స్వరాజ్య సమరంలో వనవాసీ వీరుల త్యాగం, ధైర్య సాహసాలు వర్తమానంతో పాటుగా భావితరాలకు ఆదర్శనీయమని తెలంగాణ రాష్ట్ర గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ గారు అన్నారు. దేశ పరిరక్షణ ప్రతి ఒక్కరిగా బాధ్యత అని వారు అన్నారు.
ఆగస్టు 9వ తేదీన అంతర్జాతీయ వనవాసీ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ వేడుకల్లో భాగంగా వనవాసీ కళ్యాణ్ పరిషత్ – తెలంగాణ, జాతీయ షెడ్యుల్డ్ తెగల కమిషన్, ఉస్మానియా విశ్వవిద్యాలయం షెడ్యూల్డ్ తెగలకు చెందిన టీచర్లు, రీసెర్చ్ స్కాలర్లు, విద్యార్థులు భాగ్యనగరంలోని ఉస్మానియా విశ్వవిద్యాలయ ప్రాంగణంలోని ఠాగూర్ ఆడిటోరియం వద్ద నిర్వహించిన ఒక కార్యక్రమంలో ముఖ్య అతిథిగా రాష్ట్ర గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ గారు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా గవర్నర్ గారు ప్రసంగిస్తూ 75వ స్వతంత్ర దినోత్సవ వేడుకలను జరుపుకుంటున్న సందర్భంగా వనవాసీ మహిళ దేశానికి రాష్ట్రపతి కావడం యావత్ దేశ ప్రజలు చిరస్మరణీయంగా చేసుకోవాల్సిన ఘట్టమని అన్నారు. రాష్ట్ర గవర్నర్‌గా ఆరు వనవాసీ గ్రామాలను తాము దత్తత చేసుకున్నట్టు వారు తెలిపారు. వనవాసీ ప్రజల సంక్షేమం, అభివృద్ధి కోసం రాజ్‌భవన్ అనేక కార్యక్రమాలు చేపడుతున్నదని డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ గారు చెప్పారు. ఇటీవల తెలంగాణలో భారీ వర్షాలకు అతలాకుతలమైన భద్రాచలం, నల్లమల్ల అటవీ ప్రాంతాల్లో ముంపునకు గురైన వనవాసీ ప్రాంతాలను తాము సందర్శించినట్టు గవర్నర్ గారు తెలిపారు.
వనవాసీ కళ్యాణ్ పరిషత్ అందిస్తున్న సేవలను గురించి ప్రస్తావిస్తూ తమిళనాడులో ఉన్న కాలంలో వనవాసీ కళ్యాణ్ పరిషత్ సేవా కార్యక్రమాల్లో తాము పాల్గొన్నట్టు తమిళిసై సౌందరరాజన్ గారు చెప్పారు. ఇదే సందర్భంగా 30 సంవత్సరాల క్రితం తాము తమిళనాడులో హౌస్ సర్జన్ చేస్తుండగా తంజావూరులోని ఆసుపత్రిలో ఒక రోగి కోసం రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్(RSS) కార్యకర్తలు ఎలాంటి స్వలాభాపేక్ష లేకుండా రక్తదానం చేసిన ఘట్టాన్ని తెలంగాణ గవర్నర్ గారు ఎంతో భావోద్వేగంతో సభికులకు వివరించారు. రక్తదానం చేయడానికి రోగి బంధువులు నిరాకరించినప్పుటికీ.. మానవ సేవే మాధవ సేవ అన్న నానుడిని నిజం చేస్తున్నట్టుగా RSS కార్యకర్తలు ముందుకు వచ్చారని సభికుల హర్షధ్వానాల మధ్య వారు తెలిపారు.
ఈ సందర్భంగా స్వరాజ్య సమరంలో కీలకమైన పాత్ర పోషించిన వనవాసీ అమర వీరులను డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ గారు స్మరించుకున్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ గారి చొరవతో త్వరలో తెలంగాణలో గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటు కానున్నదని వారు వెల్లడించారు. వనవాసీల కారణంగానే అడవులు ఇప్పటికీ సురక్షితంగా ఉన్నాయన్న విషయాన్ని ప్రతి ఒక్కరూ గమనంలోకి తీసుకోవాలని గవర్నర్ గారు తెలిపారు. పలు స్వచ్ఛంద సేవా సంస్థల భాగస్వామ్యంతో అనీమియా లాంటి వ్యాధుల నుంచి వనవాసీలకు విముక్తి కలిగించడంలో రాజ్‌భవన్ చురుకైన పాత్ర పోషిస్తున్నదని డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ గారు చెప్పారు.
సభికుల్లో అత్యధికులైన విద్యార్థులను ఉద్దేశించి గవర్నర్ గారు ప్రసంగిస్తూ వనవాసీ అమర వీరులు ముఖ్యంగా ఒకవైపు ఆంగ్లేయులతోనూ మరోవైపు నిజాం పాలకులతోనూ ఏకకాలంలో స్వరాజ్య సమరం సాగించిన వనవాసీ వీరుల త్యాగ చరితను, ఘనతను తెలుసుకోవడంలో ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ వేడుకలను వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. అదే సమయంలో ‘హర్ ఘర్ తిరంగా’ ఉద్యమాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లడం ద్వారా ప్రతి ఇంటిలోనూ త్రివర్ణపతాకం రెపరెపలాడేలా విద్యార్థులు పూనుకోవాలని గవర్నర్ గారు విజ్ఞప్తి చేశారు.
కార్యక్రమానికి ప్రధాన వక్తగా విచ్చేసిన సామాజిక సమరసత మంచ్ కన్వీనర్ శ్రీ అప్పాల ప్రసాద్ జీ ప్రసంగిస్తూ వనవాసీలను ప్రధాన జనజీవన స్రవంతిలోకి తీసుకురావడంలో వనవాసీ కళ్యాణ పరిషత్ విశేషమైన కృషి చేస్తున్నదని తెలిపారు. మానవ జీవనంలో వనవాసీల ప్రాధాన్యతను గుర్తెరిగిన ఐక్యరాజ్యసమితి ప్రతి సంవత్సరం ఆగస్టు తొమ్మిదవతేదీని అంతర్జాతీయ వనవాసీ దినోత్సవంగా జరుపుకోవాలని తీర్మానించిందని శ్రీ అప్పాల ప్రసాద్ జీ చెప్పారు. భారతదేశంలో 10 కోట్ల మంది వనవాసీలు ఉండగా ప్రపంచవ్యాప్తంగా 600 తెగలకు చెందిన వారి సంఖ్య 45 కోట్లుగా ఉందని వారు తెలిపారు.
అమెరికా లాంటి దేశాల్లో 500 సంవత్సరాలుగా వనవాసీలపై ఐరోపావాసులు ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తూ అత్యాచారాలకు పాల్పడుతున్నారని శ్రీ అప్పాల ప్రసాద్ జీ తెలిపారు. ప్రపంచంలో వనవాసీల సంస్కృతీ సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలు, జీవన శైలిని గౌరవిస్తూ నేటికీ వారిని పరిరక్షిస్తున్న ఏకైక దేశంగా భారతదేశం విరాజిల్లుతున్నదని వారు చెప్పారు. వనవాసీలపై దౌర్జన్యాలకు పాల్పడిన ఆర్యులుగా హిందువులపై ఆంగ్లేయుల ఏలుబడి కాలం నుంచి ఒక దుష్ప్రచారం జరుగుతున్నదని అన్నారు. భారతీయులందరినీ ఆర్యులని ప్రకటించిన ఏకైక వ్యక్తి డాక్టర్ బీ.ఆర్.అంబేద్కర్ అని వారు తెలిపారు. శ్రీరామచంద్రునితో ముడిపడిన దేశం భారతదేశమని శ్రీ అప్పాల ప్రసాద్ జీ చెప్పారు. దుష్ట శిక్షణ, శిష్ట రక్షణలో భాగంగా వనవాసం చేస్తున్న శ్రీరామచంద్ర ప్రభువుకు రేగి పండ్లు సమర్పించిన భక్త శబరి వనవాసీల ప్రతినిధిగా శ్రీరాముని ఆశయ సాధనకు తోడ్పాటును అందించారని వారు తెలిపారు.
ఉస్మానియా విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ ప్రొఫెసర్ లక్ష్మీనారాయణ గారు, పాలమూరు విశ్వవిద్యాలయం వైస్ చాన్సెలర్ ప్రొఫెసర్ లక్ష్మీకాంత్ రాథోడ్ గారు, తదితరులు కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు. అంతకమునుపు కార్యక్రమానికి విచ్చేసిన గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ గార్ని వనవాసీ సంప్రదాయబద్ధమైన వాద్య పరికరాలను వాయిస్తూ, నృత్యంతో వనవాసీలు స్వాగతం పలికారు. కార్యక్రమంలో రీసెర్చ్ స్కాలర్లు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.