- ప్రేమ, గౌరవంతో సాంస్కృతిక అనుబంధం
హైదరాబాద్‌లో సైన్యం, వైమానిక దళంలో వేర్వేరు యూనిట్లకు చెందిన 1,000 మందికి పైగా సైనికులకు హైదరాబాద్‌లో, చుట్టుపక్కల 19 ఇంజినీరింగ్ కాలేజీలకు చెందిన విద్యార్థినులు ప్రేమ, గౌరవాభిమానాలతో రాఖీలు కట్టారు. విద్యార్థినులు ప్రదర్శించిన సోదరి భావానికి సైనికులు ఆత్మీయంగా ఆనందించారు. వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన రక్షా బంధనం వేడుకల్లో పాల్గొన్న వారు పరస్పరం శుభాభినందనలు తెలుపుకున్నారు. భారతీయ సంస్కృతీ సంప్రదాయాలను ప్రతిబంబించిన ఇంతటి అనిర్వచనీయమైన కార్యక్రమాన్ని హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న సంస్కృతి ఫౌండేషన్ అనే స్వచ్ఛంద సంస్థ నిర్వహించింది. ప్రతి సంవత్సరం నిర్వహించినట్టుగానే ఈ సంవత్సరం కూడా ‘Rakhi for Soldiers’ (సైనికులకు రాఖీ) పేరిట రక్షా బంధనం కార్యక్రమాన్ని సంస్కృతి ఫౌండేషన్ ఆనందోత్సాహాల మధ్య చేపట్టింది.
సోదరసోదరీమణుల సౌభ్రాతృత్వానికి నిదర్శనంగా, భారతీయ సంస్కృతీ సంప్రదాయాలకు అద్దంపట్టేలా ప్రతి యేటా శ్రావణ పౌర్ణమి నాడు పవిత్రమైన రక్షా బంధనం వేడుకను భారతీయులు అనాదిగా దేశవ్యాప్తంగా జరుపుకుంటున్నారు. దేశ పౌరులకు ఈ వేడుకను జరుపుకునే అవకాశం మెండుగా ఉన్నప్పటికీ దేశ రక్షణలో నిరంతరం నిమగ్నమై ఉండే సైనికులు ఈ అద్భుతమైన పండగను జరుపుకునే అవకాశాన్ని కోల్పోతుంటారు. స్వస్థలంలో సోదరీమణులు, కుటుంబసభ్యులతో రక్షా బంధనం వేడుకను జరుపుకోలేకపోతారు.
అలాగే, సంస్కృతి ఫౌండేషన్ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో 35 ఇంజినీరింగ్ కాలేజీలకు చెందిన విద్యార్థినులు 10,000 మందికి పైగా సైనికులకు సకాలంలో చేరే విధంగా రాఖీలను పోస్ట్ ద్వారా పంపించారు.
ఈ సందర్భంగా సంస్కృతి ఫౌండేషన్ ఛైర్మన్ చామర్తి ఉమామహేశ్వర్ రావు గారు మాట్లాడుతూ సోదర సోదరీమణుల సౌభ్రాతృత్వానికి నిదర్శనంగా, భారతీయ సంస్కృతీ సంప్రదాయాలకు అద్దం పట్టే విధంగా సైనికులకు దేశ పౌరులుగా మేము ఉన్నాము అనే భావనను కలిగించడానికి, విద్యార్థుల్లో దేశ భక్తిని పెంపొందించడం కోసం ప్రతి సంవత్సరం రక్షా బంధనం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు తెలిపారు. మాజీ ఐఏఎస్ అధికారి ఎల్.వి.సుబ్రమణ్యంగారు, రిటైర్డ్ లెఫ్ట్‌నెంట్ కల్నల్ నీరదా కృష్ణ గారు, సంస్కృతి ఫౌండేషన్ వైఎస్ ఛైర్మన్ డి.ఆర్.ఎస్.పి.రాజు గారు, కన్వీనర్ డబ్య్లు.సి. ప్రసన్నకుమార్ గారు, కో-కన్వీనర్ టి.రాంబాబు గారు, ప్రొఫెసర్ హేమనాథ్ రావు గారు, ఎగ్జిక్యూటివ్ మెంబర్ వివేక్ మోడి గారు, నటరాజ్ గారు, నాగ ప్రశాంతి గారు, సాయకృష్ణ గారు, వేణుగోపాల్ గారు, ఎర్రం రమేష్ గారు, అన్నపూర్ణగారు, అభినవ్ గారు, తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.