Home Telugu Articles భూ సంరక్షణ కీలకం

భూ సంరక్షణ కీలకం

0
SHARE

మానవ మనుగడతో పాటు సమస్త జీవరాసులు సజీవంగా జీవన గమనం సాగించాలంటే ఈ భూమండలంలో మూలమైంది నేల. భూమి సమస్త జీవరాసులకు ఆలవాలమై మొక్కలకు, జీవులకు, మానవులకు కావలసిన గాలి, నీరు, శక్తి, భుక్తి మొదలైన అన్ని అవసరాలను సమకూరుస్తుంది.

ఈ భూమి మీద ఉన్న జీవరాసుల్లో 95 శాతం నేలలో జీవిస్తున్నాయి. వాటన్నింటికి కనీస అవసరాలు నీరు, గాలి, శక్తి మొదలైనవన్నీ సకాలంలో తీరుస్తుంది. ఇంత మహత్తర శక్తి ఉన్న నేల కొన్ని లక్షల సంవత్సరాల్లో ఏర్పడి కార్బన్‌, హైడ్రోజన్‌, ఆక్సిజన్‌తో జీవ సృష్టికి మూలమైన మొక్కలు, పంటల ఎదుగుదలకు సాయపడుతూ మనిషికి కావలసిన కూడు, గుడ్డ, ఆవాసాలను అందిస్తూనే మనిషి నాగరికంగా, ఆర్థికంగా వృద్ధి చెంది సుఖమయ జీవితం గడపటానికి అంకితమై సృష్టిధర్మాన్ని నెరవేరుస్తుంది.

నేలలో ఉండే కర్బనాలు, మట్టి రేణువులు కలిసి చిన్న చిన్న ముద్దలుగా ఏర్పడి నీటిని నిల్వ ఉంచుకొనే విధంగా దోహదపడి నేలలో ఉన్న పోషకాలను నీరు/తేమలో కరిగించుకొని మొక్కలకు సకాలంలో అందిస్తుంది. తద్వారా మొక్కల్లో పిండి పదార్థాలు తదితర మూలపదార్థాలన్నీ ఏర్పడి మొక్కలు ఎదుగుతాయి. నేలపొరల్లో గాలిని సత్వరంగా వ్యాపింపజేస్తుంది.

నేల ద్వారా మొక్కలకు కావలసిన నిలబడే శక్తి కల్గుతుంది. మొక్కల వేళ్ళు, నేలలో ఉండే పోషకాలు, నీరు, గాలి, వెలుతురు పరస్పర సరఫరాకు దోహదం చేస్తుంది. సేంద్రీయ కర్బనం ద్వారా జీవరాసులకు అవసరమైన శక్తి, జీవం వస్తుంది. మనకు అవసరమైన ఆహారం మొక్కల ద్వారా, జీవ వైవిధ్యం, జన్యుసంపద, నిల్వ ఉంచటం, ద్రవపదార్థాలను ఇంకిపోయేలా చేయడం, పలు పరిశ్రమలకు అవసరమైన ముడిపదార్థాల తయారీ.. మనందరికి అవసరమైన భౌతిక, కళా సంస్కృతులకు, మౌలిక సదుపాయాలకు నిలయమైనదే నేల.

మొక్కలు, నేలలో ఉండే సూక్ష్మజీవులకు మధ్య అనుబంధం :

జీవించే మొక్కల వేళ్ళ ద్వారా వెలువడే ద్రవాల నుండే శక్తివంతమైన కర్బన మూలకాలు- నేలలో మొక్కల వేళ్ళకు దగ్గరగా ఉండే సూక్ష్మజీవులు గ్రహించి, ఖనిజ లవణాలు, సూక్ష్మధాతువుల మూలకాలు, ఇతర పోషకాలను వృద్ధి పరచి అటు నేల ఆరోగ్య, భూ భౌతిక స్థితిగతులను మెరుగుపరచటమే గాక, మొక్కల ఎదుగుదలకు అవసరమైన పోషకాలు, గాలి, నీరు మొదలైనవన్నీ సమకూర్చి, పంటల నుండి ఆరోగ్యకరమైన వ్యవసాయోత్పత్తులకు దోహదకారి అవుతోంది.

నేలలోని సూక్ష్మజీవరాసుల చర్యల వల్ల నేల భౌతిక స్థితిగతులు, సుస్థిరత వృద్ధి చెందుతాయి. దీంతో పాటు నేలలో అంతర్గతంగా గాలి, నీరు/ద్రవపదార్థాలు ఇంకిపోవడం, నీటిని నిల్వ ఉంచుకునే శక్తి పెంపొందటం జరుగుతుంది. నేల పైభాగంలో, కింది భాగంలో ఉండే జీవరాసుల వల్ల మొక్కలకు/పంటలకు – సూక్ష్మ జీవరాసుల సంబంధం సుస్థిరంగా ఉండి పరస్పర వృద్ధి సమర్థవంతంగా నిర్వహించబడుతోంది. గత కొంతకాలంగా సక్రమంగా జరగని వ్యవసాయ పద్ధతుల వల్ల మొక్కల వేళ్ళ ద్వారా, సూక్ష్మ జీవరాసులకు లభ్యమయ్యే కర్బన ద్రవాలకు తీవ్ర అంతరాయం కలిగి నేలలోనికి సంక్రమించే కర్బన ద్రవాల పరిమాణం గణనీయంగా తగ్గి నేలలోని సూక్ష్మజీవులు – మొక్కల మధ్య జరిగే పరిణామ ప్రక్రియ తీవ్రంగా తగ్గి మొక్కల సమతుల్యత బాగా దెబ్బతిన్నది.

గత 150 సంవత్సరాల్లో కర్బన మూలకాల పరిమాణం 30 నుండి 75 శాతం వరకు పలుచోట్ల తగ్గటం విచారించదగ్గ విషయం. భూసారం స్థితిగతుల్లో వ్యవసాయం ద్వారా జరిగిన పరిణామాల వల్ల నేల ఆరోగ్య స్థితిగతులు తగ్గటం వల్ల గత 40 సంవత్సరాల్లో వ్యవసాయ యోగ్యమైన భూములు ప్రపంచ వ్యాప్తంగా 30 శాతం వరకు వ్యవసాయానికి నిరుపయోగమైనవని తేలడం ఆందోళన కల్గించే విషయం. నేల ఆరోగ్యస్థితి, భూసారం సరిగా లేకపోతే అటు జంతువులు/మానవ మనుగడపై గణనీయమైన ప్రభావం చూపుతుంది. మరీ ముఖ్యంగా 2050 కల్లా మన ప్రపంచ జనాభా 10 బిలియన్లు (1000 కోట్ల)కు చేరుతుందని అంచనా వేస్తున్న నేపథ్యంలో భూసారం/వ్యవసాయ యోగ్యమైన భూమి విస్తీర్ణత తగ్గటం ప్రమాద ఘంటికలను తెలియజేస్తుంది. భూసారంతో పాటు భూ భౌతిక స్థితిగతులను మెరుగుపరచి, ఆరోగ్య వంతమైన వ్యవసాయోత్పత్తులను పెరుగుతున్న జనాభా అవసరాల నిమిత్తం పెంచవలసిన ఆవశ్యకత తక్షణ కర్తవ్యం.

ఆహార పదార్థాల్లో పోషక విలువల క్షీణత :

గత 70 సంవత్సరాల్లో భూసారం విపరీతంగా దెబ్బతినడంతో పంటల్లో పోషక పదార్థాల విలువలు 10 నుండి 100 శాతం వరకు తగ్గిపోయాయి. ఆస్ట్రేలియా వైద్య పరిశోధనా సంస్థలో డేవిడ్‌ ఛాంఫున్‌ అనే శాస్త్రవేత్త 1940 నుండి 1991 వరకు తగ్గిన పోషక విలువలను పరిశోధించి ఫలితాలను వెల్లడించారు. ఆ వివరాల ప్రకారం 27 రకాల కూరగాయల్లో (1940-91 మధ్య) రాగి ధాతువు (76%), కాల్షియం (46%), ఇనుపధాతువు (27%), మెగ్నీషియం (24%), పొటాషియం (16%), ఖనిజ లవణ పరిమాణం గణణీయంగా తగ్గిందని తెలియజేశారు. అదేవిధంగా 10 రకాల మాంసం పోషక విలువల పరిమాణంలో కూడా కాపర్‌ (24%), కాల్షియం (41%), ఇనుపధాతువు (54%), మెగ్నీషియం (10%), పొటాషియం (16%), భాస్వరం (28%) తగ్గాయని తెలియజేశారు.

ఆయన పరిశోధించి తెలుకున్న వివరాల ప్రకారం 1940 సంవత్సరంలో ఉన్న పోషక విలువలను అదే పరిమాణంలో పొందుటకు మాంసలోనైతే రెండు రెట్లు, పండ్లు మూడు రెట్లు, కూరగాయల్లో 2.5 రెట్లు తీసుకోవాలిసిన ఆవశ్యకత ఏర్పడిందని నిర్వివాదంగా తెలుస్తోంది. ఖనిజ లవణాల్లోని ఈ మార్పుల వల్ల మన ఆరోగ్యంపై గణనీయమైన ప్రభావం పడిందని వెల్లడైంది. వీటన్నింటికీ మూలం నేలలో జరిగిన భూసార మార్పులే.

రసాయనిక పదార్థాలతో పండించే ఉత్పత్తుల్లో పోషక విలువలు ముఖ్యంగా ఖనిజ, లవణాలు ఆశించిన నిష్పత్తుల్లో లేనట్లు పరిశోధనా ఫలితాలు తెలుపుతున్నాయి. నేలలో ఖనిజ లవణాలు ఉండి మొక్కల్లోనికి అవి చేరకుండా ఉండటమనేది భూ భౌతిక లక్షణాల ప్రకారం జరుగుతూ ఉంటుంది. మొక్కల ఉత్పత్తుల్లోని ఖనిజ లవణాల రూపాలను సరిదిద్దాలంటే మొక్కలు పోషకాలను గ్రహించే విధంగా తగిన పరిస్థితులను కల్పించేట్లు చేయాలి. నేల నుండి మొక్కలు పోషకాలను ఖనిజ లవణాలతో సహా గ్రహించే ప్రక్రియలను భూమిలోని సూక్ష్మజీవులు నియంత్రిస్తాయి.

మొక్కల వేళ్ళతో మమేకమైన ఈ సూక్ష్మజీవుల చర్యలు మొక్కలకు పోషకాల అందుబాటుకు దోహదపడతాయి. నేల భౌతిక స్థితిలో చుట్టూ ఉండే ఏకోసిస్టమ్‌ పనితీరు మొక్కలు వైవిధ్యం, ఎదుగుదల, మొక్కల కిరణ జన్య ప్రక్రియ, రసాయనిక పదార్థాల హెచ్చుతగ్గులు మొదలైన పలు చర్యలపై ఆధారపడి ఉంటుంది. భూసారం, నీటిని గ్రహించే శక్తి మొదలగు లక్షణాలన్నీ మంచి ఆహార ఉత్పత్తుల సమగ్ర విధానంపై ఆధారపడి ఉంటాయి.

నేలలో కర్బన్‌ ఉనికి :

నేల అటు కర్బన్‌ ఉనికి, నిల్వ ఉండే స్థితికి, ఉత్పత్తుల మూలాలకు ఆలవాలమై ఉంటుంది. భూమి యాజమాన్యాన్ని అనుసరించి కర్బన్‌ చక్రం కొన్ని కోట్ల సంవత్సరాల క్రితమే రూపొందించ బడినది. ఈ చక్రంలో కర్బన్‌- జీవ రసాయనిక శక్తి -పలు మార్పులు చెందుతూ నేల నుండి ఆహార పదార్థాల ఉత్పత్తులను పరివర్తనం చెందించి జీవరసాయనిక చర్యలతో మన దైనందిన జీవితంలో శక్తిని ప్రసాదిస్తూ ఉంటుంది.

ఈ కర్బన చక్రం సక్రమంగా, సజీవంగా భ్రమణం చేస్తున్నంత వరకు అటు భూసార పరిరక్షణ, మొక్కలు, జంతువులు, మనుషుల ఆరోగ్యాలు బాగుంటాయి. కర్బన్‌ మూలాలకు భూమి ఆలవాలమై పంట ఉత్పత్తులకు కారణమై ఉంది. భూమి నుండి కర్బన్‌ మొక్కలకు ఇతరత్రా జీవరాసులకు వెళ్ళే దానితోపాటు నేలకు కూడా కర్బన్‌ మరలా చేరే విధంగా చక్రం భ్రమణం చేస్తూంటుంది. నేలలో కర్బన్‌ శాతం సజావుగా ఉంటేనే మానవ మనుగడకు అవసరమైన ఆహార ఉత్పత్తులు, ఇతర ఉత్పత్తులు సమంగా ఉంటాయి అలా సమంగా ఉండాలంటే, భూసార పరిరక్షణ, కర్బన స్థితి సంపూర్ణంగా నేలకు చేకూరి ఉండాలి.

– ప్రొ.పి.రాఘవరెడ్డి, 9989625230
( వ్యవసాయ విశ్వవిద్యాలయం మాజీ ఉపకులపతి)

(జాగృతి సౌజన్యం తో)