Home News సత్యాగ్రహి డా. హెడ్గేవార్‌

సత్యాగ్రహి డా. హెడ్గేవార్‌

0
SHARE

స్వాతంత్య్రోద్యమంలో ఆర్‌ఎస్‌ఎస్‌ – 3

‌దేశ నిర్మాణం విషయంలో డా.హెడ్గేవార్‌కు మూడు స్థిరాభిప్రాయాలు ఉండేవి. మొదటిది- దేశం కోసం అవసరమైతే ప్రాణ త్యాగానికైనా సిద్ధంగా ఉండాలి. దానికంటే ముఖ్యమైనది దేశం కోసం జీవించడం. రెండవది – దేశ విముక్తి అవసరార్థ దేశభక్తితో సాధ్యం కాదు. అప్రతిహతమైన, అవిశ్రాంతమైన దేశభక్తితోనే సాధ్యమవుతుంది. మూడవది- కఠిన, దీర్ఘకాలిక వ్యక్తి నిర్మాణం వల్లనే దేశ నిర్మాణం సాధ్యం అవుతుంది. దీర్ఘకాలిక పోరాటం గురించి నొక్కి చెప్పిన హెడ్గేవార్‌, ‌మరి తాత్కాలికమైన ఉద్యమంగా చెప్పుకునే అటవీ సత్యాగ్రహంలో, అది కూడా బాల్యదశలో ఉన్న సంస్థ బాధ్యతలను వేరొకరికి అప్పగించి ఎందుకు పాల్గొన్నారు? అనే ప్రశ్న కొంత గందరగోళానికి గురిచేస్తుంది. ఆయన తన సర్‌ ‌సంఘచాలక్‌ ‌పదవిని జూలై 12, 1930న వీడారు. పదకొండు మంది సభ్యులతో కూడిన సత్యాగ్రహ బృందానికి నాయకత్వం వహించారు. ఆ బృందంలోని సభ్యులు- విఠల్‌దేవ్‌, ‌గోవింద్‌ ‌సీతారామ్‌ అలియాస్‌ ‌దాదారావు పారమార్థ్, ‌పురుషోత్తం దినకర్‌ అలియాస్‌ ‌బాబాసాహెబ్‌ ‌దాపెల్‌ (‌వీళ్లంతా నాగపూర్‌కు చెందినవారు), హరికృష్ణ అలియాస్‌ అప్పాజి జోషి (వార్ధా జిల్లా సంఘచాలక్‌), ‌రామకృష్ణ భార్గవ్‌ అలియాస్‌ ‌భయ్యాజి కుంబల్‌వార్‌, ‌త్రైయంబక్‌ ‌దేశ్‌పాండే (వార్థా జిల్లా, సాల్‌ద్‌ఘకీర్‌ ‌సంఘచాలక్‌), ‌నారాయణ్‌ ‌గోపాల్‌ అలియాస్‌ ‌నానాజీ దేశ్‌పాండే (వార్థా జిల్లా అర్వి సంఘ చాలక్‌), ఆనంద్‌ అం‌బడే, రాజేశ్వర్‌ ‌గోవింద్‌ అలియాస్‌ ‌బాబాజి వెరుండే, గోరోటే పాలేవార్‌.

‌సత్యాగ్రహులకు వీడ్కోలు

జూలై 14, 1930న హెడ్గేవార్‌ ‌నాయకత్వంలోని సత్యాగ్రహుల బృందం నాగపూర్‌ ‌నుంచి పూసద్‌ (‌యావత్‌ ‌మాల్‌ ‌జిల్లా)కు బయలుదేరింది. 200 నుండి 300 మంది ప్రజలు రైల్వేస్టేషన్‌ ‌దగ్గర వీరికి వీడ్కోలు పలకడానికి వచ్చారు. ప్రజలు గట్టిగా కోరడంతో హెడ్గేవార్‌ ‌క్లుప్తంగా ఇలా మాట్లాడారు. ‘‘ఈ ఒక్క ఆందోళనతోనే స్వాతంత్య్రం సిద్ధిస్తుంది, ఇదే చివరి పోరాటం అనే భ్రమలో ఉండకండి. నిజమైన పోరాటం ముందుంది. సర్వస్వం త్యాగం చేసి అందులో దూకడానికి సిద్ధంకండి. మేమందరం కూడా ఈ ఉద్యమంలో పాల్గొనడానికి కారణం, మా చేరిక ఉద్యమాన్ని ఇంకొక అడుగు ముందుకు తీసుకువెళ్తుందనే నమ్మకం తోనే’. వందేమాతరం, జయ జయ ధ్వానాల నడుమ, రైలు వార్ధాకు బయలుదేరింది. ఆ సాయంత్రం సంఘ్‌కు సెలవు ప్రకటించారు.

జూలై 15న హెడ్గేవార్‌ ‌బృందాన్ని వార్ధా రామమందిర్‌ ‌దగ్గర సన్మానించారు. ఊరేగింపుగా తీసుకెళ్లారు. తరువాత పుల్‌గావ్‌, ‌దామన్‌గావ్‌, ఇతర చోట్ల కూడా వారిని సత్కరించారు. చివరకు ఈ బృందం పూసద్‌కు చేరింది.

బేరార్‌ ‌యుద్ధ కౌన్సిల్‌ అధ్యక్షులు జి.సి. భోజ్‌రాజ్‌ ‌జూలై 17న అరెస్టు అయ్యారు. భోజ్‌రాజ్‌ని, గంగాధర్‌ అలియాస్‌ అన్నా హివర్‌కర్‌ని అభినం దించడానికి అడ్వకేట్‌ ‌దామ్లే ఆధ్వర్యంలో ఒక సభ జరిగింది. ఆ సభలో ఆ మధ్యకాలంలో వచ్చిన అనధికార న్యూస్‌ ‌షీట్స్ ఆర్డినెన్స్‌నూ, కాంగ్రెస్‌ ‌వర్కింగ్‌ ‌కమిటీని చట్టవిరుద్ధమైనవిగా ప్రకటిస్తూ వచ్చిన ప్రభుత్వ ఆదేశాలనూ వ్యతిరేకిస్తూ తీర్మానాలు జరిగాయి. ఆ సభలోనే హెడ్గేవార్‌, అప్పాజి జోషి ప్రసంగించారు (K.K.chaudhary, ed.source Material for a history of freedom Movement, Civil Disobedience Movement, April – September, 1930, Vol.XI, Gazeters Department, Govermnemt of Maharashtra, Bombay, 1990, p.997).

జూలై 19న జరిగిన ఒక సభలో లక్ష్మణ్‌ ఓక్‌ 4000 ‌మందిని ఉద్దేశించి ప్రసంగించారు. నాటి వక్తలలో టి.ఎస్‌.‌బాపత్‌, ‌సదాశివ హన్మంత్‌ ‌బల్లాల్‌, ‌డి.ఎం.దామ్లే (వీరంతా యావత్‌మాల్‌కు చెందిన వారు) ఇతరులు ఉన్నారు. యావత్‌మాల్‌ ‌జిల్లా యుద్ధ కౌన్సిల్‌ ‌తరఫున ప్రసంగించిన బాపత్‌, ఇక మీదట పూసద్‌లో సత్యాగ్రహం ఉండదని, దానికి బదులుగా యావత్‌మాల్‌కి నాలుగు మైళ్ల దూరంలో వామన్‌రావ్‌ ‌మార్గం వద్ద, జూలై 21 నుండి ప్రారంభమై, 21 రోజులు కార్యక్రమాలు కొనసాగుతా యని ప్రకటించారు. అలానే హెడ్గేవార్‌ ‌మొదటి సత్యాగ్రహ బృందానికి నాయకత్వం వహిస్తారని కూడా ప్రకటించారు (Chaudhary, p.998).

సత్యాగ్రహి హెడ్గేవార్‌

‌హెడ్గేవార్‌, ‌పదకొండుమంది సహచర సత్యాగ్రహులు యావత్‌మాల్‌ ‌దగ్గర అటవీ చట్టాన్ని అతిక్రమించినందుకు అరెస్టు అయ్యారు. ‘కేసరి’ పత్రిక ఈ విషయం గురించి ఇలా రాసింది- ‘21న యావత్‌మాల్‌లో శాసనోల్లంఘన ప్రారంభమైంది. నాగపూర్‌ ‌నుండి హెడ్గేవార్‌, ‌దాబలే, ఇతరులు పదకొండు మంది సభ్యుల బృందం, డా. ముంజే బృందంతో కలసి సత్యాగ్రహంలో పాల్గొనడానికి వచ్చింది. మొదటిరోజే అటవీ చట్టాన్ని అతిక్రమిం చారు. ఈ ప్రదేశం పూసద్‌ ‌కన్నా విశాలంగా ఉండడం వల్ల, పది నుండి పన్నెండు వేలమంది జనం ఈ యుద్ధ సన్నివేశాన్ని తిలకించడానికి అక్కడికి వచ్చారు. ఈ ప్రదేశం కొండ నుంచి నాలుగు మైళ్ల, రెండు ఫర్లాంగ్‌ల దూరంలో ఉంది. కొండలు, పచ్చదనం, ప్రకృతి అందాలతో ఆ ప్రదేశం సస్యశ్యామలంగా, ఆహ్లాదకరంగా ఉంది. ఐదు సంవత్సరాల పిల్లలు మొదలు.. పురుషులు, స్త్రీలు తమ సంతానాన్ని సైతం తీసుకొని ఈ పవిత్ర ప్రదేశానికి కాలినడకన వచ్చారు. ఇందులో 75 సంవత్సరాల వృద్ధులు కూడా పాల్గొన్నారు. డా।। హెడ్గేవార్‌ ‌తన బృందంతో అటవీ చట్టాన్ని అతిక్రమించగానే, అడవి మొత్తం ‘మహాత్మా గాంధీకి జై!’, ‘స్వతంత్రతా దేవికి జై!’ అన్న నినాదాలతో మారు మోగింది. దీనికి కథా నాయకుడు హెడ్గేవార్‌ను రోడ్‌పై రాగానే అరెస్టు చేశారు. ఒక జైలు గదిలో విచారించారు. సెక్షన్‌ 117, 279‌ల కింద నేరం మోపారు. మూడు నెలలు, ఇంకా ఆరునెలలు, మొత్తం 9 నెలల కఠిన కారాగార శిక్ష విధించారు. పదకొండుమంది సత్యాగ్రహులకు సెక్షన్‌ 379 ‌కింద నాలుగు నెలల వంతున కఠిన కారాగార శిక్ష విధించారు. అందరిని వెంటనే అకోలా జైలుకు తరలించారు’’ (Kesari, 26 July, 1930).

నాగపూర్‌ ‌ప్రతిస్పందన

హెడ్గేవార్‌ అరెస్టు అయినరోజు సాయంత్రం స్వయంసేవకులు సమావేశం నిర్వహించారు. ఉమాకాంత్‌ ‌కేశవ్‌ అలియాస్‌ ‌బాబాసాహెబ్‌ ఆప్టే మాట్లాడారు. హెడ్గేవార్‌కు 9 నెలల శిక్ష, మిగతా వారికి 4 నెలల కఠిన కారాగార శిక్ష పడిందనే సమాచారం రాత్రి 10.30కి టెలిగ్రామ్‌ ‌ద్వారా మహారాష్ట్ర బై వీక్లికి వచ్చింది.

వీరి అరెస్టుకు నిరసనగా జూలై 22న నాగపూర్‌లో పూర్తి హర్తాళ్‌ ‌జరిగింది. అలాగే డా.నారాయణ భాస్కర్‌ ఖరే, పూనంచంద్‌ ‌రంకా, బాబాసాహెబ్‌ ‌దేశ్‌ముఖ్‌, ‌ధర్మాధికారి (వీరంతా మరాఠి, సిపి.యుద్ధ కౌన్సిల్‌లో కార్యనిర్వాహక సభ్యులు) ఆ అరెస్ట్‌లకు నిరసన తెలిపారు. అంజుమన్‌ ఇస్లాం పాఠశాల తప్ప అన్ని పాఠశాలలు, కళాశాలు మూతపడ్డాయి. కర్మాగారాలను నిలిపి వేశారు. ఆ మధ్యాహ్నం విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో ఊరేగింపు జరిగింది. ఇది కాంగ్రెస్‌ ‌పార్క్, ‌క్రాడాక్‌ ‌టౌన్‌వద్ద డా. ముంజే అధ్యక్షతన జరుగుతున్న సభ వరకు సాగింది. అరెస్ట్ అయిన నాయకులను అభినందిస్తూ, అలాగే విద్యార్థి సంఘం అధికారాన్ని గుర్తిస్తూ తీర్మానాలు జరిగాయి. సాయంత్రం 4.30కి యుద్ధ కౌన్సిల్‌ ‌నూతన అధ్యక్షుడు గణపత్‌రావ్‌ ‌తికేకర్‌, ‌పి.కె.సాల్వే, చగ్గన్‌లాల్‌ ‌భారుక, జి.డి. దావ్‌లే, ఆర్‌.ఎస్‌. ‌రుయికర్‌, ‌నందగావలి,  సంఘ్‌ ‌సర్‌ ‌సేనాపతి మార్తాండ్‌ ‌పరశురామ్‌జోగ్‌, అనసూయా కాలే ఆధ్వర్యంలో అరెస్టులకు నిరసన వ్యక్తంచేస్తూ భారీ ప్రదర్శన నిర్వహించారు (Chaudhary, p.994).

హెడ్గేవార్‌, ఆయన సత్యాగ్రహుల బృందాన్ని అభినందించడానికి సాయంత్రం స్వయంసేవకులు, నాగపూర్‌ ‌నగర ప్రముఖులు, ఇతర విద్యార్థులతో సంఘస్థాన్‌లో సభ జరిగింది. ప్రార్థన తరువాత, సర్‌ ‌సంఘచాలక్‌ ‌డా।।పరంజపే, డా।।మూంజే ప్రసంగించారు. రాత్రికి చిట్నవిస్‌ ‌పార్క్‌లో సి.పి. యుద్ధ కౌన్సిల్‌ ‌నాయకుల అరెస్ట్‌కు నిరసనగా ఒక సమావేశం జరిగింది. అక్కడ హెడ్గేవార్‌, ‌దాబలేకు విధించిన శిక్షల గురించి కూడా గుర్తు చేశారు. శారీరక శిక్షణ సంఘ్‌ ఇన్‌చార్జ్ అనంత్‌గణేశ్‌ అలియాస్‌ అన్నా సోహాని 250 స్వయంసేవకులతో అక్కడికి వచ్చారు. హెడ్గేవార్‌ అరెస్టు తరువాత సంఘ్‌ ‌తన కార్యక్రమాన్ని నిలిపివేయలేదు. జూలై 23 నుండి క్రమంగా రోజువారీ తరగతులు ప్రారంభమయ్యాయి. నిత్య హాజరు 100 దాటింది. జూలై 24 సాయంత్రం మరాఠి సిపి యుద్ధ కౌన్సిల్‌ ‌నూతన అధ్యక్షుడి గణపత్‌రావ్‌ ‌తికేకర్‌ ‌నాయకత్వంలో నాగపూర్‌ ‌నుండి 24 మంది సత్యాగ్రహుల బృందం ఆలేగావ్‌కు బయలుదేరింది (తాల్‌ అస్థి, వార్దా జిల్లా). ఆ సత్యా గ్రహులలో ఇద్దరు స్వయంసేవకులు- రాంభాహు వాఖే, విఠల్‌రావ్‌ ‌గాడ్గే ఉన్నారు. వారిని పి.భాండారా, సహ సంఘ్‌చాలక్‌ ‌కర్మవీర్‌ ‌పాథక్‌ ‌సంఘ్‌ ‌తరఫున పూలమాలలతో సన్మానించారు. ఈ సన్మానంలో పాథక్‌ ఇలా అన్నారు, ‘‘భారతీయ నాగరికతను పునరుద్ధరించి, రాజకీయ లక్ష్యాలను సాధించడానికి సంఘ్‌ ‌పుట్టింది. స్వాతంత్య్ర సాధనే ధ్యేయంగా ప్రారంభమైన ఏ సంస్థతోనైనా సహకరించ డానికి సిద్ధంగా ఉంది’’ (Sangh archives, Hedgewar papers, registerol/registerd / BSC-0236-239).

హెడ్గేవార్‌ ఉ‌గ్రరూపం

అరెస్టయిన హెడ్గేవార్‌ని యావత్‌మాల్‌ ‌నుండి ఆకోలాకి రైలులో తీసుకువెళుతున్నప్పుడు కూడా హెడ్గేవార్‌కి చాలా చోట్ల స్వాగతం లభించింది. ఆయనకు మద్దతుగా జన నినాదాలు చేశారు.  రైలు ఆగిన ప్రతి రైల్వేస్టేషన్‌లో జనం కోరిక మేరకు ఆయన ఐదు నిమిషాల పాటు ప్రసంగించారు. యావత్‌ ‌మాల్‌, ‌ముర్తిజాపూర్‌ ‌మధ్య ఉన్న దర్‌వాహ రైల్వేస్టేషన్‌ ‌పెద్దది. హెడ్గేవార్‌ని ఆహ్వానించడానికి అక్కడ కూడా సన్నాహాలు చేశారు. ప్లాట్‌ఫారం మీదనే ఒక వేదికను ఏర్పాటు చేశారు. 700 నుండి 1000 మంది వరకు జనం వచ్చారు. దర్‌వాహ వరకు రైలు బోగి గుమ్మం దగ్గర నిల్చుని స్టేషన్‌లలో తనను జనం అభినంది స్తుంటే హెడ్గేవార్‌ ‌కూడా ప్రతి స్పందించారు. దర్‌వాహ దగ్గర రైలు దిగి వేదిక ఎక్కి 15-20 నిమిషాలు మాట్లాడారు. అక్కడ రైలు కొద్దిగా ఎక్కువ సమయం ఆగింది. గార్డ్, ‌సబ్‌ఇన్‌స్పెక్టర్‌, ‌స్టేషన్‌ ‌మాస్టర్‌ ఆం‌దోళనపడ్డారు. ప్రజలు రైలు కంపార్ట్‌మెంట్‌లో ఆహార పొట్లాలు పెట్టసాగారు. రైలు దర్‌వాహ రైలుస్టేషన్‌ ‌నుండి బయలుదేరింది. అప్పాజి జోషి హెడ్గేవార్‌తో పాటు ఉన్నారు. ఆయన ఆ తరువాత జరిగిన ఆ సంఘటన గురించి ఇలా చెప్పారు: ‘కొంచెం అన్యాయం జరిగినా హెడ్గేవార్‌ ‌కుటుంబం ఆగ్రహంతో ప్రతిఘటించే స్వభావం కలదని ప్రసిద్ధి. హెడ్గేవార్‌కి కూడా అదే స్వభావం వచ్చింది. కానీ సంస్థ కోసం ఆయన కోపాన్ని అదుపులో పెట్టటం నేర్చుకున్నారు.’ కానీ తన ఆత్మగౌరవం గాయపడే సందర్భం ఎదురవు తున్నదని భావించగానే ఆ కోపం పెల్లుబికింది. ఆ సందర్భంగా గురించి అప్పాజీ ఇలా చెప్పారు- రైలు దర్‌వాహ్‌ ‌నుండి బయలుదేరింది. ఆ వెంటనే 27 సంవత్సరాల సబ్‌ఇన్‌స్పెక్టర్‌ ‌తన కానిస్టేబుల్‌ను ఆదేశిస్తూ,‘‘రామ్‌సింగ్‌, ‌సంకెళ్లు బయటకు తియ్యి’’ అన్నాడు.

దీనికి హెడ్గేవార్‌ ‘‘‌సంకెళ్లు ఎందుకు?’’ అన్నారు.

‘‘నేనేం చేయాలి! డీఎస్‌పీ నాకు ఆదేశించాడు. నేను నా పని చేస్తున్నాను. నేను ఆయన కింద ఉద్యోగిని.’’ అన్నాడు సబ్‌ఇన్స్‌పెక్టర్‌.

‘‘ఇది డీఎస్‌పీ ఆదేశం అయితే, సంకెళ్లు మొదట్లోనే వేసేవారు. కాబట్టి డీఎస్‌పీ అలా చెప్పలేదు’’ అన్నారు హెడ్గేవార్‌.

‘‘ఆ ఆదేశం ఇప్పుడు ఇచ్చారు’’ చెప్పాడు సబ్‌ ఇన్‌స్పెక్టర్‌.

‘‘ఇది పూర్తిగా అబద్ధం. ఇది నా మొదటి నిర్బంధం కాదు. మేము స్వచ్ఛందంగా చాలా సత్యాగ్రహాలు చేశాం. మేము పారిపోయేవాళ్లం కాదు, సంకెళ్లు వేయొద్దు, వేయడానికి ప్రయత్నించకండి!’’

సబ్‌ఇన్‌స్పెక్టర్‌ ‌వినే ధోరణిలో లేడు. హెడ్గేవార్‌ ‌చెప్పింది పట్టించుకోలేదు.

మళ్లీ ‘‘రాంసింగ్‌, ‌సంకెళ్లు అందుకో’’ అన్నాడు.

దీనితో హెడ్గేవార్‌ ‌సూటిగా ఇలా అన్నారు, ‘‘మీకు నేను చెప్పేది అర్థం కాలేదనుకుంటా’’.

దీనితో సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ ‌కంగుతిన్నాడు.

‘‘నీకు నేనెవరో తెలియదనుకుంటా? నీవు ఎలాగైనా నాకు సంకెళ్లు వేయాలని చూస్తున్నట్లు న్నావు. అలా అయితే నేను కూడా నా పట్టుదల ఎలాంటిదో చూపించాల్సి వస్తుంది.’’

‘‘అంటే మీరు నన్ను సంకెళ్లు వెయ్యనివ్వరన్న మాట?’’

హెడ్గేవార్‌ ‌కోపంతో ఊగిపోతున్నారు. నేను హెడ్గేవార్‌ను అంత కోపంతో ఎప్పుడు చూడలేదు. ఆయన ఇలా అన్నారు, ‘‘సంకెళ్లు ఎలా వేస్తారో చూద్దాం! అతిగా ప్రవర్తించావంటే రైలు నుండి నిన్ను తోసిపడేస్తా, మహా అయితే ఏంచేస్తారు, మరో కేసు పెడతారు. సత్యాగ్రహం చేసినప్పుడు 9 నెలల శిక్ష పడుతుందని మేం అనుకోలేదు. 9 నెలలకు బదులు 18 నెలల శిక్ష పడుతుంది. అంతేకదా. కాబట్టి సంకెళ్లు ఎలా వేస్తారో చూద్దాం.’’

హెడ్గేవార్‌ ‌కోపాన్ని చూసి రాంసింగ్‌, ఇతర ఆ కానిస్టేబుళ్లు అయోమయంలో పడ్డారు. అప్పాజి ముందుకొచ్చి, ఇలా చెప్పారు ‘‘మీరు ఈ ప్రాంతానికి కొత్త కాబట్టి హెడ్గేవార్‌ ‌స్థాయితో పాటు, ప్రభుత్వం ఆయనను ఎలా గౌరవిస్తుందో కూడా తెలియదు. డిఎస్‌పి ఉత్తర్వులు ఇచ్చారనడం అబద్ధం. చాలాచోట్ల జరిగిన సన్మానాలు చూసి మీకు కోపం వచ్చినట్టుంది. అయినా సంకెళ్లు వేయడానికి ప్రయత్నించకండి. డీఎస్‌పీ ముస్లిం కాబట్టి ఆయన ఆనందిస్తాడని మీరు అనుకోవడం తప్పు. సంకెళ్లు వేసి చూడు. హెడ్గేవార్‌, ‌డీఎస్‌పీకి మధ్య అనుబంధం అప్పుడు మీకు తెలుస్తుంది. డీఎస్‌పీ మిమ్మల్ని చీవాట్లు పెడతారు, చూడు. మేం ఏమన్నా పారిపోయేవాళ్లమా?’’

అప్పాజి చెప్పిన మాటలతో అక్కడ ఉన్న కాని స్టేబుల్‌ ఏకీభవించాడు. సబ్‌ ఇన్‌స్పెక్టర్‌కు విషయం అర్ధమయ్యేటట్టు చేయడానికి ప్రయత్నం ప్రారంభిం చారు. చేయించసాగారు. దీంతో సబ్‌ఇన్‌స్పెక్టర్‌ అహంకారంతో ఇలా అన్నాడు. ‘‘నేను సాధారణ ఉద్యోగిని. మీరు ఎన్నో స్టేషన్‌లలో దిగుతున్నారు. మీలో ఎవరైనా పారిపోతే నేను చిక్కుల్లో పడతాను.’’

దీనికి అప్పాజి ‘‘మేము పారిపోవాలని అనుకుంటే, ఇప్పటివరకే పారిపోయేవారం. చింతిం చకు, మా అందరిని క్షేమంగా జైలుకి చేర్చిన ఘనత నీకే దక్కుతుంది’’.

సబ్‌ ఇన్స్‌పెక్టర్‌కు విషయం అర్థమైంది. గందర గోళం సద్దుమణిగింది. హెడ్గేవార్‌ ‌నవ్వుతూ ‘‘నీవు సమ్మతించావా? ఈ ఘనత అప్పాజీకే దక్కాలనుంది. అందుకే నువ్వు నేను ఎంత చెప్పినా సమ్మతించలేదు.’’ అందరూ మనస్ఫుర్తిగా నవ్వుకున్నారు. తరువాత ఆ కంపార్ట్‌మెంట్‌లో ఉన్న ఆహారపదార్థాలు అందరు, సబ్‌ ఇన్‌స్పెక్టర్‌తో సహా తిన్నారు. రాత్రి పదికి మేము ముర్తిజాపూర్‌ ‌చేరాం. అక్కడి రైలు మారాం. అకోలా చేరేసరికి అర్థరాత్రి దాటింది. అక్కడి నుండి లారీలో మమ్మల్ని జైలుకి తరలించారు. అందరినీ ఒకే గదిలో బంధించారు (Sangh archives, Hedgewar papers, Nana palker/ Hedgewar notes – S S-115-119). అకోలా జైలులో హెడ్గేవార్‌ ‌కారాగార వాసం ప్రారంభమైంది. అది ఫిబ్రవరి 11, 1931 వరకు కొనసాగాలి. అటవీ సత్యాగ్రహంలో పాల్గొన్నం దుకు హెడ్గేవార్‌కు శిక్ష పడింది. మరి ఇతర స్వయం సేవకులు ఈ సమయంలో ఏం చేస్తున్నట్లు..?

– డాక్టర్‌ శ్రీ‌రంగ్‌ ‌గోడ్బొలే

జాగృతి సౌజ‌న్యంతో…

మొద‌టి భాగం : అటవీ సత్యాగ్రహంలో సంఘ్‌ (స్వాతంత్య్ర ఉద్యమంలో ఆర్‌ఎస్‌ఎస్‌ – 1)

రెండ‌వ భాగం : సర్‌సంఘచాలక్‌ ‌బాధ్యతకు విరామం (స్వాతంత్య్ర ఉద్యమంలో ఆర్‌ఎస్‌ఎస్‌ – 2)