Home Rashtriya Swayamsevak Sangh స్వరాజ్య సమరంలో స్వయంసేవకులు పేరు ఆశించని పోరు

స్వరాజ్య సమరంలో స్వయంసేవకులు పేరు ఆశించని పోరు

0
SHARE

 -న‌డింప‌ల్లి ఆయుష్‌

ఆర్‌ఎస్‌ఎస్‌కూ, స్వాతంత్య్ర సమరానికీ సంబంధం లేదనే జ్ఞానశూన్యులకు ఈ దేశంలో కొదవలేదు. ఆర్‌ఎస్‌ఎస్‌ ‌స్థాపకులు డాక్టర్‌ ‌కేశవరావ్‌ ‌బలిరాం హెడ్గేవార్‌ ‌వంటి చింతనాపరులు, దూరదృష్టి కలిగినవారు, ద్రష్టలు స్వాతంత్య్రోద్యమానికి దూరంగా ఉండిపోయారనీ, ఉండగలరనీ తీర్మానించడం అవకాశవాద రాజకీయ ధోరణే తప్ప, చారిత్రక దృక్పథం కాలేదు. చరిత్రను నిష్పాక్షికంగా చూసే దృష్టి అసలే కాలేదు. స్వరాజ్య పోరాటం పదునెక్కుతున్న సమయంలో రెండు భిన్నధృవాలుగా ఉన్న గాంధీజీ, నేతాజీ ఇద్దరితోనూ ఆయనకు సాన్నిహిత్యం ఉండేది. డాక్టర్జీ జీవితం ఆధారంగా రాసిన ‘పెనుతుపానులో దీపస్తంభం’ నవల ఈ విషయాలను సాధికారికంగా ఆవిష్కరించింది. ఇక్కడే ఒక ప్రశ్న. భారత స్వాతంత్య్ర సమర చరిత్ర సకారాత్మకంగా, వస్త్వాశ్రయ దృష్టితో దేశం ముందుకు వచ్చిందా? చరిత్రపుటలకు ఎక్కకుండా మిగిలినపోయిన వారు ఎందరు? చరిత్రపుటలలో చేరడం, సమరయోధుల పింఛనలు, సౌకర్యాలు తీసుకోవడం మా లక్ష్యం కాదు, దేశ స్వాతంత్య్రమే మా ఆశయం అంటూ నిష్కామ కర్మ దృష్టి నాటి స్వరాజ్య సమరయోధు లలో ఇతోధికంగా ఉంది.  స్వాతంత్య్ర పోరాట యోధుల గురించి మాట్లాడవలసి వచ్చినప్పుడు చారిత్రక దృక్పథంతో ఉండాలి. మార్క్సిస్టు దృక్పథంతోనో, కాంగ్రెస్‌ అనుకూల దృక్పథం తోనో అంచనా వేయడం సరికాదు. స్వాతంత్య్రం వచ్చిన తరువాత భారతదేశం ఏమిటి? భారతీయుల కర్తవ్యం ఏమిటి అని ఆలోచించిన డాక్టర్‌ ‌హెడ్గేవార్‌కు స్వాతంత్య్ర పోరాటంతో సంబంధం లేదని ప్రచారం చేయడం అజ్ఞానమే.

డాక్టర్‌ ‌హెడ్గేవార్‌ ‌వివిధ రాజకీయ, విప్లవ ఉద్యమాల్లో పనిచేశారు. దేశమాత స్వేచ్ఛను కోరుతూ ఈ దేశంలో అనేక సంస్థలు, అనేక పంథాలతో పనిచేశాయి. గాంధీజీ ఉద్యమంలోకి రాకముందు కూడా ఈ దేశంలో స్వాతంత్య్ర సమరం ఉంది. తరువాత చాలావరకు కాంగ్రెస్‌ ‌పంథాలో, గాంధీజీ చింతనతో సాగాయి. ఇంకొన్ని వాటితో సంబంధం లేకుండా, ఆ సిద్ధాంతాలను నిరాకరిస్తూ సాగాయి. గాంధీజీ అంటే భక్తి ఉన్నా, కాంగ్రెస్‌కు బయట ఉండి దేశం కోసం త్యాగాలు చేసినవారూ ఉన్నారు. అలాంటివారిలో డాక్టర్జీ ఒకరు. స్వాతంత్య్ర సాధన, దేశ సర్వతోముఖ అభివృద్ధి గురించి ఆయనకు కొన్ని దృఢమైన అభిప్రాయాలు ఉన్నాయి. స్వరాజ్య సమరానికి కల్పనతో పాటు స్వతంత్ర భారతం ఎలా ఉండాలో భావించిన ద్రష్ట డాక్టర్జీ.

  1. మన ధర్మం ఆధారంగానే దేశ నిర్మాణం జరుగుతుంది.
  2. ధర్మ పరిరక్షణకు సమీకృత, సమైక్య సామాజిక వ్యవస్థ ఉండాలి.
  3. అలాంటి సమాజాన్ని నిర్మించడానికి ఉన్నత స్థాయి జాతీయ, వ్యక్తిగత వ్యవహార శైలి కలిగిన వ్యక్తులు అవసరం.

ఈ నిష్కర్షలకు తగినట్లుగా దేశీయులలో వ్యక్తిగత, జాతీయశీలాన్ని నిర్మించేందుకు ఆయన శాఖ అనే తంత్రాన్ని రూపొందించారు. శాఖ ద్వారా సంస్కారాలు పొందిన వ్యక్తులు దేశం మొత్తంలో వివిధ రంగాల్లో పనిచేసి విలువలతో కూడిన సమాజ నిర్మాణానికి కృషి చేస్తారు. విదేశీ పాలన నుండి విముక్తి పొందడానికి, అలాగే దేశాన్ని పటిష్టపరుచుకోవడానికి ఇదే సరైన మార్గమని ఆయన విశ్వసించారు. నిజానికి భారతీయ ధర్మం ఆధారంగా స్వతంత్ర భారతం ఆవిర్భవించాలన్న చింతన తిలక్‌, అరవిందులు, లజపతిరాయ్‌ ‌వంటివారు కూడా స్వప్నించారు. కానీ ఆ చింతనను తుదికంటా నడిపించాలని తపించినవారు డాక్టర్జీ.

దేశ కార్యం చేయడమంటే తల్లికి సేవ చేయడం వంటిదేనని అందుకు పేరు ప్రతిష్టలు, గుర్తింపు కోరుకోకూడదని డా. హెడ్గేవార్‌ ‌స్వయంసేవకులకు (ఆర్‌ఎస్‌ఎస్‌ ‌సభ్యులు) చెపుతూ ఉండేవారు. అందువల్ల తాము చేసిన దేశసేవ వివరాలు నమోదు చేసుకోవాలన్న ఆలోచన సహజంగానే స్వయంసేవకులకు రాలేదు. సంఘ స్ఫూర్తితో ప్రారంభమయిన అనేక సంస్థల్లో కూడా ఇదే ధోరణి నేటికీ కనిపిస్తుంది.

ఈ రకమైన ధోరణిని, ఆలోచనను సంఘ స్థాపకులు ప్రయత్నపూర్వకంగా, జాగ్రత్తగా స్వయంసేవకుల్లో నిర్మాణం చేశారు. అందువల్లనే వివిధ రంగాల్లో పనిచేసే స్వయంసేవకులకు ఆ పని చేయడానికి అవసరమైన ప్రేరణ, స్ఫూర్తి ఎక్కడ నుండి వస్తుంది? అలా ఒకపక్క వివిధ కార్యాల్లో నిమగ్నమైనప్పటికీ వ్యక్తి నిర్మాణం, హిందూ సంఘటన అనే మౌలిక లక్ష్యంపై వారు ఎలా దృష్టి ఉంచగలుగుతారు అనే విషయాలు బయటవారికి అర్థంకావు. సంఘ కార్యం అంటే సమాజాన్ని సంఘటితం చేయడం. అంతేకాని సమాజంలో అతిపెద్ద సంస్థగా అవతరించడం కాదు. అవతరించా మని ప్రచారం చేసుకోవడమూ కాదు. సంఘ పద్ధతిని అర్ధం చేసుకోవడం ఎందుకు మరింత కష్టమవు తుందంటే ఇటువంటి కార్యపద్ధతి, ఆలోచన కలిగిన సంస్థ ప్రపంచంలో మరొకటి లేదు. ఈ వినూత్నమైన దేశ నిర్మాణ పద్ధతి వల్లనే స్వార్ధపూరిత, విఘటన వాద సంస్థలు కొన్ని సంఘంపై, స్వాతంత్య్రోద్యమంలో సంస్థ నిర్వహించిన పాత్రపై అసత్య ప్రచారానికి పాల్పడుతున్నాయి.

సమాజాన్ని రక్షించి, బలాన్ని చేకూర్చే పని సంఘం చేస్తుంది. కాబట్టి సంఘం ఏం చేసిందో తెలుసుకోవాలంటే ఆ సంస్థ సంస్థాపకులతో సహా అనేకమంది స్వయంసేవకులు నెరవేర్చిన కార్యాలు, సాధించిన విజయాలను పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది. స్వాతంత్య్రోద్యమం విషయంలో కూడా అంతే.

కలకత్తాలో వైద్య విద్య అభ్యసిస్తున్నప్పుడు

డా. హెడ్గేవార్‌ ‌విప్లవకారులతో సన్నిహితంగా మెలిగేవారు. అనుశీలన సమితి సభ్యులతో ఆయనకు ఉన్న సన్నిహిత సంబంధాల గురించి వారితో కలిసి పనిచేసిన రాంలాల్‌ ‌వాజపేయి తన స్వీయచరిత్రలో రాశారు, ‘దాజీ సాహెబ్‌ ‌బూటి ఆర్ధిక సహాయంతో కేశవ బలిరామ్‌ ‌హెడ్గేవార్‌ ‌కలకత్తాలో అడుగు పెట్టింది ఉన్నత విద్య అభ్యసించడం కోసం కాదు. పులిన్‌ ‌బిహారీ దాస్‌ ‌పర్యవేక్షణలో విప్లవ కార్య కలాపాల్లో శిక్షణ పొందేందుకు.’ యువకుడైన కేశవరావ్‌ అనుశీలన సమితిలో (కొంతమంది బెంగాల్‌ ‌యువకులు, స్థానిక వ్యాయామశాలల సభ్యులతో కలసి 1902లో ఈ సంస్థను స్థాపించారు. ఇది పూర్తిగా తీవ్ర జాతీయవాదాన్ని విశ్వసించింది.) అడుగుపెట్టిన అనతికాలంలోనే ఆ సంస్థ ముఖ్య సభ్యుల్లో ఒకరయ్యారు. 1915లో వైద్య పట్టా పుచ్చుకుని నాగ్‌పూర్‌లో అడుగుపెట్టిన వెంటనే ఆయన వార్ధాకు చెందిన తన సహచరులైన భావూజీ కావ్రే, అప్పాజీ జోషిలతో సెంట్రల్‌ ‌ప్రావిన్స్‌లో (నేటి ఉత్తర ప్రదేశ్‌) ‌విప్లవ కార్యకలాపాలు ప్రారంభించారు.

కానీ ఆ తరువాత కొద్దికాలానికే విప్లవ కార్యకలాపాలు సన్నగిల్లడంతో స్వతంత్ర సాధనకు ప్రత్యామ్నాయ మార్గాన్ని ఎంచుకోవలసి వచ్చింది. దానితో అప్పట్లో బలమైన ప్రజా ఉద్యమంగా ఉన్న భారత జాతీయ కాంగ్రెస్‌లో (‌భారత జాతీయ కాంగ్రెస్‌ 1885‌లో ఆవిర్భవించింది. దాదాభాయ్‌ ‌నౌరోజీ, గోపాలకృష్ణ గోఖలే, ఫిరోజ్‌షా మెహతా వంటివారు ఏఓ హ్యూమ్‌ ‌నాయకత్వంలో ఆరంభించారు.) ఆయన చేరారు.  కాంగ్రెస్‌ ‌లోనే ఆయన తన స్నేహితులతో కలిసి నాగ్‌పూర్‌ ‌జాతీయ సంఘాన్ని ప్రారంభించారు. 1920 నాగ్‌పూర్‌లో జరిగిన అఖిల భారతీయ కాంగ్రెస్‌ ‌సమావేశాల్లో డాక్టర్జీ స్వచ్ఛంద కార్యకర్తలకు నాయకత్వం వహించారు. అప్పుడే నాగ్‌పూర్‌ ‌జాతీయ సంఘం ‘సంపూర్ణ స్వాతంత్య్రమే తమ లక్ష్యమని’ ప్రకటించాలని, దీనికోసం ఒక తీర్మానం ఆమోదించాలని కాంగ్రెస్‌ ‌కమిటీకి సూచించింది. కాంగ్రెస్‌కు చేసిన సూచనలో ఇలా పేర్కొంది – ‘భారత్‌లో ప్రజాస్వామ్యాన్ని నెలకొల్పడంతో పాటు అన్ని దేశాలను పెట్టుబడిదారీ దేశాల కబంధ హస్తాల నుండి విముక్తం చేయడమే కాంగ్రెస్‌ ‌లక్ష్యం.’ కానీ ఆ తరువాత 10 ఏళ్లకుగానీ, డిసెంబర్‌ 1929‌లో సంపూర్ణ స్వాతంత్య్రమే తమ లక్ష్యమంటూ తీర్మానం చేయలేకపోయింది.

1920 సమావేశాలలో డా. హెడ్గేవార్‌ ‌చేసిన సూచనను తీర్మాన కమిటీ తిరస్కరించింది. కానీ మార్చ్ 21‌నాటి సంచికలో కలకత్తా నుంచి వచ్చే ‘మాడర్న్ ‌రివ్యూ’ అనే పత్రిక ఈ సూచన గురించి ఇలా వాఖ్యానించింది – ‘ఈ ముసాయిదా తీర్మానం కమిటీ పరిశీలనలో ప్రముఖంగా చర్చకు వచ్చింది.’ 1921లో మహాత్మా గాంధీ ప్రారంభించిన సహాయ నిరాకరణోద్యమంలో తన స్నేహితులతోపాటు డా. హెడ్గేవార్‌ ‌చురుకుగా పాల్గొన్నారు. జైలు శిక్ష కూడా అనుభవించారు. తన చర్యలను సమర్ధించుకుంటూ ఆయన న్యాయమూర్తి స్మెల్లి ఎదుట వినిపించిన వాదన ‘అప్పటివరకూ ఆయన చేసిన ఉపన్యాసాల కంటే మరింత తీవ్రంగా, ప్రభుత్వ వ్యతిరేకంగా ఉంది’ అని బ్రిటిష్‌ ‌వారు భావించారు. దానితో

డా. హెడ్గేవార్‌కు ఏడాదిపాటు కఠిన కారాగార శిక్ష విధిస్తూ స్మెల్లి తీర్పు చెప్పారు. డా.హెడ్గేవార్‌ ‌స్వాతంత్య్ర ఉద్యమంలో అంతటి నిష్ట కలిగి ఉండేవారు.

అటవీ సత్యాగ్రహం

ఏప్రిల్‌ 6, 1930‌న గాంధీజీ ఉప్పు సత్యాగ్రహం లేదా దండియాత్ర ప్రారంభించినప్పుడు ఆర్‌ఎస్‌ఎస్‌ ‌పాల్గొంది. అప్పటికి డా. హెడ్గేవార్‌ ‌సర్‌ ‌సంఘచాలక్‌గా నియమితులయ్యారు. అటవీ సత్యా గ్రహంలో పాల్గొనాలని నిర్ణయించుకున్నప్పుడు ఆయన తన బాధ్యతలను డా.ఎల్‌.‌వి. పరాంజపేకు అప్పగించారు. అది సంఘం శైశవదశ. 1925లో 10,15మందితో ప్రారంభమయిన సంస్థ 1930నాటికి ఇంకా పూర్తిగా వికసించలేదు. అలాంటి స్థితిలో కూడా సంఘ వ్యాప్తికి సంబంధించిన పనిని పక్కన పెట్టి అటవీ సత్యాగ్రహంలో కీలక పాత్ర పోషించారు. బ్రిటిష్‌ ‌నిరంకుశ పాలనకు నిరసనగా సెంట్రల్‌ ‌ప్రావిన్స్‌లో అటవీ చట్టాలను ఉల్లంఘించాలని నిర్ణయించారు. ఆ ప్రకారమే ఆయన నాయకత్వంలో కొందరు ఆర్‌ఎస్‌ఎస్‌ ‌కార్యకర్తలు, కాంగ్రెస్‌ ‌కార్యకర్తలు నాగ్‌పూర్‌కు 150 కి.మీ దూరంలోని యావత్‌మాల్‌ అడవులకు వెళ్లారు. దారిలో పూసాద్‌ ‌దగ్గర స్వాతంత్య్ర సాధన గురించి ఆయన ఒక ఉపన్యాసం ఇచ్చారు. ‘‘ఇంగ్లీష్‌ ‌వారి బూట్లు పాలిష్‌ ‌చేయడం దగ్గర నుంచి వారు ఈ దేశం వదిలిపోయేవరకు అదే బూట్లతో వారి తలపై గట్టిగా కొట్టడం వంటి అన్నీ మార్గాలు సహేతుకమైనవే నని నా అభిప్రాయం’’ అని అన్నారు. ఆ తరువాత ఆయన అటవీ సత్యాగ్రహంలో పాల్గొని అకోలా జైలులో 9 నెలల శిక్ష అనుభవించారు.

1929 డిసెంబర్‌ 31‌న రావి నది ఒడ్డున కాంగ్రెస్‌ ‌చరిత్రాత్మక లాహోర్‌ ‌తీర్మానం చేసింది. అందులో ‘సంపూర్ణ స్వాతంత్య్రం’ కోరుతూ జనవరి 26 ను ప్రతి సంవత్సరం స్వతంత్ర దినోత్సవంగా పాటించాలని నిర్ణయించింది. కాంగ్రెస్‌ ఈ ‌విధమైన తీర్మానం చేయాలని డా. హెడ్గేవార్‌ ‌పదేళ్ల క్రితమే చెప్పారు. ఆలస్యంగానైనా ఇలాంటి నిర్ణయం తీసుకున్నందుకు సహజంగానే ఎంతో సంతోషించిన డా. హెడ్గేవార్‌ ‌జనవరి 26న అన్ని శాఖలలో జాతీయ జెండాను ఎగురవేసి, స్వాతంత్య్ర సందేశాన్ని అందరికీ వినిపించాలని సూచన పంపారు.

ఆర్‌ఎస్‌ఎస్‌ ‌కనబరచిన సామ్రాజ్యవాద వ్యతిరేకత, కాంగ్రెస్‌ ఉద్యమానికి పూర్తి మద్దతు నివ్వడం వంటివి బ్రిటిష్‌ ‌ప్రభుత్వానికి ఆందోళన కలిగించాయి. దానితో సహాయనిరాకరణ ఉద్యమం చల్లబడిన తరువాత ఆర్‌ఎస్‌ఎస్‌ను అణచివేసేందుకు మొట్టమొదటి ప్రయత్నం చేసింది.

1932లో సెంట్రల్‌ ‌ప్రావిన్స్ ‌ముఖ్యమంత్రి ఇ. గోర్దాన్‌ ‌మొదటిసారి ఆర్‌ ఎస్‌ఎస్‌పై చర్య తీసుకుంటూ ఆదేశాలు జారీచేశాడు.‘ఆర్‌ఎస్‌ఎస్‌ ‌రాజకీయ, మతతత్వ సంస్థ’ కాబట్టి ఆ సంస్థ కార్యకలాపాల్లో ప్రభుత్వోద్యోగులు పాల్గొనరాదని సర్క్యులర్‌ ‌జారీ చేశాడు.

ఈ ఆదేశాలను 1933 డిసెంబర్‌లో స్థానిక సంస్థలలో పనిచేసే ఉద్యోగులు, ఉపాధ్యాయులకు కూడా వర్తింపజేశారు. స్థానిక ప్రభుత్వ మంత్రి ముస్లిం కాబట్టి విషయానికి ‘మత రంగు’ పులిమితే మరింత ఉపయోగం ఉంటుందని ఆ పని చేశారు. కానీ సంఘం మాత్రం ప్రభుత్వ వ్యవహారాన్ని సామ్రాజ్య వాద ధోరణిగానే చూసింది తప్ప మతదృష్టితో చూడలేదు. 1940లో హోమ్‌ ‌మంత్రిత్వ శాఖ ఒక నివేదికలో ‘‘ఈ సంస్థ తీవ్రమైన బ్రిటిష్‌ ‌వ్యతిరేకతను ప్రదర్శిస్తోంది’’ అంటూ పేర్కొంది. సీఐడీ నివేదిక మరింత ముందుకు వెళ్లి ‘సైన్యం, నౌకాదళం, పోస్టల్‌, ‌టెలిగ్రాఫ్‌, ‌రైల్వే, పరిపాలనా విభాగాల్లో ఆర్‌ఎస్‌ఎస్‌ ‌తమ కార్యకర్తలను ప్రవేశపెడుతోంది. సమయం వచ్చినప్పుడు ఈ విభాగాలను అదుపులోకి తీసుకోవడానికి వీలుగానే ముందస్తుగా ఈ పని చేస్తున్నారు’ అని హెచ్చరించింది.

హెడ్గేవార్‌ 1940‌లో స్వర్గస్తులైన తరువాత సర్‌ ‌సంఘచాలక్‌ ‌బాధ్యతలు చేపట్టిన ప.పూ. ఎం. ఎస్‌. ‌గోల్వాల్కర్‌ (‌గురూజీ) ప్రభుత్వోద్యోగులపై విధించిన ఆంక్షల గురించి మే 3, 1942న పునాలో జరిగిన ఒక శిక్షణ శిబిరంలో ప్రస్తావించారు. వారు చెప్పిన మాటల గురించి సీఐడీ తన నివేదికలో ఇలా పేర్కొంది – ‘ఎంతటి అణచివేత, వ్యతిరేకత ఎదురైనా తన కాళ్లపై తాను నిలబడాలని సంఘం కృత నిశ్చయంతో ఉంది. దేశీ పాలకులను అభ్యర్ధిస్తే, బతిమాలితే స్వరాజ్యం సిద్ధించదు. దానిని శక్తి ప్రదర్శన ద్వారా సాధించుకోవాలి’.

క్విట్‌ ఇం‌డియా ఉద్యమ సమయంలో కొందరు స్వయంసేవకులు విదర్భ ప్రాంతంలోని చిమూర్‌ అస్తిలో సమాంతర ప్రభుత్వాన్ని నిర్వహించారు. దీనితో బ్రిటిష్‌ ‌ప్రభుత్వం 125 మంది సత్యా గ్రహులతోపాటు వేలాది మంది స్వయంసేవకు లకు జైలు శిక్ష విధించింది. చిమూర్‌ ‌శాఖ ప్రముఖ్‌ ‌దాదా నాయక్‌కు ప్రభుత్వం ఏకంగా ఉరిశిక్ష విధించింది. కానీ ఆ తరువాత హిందూ మహాసభ నాయకుడు డా. ఎన్‌.‌బి. ఖరే జోక్యం చేసుకోవడంతో దానిని కారాగార శిక్షగా మార్చింది. ఆ తరువాత ఈ తిరుగుబాటులో పాల్గొన్న కొద్దిమందిని ప్రభుత్వ ఉరి తీసింది.

కొందరు స్వయం సేవకులు ఢిల్లీ-ముజఫర్‌ ‌నగర్‌ ‌రైల్వే లైన్‌ను నాశనం చేసేందుకు ప్రయత్నించారు. రైలు పట్టాలకు ఉండే ఫిష్‌ ‌ప్లేట్‌లను తొలగించడానికి ప్రయత్నించాడనే ఆరో పణతో హేమూ కలానికి ఉరిశిక్ష విధించింది. 1943లో కలానీని ఉరి తీశారు. ముంబైలోని సింధిలు ఇప్పటికీ హేమూ బలిదనాన్ని గుర్తు చేసుకుంటారు. మేవాన్‌లోని తహసిల్‌ ‌కార్యాలయంపై త్రివర్ణ పతాకాన్ని ఎగరవేయడానికి ప్రయత్నించిన స్వయంసేవకులపై ఆగస్ట్ 11,1942 ‌న ప్రభుత్వం కాల్పులు జరిపింది. ఆ సంఘటనలో ఆరుగురు చనిపోయారు.

1942 ఉద్యమంలో పాల్గొన్న అనేకమంది నాయకులు అజ్ఞాతంలో ఉన్నప్పుడూ వారికి స్వయంసేవకులే రక్షణ, తదితర ఏర్పాట్లు చూశారు. అరుణా అసఫలీ, జయప్రకాష్‌ ‌నారాయణ్‌లు ఢిల్లీ సంఘచాలక్‌ ‌లాలా హంసరాజ్‌ ‌గుప్తా ఇంట్లో ఉన్నారు. అచ్యుత్‌ ‌పట్వర్ధన్‌, ‌సానే గురూజీలు పూనా సంఘచాలక్‌ ‌భావుసాహెబ్‌ ‌దేశముఖ్‌ ఇం‌ట్లో ఆశ్రయం పొందారు. క్రాంతివీర్‌ ‌నానా పాటిల్‌ అవధ్‌ ‌సంఘచాలక్‌ ‌పండిట్‌ ఎస్‌.‌ది. సాత్వలేకర్‌ ఇం‌ట్లో తలదాచుకున్నారు. సంఘం బలంగా ఉన్నచోట్ల నుండి చాలామంది స్వయంసేవకులు 1942 ఉద్యమంలో పాల్గొన్నారు.

ఆర్‌ఎస్‌ఎస్‌ ‌గురించి 1943 నివేదికలో ఇంటలిజెన్స్ ‌విభాగం ఇలా పేర్కొంది – ‘ఈ దేశం నుండి బ్రిటిష్‌ను వెళ్లగొట్టి దేశాన్ని స్వతంత్రం చేయడమే ఆర్‌ఎస్‌ ఎస్‌ ‌ప్రధాన లక్ష్యం.’

భారత్‌లో జమ్ము కశ్మీర్‌ ‌విలీన సమయంలో కూడా ఆర్‌ఎస్‌ఎస్‌ ‌ప్రముఖ పాత్ర పోషించింది. అప్పుడు కశ్మీర్‌ ‌సంఘ ప్రచారక్‌ ‌బాల్‌రాజ్‌ ‌మధోక్‌ 1947 అక్టోబర్‌లో శ్రీనగర్లోని ఒక సభలో షేక్‌ అబ్దుల్లా ఇచ్చిన ఉపన్యాసాన్ని విని సర్దార్‌ ‌పటేల్‌ ‌తోపాటు కొంతమంది ముఖ్య నాయకులకు కీలకమైన సమాచారం అందించారు. అలా అప్పటి సంఘ సర్‌ ‌సంఘచాలక్‌ ఎం.ఎస్‌. ‌గోల్వాల్కర్‌ ‌భారత్‌లో జమ్మూకశ్మీర్‌ను విలీనం చేసేందుకు మహారాజ హరిసింగ్‌ను ఒప్పించడంలో కీలక పాత్ర పోషించారు. కేదారనాథ్‌ ‌సహాని కూడా ప్రధాన పాత్ర పోషించారు. సైన్యం కశ్మీర్‌ ‌నుండి పాకిస్తానీ చొరబాటుదారులను తరిమివేయడానికి చర్యలు ప్రారంభించే వరకు స్వయంసేవకులు శ్రీనగర్‌ ‌విమానాశ్రయాన్ని కాపాడారు. రావి నది దాటి మాధోపూర్‌లో పడిపోయిన మందుగుండు సామగ్రిని తడిసిపోకుండా వీపులపై మోస్తూ వెనుకకు తీసుకువచ్చారు. పాకిస్తానీయులు ఏర్పాటుచేసిన మందుపాతరలను తొలగించడంలో కూడా వారు భారతీయ సైనికులకు సహాయం చేశారు.

ఆగస్ట్ 15,1947‌న స్వాతంత్య్రం వచ్చినా దేశ విభజన మూలంగా పెద్ద సంఖ్యలో శరణార్ధులు ఇక్కడికి వచ్చారు. పాకిస్తాన్‌లో హిందువులపై అమానుషమైన దాడులు, అత్యాచారాలు జరిగాయి. ఖండిత భారత్‌లో కూడా తన వ్యవస్థ ద్వారా అలజడి, అరాచకం సృష్టించాలని ముస్లిం లీగ్‌ ‌కుట్ర పన్నింది. అక్టోబర్‌ 1,1948‌న భారతరత్న డా. భగవాన్‌ ‌దాస్‌ ఇలా రాసారు – ‘‘భారత్‌ ‌ప్రభుత్వంలోని మంత్రులను, ముఖ్యమైన అధికారులను హతమార్చి, ఎర్రకోటపై పాకిస్తాన్‌ ‌జెండా ఎగురవేసి ఇక్కడ కూడా తమ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవాలన్న ముస్లిం లీగ్‌ ‌కుట్ర గురించి ఆర్‌ఎస్‌ఎస్‌ ‌స్వయంసేవకులు ప్రధాని జవహర్‌లాల్‌ ‌నెహ్రూ, హోమ్‌ ‌మంత్రి సర్దార్‌ ‌పటేల్‌ ‌లకు ముందుగా సమాచారం అందించారని నాకు తెలుసు. తె

సకాలంలో ఈ సమాచారాన్ని దేశభక్తులైన ఈ యువకులు అందించి ఉండకపోతే ఈ దేశం ఇప్పటికే పాకిస్తాన్‌లో కలిసిపోయేది. లక్షలాదిమంది హిందువులు ఊచకోతకు గురయ్యేవారు. అంతకంటే ఎక్కువమంది బలవంతంగా ఇస్లాంలోకి మతాంతరీకరణ అయ్యేవారు. ఈ దేశం మరోసారి బానిసత్వంలోకి వెళ్లి ఉండేది. దీనినిబట్టి మనకు ఏం తెలుస్తోంది? మన ప్రభుత్వం ఇప్పటికైనా ఆర్‌ఎస్‌ఎస్‌పై దాష్టికం చేయడం మానుకుని లక్షలాదిమంది స్వయంసేవకుల శక్తిని దేశం కోసం ఉపయోగించు కోగలగాలి.’’

నిజాం వ్యతిరేక పోరాటం

నిరంకుశ నిజాంకు వ్యతిరేకంగా 1938లో భాగ్య నగర్‌ ఉద్యమం పేరిట ఒక ప్రజా ఉద్యమం జరిగింది. అందులో ప్రభాకర్‌ ‌దాణి (భయ్యాజీ దాణి) నాయకత్వంలో 15 వందల మంది స్వయంసేవకులు పాల్గొన్నారు. సంఘ మొదటినుంచి అనుసరించిన పద్ధతి ప్రకారం స్వయంసేవకులు వ్యక్తిగత హోదాలోనే ఆ ఉద్యమంలో పాల్గొన్నారు. భయ్యాజీ దాణి ఆ తరువాత 1946లో సంఘ సర్‌ ‌కార్యవాహ బాధ్యత చేపట్టారు.

గోవా, డామన్‌, ‌డయ్యూ, దాద్రా, నగర్‌ ‌హవేలి, పాండిచ్చేరీల విముక్తి

1954లో ఆజాద్‌ ‌గోమంతక్‌ ‌దళ్‌ ‌దాడి చేసి దాద్రా, నగర్‌ ‌హవేలిని విముక్తం చేసింది. సిల్వేస్సపై దాడి చేసిన గోమంతక్‌ ‌సభ్యుల ముందు అక్కడ ఉన్న 175 మంది పోర్చుగీసు సైనికులు లొంగి పోయారు. అక్కడ త్రివర్ణపతాకం రెపరెప లాడింది. ఈ గోమాంతక్‌ ‌దళ్‌లో ఎక్కువ మంది స్వయంసేవకులే. ఈ దాడిలో అనేకమంది స్వయం సేవకులు ప్రాణాలు కూడా కోల్పోయారు.

ఈ విజయయాత్రలో రాజా వాకణ్‌కర్‌, ‌నానా కజ్రేకర్‌ ‌కీలకపాత్ర వహించారు. పోర్చు గీసు పాలన అంతమై గోవాను భారత్‌లో విలీనం చేయాలని 1955లో ఆర్‌ఎస్‌ఎస్‌ ‌డిమాండ్‌ ‌చేసింది. కానీ సైనికచర్య ద్వారా విలీన పక్రియను పూర్తి చేయడానికి ప్రధాని జవహర్‌లాల్‌ ‌నెహ్రూ అంగీకరించక పోవడంతో ఆర్‌ఎస్‌ఎస్‌ ‌కార్యకర్త జగన్నాథ జోషి సత్యాగ్రహం ప్రారంభించారు. ఆయన్ని, ఇతర సహచరులను పోర్చుగీసు పోలీసులు అరెస్ట్ ‌చేసి జైలులో పెట్టారు. శాంతియుత నిరసనలు కొనసాగాయి. కానీ సత్యాగ్రహులపై పోలీసులు తీవ్రమైన చర్యలకు పాల్పడ్డారు. సత్యాగ్రహం కొనసాగుతుండడంతో పోర్చుగీసు పోలీసులు ఆగస్ట్ 15, 1955‌న కాల్పులకు జరిపారు. అందులో 30 మందికి పైగా సత్యాగ్రహులు ప్రాణాలు కోల్పోయారు.

ఇలా స్వాతంత్య్ర సంగ్రామంలో సంఘ స్వయంసేవకులు మొదటి నుండి పాల్గొన్నారు. స్వాతంత్య్రానికి ముందు సంఘ స్వయంసేవకులు చేసే ప్రతిజ్ఞలో ‘దేశానికి స్వాతంత్య్రం తెచ్చేందుకు’ అనే పదాలు ఉండేవి. ఆ తరువాత వాటిని ‘దేశపు సర్వాంగీణ ఉన్నతి కోసం’ అని మార్చారు. ఆర్‌ఎస్‌ఎస్‌ ‌స్వాతంత్య్రానికి, దేశాభివృద్ధికి ఎంతటి ప్రాముఖ్యత, ప్రాధాన్యతనిచ్చిందో ఈ పదాలే తెలుపుతాయి. గిరిజన, రైతాంగ పోరాటాల గురించీ, విదేశాలే కేంద్రంగా సాగిన ఉద్యమాల గురించీ, దేశంలోనే వ్యక్తులు చేసిన పోరాటం గురించీ అనేక రహస్య నివేదికలు ఉన్నాయి. వాటితో పట్టించుకోకుండా, మిగిలిన చారిత్రక వాస్తవాలను చూడకుండా చరిత్ర నిర్మాణం జరగడం శోచనీయం. సిద్ధాంతపరంగా తమతో విభేదించిన వారిని సైతం చరిత్ర పుటల నుండి సౌకర్యంగా జారవిడిచిన చరిత్రకారులకు ఈ దేశంలో కొదవలేదు. భారతదేశ చరిత్రను మార్క్సిస్ట్ ‌ధోరణితో చూడడం, రాయడం; ఉదారవాద పంథాలో ఆలోచించడం, నమోదు చేయడం వంటి అవాంఛనీయ విన్యాసాలతో వాస్తవ ఘటనలు మరుగున ఉండిపోయాయి. ఈ విన్యాసాలన్నీ బ్రిటిష్‌ అనుకూల ధోరణులేనన్నది ఇప్పటికైనా అర్ధం కావాలి. భారత జాతి ఐక్యత, భారతీయత మిథ్య అని చెప్పడానికి అప్రతిహతంగా సాగిపోతున్న కుట్రకు ఇవన్నీ కొనసాగింపు. ఈ విషయం గుర్తించడానికి చాలా సమయమే పట్టింది. అలా మరుగున ఉండిపోయిన ఎన్నో సంస్థలు, వ్యక్తుల చరిత్రలను ఈ ఆజాదీ కా అమృత్‌ ‌మహోత్సవ్‌ ‌సందర్భంగా అయినా వెలికి తీసే యత్నం చేయడం ఈ తరం ప్రథమ కర్తవ్యం.

‌సంప్రదించిన గ్రంథాలు:

1. Dr. Hedgewar Charitra ( Hindi) by N.H.Palkar
2. Dr. Keshav Baliram Hedgewar by Dr. Rakesh Sinha, Publications Division
3. Prof Rajendra Singh ki Jeevan yatra
4. Devendra Swaroop, Sangh beej se vriksha
5. The sangh and Swaraaj by Ratan Sharda
6. Biography of Dr. Hedgewar by Arun Anand

వ్యాసకర్త :  క్షేత్ర ప్రచార ప్రముఖ్‌, ఆర్‌ఎస్‌ఎస్‌