తూర్పు లఢఖ్‌లోని గాల్వాన్ లోయ, ప్యాంగాంగ్ త్సో సరస్సు ప్రాంతాల్లో రక్షణ రంగంపై నియమించిన పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ త్వరలో పర్యటించనుందని ప్రభుత్వవర్గాలు వెల్లడించాయి. ఈ పర్యటన మే నెల చివరి వారంలో లేదా జూన్‌లో ఉండే అవకాశం ఉందని తెలిపాయి. 30 మంది సభ్యులు గల ఈ ప్యానెల్‌కు బిజెపి నేత, మాజీ కేంద్ర మంత్రి జువల్ ఓరం చైర్మన్‌గా ఉన్నారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కూడా ఈ ప్యానెల్‌లో సభ్యుడిగా ఉన్నారు. ఆయా ప్రాంతాల్లో పర్యటించాలని నిర్ణయం తీసుకున్న ప్యానెల్ ఇటీవలి సమావేశానికి రాహుల్ హాజరుకాకపోవడం గమనార్హం.
వాస్తవధీన రేఖ (ఎల్‌ఎసి) వెంబడి పర్యటించాలని ప్యానెల్ భావిస్తున్నందున.. ఇది ప్రభుత్వ ఆమోదం మీద ఆధారపడి ఉంటుందని ప్రభుత్వవర్గాలు తెలిపాయి. సరిహద్దు వివాదం నేపథ్యంలో గతేడాది గాల్వాన్ లోయ ప్రాంతంలో భారత్, చైనా జవాన్ల మధ్య ఘర్షణ చోటుచేసుకున్న విషయం తెలిసిందే. పలు దఫాల చర్చ అనంతరం దశలవారీ బలగాల ఉపసంహరణకు ఇరుదేశాలు నిర్ణయం తీసుకున్నాయి.
దీనిపై కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాధ్ సింగ్ కూడా గురువారం పార్లమెంట్‌లో మాట్లాడారు. తూర్పు లడఖ్ సరిహద్దుల్లోని పాంగాంగ్ సరస్సు ఉత్తర, దక్షిణ తీరంలో బలగాల వెనక్కు మళ్లింపు విషయంలో భారత్, చైనాలు ఒక ఒప్పందానికి వచ్చాయని ఆయన రాజ్యసభలో ప్రకటించారు. అంగుళం భూమిని కూడా చైనాకు వదులుకోమని ఆయన ఈ సందర్భంగా స్పష్టం చేశారు. పాంగాంగ్ సరస్సు ఉత్తర, దక్షిణ తీరాల్లో బలగాల ఉపసంహరణకు చైనాతో ఒప్పందం కుదిరిందని ఆయన వెల్లడించారు.దశలవారీగా రెండు దేశాలు తమ బలగాలను ఉపసంహరిస్తాయని ఆయన చెప్పారు. భారత్, చైనా మధ్య జరుగుతున్న ఘర్షణలో భారతలోని భూభాగం కోల్పోయింది ఏమీ లేదని ఆయన స్పష్టం చేశారు. ఇప్పటికీ కొన్ని సమస్యలు పరిష్కారం కాలేదని, చర్చలు కొనసాగుతూనే ఉంటాయని ఆయన తెలిపారు. అయితే ఫింగర్ 8కి తూర్పున ఉన్న ఉత్తర నార్త్ బ్యాంక్ ప్రాంతంలో చైనా తన సైన్యాన్నిబలపరుస్తుందని, భారత్ కూడా ఫింగర్ 3 సమీపంలోని ధన్ సింగ్ థాపా పోస్టు వద్ద సైనిక స్థావరాలను పటిష్టం చేస్తోందని తెలిపారు. పాంగాంగ్ సరస్సు ఉత్తర దిక్కున ఇరు దేశాలు తమ సైనిక కార్యకలాపాలపై తాత్కాలిక నిషేధానికి అంగీకరించాయని, ఈ విషయంపై ఇప్పటి వరకు సీనియర్ కమాండర్లతో 9 రౌండ్ల సమావేశాలు జరిగాయని తెలిపారు. తదుపరి సమావేశాల్లో ఒప్పందం కుదుర్చుకున్న తర్వాతే పెట్రోలింగ్ తిరిగి ప్రారంభమవుతుందని ఆయన తెలిపారు. ఇప్పటికి, చైనాకు మన బలం గురించి స్పష్టంగా అర్థమయిందని, అందువల్ల చైనా మన దేశంతో పూర్తి చిత్తశుద్ధితో పనిచేస్తుందని, భారత్ సైన్యం కూడా ఈ విషయంలో కట్టుదిట్టంగా పని చేస్తోందని ఆయన స్పష్టం చేశారు.