Home Telugu Articles పంజాబ్‌లో సంఘకార్య విస్తారకుడు – మోరూభావు ముంజే

పంజాబ్‌లో సంఘకార్య విస్తారకుడు – మోరూభావు ముంజే

0
SHARE

రాష్ట్రీయ స్వయంసేవక్‌ సంఘ్‌ నేడు పొందుతున్న గౌరవం, ఆదరణ హఠాత్తుగా వచ్చినవి కావు. పేరు, కీర్తి ప్రతిష్టలు ఆశించని కొన్ని వందల మంది కార్యకర్తల అవిశ్రాంత కృషి ఫలితమే అవి. ముఖ్యంగా ప్రారంభ దశలో సంఘను ఎవరూ పట్టించుకోలేదు. పైగా అపనమ్మకం, వ్యతిరేకత, వెటకారం ఉండేవి. సంఘ నిర్మాత నుండి స్ఫూర్తి పొందిన అనేకమంది కార్యకర్తలు తమ జీవితాలనే సంఘ కార్యానికి అంకితం చేశారు. సౌకర్యవంతమైన, సుఖవంతమైన జీవితాన్ని, ఇంటిని వదిలి ఎక్కడో తమకు ఏమాత్రం పరిచయం లేని ప్రాంతాలకు వెళ్ళి పని చేశారు. సంఘమనే మహాసౌధపు పునాది రాళ్ళుగా మిగిలిపోయారు. వారి జీవితాలు ఇప్పటికీ కార్యకర్తలకు దారి చూపుతూనే ఉన్నాయి. మోరేశ్వర రాఘవ లేదా మోరూభావు ముంజే అటువంటి విశిష్ట కార్యకర్త, ప్రచారకుల్లో ఒకరు. ఈ ఏడాది ఆయన(18 నవంబర్‌, 1916 – 8 డిసెంబర్‌, 2007) జన్మశతాబ్ది.

మహారాష్ట్ర వార్ధా జిల్లా పవనార్‌ గ్రామంలో జన్మించిన మోరూభావు 1927లో తన 11ఏట చదువు కోసం నాగపూర్‌ వచ్చారు. ఒక రోజు సాయంత్రం భోస్లా వేదశాలకు వెళుతున్నప్పుడు ఆయన మోహితేవాడా మైదానంలో కొంతమంది పిల్లలు ఆడుతుండడం చూశారు. మర్నాడు కూడా మోరూభావు అటువైపుగా వెళుతున్నప్పుడు 30 ఏళ్ళ పైబడిన ఒక ఆజానుబాహుడైన వ్యక్తి ఆయన్ని లోపలకి రమ్మని పిలిచారు. ఆయన ఎవరో కాదు సంఘ స్థాపకులు డా. హెడ్గెవార్‌. అలా మోరూభావు సంఘ జీవితం ప్రారంభమైంది. త్వరలోనే ఆయన డా. హెడ్గెవార్‌కు దగ్గరయ్యారు. చేసి చూపడం, అనౌపచారిక సంభాషణల ద్వారా విషయాలపట్ల అవగాహన కలిగించడం డా. హెడ్గెవార్‌ పద్ధతి. అలా డా.హెడ్గెవార్‌ ఆదర్శవాదాన్ని క్రమంగా ఆకళింపు చేసుకున్నారు మోరూభావు.

సంఘకార్య వ్యాప్తి

సంఘకార్యాన్ని నాగపూర్‌ బయట వ్యాప్తి చేయడానికి డా. హెడ్గెవార్‌ ఒక అద్భుతమైన పద్ధతి ఎంచుకున్నారు. తనతో పాటు ఉన్న కొద్దిమంది యువకుల్ని ప్రోత్సహించి చదువు నిమిత్తమైన వివిధ ప్రాంతాలకు పంపారు. వాళ్ళు చక్కగా చదువుకుంటూనే మిగతా సమయాన్ని సంఘకార్య విస్తరణకు వెచ్చించేవారు. అలా 1932లో రాంభావు జంగడే, గోపాల సదాశివ ఎర్‌కుంట్‌వార్‌, మాధవరావ్‌ మూలే, తాత్యా తెలంగ్‌లను యవత్‌మహల్‌, సాంగ్లీ, చిప్లూన్‌, టోల్‌ ప్రాంతాలకు పంపారు. వీళ్ళందరినీ స్వయంగా డాక్టర్జీ అనేకమంది స్వయంసేవకుల సమక్షంలో వీడ్కోలు చెప్పి పంపారు. దీనివల్ల వారందరిలో కూడా ఇలా సంఘకార్య నిమిత్తం ఇతర ప్రాంతాలకు వెళ్ళి పని చేయాలన్న ఆలోచన కలిగేది. గోపాలరావు వీడ్కోలు కార్యక్రమంలో పాల్గొన్న మోరూభావులో కూడా ఇలాంటి ఆలోచనే కలిగింది. వేరే ప్రాంతంలో విద్యార్థి కార్యకర్తగా పనిచేయాలనుకున్నారు. మహారాష్ట్ర బయట మొట్టమొదటి శాఖ 10 మే, 1932న స్వయంగా డాక్టర్జీ కరాచీలో ప్రారంభించారు. అఖిలభారత తరుణ్‌ హిందూ పరిషత్‌ సమావేశాలకు వెళ్ళిన డాక్టర్జీ ఈ శాఖ ప్రారంభించారు. ఆ తరువాత 6 ఆగస్ట్‌ నుంచి 14 సెప్టెంబర్‌ వరకూ పశ్చిమ మహారాష్ట్ర ప్రాంతంలో డాక్టర్జీ పర్యటించారు. అప్పుడు ఆయనతోపాటు బాబారావు సావర్కర్‌, మార్తాండరావ్‌ జోగ్‌ కూడా ఉన్నారు. వివిధ ప్రాంతాల్లో సంఘకార్యాన్ని విస్తరింపచేయడానికి వీలుగా స్వయంసేవకులు వివిధ భాషలు నేర్చుకోవాలని డాక్టర్జీ భావించారు. 18 నవంబర్‌, 1936న వసంతరావ్‌ ఓక్‌, బాబాసాహెబ్‌ ఆప్టేలు ఢిల్లీలో పనిచేయడానికై బయలుదేరి వెళ్ళారు. అలాగే 1937లో డాక్టర్జీ పదిమంది విద్యార్థి కార్యకర్తలను ఢిల్లీ, పంజాబ్‌, ఉత్తరప్రదేశ్‌, మధ్యభారత్‌ ప్రాంతాలకు పంపారు.

పంజాబ్‌లో సంఘకార్య ప్రారంభం

దేశంలోని వివిధ ప్రాంతాల్లో వస్తున్న సామాజిక, రాజకీయ మార్పులు డాక్టర్జీకి బాగా తెలుసు. ముఖ్యంగా పంజాబ్‌లో హిందువుల పరిస్థితి రానురాను దిగజారిపోయింది. 1930లో అల్లామా ఇనయతుల్లా మష్రికీ ఖక్‌సర్‌ తహరీక్‌ అనే సంస్థను లాహోర్‌లో ప్రారంభించాడు. 1930 చివరి నాటికి ఈ సంస్థ కార్యకలాపాలు ఉత్తర భారతానికి కూడా వ్యాపించాయి. ముస్లింలీగ్‌ వైఖరి కూడా తీవ్రంగా మారింది. హిందువులను సమైక్య పరచి, వారిలో విశ్వాసాన్ని నింపడం అత్యవసరమైంది. అందుకని పంజాబ్‌పై డాక్టర్జీ దృష్టి సారించడంలో ఆశ్చర్యం లేదు. పంజాబ్‌లో పనిచేయడానికి డాక్టర్జీ ముగ్గురు విద్యార్థి కార్యకర్తలను ఎంపిక చేశారు. కృష్ణ ఢూండీరాజ్‌ లేదా కెడి. జోషిని సియోల్‌కోట్‌కు పంపారు. దిగంబర్‌ విశ్వనాధ్‌ లేదా రాజాభావూ పాతుర్కర్‌ను లాహోర్‌కు పంపారు. మోరూభావును రావల్‌పిండీకి పంపారు. 1937లో మొదటి గురుపౌర్ణమి ఉత్సవం అట్టహాసంగా జరిగింది. ఈ ముగ్గురి పని డాక్టర్జీకి ఎంతో సంతోషాన్ని ఇచ్చింది. అందుకనే 13 ఆగస్ట్‌, 1937న రాసిన ఉత్తరంలో డాక్టర్జీ ”మీరు ఎంతో ఉత్సాహంతో పని చేస్తున్నందుకు మాకు ఎంతో సంతోషంగా ఉంది. కానీ కొత్త ప్రదేశంలో ఎన్నో అవరోధాలు, అడ్డంకులు ఉంటాయి. అయినా వాటన్నింటిని దాటుకుంటూ మీరు చేస్తున్న పనికి మేము (నాగపూర్‌ వాసులం) హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతున్నాం” అని అన్నారు. ఆగస్ట్‌, 1938లో లాహోర్‌లో మొట్టమొదటి ఆఫీసర్స్‌ ట్రైనింగ్‌ క్యాంప్‌ (ఓటిసి) జరిగింది. 40రోజులపాటు జరిగిన ఈ క్యాంపులో 14 గ్రామాల నుంచి వచ్చిన 40మంది స్వయంసేవకులు పాల్గొన్నారు. డాక్టర్జీ స్వయంగా ఈ క్యాంప్‌కు వచ్చారు. ఆయనతోపాటు శ్రీ గురూజీ, బాబాసాహెబ్‌ ఆప్టేలు కూడా ఉన్నారు. 27 ఆగస్ట్‌ సమారోప్‌ కార్యక్రమంలో డాక్టర్జీకి గౌరవవందనం సమర్పించారు. స్వయంసేవకుల అద్భుతమైన శారీరిక ప్రదర్శనలు చూసి ఎంతో ప్రభావితులైన నాటి ముఖ్యఅతిథి రాజా నరేంద్రనాధ్‌ చక్కని ఉపన్యాసం ఇచ్చారు. ఆ తరువాత డాక్టర్జీ ప్రభావవంతమైన ఉపన్యాసం 30 నిముషాలపాటు సాగింది.

1937 నుండి 1941 వరకూ మోరూభావు రావల్‌పిండీ విభాగ్‌ ప్రచారక్‌గా ఉన్నారు. ఆయన ఝీలమ్‌, గుజ్రన్‌వాలా, పెషావర్‌లలో శాఖలు ప్రారంభించారు. ఆయన పనిచేసేనాటికి ఈ ప్రాంతాల్లో పరిస్థితులు ఒకసారి పరిశీలిస్తే ఎంతటి ప్రతికూల వాతావరణం ఉండేదో అర్థమవుతుంది. రావల్‌పిండీలో ముస్లిం జనాభా 80శాతం ఉండేది. అలాగే గుజ్రన్‌వాలాలో 70.4శాతం, షేక్‌పురా 62.4శాతం, ఝీలమ్‌ 89.5శాతం, డేరా ఘాజీ ఖాన్‌లో 88.9 శాతం ఉండేది. స్థానిక యువకుల దృష్టిని ఆకర్షించడం కోసం ఒకసారి మోరూభావు గడ్డకట్టించే ఝీలమ్‌ నది నీళ్ళలోకి దూకి ఈదుకుంటూ ఒడ్డుకు వచ్చారు. రావల్‌పిండీ శాఖలో సంఖ్య రోజురోజుకూ పెరుగుతుండడం ముస్లిం ఛాందసవాదులకు మింగుడుపడలేదు. దానితో వాళ్ళు మోరూభావుపై రెండుసార్లు ఆయుధాలతో దాడి చేశారు. శారీరిక బలం, సమయ స్ఫూర్తితో రెండుసార్లూ ఆయన చిన్న గాయం కూడా కాకుండా తప్పించుకున్నారు. మొదటి సారి దాడి జరిగిన తరువాత ఆయన ప్రముఖ నటుడు బాల్‌రాజ్‌ సహానీ తండ్రిని కలిశారు. అలాగే హిందూ మహాసభ నేత భాయి పరమానంద్‌ మార్గదర్శనం కూడా ఆయనకు లభించింది. దేశ విభజననాటికి ఈ ప్రాంతంలో స్వయంసేవకుల సంఖ్య 47 వేలకు చేరుకోడానికి, విభజన సమయంలో హిందూ శరణార్థులకు రక్షణ లభించడానికి కారణం మోరూభావు వంటి కార్యకర్తల నిరంతర కృషే.

సంఘకార్యమే జీవితం 1941లో మోరూభావు రాయ్‌పూర్‌ మొట్టమొదటి విభాగ్‌ ప్రచారక్‌గా బాధ్యతలు తీసుకున్నారు. అలాగే 1943 నుండి 46 వరకూ జబల్‌పూర్‌ విభాగ్‌ ప్రచారక్‌గా పనిచేశారు. 1946లో ఇంటి సమస్యల మూలంగా ఆయన ప్రచారక్‌ జీవనం నుండి విరమించుకుని ఇంటికి వచ్చారు. జబల్‌పూర్‌లోని మహారాష్ట్ర విద్యాలయంలో టీచర్‌గా చేరారు. ఏడాది తరువాత ఆయన కుముద్‌ అభ్యంకర్‌ (ఈవిడ వివాహం తరువాత మధ్యప్రదేశ్‌ భారతీయ జనసంఘ్‌ రాష్ట్ర కార్యవర్గంలో మొట్టమొదటి మహిళా సభ్యురాలిగా బాధ్యతలు నిర్వహించారు. అలాగే 1965 కచ్‌ ఒప్పందానికి వ్యతిరేకంగా జబల్‌పూర్‌లో జరిగిన మహిళా సత్యాగ్రహానికి నాయకత్వం వహించారు) ను వివాహం చేసుకున్నారు. గాంధీ హత్య తరువాత మోరూభావును 4 ఫిబ్రవరి, 1948న అరెస్ట్‌ చేసి జబల్‌పూర్‌ సెంట్రల్‌ జైలులో ఉంచారు. అక్కడ ఆయన 7 నెలలపాటు ఉన్నారు. విడుదలైన తరువాత 52మంది స్వయంసేవకులతో కలిసి ఆయన సంఘపై విధించిన అన్యాయపూరితమైన నిషేధానికి వ్యతిరేకంగా సత్యాగ్రహం చేశారు. అప్పుడు తిరిగి అరెస్ట్‌ అయ్యారు. చివరికి 7 జూలై, 1949లో విడుదలయ్యారు. సంఘపై నిషేధం తొలగినా, మోరూభావు తీవ్రమైన ఆర్థిక ఇబ్బందుల్లో పడ్డారు. చిన్నచిన్న ఉద్యోగాలు చేశారు. చివరికి 1953లో ఒక మందుల తయారీ కంపెనీలో ఆయనకు ఉద్యోగం వచ్చింది. అందులో 1976 వరకూ పనిచేశారు. 1982 నుండి 89 వరకూ ఆయన ప్రాంత బౌద్ధిక్‌ ప్రముఖ్‌గా ఉన్నారు. తరువాత సంభాగ్‌ ప్రచారక్‌ అయ్యారు. 1989 నుండి 91 వరకూ విశ్వహిందూ పరిషత్‌ రాష్ట్ర కోశాధికారిగా, 1991-94 రాష్ట్ర కార్యదర్శిగా ఉన్నారు. ఆయోధ్య ఉద్యమంలో పాల్గొని మణిరామ్‌ చావ్‌నీలో నాలుగునెలలపాటు కరసేవకుల కోసం అన్ని ఏర్పాటు చేయించారు. జబల్‌పూర్‌లో డా.హెడ్గెవార్‌ స్మృతి సమితి అధ్యక్షులుగా ఉండి అనేక సేవా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. డిసెంబర్‌, 2000లో హెచ్‌.వి. శేషాద్రి గారి కోరిక మేరకు మోరూభావు వారంరోజుల పాటు బెంగళూరులో పర్యటించి డాక్టర్జీ జీవితం, సంఘ ప్రారంభ రోజుల గురించి ఉపన్యాసాలిచ్చారు. 8 డిసెంబర్‌, 2007న 91ఏళ్ళ వయస్సులో గుండెపోటుతో ఆయన తుదిశ్వాస విడిచారు. మోరూభావు జీవితం స్వయంసేవకులకు ఎప్పుడూ స్ఫూర్తిని కలిగిస్తూనే ఉంటుంది.

– డా. శ్రీరంగ గోడ్బొలె

అనువాదం – శ్రీ కేశవ నాథ్