో యుద్ధం చేస్తున్నారు. అఫ్గాన్‌కు రావడమంటే వారికి స్వదేశానికి తిరిగివచ్చినట్లే! మరోపక్క విఫలరాజ్యంగా మారుతున్న పాకిస్థాన్‌లోని ఉగ్రవాద తండాల నుంచీ దానికి మద్దతు లభిస్తుంది. నైజీరియా, లిబియాల్లో ఆశ్రయం పొందితే ఇలాంటి వెసులుబాట్లు ఏమీ ఉండవు. భద్రతా దళాల దాడుల నుంచి తప్పించుకు తిరగడానికి అఫ్గాన్‌లోని భౌగోళిక పరిస్థితులూ అనుకూలిస్తాయి. కాబట్టే- అమెరికా, రష్యా దళాల దాడులను తట్టుకోలేక సిరియా నుంచి పలాయనం చిత్తగించాల్సి వస్తే ఐసిస్ మలి మజిలీ అఫ్గానిస్థాన్ అవుతుందన్నది విశ్లేషకుల అంచనా. అదే జరిగితే ఉగ్రవాదం, ఐసిస్ భావజాలంతో సతమతమవుతున్న భారత్ మరింత అప్రమత్తంగా భవిష్యత్ పరిణామాల్ని ఎదుర్కోవాల్సి వస్తుంది!
– వలసాల వీరభద్రం
(ఈనాడు సౌజన్యం తో)