Home News పేదరికంపై పాశుపతాస్త్రం ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన

పేదరికంపై పాశుపతాస్త్రం ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన

0
SHARE

దేశంలో పేద ప్రజలకు ఉచితంగా ఆహార ధాన్యాన్ని అందించడంలో ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన (PMGKAY) ముఖ్యమైన భూమిక పోషిస్తున్నది. 2020 సంవత్సరంలో కరోనా మహమ్మారి విజృంభిస్తున్నప్పటికీ భారత్‌లో తీవ్రమైన పేదరికాన్ని 0.8 శాతం వరకు కనిష్టం చేయడంలో PMGKAY కీలకమైన పాత్ర పోషించిందని అంతర్జాతీయ ద్రవ్య నిధి (IMF) పేర్కొంది.

ఈ మేరకు “మహమ్మారి, పేదరికం మరియు అసమానత: భారత్ నుంచి సాక్ష్యాధారం” (‘Pandemic, Poverty, and Inequality: Evidence from India) పేరిట ఒక కార్య పత్రాన్ని IMF విడుదల చేసింది. 2004-05 నుంచి 2020-21 వరకు వరుసగా ప్రతి సంవత్సరం భారత్‌లో పేదరికం మరియు అసమానతపై అంచనాలను ఆ పత్రం సమర్పించింది. సదరు పత్రాన్ని సంబంధిత నిపుణులైన సూర్జిత్ ఎస్ భల్లా, కరణ్ భాసిన్, అరవింద్ విర్మాణి రూపొందించారు.

“మహమ్మారికి ముందు సంవత్సరమైన 2019లో పెను పేదరికం కనిష్టంగా 0.8 శాతంగా ఉంది. మహమ్మారి పీడిత 2020 సంవత్సరంలోనూ అదే కనిష్ట స్థాయిలో పేదరికం కట్టడి కావడంలో ఆహార ధాన్యాల సరఫరా కీలకమైంది. అంతకుమునుపు 2016-17 సంవత్సరంలో పెను పేదరికం కనిష్టంగా రెండు శాతం స్థాయికి చేరుకుంది ” అని సదరు పత్రం పేర్కొంది.

కేంద్ర ప్రభుత్వం PMGKAY పథకాన్ని 2020 సంవత్సరం మార్చి నెలలో ఆరంభించింది. పథకం ద్వారా పేద ప్రజలకు ప్రతి నెలా ఐదు కేజీల ఆహార ధాన్యాన్ని అందించసాగింది. జాతీయ ఆహార భద్రత చట్టం (NFSA) కింద సబ్సిడీ రేటు ప్రకారం రెండు లేదా మూడు రూపాయలకు సరఫరా చేసే ఆహార ధాన్యానికి అదనంగా PMGKAY కింద ఉచితంగా మరో ఐదు కేజీల ఆహార ధాన్యాన్ని కేంద్ర ప్రభుత్వం సరఫరా చేయడానికి సంకల్పించడం విశేషం. పేద ప్రజలకు మరింత ఊతమిచ్చేలా PMGKAY పథకాన్ని 2022 సంవత్సరం సెప్టెంబర్ వరకు కేంద్ర ప్రభుత్వం పొడిగించింది. PMGKAY పథకం ద్వారా దేశంలో 80 కోట్ల మంది పేద కుటుంబాలు ఉచితంగా ఆహార ధాన్యాన్ని పొందుతున్నాయని కేంద్ర ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.