Home News పోలీసుల సహకారంతో మసక బారుతున్న ప్రభుత్వ పాఠశాలను ఆదర్శంగా మార్చుకున్నకాటవరం గ్రామస్తులు

పోలీసుల సహకారంతో మసక బారుతున్న ప్రభుత్వ పాఠశాలను ఆదర్శంగా మార్చుకున్నకాటవరం గ్రామస్తులు

0
SHARE

కనీస వసతులు లేని స్కూల్‌కి పిల్లల్ని పంపేందుకు ఏ తల్లిదండ్రులు ఇష్టపడతారు చెప్పండి… అందుకే తమ పిల్లల్ని వేరే పాఠశాలల్లో చేర్పించడం మొదలుపెట్టారు ఆ ఊరి వాళ్లు. దాంతో ఆ స్కూల్లో విద్యార్థుల సంఖ్య తగ్గు ముఖం పట్టింది. ఇది ఇలానే కొనసాగితే ఏమవుతుంది? వచ్చేందుకు పిల్లలే లేకపోతే పాఠశాల ఎందుకని మూసేస్తారు. మరి ఇంతకీ ఈ స్కూల్‌ పరిస్థితి ఏంటి? మూసేశారా? నడుస్తోందా?… ఎన్నో ప్రశ్నలు తలెత్తాయి కదా… వాటన్నింటికీ సమాధానమే తెలంగాణ రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌ జిల్లా అడ్డాకుల మండలంలో ఉన్న కాటవరం ప్రాథమిక పాఠశాల. ఇవాళ ఏ రాష్ర్టానికైనా, ఏ ప్రాంతానికైనా కొత్త పాఠం చెబుతున్న ఆ స్కూల్‌ కథ…

మొన్నమొన్నటి వరకు మనదేశంలో ఉండే మిగతా గ్రామీణ ప్రభుత్వ పాఠశాలల పరిస్థితే ఈ స్కూల్‌ది కూడా. కాని ఒక సంకల్పం ఆ పాఠశాల రూపురేఖల్ని మార్చేసింది. ఆ సంకల్పానికి అందిన తోడ్పాటు వసతులు సమకూర్చగా, మరో చేయి అందించిన సహకారంతో విద్యాప్రమాణాలు మెరుగుపడ్డాయి. దాంతో ఇప్పుడు ఆ ప్రభుత్వ పాఠశాల కార్పొరేట్‌ స్కూళ్ళకు దీటుగా మారిపోయింది. దీనస్థితిలో ఉన్న పాఠశాలకి కళాకాంతులు వచ్చేందుకు తొలి అడుగు పడింది మాత్రం ఆ గ్రామసభలోనే. ‘గ్రామజ్యోతి’ కార్యక్రమంలో భాగంగా కాటవరంలో గ్రామసభ నిర్వహించారు. ఆ సభలో తమ పాఠశాల దుస్థితి గురించి ప్రస్తావించారు ప్రధానోపాధ్యాయురాలు ఎం.ధనలక్ష్మి. ‘‘భవనం శిథిలమైపోయింది. ప్రహరీ గోడ లేకపోవడం వల్ల పరిసరాలు అపరిశుభ్రంగా మారిపోయాయి. దానికి తోడు కనీసావసరమైన మంచినీరు కూడా లేదు. ఈ కారణాల వల్ల బడికి వచ్చే పిల్లల సంఖ్య ఏటేటా తగ్గిపోతోంద’’ని చెప్పారామె. అందుకు అధికారులు గ్రామంలో ఉన్న భవనంలో కాకుండా ఊరి చివరన ఉన్న కొత్త భవనానికి మారమని సూచించారు. సలహా అయితే బాగానే ఉంది. కాని… కొత్తగా నిర్మించిన భవనం దగ్గర మౌలికవసతుల పరిస్థితి మరింత అధ్వాన్నంగా ఉంది.

ఒక్కోటిగా అన్ని సౌకర్యాలు

సరిగ్గా ఇదే సమయంలో ఆ సభలో ఉన్న సబ్‌-ఇన్‌స్పెక్టర్‌ శ్రీనివాస్‌ గౌడ్‌ తెరమీదకు వచ్చారు. పిల్లల అవస్థలు, ఉపాధ్యాయుల ఆవేదనను గమనించిన ఆయన కొత్తగా నిర్మించిన పాఠశాల భవనంలో మౌలికవసతుల కల్పించేందుకు ముందుకు వచ్చారు. జిల్లా ఎస్పీ రెమా రాజేశ్వరి సూచనల మేరకు పాఠశాలలో ఒక్కో వసతిని కల్పించడం మొదలుపెట్టారు. ముందుగా పాఠశాలకు వచ్చే గ్రామ ప్రధాన రహదారి నుంచి సుమారు వంద మీటర్ల వరకు గుట్టలతో నిండిపోయిన స్థలాన్ని చదును చేయించి… మట్టిరోడ్డు వేయించారు. పెండింగ్‌లో ఉన్న ప్రహారీ గోడను నిర్మించారు. మైదానమంతా ఇసుక నింపారు. ఇవన్నీ సరే కాని కనీసావసరమైన మంచినీటి సౌకర్యం లేకపోతే మరీ ఇబ్బంది కదా. అందుకని బోరు వేయించే ప్రయత్నం చేశారు. కాని అక్కడ బోరు పడలేదు. అప్పుడు ఆయన దృష్టి పాఠశాలకు పావు కిలోమీటరు దూరంలో ఉన్న వ్యవసాయ బోరుబావిపై పడింది. అది రైతు బాలచంద్రయ్యది. ఆయన్ని ఒప్పించి, అక్కడి నుంచి 250మీటర్ల మేర పైపులు వేయించారు. అలా పాఠశాల పిల్లల కోసం తాగునీటి సౌకర్యం ఏర్పాటుచేశారు. నీటిని నిల్వచేసుకునేందుకు ఒక ట్యాంక్‌ పెట్టించడంతో పాటు నల్లాలు కూడా ఏర్పాటుచేయించారు. అడ్డాకుల పోలీస్‌ బృంద సమన్వయంతో విద్యార్థులకు, ఉపాధ్యాయులకు టాయిలెట్స్‌ నిర్మించారు.

కూతుర్నీ ఇదే స్కూల్లో…

ఈ మొత్తం వ్యవహారంలో ఒక ఆసక్తికరమైన అంశం ఉంది. అదేమిటంటే మద్యపానం చేసి వాహనాలు నడుపుతూ పట్టుబడిన వాళ్లు, బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తున్న వాళ్ల నుంచి వసూలు చేసిన చలాన్లను పాఠశాల భవనానికి సంబంధించిన పనుల్లో వాడడం. ఆహ్లాదకర వాతావరణం కోసం 250 మొక్కలు నాటించారు. వాటి పెంపకం బాధ్యతలను పిల్లలకు అప్పజెప్పారు. ప్రభుత్వ బడిలో పిల్లలను చేర్పించాలని గ్రామస్తులను చైతన్య పరిచారాయన. ‘సలహాలు చెప్పడం కాదు. చేసి చూపించాలి అంటార’ని కాబోలు స్వయంగా తన కూతురు ‘వ్రిశాల’ని కూడా ఇదే స్కూల్లో చదివిస్తున్నారు. ఆ గ్రామ సమీపంలోని ప్రైవేట్‌ స్కూల్లో చదువుతున్న 32 మంది పిల్లలు అక్కడ మానేసి ఈ స్కూల్లో చేరడం అక్కడ వచ్చిన మార్పుకి నిదర్శనం. పోలీసులు ఈ పాఠశాలను దత్తత తీసుకోకముందు 42 మంది విద్యార్థులు ఉండేవారు. ఇప్పుడు ఆ సంఖ్య 87కి చేరుకుంది. పోలీసులు పాఠశాల కోసం చేస్తున్న అభివృద్ధికి మరో స్వచ్ఛంద సంస్థ కూడా తోడైంది.

 అందరూ కలిసొచ్చారు!

ప్రధానోపాధ్యాయురాలు ధనలక్ష్మి తమ పాఠశాల పేరు మీద ‘కాటవరం స్కూల్‌’ అనే ఫేస్‌బుక్‌ అకౌంట్‌ ఏర్పాటుచేశారు. విద్యాప్రమాణాలు మెరుగుపడేందుకు ఇంకా ఏమేం కావాలో అందులో చేర్చేవారు. ఆమె చేసిన పోస్టింగులకు హైద్రాబాద్‌కు చెందిన ‘కేరింగ్‌ హ్యాండ్స్‌’ అనే స్వచ్ఛంద సంస్థ స్పందించింది. తమవంతుగా పిల్లలకు స్కూల్‌ బ్యాగులు, టాయిలెట్లకు పైప్‌లైన్లు,పాఠశాల లైబ్రరీకి 250 పుస్తకాలు అందజేశారు. అంతే కాకుండా పాఠశాల ప్రహారీ లోపలి భాగంతో పాటు, పాఠశాల గదుల్లో, వరండాలో గోడలకు పెయింటింగ్స్‌, నీతివాక్యాలు, ప్రముఖుల చిత్రపటాలను వేయించారు. ఇవేకాకుండా డిజిటల్‌ క్లాసులు నిర్వహించేందుకు వీలుగా రెండు కంప్యూటర్లు, ఒక ప్రొజెక్టర్‌, స్కానర్‌, స్ర్కీన్‌లను కూడా ఏర్పాటుచేశారు. స్కూల్లో ఒక విద్యావలంటీర్‌ని నియమించారు. పిల్లలకు డ్రాయింగ్‌ కిట్స్‌ ఇచ్చారు. మరో విశేషం ఏమిటంటే ఈ స్కూలును మూడునెలల క్రితం ‘స్వచ్ఛ పాఠశాల’గా ఎంపికచేయడం.

చల్లా సాంబశివారెడ్డి, మహబూబ్‌నగర్‌.

‘‘ఈ స్కూల్‌కి వచ్చి దాదాపు ఏడాదిన్నర అవుతోంది. స్కూల్లో అడుగుపెట్టినప్పుడు ఇక్కడి పరిస్థితి చూసి ఎలా పనిచేయాలి అనుకున్నాను. కాని ఇప్పుడు జిల్లా వ్యాప్తంగా మా స్కూల్‌కే కాకుండా నాక్కూడా గుర్తింపు లభించింది. ఇదే స్ఫూర్తితో ముందుకెళ్తాను. వచ్చే విద్యాసంవత్సరానికి మా పాఠశాలలో విద్యార్థుల సంఖ్య 150కి చేరేలా కృషి చేస్తాం. అంతేకాకుండా ప్రైవేటు పాఠశాలలకి దీటుగా మా కాటవరం ప్రాఽథమిక పాఠశాలను నిలబెడతాం కూడా.’’

– ఎం. ధనలక్ష్మి, ప్రధానోపాధ్యాయురాలు

‘‘నేనూ ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్న వాడినే. అక్కడ చదివే పిల్లలకు ఎలాంటి ఇబ్బందులు ఉంటాయో నాకు తెలుసు. అందుకే వాటిని తీర్చే ప్రయత్నంలో భాగంగా ఈ పనులు చేశాం. ఈ పాఠశాలని ఇలా తీర్చిదిద్దడం మా పోలీసులందరికీ ఎంతో సంతోషాన్నిచ్చింది. మా అమ్మాయిని కూడా ఈ పాఠశాలలోనే చేర్చాను.’’

– శ్రీనివాస్‌ గౌడ్‌, సబ్‌-ఇన్‌స్పెక్టర్‌

(ఆంధ్రజ్యోతి సౌజన్యం తో)