Home News రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) జ్యేష్ట ప్రచారక్ శ్రీ పి.ప్రమేశ్వరన్ జీ కన్నుమూత

రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) జ్యేష్ట ప్రచారక్ శ్రీ పి.ప్రమేశ్వరన్ జీ కన్నుమూత

0
SHARE

రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) జ్యేష్ట ప్రచారక్, భారతీయ విచార కేంద్ర వ్యవస్థాపక డైరెక్టర్, పద్మవిభూషణ్ శ్రీ పి.పరమేశ్వరన్ జీ కేరళలోని పాలక్కాడ్ జిల్లా ఒట్టప్పాలంలో కన్నుమూశారు. ఆయన వయసు 91 సంవత్సరాలు.

కేరళలోని అలప్పుజ జిల్లాలోని ముహమ్మాలో 1927 లో జన్మించిన పి.పరమేశ్వరన్ తన విద్యార్థి రోజుల్లోనే  ఆర్‌ఎస్‌ఎస్‌లో చేరారు. పరమేశ్వరన్ పురాతన భారతీయ పరిజ్ఞానంలో మంచి పట్టు ఉన్నవారేకాక, గొప్ప రచయిత, కవి, పరిశోధకులు, జాతీయ పునరుత్థానానికి కట్టుబడి ఉన్నవారు. భారతీయ జనసంఘ్ కు  జాతీయ కార్యదర్శిగా  (1967 – 1971), జాతీయ ఉపాధ్యక్షుడు (1971 – 1977)గా, న్యూ ఢిల్లీలోని దీన్‌దయాల్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ డైరెక్టర్ (1977 – 1982) గా పని చేశారు.

కేరళ విశ్వవిద్యాలయం నుండి చరిత్ర (గౌరవ)లో బి.ఏ పూర్తి చేసిన పరమేశ్వరన్ జాతి పునర్నిర్మాణం కోసం తనను తాను అంకితం చేసుకుని, పూర్తి సమయం ఆర్ఎస్ఎస్ ప్రచారక్ గా పని చేశారు. క్రూరమైన అత్యవసర పరిస్థితి రోజుల్లో, శ్రీమతి ఇందిరా గాంధీ నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా అఖిల భారత సత్యాగ్రహంలో పాల్గొన్నారు. ఆ సమయంలో మీసాచట్టం కింద అరెస్టు చేసినపుడు 16 నెలలు జైలు శిక్ష కూడా అనుభవించారు.

స్వామి వివేకానంద, కార్ల్ మార్క్స్ చెప్పిన విషయాలను పోలుస్తూ ‘మార్క్స్ మరియు వివేకానంద’ పేరుతో వ్రాసిన పుస్తకం ఆయన సునిశితమైన పరిశోధనాత్మక దృష్టికి, స్పష్టమైన వ్యక్తీకరణకు అద్భుతమైన ఉదాహరణ. ఆయన వ్రాసిన ‘శ్రీ నారాయణ గురు – ది ప్రాఫెట్ ఆఫ్ రెనయసాన్స్’, ‘ఫ్రమ్ మార్క్స్ టు మహర్షి’, ‘అరబిందో – ది ప్రాఫెట్ ఆఫ్ ఫ్యూచర్, ‘ది చెంజింగ్ సొసైటీ అండ్ ది ఛేంజ్ లెస్ వాల్యూస్’ పుస్తకాలు జాతీయ భావజాలంపట్ల లోతైన అవగాహన, జాతీయ పునర్నిర్మాణం పట్ల నిబద్ధతను చూపుతాయి.  ‘కేరళ మోడల్’ డొల్లతనాన్ని పరమేశ్వరన్ చాలాకాలం ముందుక్రితమే బయటపెట్టారు. ఆ తరువాత డా. అమర్త్యసేన్ కూడా ఆ విషయాలను ఒప్పుకోకతప్పలేదు. స్వామి వివేకానంద జీవితం- రచనలపై ఉన్న పరిచయం, అవగాహన దృష్ట్యా  1993 లో జరిగిన స్వామి వివేకానంద చికాగో ఉపన్యాస శతాబ్దిఉత్సవాలలలో పాల్గొనడానికి ఆయనను ఆహ్వానించారు. అనంతర కాలంలో పరమేశ్వరన్ కన్యాకుమారిలోని వివేకానంద కేంద్రం అధ్యక్షుడిగా కూడా పని చేశారు.

కోల్‌కతా హనుమాన్ ప్రసాద్ పోద్దార్ అవార్డు (1997), మాతా అమృతానందమయి మఠం వారి అమృత కీర్తి పురస్కార్, (2002), హిందూ పునరుజ్జీవన అవార్డు (2010) తో పాటు మరికొన్ని ముఖ్యమైన పురస్కారాలు పరమేశ్వర్ జీ  అందుకున్నారు. ఇవేకాక సాంప్రదాయ పరిజ్ఞానం, జాతీయ పునర్నిర్మాణం పట్ల ఆయన ఉత్సాహాన్ని, అంతులేని ప్రయత్నాలను పరిగణనలోకి తీసుకుని కేంద్ర ప్రభుత్వం ఆయనను 2004 లో పద్మశ్రీతోను, 2018 లో దేశ రెండవ అత్యున్నత పౌర పురస్కారం పద్మవిభూషణ్ తో సత్కరించింది.